ఊరించే ఉగాది విందు!

తెలుగు సంవత్సరాది రోజున ఉగాది పచ్చడితోపాటూ చేసుకునే పిండివంటల్లో బొబ్బట్లూ, గారెల్లాంటివి ఉండనే ఉంటాయి. కానీ ఎప్పుడూ అవే అంటే ఏం ప్రత్యేకత ఉంటుంది... అందుకే ఈసారి ఈ రుచుల్ని ఎంచుకుని చూడండి.

Updated : 26 Jun 2021 13:37 IST

తెలుగు సంవత్సరాది రోజున ఉగాది పచ్చడితోపాటూ చేసుకునే పిండివంటల్లో బొబ్బట్లూ, గారెల్లాంటివి ఉండనే ఉంటాయి. కానీ ఎప్పుడూ అవే అంటే ఏం ప్రత్యేకత ఉంటుంది... అందుకే ఈసారి ఈ రుచుల్ని ఎంచుకుని చూడండి.

మామిడి కొబ్బరి పులిహోర

కావలసినవి
అన్నం:మూడుకప్పులు, నూనె: నాలుగు చెంచాలు, పల్లీలు: గుప్పెడు, సెనగపప్పు, ఆవాలు, మినప్పప్పు: చెంచా చొప్పున, ఎండుమిర్చి, పచ్చిమిర్చి: రెండు చొప్పున, కరివేపాకు: రెండురెబ్బలు, పసుపు: అరచెంచా, ఉప్పు: తగినంత, పచ్చిమామిడి తురుము: కప్పు, పచ్చికొబ్బరి తురుము: అరకప్పు, అల్లం ముద్ద: చెంచా, ఇంగువ: కొద్దిగా.

తయారుచేసే విధానం
* అన్నాన్ని వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. స్టౌమీద బాణలి పెట్టి, అది వేడయ్యాక నూనె పోయాలి. ఇందులో ఆవాలు, పల్లీలు, సెనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించుకోవాలి. తరువాత నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలి. అవి కూడా వేగాక తగినంత ఉప్పు, పసుపు, కొబ్బరి, మామిడి తురుము, అల్లంముద్ద  వేసి వేయించాలి. రెండు నిమిషాలయ్యాక స్టౌ కట్టేసి ఈ తాలింపును అన్నంపైన వేసి బాగా కలిపితే సరి.


సొరకాయ పాయసం

కావలసినవి
సొరకాయ తురుము: రెండుకప్పులు, చిక్కని పాలు: లీటరు, కండెన్స్‌డ్‌మిల్క్‌: పావుకప్పు, నెయ్యి: రెండు పెద్ద చెంచాలు, జీడిపప్పు, బాదం, పిస్తాపలుకులు: అన్నీ కలిపి పావుకప్పు, చక్కెర: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా.

తయారుచేసే విధానం
* సొరకాయ తురుమును ఓ గిన్నెలోకి తీసుకుని అది మునిగేలా నీళ్లు పోసి పొయ్యిమీద పెట్టాలి. ఆ తురుము ఉడికాక నీళ్లు పిండేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక డ్రైఫ్రూట్స్‌ పలుకులు వేయించి, సొరకాయ తురుము వేయాలి. తడి పూర్తిగా పోయాక దీన్నో ప్లేటులోకి తీసుకోవాలి. ఇప్పుడు పాలను పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగి సగం అయ్యాక కండెన్స్‌డ్‌మిల్క్‌, సొరకాయ తురుము, చక్కెర వేసి బాగా కలపాలి. ఇది చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి.


బొబ్బర్ల వడ

కావలసినవి
బొబ్బర్లు: కప్పు, పచ్చిమిర్చి: ఒకటి, కారం: అరచెంచా, కరివేపాకు: రెండు రెబ్బలు, కొత్తిమీర: కట్ట, అల్లం: చిన్నముక్క, జీలకర్ర: చెంచా ఉప్పు: తగినంత, పసుపు: పావు చెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారుచేసే విధానం
* బొబ్బర్లను రెండుగంటలసేపు నానబెట్టుకోవాలి. తరవాత అవీ, నూనె తప్ప మిగిలిన పదార్థాలూ మిక్సీ జారులోకి తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పిండిని వడల్లా తట్టుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. 


పెరుగు జంతికలు

కావలసినవి
ఇంట్లో చేసుకున్న బియ్యప్పిండి: రెండు కప్పులు, పెరుగు: ముప్పావుకప్పు, నువ్వులు: ఒకటిన్నర టేబుల్‌స్పూను, కారం: ఒకటిన్నర చెంచా, ఉప్పు: తగినంత నూనె: వేయించేందుకు సరిపడా.

తయారుచేసే విధానం
* ఓ గిన్నెలో బియ్యప్పిండి, కారం, ఉప్పు, నువ్వులు, ఒకటిన్నర టేబుల్‌స్పూను వేడి నూనె వేసి అన్నింటినీ కలుపుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఈ పిండిని నూనె రాసిన జంతికల గొట్టంలోకితీసుకుని కాగుతోన్న నూనెలో జంతికల్లా వత్తుకుని ఎర్రగా వేగాక తీసుకోవాలి.


పాకం బొబ్బట్టు

కావలసినవి
మైదా: కప్పు, నెయ్యి: టేబుల్‌స్పూను, ఉప్పు: చిటికెడు, పుట్నాలపప్పు: అరకప్పు, చక్కెర: అరకప్పు, వేయించిన కొబ్బరిపొడి: అరకప్పు, యాలకులపొడి: పావుచెంచా, జీడిపప్పు-బాదంపలుకులు: కొద్దిగా.
పాకంకోసం- చక్కెర: ముప్పావుకప్పు, నీళ్లు: ముప్పావుకప్పు.

తయారుచేసే విధానం
* ముందుగా మైదాను ఓ గిన్నెలోకి తీసుకుని నెయ్యి, ఉప్పు వేసి ఓసారి కలపాలి. తరువాత నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలిపి నాననివ్వాలి. మిక్సీజారులో చక్కెర, పుట్నాలపప్పు తీసుకుని పొడిలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఇందులో కొబ్బరిపొడి, యాలకులపొడి కూడా వేసి అన్నింటినీ కలుపుకోవాలి. పాకం కోసం చక్కెర, నీళ్లు ఓ గిన్నెలోకి తీసుకుని స్టౌమీద పెట్టాలి. చక్కెర కరిగి, తీగపాకం వచ్చాక స్టౌ కట్టేయాలి. ఇప్పుడు స్టౌమీద బాణలి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె వేయాలి. అది వేడయ్యేలోగా నానిన మైదా పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. రెండుచొప్పున పూరీలను కాగుతోన్న నూనెలో వేసి వేయించుకుని ఆ వెంటనే చక్కెరపాకంలో నిమిషం ఉంచి తీయాలి. ఒక పూరీ తీసుకుని దానిపైన ముందుగా చేసుకున్న పుట్నాలపిండి మిశ్రమాన్ని చెంచా ఉంచి, రోల్‌లా చుట్టేయాలి. ఇలాగే  పూరీలన్నీ చేసుకుని మిగిలిన పాకాన్ని వీటిపై పోసి, డ్రైఫ్రూట్స్‌ పలుకులు అలంకరించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని