పచ్చని గృహమే స్వర్గ సీమ

ఇంట్లో అడుగుపెట్టగానే పచ్చదనం స్వాగతం పలికితే.. ఎటుచూసినా ఆకుపచ్చని వాతావరణం దర్శనమిస్తే.. వాన నీరంతా ఇంకేలా ఏర్పాట్లు ఉంటే.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే.. ఆ ఇల్లే కదా స్వర్గసీమ.. మీ ఇంటిని ఇలా

Updated : 04 Sep 2021 02:23 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ఇంట్లో అడుగుపెట్టగానే పచ్చదనం స్వాగతం పలికితే.. ఎటుచూసినా ఆకుపచ్చని వాతావరణం దర్శనమిస్తే.. వాన నీరంతా ఇంకేలా ఏర్పాట్లు ఉంటే.. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే.. ఆ ఇల్లే కదా స్వర్గసీమ.. మీ ఇంటిని ఇలా తీర్చిదిద్దుకోవాలంటే వానాకాలమే సరైన సమయం.. ఇప్పటికీ మించిపోలేదు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ తక్షణం చర్యలకు దిగితే తర్వాతి కాలాల్లోనూ ఇంటి పరిసరాలను అహ్లాదకరంగా మార్చుకోవచ్చు.
*వనాలు పోయి భవనాలు వెలుస్తూ..కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు కాలంతో సంబంధం లేకుండా ఇటీవల సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. వేసవిలో నలభై డిగ్రీలపైనే ఉంటున్నాయి. ముఖ్యంగా పై అంతస్తుల్లో ఉన్నవారు వేడి తీవ్రతకు నానాపాట్లు పడుతుంటారు. వీరు వానాకాలంలో ఇంటిపైన పూల, పండ్ల, ఆహ్లాదాన్ని పంచే మొక్కలు పెంచుకోవడం ద్వారా వేసవిలో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తీవ్రతను తగ్గించుకోవచ్చు. బాల్కనీలు, కిటికీల వద్ద పెంచుకోవడం ద్వారా చల్లగాలి ఇంట్లోకి వచ్చేలా చూసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించవచ్చు.
* వ్యక్తిగత నివాసాలు తగ్గి క్రమంగా బహుళ అంతస్తుల ఆవాసాలు పెరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్లలో మొక్కలు పెంచలేమా? అనే నిరాశ వద్దు. మనస్సు ఉండాలే గాని మార్గాలు అనేకం. అభిరుచి కలిగిన వారికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. వరండాలో, బాల్కనీలో అందమైన కుండీల్లో చిన్నచిన్న మొక్కలు పెంచుకోవడానికి వీలుంటుంది. మెట్లు దిగే దగ్గర కుండీలు ఏర్పాటు చేసుకోవచ్చు. వేలాడదీసే కుండీలతో హైబ్రీడ్‌ మొక్కలు బాగుంటాయి. మనీప్లాంట్స్‌, సన్నజాతి తీగలలో అల్లుకునేవి   చూడముచ్చటగా ఉంటాయి.
*ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఫలాలనిచ్చే రకాలు, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఔషధ గుణాలున్నవి, చక్కని పరిమళాన్ని వెదజల్లేవి, చూపరులకు కనువిందు చేసేవి, గాలిని శుభ్రపరిచ్చేవి, ఇంటికి శోభనిచ్చే మొక్కలు ఇలా ఎన్నో ఉన్నాయి.
* పెరట్లో మందారం, మల్లె, సంపంగి, బ్రహ్మకమలం మొక్కలతోపాటు కొబ్బరి, పనస, దానిమ్మ, నారింజ తదితరాలను,  గులాబీలను పదుల సంఖ్యలో పెంచుకోవచ్చు. చామంతుల తోట వేసుకోవచ్చు.
* ఇంటి ముందు ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నట్లయితే నిటారుగా పెరిగే చెట్లు నీడనిస్తూ ఇంటి అందాన్ని ఇనుమడింపజేస్తాయి. గాలులను, బయటినుంచి వచ్చే దుమ్ముధూళిని అడ్డుకుంటాయి.

ముందు జాగ్రత్తగా..

ఇంటిపైన తోట ఏర్పాటు చేసుకునే వారు  కుండీల్లో పోసే నీరు కారి బయటకు వస్తుంది. స్లాబులోంచి లీకేజీలకు అవకాశం ఉంటుంది. అందుకే మేడపైన గార్డెన్‌ ఏర్పాటుకు ముందే స్లాబ్‌ను వాటర్‌ప్రూఫ్‌ చేయించుకోవాలి. కొత్త ఇల్లు కట్టుకునేవారు నిర్మాణ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. పాత ఇంటిని ఇంజినీర్లతో పరిశీలించి జాగ్రత్తలు తీసుకున్నాక పెంపకాన్ని చేపట్టాలి.
* స్లాబ్‌పై భారం పడకుండా తేలిగ్గా ఉండే ప్లాస్టిక్‌ కుండీల్లో  పెంచుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని