ఈ వంటలతో పొట్టకి హాయి!

కాస్త జ్వరం వచ్చి తగ్గితేనే త్వరగా అరగదన్న భయంతో పత్యం చేయిస్తారు. తేలికపాటి కూరలు పెడతారు. అలాంటిది క్యాన్సర్‌లాంటి రోగాన్ని ఎదుర్కొనేందుకు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలన్నది తెలిసిందే. పైగా మందుల ప్రభావం.....

Published : 27 Jun 2021 17:24 IST

కాస్త జ్వరం వచ్చి తగ్గితేనే త్వరగా అరగదన్న భయంతో పత్యం చేయిస్తారు. తేలికపాటి కూరలు పెడతారు. అలాంటిది క్యాన్సర్‌లాంటి రోగాన్ని ఎదుర్కొనేందుకు పుష్టికరమైన ఆహారం తీసుకోవాలన్నది తెలిసిందే. పైగా మందుల ప్రభావం... పొట్ట మండిపోతుంటుంది. కానీ రుచిగా తినాలి. బలంగా ఉండాలి. అందుకే ఈ కమ్మని పౌష్టిక రుచులు..!

కాలీఫ్లవర్‌ మెంతి గ్రేవీ

కావలసినవి
కాలీఫ్లవర్‌ రెమ్మలు: 2 కప్పులు, మెంతి కూర తురుము: కప్పు, క్యారెట్‌ ముక్కలు: కప్పు, ఉల్లిముక్కలు: 2 కప్పులు, పాలు: 2 కప్పులు, పచ్చిమిర్చి తురుము: టీస్పూను, అల్లంవెల్లుల్లి: టీస్పూను, కొబ్బరితురుము: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
* నాన్‌స్టిక్‌ పాన్‌లో టీస్పూను నూనె వేసి ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి, కొబ్బరితురుము వేసి వేయించాలి. ఇవి చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరవాత మరిగించిన పాలు పోసి కలపాలి.
* కాలీఫ్లవర్‌, మెంతికూర, క్యారెట్‌ ముక్కలు కుక్కర్‌లో పెట్టి ఉడికించి తీయాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేసి జీలకర్ర వేసి వేగాక ఉల్లి మిశ్రమం వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరవాత ఉడికించిన కూరగాయ ముక్కలు, మెంతి ఆకు వేసి, ఉప్పు వేసి మూతపెట్టి మరో నాలుగు నిమిషాలపాటు సిమ్‌లో ఉడికించి దించాలి.

గ్రీన్‌ కిచిడీ

కావలసినవి
కొర్రలు: పావుకప్పు, పెసలు: పావుకప్పు, తాజా బఠాణీ: అరకప్పు, నూనె: 2 టీస్పూన్లు, జీలకర్ర: టీస్పూను, ఇంగువ: చిటికెడు, ఉల్లిముక్కలు: అరకప్పు, టొమాటో ముక్కలు: కప్పు, వెల్లుల్లిముద్ద: టీస్పూను, అల్లంముద్ద: అరటీస్పూను, పచ్చిమిర్చి: ఒకటి, పసుపు: అర టీస్పూను, ఉప్పు:
తగినంత, నెయ్యి: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం
కొర్రలు, పెసరపప్పు విడివిడిగా సుమారు ఐదు గంటలపాటు నాననివ్వాలి.
* ప్రెషర్‌పాన్‌లో నానబెట్టిన కొర్రలు, పప్పు, తాజా బఠాణీలు, ఉప్పు, ఓ కప్పు నీళ్లు పోసి ఐదు విజిల్స్‌ వచ్చే వరకూ ఉడికించాలి.
* నాన్‌స్టిక్‌పాన్‌లో నెయ్యి వేసి జీలకర్ర వేసి వేగాక ఇంగువ, అల్లం, వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి. ఇప్పుడు ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక టొమాటోముక్కలు, పసుపు, కారం వేసి సిమ్‌లో ఉడికించాలి. తరవాత టొమాటో మెత్తగా అయ్యేలా మెదిపి, ఉడికించిన కొర్రల మిశ్రమం వేసి మరో రెండు నిమిషాలు సిమ్‌లో తిప్పుతూ ఉడికించి దించాలి.

(గమనిక: కొర్రలకు బదులు దంపుడుబియ్యం, సజ్జలు, సామలు, అరికెలు... ఏవయినా వాడుకోవచ్చు).

కీరా- మొలకల సబ్జి

కావలసినవి
కీరాముక్కలు: 2 కప్పులు, మొలకలొచ్చిన పెసలు, సెనగలు, బఠాణీలు: కప్పు, జీలకర్ర: టీస్పూను, ఇంగువ: చిటికెడు, పసుపు: అరటీస్పూను, కారం: టీస్పూను, దనియాలపొడి: టీస్పూను, జీలకర్రపొడి: టీస్పూను, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: 2 టీస్పూన్లు, ఉప్పు: తగినంత

తయారుచేసే విధానం
బాణలిలో నూనె వేసి వేగాక జీలకర్ర, ఇంగువ వేసి వేయించాలి. తరవాత మొలకలు, పసుపు వేసి ఓ కప్పు నీళ్లు పోసి మూత పెట్టి మీడియం మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. తరవాత కీరాముక్కలు, కారం, దనియాలపొడి, జీలకర్రపొడి, ఉప్పు వేసి అవసరమైతే మరికాసిని నీళ్లు పోసి మూత పెట్టి సిమ్‌లో మొలకలన్నీ ఉడికేవరకూ ఉంచాలి. చివరగా కాస్త కొత్తిమీర తురుము చల్లి దించితే సరి.

ఆలూ-మునక్కాయ కూర

కావలసినవి
మునక్కాయలు: నాలుగు, బంగాళాదుంప ముక్కలు: కప్పు, బెల్లం తురుము: టేబుల్‌స్పూను, మినప్పప్పు: 2 టీస్పూన్లు, ఆవాలు: టీస్పూను, కరివేపాకు: రెండురెమ్మలు, గ్రేవీకోసం: టొమాటోముక్కలు: కప్పు, కొబ్బరితురుము: కప్పు, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: రెండు, దనియాలు: 2 టేబుల్‌స్పూన్లు, వెల్లుల్లితురుము: టీస్పూను, పసుపు: అరటీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు

తయారుచేసే విధానం
* నాన్‌స్టిక్‌ పాన్‌లో మునక్కాడ ముక్కలు, బంగాళాదుంపలు, బెల్లం తురుము, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
* గ్రేవీ కోసం తీసుకున్న టొమాటోలు ఓ ఐదు నిమిషాలు ఉడికించి చల్లారాక మెత్తగా రుబ్బాలి.
* కొబ్బరితురుము, జీలకర్ర, ఎండుమిర్చి, దనియాలు, వెల్లుల్లి అన్నీ వేసి రుబ్బాలి.
* విడిగా మరో పాన్‌లో నూనె వేసి మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి వేగాక ఉడికించిన కూరగాయల ముక్కలన్నీ వేసి కలపాలి. ఇప్పుడు రుబ్బిన టొమాటోముద్ద, కొబ్బరి మిశ్రమం కూడా వేసి బాగా కలిపి కూరగాయముక్కల్ని ఉడికించిన నీళ్లు కూడా పోసి సిమ్‌లో ఓ పది నిమిషాలు ఉంచి దించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని