అలసందల వడ

అలసందల్ని బాగా నానబెట్టాలి. తరవాత నీళ్లు వంపేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్‌ తురుము, కొబ్బరి తురుము...

Published : 26 Jun 2021 16:07 IST

కావలసినవి
అలసందలు: ఒకటింపావు కప్పు, కొబ్బరి తురుము: 3 టేబుల్‌స్పూన్లు, క్యారెట్‌ తురుము: పావు కప్పు, ఉల్లిపాయలు: ముప్పావు కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లంతురుము: టీస్పూను, కొత్తిమీర: కట్ట, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* అలసందల్ని బాగా నానబెట్టాలి. తరవాత నీళ్లు వంపేసి కచ్చాపచ్చాగా రుబ్బాలి. తరవాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్‌ తురుము, కొబ్బరి తురుము, అల్లం తురుము, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. తరవాత మిశ్రమాన్ని నిమ్మకాయ సైజులో ఉండలు చేసి వడల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

మసాలా స్వీట్‌ కార్న్‌ వడ

కావలసినవి
స్వీట్‌ కార్న్‌: కప్పు, సెనగపిండి: కప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, ఉల్లిముక్కలు: పావుకప్పు, క్యాప్సికమ్‌ ముక్కలు: పావుకప్పు, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లి ముద్ద: పావుటీస్పూను, కారం: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, నిమ్మరసం: టీస్పూను, ఉప్పు: తగినంత, చాట్‌ మసాలా: టీస్పూను, నూనె: వేయించడానికి సరిపడా 
తయారుచేసే విధానం
* స్వీట్‌కార్న్‌ కచ్చాపచ్చాగా రుబ్బాలి. అందులోనే మిగిలిన అన్ని దినుసులూ వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొంచెంకొంచెంగా తీసుకుని వడల్లా వత్తి కాగిన నూనెలో వేయించి ఆపై చాట్‌మసాలా చల్లి గ్రీన్‌ చట్నీతో అందిస్తే సరి.

మద్దూరు వడ

కావలసినవి
బియ్యప్పిండి: అరకప్పు, మైదా: పావుకప్పు, బొంబాయిరవ్వ: పావుకప్పు, ఉల్లితురుము: అరకప్పు, పచ్చిమిర్చి: రెండు, కరివేపాకు తురుము: కొద్దిగా, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, మంచినీళ్లు: తగినన్ని, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* బేసిన్‌లో బియ్యప్పిండి, రవ్వ, మైదా వేసి కలపాలి. అందులోనే సన్నగా తరిగిన ఉల్లి తురుము, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు తురుము, కొత్తిమీర తురుము, ఉప్పు వేసి కలపాలి. తరవాత విడిగా టేబుల్‌స్పూను నూనె వేసి స్పూనుతో కలపాలి. తరవాత సుమారు నాలుగైదు టేబుల్‌స్పూన్ల నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని చేతులతో చపాతీ పిండిలా కలపాలి. మరీ అతుక్కున్నట్లుగా అనిపిస్తే నాలుగు టీస్పూన్ల మైదా కలపాలి. 
* ఇప్పుడు బాణలిలో నూనె వేసి కాగనివ్వాలి. తరవాత పిండిని చిన్న ఉండల్లా చేసి, ప్లాస్టిక్‌ కాగితం మీద చేతులతోనే మందపాటి చెక్కల్లా వత్తి కాగిన నూనెలో వేసి వేయించి తీయాలి. ఇలాగే అన్నీ చేసుకుని వేయించాలి. వీటిని నేరుగాగానీ కొబ్బరి చట్నీతోగానీ వడ్డించొచ్చు.

పాలక్‌ వడ

కావలసినవి
పాలకూర: 3 కట్టలు, సెనగపప్పు: ముప్పావు కప్పు, కందిపప్పు: పావుకప్పు, మినప్పప్పు: టేబుల్‌స్పూను, మెంతులు: టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు: పావుకప్పు, అల్లం తురుము: టీస్పూను, కొత్తిమీర తురుము: 2 టేబుల్‌స్పూన్లు, కరివేపాకు: టేబుల్‌స్పూను, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* సెనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, మెంతులు రెండు గంటలు నానబెట్టాలి. తరవాత నీళ్లు వంపేసి మిక్సీలో వేసి కొంచెంకొంచెంగా నీళ్లు చల్లుతూ మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమంలో సన్నగా తరిగిన పాలకూర, అల్లం, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి.
* తరవాత మిశ్రమాన్ని చిన్న వడల్లా వత్తి కాగిన నూనెలో వేయించి తీయాలి.

రాజస్థానీ దాల్‌ కల్మి వడ

కావలసినవి
సెనగపప్పు: కప్పు, మెంతులు: టీస్పూను, దనియాలు: టీస్పూను, కారం: 2 టీస్పూన్లు, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
* సెనగపప్పుని నాలుగు గంటలపాటు నాననివ్వాలి. తరవాత నీళ్లు వంపేసి వీటికి మెంతులు, దనియాలు జోడించి కచ్చాపచ్చాగా రుబ్బాలి. తరవాత అందులో కారం, ఇంగువ, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని వడల్లా చేసి కాగిన నూనెలో వేయించి తీసి సగానికి కోసి గ్రీన్‌, రెడ్‌ చట్నీలతో అందించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని