అన్నివైపులా అమ్మకాలు

కొవిడ్‌ ఒడిదొడుకులు తట్టుకుని.. ధరణి అడ్డంకుల్ని అధిగమించి.. పెరుగుతున్న భూముల ధరలతో పోటీపడుతూ ప్రస్తుతం స్థిరాస్తి రంగం పరుగులు పెడుతోంది. కొత్త సంవత్సరంలో లావాదేవీలు వేగం అందుకున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడంతో స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడుతున్నవారు పెరిగారు. ఇలాంటివారు స్థలాలు కొనుగోలు చేస్తుంటే.. గృహరుణ వడ్డీరేట్లు తగ్గడంతో రుణాలు తీసుకుని...

Published : 27 Feb 2021 02:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ ఒడిదొడుకులు తట్టుకుని.. ధరణి అడ్డంకుల్ని అధిగమించి.. పెరుగుతున్న భూముల ధరలతో పోటీపడుతూ ప్రస్తుతం స్థిరాస్తి రంగం పరుగులు పెడుతోంది. కొత్త సంవత్సరంలో లావాదేవీలు వేగం అందుకున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీరేట్లు తగ్గడంతో స్థిరాస్తుల్లో పెట్టుబడి పెడుతున్నవారు పెరిగారు. ఇలాంటివారు స్థలాలు కొనుగోలు చేస్తుంటే.. గృహరుణ వడ్డీరేట్లు తగ్గడంతో రుణాలు తీసుకుని అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో సిద్ధంగా ఉన్న ఇళ్లు, కొత్త ప్రాజెక్టుల్లో ఫ్లాట్లు, వెంచర్లలో స్థలాలు హాట్‌ కేకుల్లా బుకింగ్‌లు అవుతున్నాయని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.
నగరం చుట్టూ మౌలిక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తుండటం... పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఓఆర్‌ఆర్‌ బయట పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుండటంతో మార్కెట్లో సానుకూలత నెలకొంది. కొవిడ్‌తో ఐటీ కార్యాలయాలన్నీ చాలావరకు ఇంటి నుంచే పని చేస్తున్నా ఆ ప్రభావం స్థిరాస్తి రంగంపై తాత్కాలికమేనని అంటున్నాయి. కార్యాలయాల లీజింగ్‌ కొవిడ్‌ అనంతరం మందగించినా.. గత ఏడాది చివరి త్రైమాసికం నుంచి తిరిగి పుంజుకుంది. పశ్చిమ హైదరాబాద్‌ను దాటి ఐటీ కార్యాలయాలు నగరంలోని ఇతర ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఉప్పల్‌ వైపు పోచారంలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ కార్యాలయాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కొంపల్లి వైపు ఐటీ సంస్థల ఏర్పాటుకు సర్కారు ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయవాడ జాతీయ రహదారి, బెంగళూరు జాతీయ రహదారివైపు లాజిస్టిక్‌ పార్కులు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా.. మరికొన్ని వేర్వేరు దశలో ఉన్నాయి. . దీంతో తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్‌ నగరానికి  ఉత్తరాది నుంచి పెద్ద ఎత్తున వలసలు పెరిగాయి. జనాభాకు తగ్గట్టుగా ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా రహదారుల విస్తరణ, ప్లైఓవర్ల నిర్మాణం, స్కైవాక్‌లు, మెట్రో విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డితో భవిష్యత్తులో హైదరాబాద్‌కు నీటి కొరత ఉండదనే భరోసా సర్కారు ఇస్తోంది. ఇవన్నీ హైదరాబాద్‌లో  పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నాయి. నగరానికి అన్నివైపులా స్థిరాస్తులు పెద్ద సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్‌.. భవిష్యత్తులో వృద్ధి అంచనాల ఆధారంగా కొనుగోలుదారులు ఆయా ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు.

ఐటీ కేంద్రంగా ఉన్న మాదాపూర్‌, గచ్చిబౌలి చుట్టు పక్కల ప్రాంతాల్లో పలు కంపెనీల విస్తరణతో చుట్టూ పది కిలోమీటర్ల వరకు గృహనిర్మాణం ఊపందుకుంది. కొండాపూర్‌, కోకాపేట్‌, రాయదుర్గం, నార్సింగి, పుప్పాల్‌గూడ ప్రాంతాల్లోని నివాసాలకు డిమాండ్‌ పెరిగింది. కార్యాలయాలకు సమీపంలో ఉండటంతో ఇక్కడ కొనుగోలుకు ఐటీ ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ చాలా అపార్ట్‌మెంట్లు నిర్మాణంలో ఉండగా.. పలు సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటించాయి.  ఇంటి నుంచి పనితో రెండు పడక గదుల స్థానంలో 2.5 పడగ గదులను నిర్మించేలా డిజైన్లలో మార్పులు చేశారు. చిన్న గదిని పిల్లలు పాఠాలు వినేందుకు, భార్యాభర్తలు పని చేసుకునేందుకు ఉపయోగించుకునేలా నిర్మిస్తున్నారు. కొల్లూరు, మోఖిల్లా దాటి శంకర్‌పల్లి వైపు రియల్‌ ఎస్టేట్‌ విస్తరించింది.
శంషాబాద్‌ వైపు... భవిష్యత్తులో వృద్ధికి అవకాశం ఉండటంతో విమానాశ్రయం మార్గంలోనూ నివాసాలు వెలుస్తున్నాయి. అత్తాపూర్‌, అరాంఘర్‌ దాటి జల్‌పల్లి వైపు  విస్తరిస్తోంది. అప్పా జంక్షన్‌ ఐటీ కేంద్రానికి దగ్గరలో ఉండటం ఈ ప్రాంతంలో నిర్మాణాలు పెరిగాయి. బహుళ అంతస్తుల భవనాలు అందుబాటు ధరల్లో ఉన్నాయి. బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పుర, అప్పా వరకు అభివృద్ధి విస్తరించింది.
* కొంపల్లి వైపు...  సికింద్రాబాద్‌ నుంచి చుట్టు పక్కల 15 కిలోమీటర్ల వరకు నివాస ప్రాంతాలు విస్తరించాయి. మౌలాలి, తిరుమలగిరి, ఈసీఐఎల్‌, సైనిక్‌పురి, ఎ.ఎస్‌.రావు నగర్‌, కొంపల్లి, శామీర్‌పేట, కాప్రా వరకు బహుళ అంతస్తుల నిర్మాణాలు అందుబాటులో ఉన్నాయి. విల్లా ప్రాజెక్ట్‌లు ఆకర్షణీయ ధరల్లో ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌తో ఐటీ కేంద్రానికి త్వరగా చేరుకునే అవకాశం ఉండటం, పచ్చని చెట్లు ప్రశాంత వాతావరణం కోరుకునేవారు ఇటువైపు చూస్తున్నారు.
ఎల్‌బీనగర్‌ దారిలో.. జాతీయ రహదారి మీదున్న ఈ ప్రాంతానికి మెట్రో రైలుతో డిమాండ్‌ పెరిగింది. చుట్టు పక్కల నాగోల్‌, బండ్లగూడ, హస్తినాపురం, బీఎన్‌రెడ్డినగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ వరకు నగరం విస్తరించింది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ బయట ఎక్కువ ప్రాజెక్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆదిభట్ల, తుక్కుగూడ వరకు నిర్మాణాలు ఊపందుకున్నాయి. శ్రీశైలం దారిలో విల్లా ప్రాజెక్ట్‌లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి.
కూకట్‌పల్లి మార్గంలో.. ఐటీ కేంద్రానికి చేరువలో ఉండటంలో ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందింది. చుట్టు పక్కల ప్రాంతాలకు విస్తరించింది. ప్రగతినగర్‌, నిజాంపేట, బాచుపల్లి, మియాపూర్‌, మదీనాగూడ, చందానగర్‌, లింగంపల్లి, బీరంగూడ దాటి అమీర్‌పూర్‌ వరకు నివాస కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి. ఓఆర్‌ఆర్‌ బయట విల్లా ప్రాజెక్ట్‌లు, వ్యక్తిగత గృహ నిర్మాణాలు ఎక్కువగా వస్తున్నాయి.  
ఉప్పల్‌ వైపు.. మెట్రో రవాణా అందుబాటులోకి రావడంతో ఎక్కువ మంది దృష్టి ఇటువైపు పడింది. ఇక్కడి నుంచి వరంగల్‌ రహదారి మార్గంలో పోచారం, ఘట్‌కేసర్‌ వరకు వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం, అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లు అందుబాటు ధరల్లో ఉన్నాయి. పశ్చిమంలో ఉండే ఐటీ కేంద్రానికి సైతం గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండటం సానుకూల అంశం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని