అపార్ట్‌మెంట్లకు ఏది మేలు?

అపార్ట్‌మెంట్‌ సంక్షేమ సంఘాలు ఎక్కడ రిజిస్టర్‌ చేసుకోవాలి? 21 కంటే తక్కువ ఫ్లాట్లు ఉంటే ఎక్కడ చేసుకోవాలి?

Published : 21 Nov 2020 12:47 IST

మ్యాక్స్‌ చట్టం 1995 కింద నమోదుకు అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌ : అపార్ట్‌మెంట్‌ సంక్షేమ సంఘాలు ఎక్కడ రిజిస్టర్‌ చేసుకోవాలి? 21 కంటే తక్కువ ఫ్లాట్లు ఉంటే ఎక్కడ చేసుకోవాలి? తెలంగాణ సహకార చట్టం 1964 కింద మేలా? పరస్పర సహాయక సహకార సంఘాల చట్టం(మ్యాక్స్‌) 1995 ప్రకారం చేసుకుంటే సరిపోతుందా? గతంలో ఒక చట్టం కింద రిజిస్టర్‌ చేసుకున్నా ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా మరో చట్టం కిందకు మార్చుకోవచ్చా? నెల రోజుల క్రితం వరకు ఇవన్నీ ప్రశ్నలే. అధికారుల వద్ద సమాధానాలు లేవు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అపార్ట్‌మెంట్‌ సంక్షేమ సంఘాల రిజిస్ట్రేషన్లపై స్పష్టత వచ్చింది. రెండు చట్టాల్లో దేనికిందనైనా ‘అపార్ట్‌మెంట్‌ నిర్వహణ ఫ్లాట్‌ యజమానుల పరస్పర సహాయక సహకార సంఘం’గా రిజిస్టర్‌ చేసుకోవచ్చు. 

వివాదాలతో.. 
అపార్ట్‌మెంట్, కాలనీ సంక్షేమ సంఘంలోని సభ్యులు, పాలకమండలిలో విభేదాలతో చాలా కేసులు కోర్టులకు చేరడంతో రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ కింద రిజిస్ట్రేషన్లను హైకోర్టు నిలిపేసింది. తెలంగాణ సహకార సంఘాల చట్టం 1964 కింద రిజిస్టర్‌ చేసుకోవాలని ఆదేశించింది. ఈ చట్టం కొంత సంక్లిష్టంగా ఉండటంతో యజమానులు ఆసక్తి చూపలేదు. ఎక్కువ ఫ్లాట్లు ఉన్న అపార్ట్‌మెంట్ల యజమానులు తెలంగాణ సహకార సంఘాల చట్టం 1995 కింద రిజిస్టర్‌ చేసుకునేందుకు మొగ్గుచూపారు. కొన్నాళ్ల తర్వాత అధికారులు వీటిని సైతం ఆపేశారు. దీనిపై కొందరు కోర్టుకెళ్లడంతో రెండు చట్టాల్లో దేనినైనా ఎంచుకోవచ్చని గత నెలలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇబ్బందులు ఉంటే ఒక చట్టం కింద నమోదైనా మరో చట్టం కిందకు మారొచ్చు అని తెలిపింది. మరి రెండింటిలో మ్యాక్స్‌ 1995 ప్రకారం రిజిస్టర్‌ చేసుకోవడం మేలని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్‌ ప్రెస్‌ ఇన్‌ఛార్జి కొత్త సుధాకర్‌రెడ్డి తెలిపారు.

ఎలా చేసుకోవాలి?
గన్‌ఫౌండ్రిలోని తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్‌ కార్యాలయంలో అపార్ట్‌మెంట్‌ నిర్వహణ యజమానుల పరస్పర సహాయక సహకార సంఘంగా నమోదుకు సంబంధించిన పూర్తి సమాచారం, దరఖాస్తు పత్రాలు, నమూనా నిబంధనావళి(మోడల్‌ బైలాలు) పొందవచ్చు. ః అపార్ట్‌మెంట్‌లో ఎన్ని ఫ్లాట్లు ఉన్నా సంఘంగా రిజిస్టర్‌ చేసేందుకు మ్యాక్స్‌ చట్టం 1995 ప్రకారం కనీసం పది మంది సభ్యుల పేర్లు, సంతకాలతో దరఖాస్తు(ఫాం-ఏ) సమర్పించాలి. మరో పత్రంలో సభ్యుల చిరునామా, వాటాధనం వివరాలు నమోదు చేయాలి. రూ.20 విలువైన బాండ్‌పేపర్‌పై ప్రతి సభ్యుడు డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఇవన్నీ మూడు సెట్‌లు తీసి జిల్లా సహకార అధికారి కార్యాలయంలో సమర్పించాలి. 64 చట్టం కింద అయితే 21 మంది సభ్యులు ఉండాలి. పరిశీలించి 45 రోజుల్లో సంఘాన్ని రిజిస్టర్‌ చేస్తారు. రిజిస్టరైన 30 నుంచి 90రోజుల్లో పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని