తిరంగా రోల్‌ తిందామా?!

నాన్‌స్టిక్‌పాన్‌లో టేబుల్‌స్పూను నెయ్యి వేసి జీడిపప్పు పొడి, కప్పు కండెన్స్‌డ్‌ మిల్క్‌, టేబుల్‌స్పూను పాలపొడి వేసి గట్టిపడే వరకూ ఉడికించి తీయాలి. అదే బాణలిలో పైన చెప్పిన పద్ధతిలోనే నెయ్యి, బాదం, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాలపొడి వేసి హల్వా చేసి చివరలో నారింజరంగు కలిపి తీయాలి. ఇదే పద్ధతిలో పిస్తా హల్వా చేసి ఆకుపచ్చరంగు ..

Published : 26 Jun 2021 16:53 IST

తిరంగా పనీర్‌ పులావ్‌

కావలసినవి
బాస్మతి బియ్యం: పావుకిలో, పనీర్‌: 200గ్రా., బఠాణీలు: పావుకప్పు, ఉల్లిముక్కలు: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంవెల్లుల్లి: 2 టేబుల్‌స్పూన్లు, పలావు ఆకులు: రెండు, షాజీరా: టీస్పూను, యాలకులు: రెండు, లవంగాలు: నాలుగు, దాల్చినచెక్క: అంగుళంముక్క,నెయ్యి: టేబుల్‌స్పూను, ఉప్పు: తగినంత, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఆరెంజ్‌ ఫుడ్‌ కలర్‌: చిటికెడు, గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌: చిటికెడు

తయారుచేసే విధానం
* అన్నం ఉడికించి పక్కన ఉంచాలి. రెండు చిన్న బౌల్స్‌ తీసుకుని కొంచెంకొంచెం అన్నం వేసి రంగులు చల్లి కలిపి ఉంచాలి. మిగిలిన తెల్ల అనాన్ని అలాగే ఉంచాలి.
* నాన్‌స్టిక్‌ పాన్‌లో తగినంత నూనె వేసి పనీర్‌ ముక్కలు వేయించి తీయాలి. రెండు టేబుల్‌స్పూన్ల నూనె మాత్రం ఉంచి మిగిలినది వంపేయాలి. బఠాణీలను విడిగా ఉడికించాలి. ఇప్పుడు పాన్‌లో పలావు ఆకులు, షాజీరా, లవంగాలు, యాలకులు, చెక్క వేసి వేగాక అల్లం వెల్లుల్లి వేసి వేగనివ్వాలి. ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక బఠాణీలు, పనీర్‌ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి. ఉప్పు చల్లి  తెల్ల అన్నం వేసి కలపాలి. తరవాత రెండు రంగుల అన్నాల్ని కూడా వేసి కలిపితే సరి.

తిరంగా రోల్స్‌

కావలసినవి
జీడిపప్పు పొడి, బాదంపొడి, పిస్తాపొడి: కప్పు చొప్పున, నెయ్యి: 3 టేబుల్‌స్పూన్లు, కండెన్స్‌డ్‌మిల్క్‌: మూడు కప్పులు, పాలపొడి: మూడు టేబుల్‌స్పూన్లు, ఆకుపచ్చరంగు: చిటికెడు, నారింజరంగు: చిటికెడు

తయారుచేసే విధానం
* నాన్‌స్టిక్‌పాన్‌లో టేబుల్‌స్పూను నెయ్యి వేసి జీడిపప్పు పొడి, కప్పు కండెన్స్‌డ్‌ మిల్క్‌, టేబుల్‌స్పూను పాలపొడి వేసి గట్టిపడే వరకూ ఉడికించి తీయాలి. అదే బాణలిలో పైన చెప్పిన పద్ధతిలోనే నెయ్యి, బాదం, కండెన్స్‌డ్‌ మిల్క్‌, పాలపొడి వేసి హల్వా చేసి చివరలో నారింజరంగు కలిపి తీయాలి. ఇదే పద్ధతిలో పిస్తా హల్వా చేసి ఆకుపచ్చరంగు కలపాలి. నున్నని రాయి లేదా పీట మీద బాదం, ఆపైన జీడిపప్పు, దానిమీద పిస్తా హల్వా ముద్దలు పెట్టి అప్పడాల కర్రతో మెల్లగా వత్తి, చాపలా చుట్టాలి. చుట్టిన రోల్‌ని ఫ్రిజ్‌లో నాలుగు గంటలు ఉంచి తీసి ముక్కలుగా కోయాలి.

బ్రెడ్‌ చమ్‌ చమ్‌

కావలసినవి
బ్రెడ్‌ స్లైసెస్‌: పది, పంచదార: పావుకిలో, కోవాబర్ఫీ స్వీట్లు: మూడు, డెసికేటెడ్‌ కొబ్బరి: కప్పు, బాదం: పావుకప్పు, నారింజ రంగు: చిటికెడు, ఆకుపచ్చరంగు: చిటికెడు

తయారుచేసే విధానం
* బ్రెడ్‌ స్లైస్‌లమీద ఏదైనా సీసా మూత ఉంచి గుండ్రంగా కట్‌ చేయాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి కరిగించి ఓ నిమిషం మరిగాక పాకాన్ని మూడు చిన్న గిన్నెల్లో పోయాలి. ఒకదాన్ని అలాగే ఉంచి మిగిలిన రెండింట్లో రంగులు వేయాలి. కొబ్బరిపొడిని కూడా మూడు విభాగాలుగా చేసి ఒకదాన్ని అలాగే ఉంచి, మిగిలిన వాటిలో ఆయా రంగులు వేసి కలపాలి.
* చిన్న గిన్నెలో కోవా స్వీట్లు వేసి మెదపాలి. బాదంపప్పుని సన్నని పొడవాటి ముక్కల్లా కోయాలి. బ్రెడ్‌స్లైసుల్ని తీసుకుని తెల్లని చమ్‌ చమ్‌కోసం కొన్నింటిని రంగు కలపని పంచదార పాకంలోనూ మిగిలిన వాటిని ఆయా రంగుల పాకంలోనూ ముంచి తీయాలి. తరవాత ఒకే రంగులో ఉన్న రెండు రెండు బ్రెడ్‌ స్లైసుల్ని తీసుకుని వాటి మధ్య కోవా బర్ఫీ మిశ్రమాన్ని పెట్టి అదమాలి. తెలుపు రంగు వాటిని తెల్లని కొబ్బరి తురుములోనూ మిగిలిన వాటిని ఆయా రంగుల కొబ్బరి తురుముల్లోనూ దొర్లించి వాటిమీద బాదం ముక్కలు చల్లితే సరి.

రవ్వ బర్ఫీ

కావలసినవి
బొంబాయిరవ్వ: కప్పు, పంచదార: 4 కప్పులు, పాలు: 4 కప్పులు, నెయ్యి: కప్పు, యాలకులపొడి: టీస్పూను, ఆకుపచ్చ, నారింజ రంగులు: చిటికెడు చొప్పున

తయారుచేసే విధానం
* బాణలిలో రవ్వ, పంచదార, పాలు, నెయ్యి వేసి కాసేపు వేడిచేయాలి. పంచదార పూర్తిగా కరిగిన తరవాత దించి దాన్ని మూడు విభాగాలుగా చేయాలి.
* ఓ చిన్న గిన్నెలో టీస్పూను పాలల్లో ఆకుపచ్చ రంగు కలిపి ఉంచాలి. అలాగే మరో గిన్నెలో కాషాయ రంగు కలిపి ఉంచాలి.
* బాణలిలో తెలుపురంగు కోసం తీసుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి, అందులో కాస్త యాలకులపొడి వేసి అంచుల నుంచి వేరయ్యేవరకూ ఉడికించి తీసి పక్కన ఉంచాలి. అందులోనే ఆకుపచ్చ రంగుకోసం తీసుకున్న హల్వాని వేసి ఉడికాక ఆ రంగూ, యాలకులపొడి వేసి కలిపి దించి నెయ్యి రాసిన ప్లేటులో అడుగున పరిచినట్లుగా ఉంచాలి. దానిమీద తెలుపురంగు మిశ్రమాన్ని పరచాలి. కాషాయరంగు కోసం తీసుకున్న మిశ్రమాన్ని కూడా అలాగే ఉడికించి తెలుపు రంగు హల్వామీద పరిచి కాస్త గట్టిపడ్డాక ముక్కల్లా కోయాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని