పటాన్‌చెరు వైపు వడివడిగా

చాన్నాళ్ల క్రితమే గ్రేటర్‌లో దాదాపుగా కలిసిపోయిన ప్రాంతం.. అక్కడున్న కాలుష్య కారక పరిశ్రమలన్నీ బాహ్య వలయ రహదారి ఆవలకు తరలించడంతో ఇప్పుడా ప్రాంతం నివాసాలకు నిలయంగా మారింది. ఓఆర్‌ఆర్‌ పక్కనే ఉండటం, ఐటీ కారిడార్‌కు వేగంగా ....

Updated : 25 Dec 2021 05:38 IST

ఈనాడు, హైదరాబాద్‌

చాన్నాళ్ల క్రితమే గ్రేటర్‌లో దాదాపుగా కలిసిపోయిన ప్రాంతం.. అక్కడున్న కాలుష్య కారక పరిశ్రమలన్నీ బాహ్య వలయ రహదారి ఆవలకు తరలించడంతో ఇప్పుడా ప్రాంతం నివాసాలకు నిలయంగా మారింది. ఓఆర్‌ఆర్‌ పక్కనే ఉండటం, ఐటీ కారిడార్‌కు వేగంగా చేరుకునే సౌలభ్యం ఉండటంతో అత్యధిక శాతం ఐటీ ఉద్యోగుల ఆవాస కేంద్రమైంది పటాన్‌చెరు ప్రాంతం. వేగంగా విస్తరిస్తున్న ఈ ప్రాంతం స్థిరాస్తి రంగానికి నయా హబ్‌గా మారింది.

కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో స్థిరాస్తి రంగంలో చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు నగరంలో నివాసాలకు ప్రాధాన్యమిచ్చిన వారంతా.. కాస్త దూరమైనా వ్యక్తిగత ఇళ్లు, విల్లాల్లోకి మారేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఓఆర్‌ఆర్‌ చుట్టుపక్కల, నగరానికి చేరువగా ఉన్న ప్రాంతాలపై దృష్టిపడింది. అప్పటికే ఆయా ప్రాంతాల్లో పలు విల్లా ప్రాజెక్టులు మొదలైనా.. విక్రయాలు మందకొడిగా ఉండేవి. లాక్‌డౌన్‌ అనంతరం డిమాండ్‌ పెరగడంతో పటాన్‌చెరు చుట్టుపక్కల మరిన్ని సంస్థలు కొత్త ప్రాజెక్టులతో వచ్చాయి. పరిశ్రమలు తరలిపోవడంతో వాటి భూములన్నీ నివాస కేంద్రాలుగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున గేటెడ్‌ కమ్యూనిటీలు వస్తున్నాయి. విల్లాలతో పాటూ ఆకాశ హర్మ్యాలను ఇక్కడ నిర్మిస్తున్నారు.  

పశ్చిమానికి కొనసాగింపుగా..
హైదరాబాద్‌ స్థిరాస్తి రంగంలో సింహ భాగం పశ్చిమ భాగంలోనే కేంద్రీకృతమైంది. ఐటీ కారిడార్‌ చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు డిమాండ్‌ అధికంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. ఐటీ కేంద్రానికి ఇదివరకు ఐదారు కిలోమీటర్ల దూరంలోనే ఎక్కువగా నివాసాలకు మొగ్గు చూపేవారు. ఆ తర్వాత 10-15 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం పెరగడంతో ఇప్పుడు 20 కి.మీ. అయినా పెద్ద దూరమే కాదంటున్నారు అభివృద్ధి చేసేవారు.

జనావాసాలతో..
పటాన్‌చెరు కంటే ముందున్న లింగంపల్లి, తెల్లాపూర్‌, బీహెచ్‌ఎఈల్‌ రామచంద్రాపురం చుట్టుపక్కల బీరంగూడ, కిష్టారెడ్డిపేట వరకు జనావాసాలతో నిండిపోవడంతో కొత్త నిర్మాణ ప్రాజెక్టులు పటాన్‌చెరు చుట్టుపక్కల ప్రాంతంలో వస్తున్నాయి. 5 కి.మీ. దూరంలోనే సుల్తాన్‌పూర్‌లో ఇటీవలే ప్రభుత్వం మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయి. ఆవాసాలకు డిమాండ్‌ పెరగనుంది.

ఎక్కడికైనా తేలికగా..
జాతీయ రహదారితో నగరంలోకి ప్రజారవాణా అందుబాటులో ఉంది. సమీపంలోనే ఓఆర్‌ఆర్‌ ఉండటంతో ఏ ప్రాంతానికైనా వేగంగా చేరుకునే సౌలభ్యం ఉంది. బీహెచ్‌ఈఎల్‌ వరకు మెట్రో రెండో దశ ప్రతిపాదనలు ఉన్నాయి. భవిష్యత్తులో పటాన్‌చెరు వరకు విస్తరించే సూచనలున్నాయి. లింగంపల్లి, తెల్లాపూర్‌ వరకు ఎంఎంటీఎస్‌ అందుబాటులో ఉంది. ఇవన్నీ నివాస ప్రాంతంగా మారడానికి అనుకూలంగా మారాయి. పేరున్న పాఠశాలలు ఇక్కడ పెద్ద సంఖ్యలో కొలువుదీరడంతో ఎక్కువ మంది ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారని నిర్మాణదారులు అంటున్నారు.


అక్కడ ఖరీదు కావడంతో...

టీ కారిడార్‌కు కొనసాగింపుగా కొల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు నివాసాలకు అనుకూలంగా ఉన్నా.. ఇక్కడ భూముల ధరలు అధికంగా ఉన్నాయి. విల్లాల ఖరీదు మరీ ఎక్కువ. ఇప్పుడిప్పుడే ఇక్కడ బహుళ అంతస్తుల భవనాలు వస్తున్నాయి. అందుబాటు ధరల్లో విల్లాలు కావాలనుకునేవారికి చేరువలో పటాన్‌చెరు కన్పిస్తోందని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ పటాన్‌చెరు దాటి సంగారెడ్డి వరకు విస్తరించింది. ఇక్కడ పెద్ద ఎత్తున లేఅవుట్‌ వెంచర్లు వేశారు.


విలువ పెరుగుతుండటంతో..

నివాసం ఉండటంతో పాటు పెట్టుబడి విలువ రెండు మూడేళ్లలో భారీగా వృద్ధి చెందుతుండటంతో విల్లాలకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా అధికాదాయ వర్గాలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ‘విల్లా ప్రాజెక్టుల్లో భద్రతతో పాటు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉంటాయి. సమీపంలో మంచి పాఠశాలలు అందుబాటులో ఉన్నాయి. కార్యాలయం ఒక్కటే కాస్త దూరం. ప్రస్తుతం ఇంటి నుంచి పనికావడంతో విల్లాలు కొనేందుకు ఇష్టపడుతున్నారు. 95 శాతం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులే కొనుగోలు చేస్తున్నారు’ అని ఏపీఆర్‌ గ్రూపు ఎండీ ఆవుల సంజీవ్‌రెడ్డి అన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని