ఆహ్లాదం.. ఆరోగ్యం

విశాలమైన ఇల్లు.. చూపు తిప్పుకోనివ్వని ఎలివేషన్‌.. ఆకట్టుకునే రంగులు.. అబ్బురపరిచే ఇంటీరియర్‌...

Published : 06 Mar 2021 02:32 IST

ఈనాడు, హైదరాబాద్‌

విశాలమైన ఇల్లు.. చూపు తిప్పుకోనివ్వని ఎలివేషన్‌.. ఆకట్టుకునే రంగులు.. అబ్బురపరిచే ఇంటీరియర్‌.. నివాసాల హంగులకు హద్దే లేదు. స్థోమతకు తగ్గట్టుగా పొదరిల్లును నిర్మించుకుంటున్నారు. బయటి నుంచి చూసేవారికి గొప్పగా ఉన్నా.. ఇంట్లో ఉన్నవారికి నచ్చితేనే వీటి ఉపయోగం. ఇన్నాళ్లు విలాసానికి పెద్దపీట వేసిన గృహస్తుల ఆలోచనల్లో మార్పులొస్తున్నాయి. ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పంచే కలల లోగిళ్లవైపు చూస్తున్నారు. అందుకు అనుగుణంగా ఇంట్లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. హరిత ఉత్పత్తులవైపు మొగ్గు చూపిస్తున్నారు.
సొంతిల్లు ఇచ్చే భరోసా కొంతకాలం ఆయుష్షును పెంచుతుందని అంటారు. ప్రస్తుత ఇళ్లను చూస్తుంటే విలాసంగా ఉంటున్నాయే తప్ప జీవన ప్రమాణాలను పెంచేవిగా కనిపించడం లేదు. కాలుష్య కారకాలుగా ఉంటున్నాయి. ఆకర్షణీయంగా కనిపించేందుకు ముదురు రంగులను ఉపయోగిస్తున్నారు. వీటి వాసన చాలా మందికి పడక ఆరోగ్య, మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇళ్లలో విపరీతమైన వేడి ఉంటోంది. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఉత్సాహంగా.. ఉండేందుకు ఇంటి నిర్మాణం, ఇంటిలోపల ఉపయోగించే ఉత్పత్తుల ప్రభావం కూడా ఉంటుందనే అవగాహన ఇటీవల పెరిగింది. ఆ మేరకు ఇంటిని, కార్యాలయాలను సరిదిద్దుకునేందుకు ముందుకొస్తున్నారు. హరిత భవనాల్లో ఆరోగ్యంతో పాటు ఉత్పాదకత పెరుగుతుందని గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ అంటోంది. శుభ్రమైన గాలితో సంతోషాలు రెట్టింపు కానున్నాయి.

అపోహలు తొలగితే..
యూఎస్‌ గ్రీన్‌ బిల్దింగ్‌ కౌన్సిల్‌ (యూఎస్‌జీబీసీ) భారత్‌తో సహా వేర్వేరు దేశాల్లో ప్రామాణిక నివాసాలపై ఇటీవల అధ్యయనం నిర్వహించింది. భారత్‌లో హరిత భవనాలు, వాటితో కలిగే ప్రయోజనాలపై అవగాహన ఉన్నా.. హరిత ఉత్పత్తులు అందుబాటులో ఉండవని, ధర ఎక్కువనే అపోహలతో ఇన్నాళ్లు అందిపుచ్చుకోలేక పోయారని తెలిపింది.  
సర్వేలో ఏం తేలిందంటే..
75%   ఇండోర్‌ ప్రదేశాలను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నారు
67%   ఆరోగ్యం మెరుగుపర్చే ఉత్పత్తులు కొనేందుకు సుముఖంగా ఉన్నారు
63 %  హరిత ఉత్పత్తులను వినియోగించనున్నట్లు చెప్పారు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని