ఐటీ కంపెనీలకు ఎంత స్థలం కావాలి?

కొవిడ్‌ కొత్త రకం వైరస్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తితో మూడోవేవ్‌ మొదలైంది. దీంతో మరికొంత కాలం ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమంటున్నాయి. ఈ ప్రభావం కార్యాలయాల నిర్మాణాల లీజింగ్‌పై ఎంతోకొంత ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ జాతి ఐటీ, చిన్న ఐటీ సంస్థల ఆలోచనలు ఎలా ఉన్నాయి?

Updated : 08 Jan 2022 05:28 IST

ఇంటి నుంచి పనితో మారనున్న కార్యాలయ నిర్మాణ రంగ స్వరూపం
ఈనాడు, హైదరాబాద్‌

కొవిడ్‌ కొత్త రకం వైరస్‌ ఒమిక్రాన్‌ వేగంగా వ్యాప్తితో మూడోవేవ్‌ మొదలైంది. దీంతో మరికొంత కాలం ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయమంటున్నాయి. ఈ ప్రభావం కార్యాలయాల నిర్మాణాల లీజింగ్‌పై ఎంతోకొంత ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బహుళ జాతి ఐటీ, చిన్న ఐటీ సంస్థల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆయా సంస్థల ప్రతినిధులతో తరచూ ప్రభుత్వం తరుఫున మాట్లాడుతున్న ఐటీ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వాటిని బిల్డర్లతో ఇటీవల పంచుకున్నారు. ఆ విశేషాలు..
* ఒమిక్రాన్‌ లేకపోతే జనవరి నుంచి చాలా కార్యాలయాలకు ఉద్యోగులు వచ్చి పనిచేసేవారు. కొత్త రకం వైరస్‌ వ్యాప్తితో ఇది మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇంటి నుంచి పనితో ప్రారంభంలో ఉత్పాదకత పెరిగినా..  రానురాను కొంత వరకు తగ్గుతున్నట్లు ఐటీ కంపెనీలతో మాట్లాడినప్పుడు తెలిసింది. దీంతో కొన్నిరోజులు అనివార్యంగా కార్యాలయానికి ఉద్యోగులు రావాలనే విధానాన్ని పెట్టాలని కొన్ని కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి. కాబట్టి కార్యాలయాలు ఎక్కడికీ పోవు.
* హైదరాబాద్‌లో ఏటా 30వేల నుంచి 40వేల వరకు కొత్త ఉద్యోగాలు వస్తుంటాయి. కొవిడ్‌ అనంతరం పెరిగిన డిమాండ్‌తో 70వేలకు పైగా నూతన కొలువులు వస్తున్నాయి. వాస్తవంగా ఆ మేరకు కార్యాలయాల నిర్మాణాలకు డిమాండ్‌ ఉండేది. కానీ ఇంటి నుంచి పనితో ముందున్న స్థాయిలో కార్యాలయాలను లీజు తీసుకునే పరిస్థితి లేదు. ఈ కంపెనీలన్నీ రెండేళ్లుగా కొవిడ్‌తో ఎదురైన సవాళ్లను అధిగమించేందుకు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నాయి.
* హైదరాబాద్‌లో 1400పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటిలోనూ మూడు రకాలు ఉన్నాయి. పెద్ద కంపెనీలు గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫార్చూన్‌ 500లో కొన్ని ముఖ్యమైన కంపెనీలు ఉన్నాయి. కొవిడ్‌తో డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ పెరగడంతో కొత్త ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో ప్రస్తుతం 20వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యను రెట్టింపు చేయబోతున్నారు. సహజంగానే కార్యాలయాల స్థలం రెట్టింపు కావాల్సి ఉంటుంది. ఇంటి నుంచి పనితో అదే స్థాయిలో కార్యాలయాల స్థలం రెట్టింపు చేయడం లేదు. హైబ్రిడ్‌ విధానం వైపు మొగ్గు చూపుతున్నాయని వారి మాటలను బట్టి అర్థమైంది. వారంలో మూడు నాలుగు రోజులు వస్తే చాలంటున్నాయి. ఇదివరకు ఒక లక్ష చదరపు అడుగుల్లో ఒక కంపెనీ కార్యాలయం ఉంటే... ఉద్యోగులను రెట్టింపు చేసినప్పుడు 2లక్షల చ.అ.కు పెరగాలి. కానీ ఆ స్థాయిలో లీజింగ్‌లు ఉండబోవని తెలుస్తోంది. లక్షన్నర చదరపు అడుగులకే పరిమితం అవుతారు.
* మిడ్‌ స్కేల్‌ కంపెనీల్లో 1000 నుంచి 2వేల మంది ఉద్యోగులు ఉంటారు. ఒకటి రెండు దేశాల్లోనే పనిచేస్తుంటారు. ఇక చిన్న కంపెనీల్లో ఉద్యోగులు 25 నుంచి వంద మంది వరకు ఉంటారు. లాక్‌డౌన్‌ సమయంలో మొదటి ఆరు నెలల మధ్య, చిన్న కంపెనీలు  తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాయి. ఆ తర్వాత డిజిటల్‌ సేవలకు పెరిగిన డిమాండ్‌తో త్వరగా కుదుటపడ్డాయి. ఇలాంటి పరిస్థితి మున్ముందు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు పొదుపు మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకుంటున్నాయి. అద్దె ఎక్కువగా ఉండే ‘ఏ’ గ్రేడ్‌ కార్యాలయాలు కాకుండా అద్దెలు తక్కువ ఉండే ‘బి’, ‘సి’ గ్రేడ్‌ వాటి వైపు చూస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ ఖర్చును తగ్గించుకుంటున్నాయి. దీంతో సైబరాబాద్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లోని కార్యాలయాల స్థలాలకు డిమాండ్‌ ఉంటుంది.

* తెలంగాణ ప్రభుత్వం నగరం అన్నివైపులా అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో గతంలోనే గ్రిడ్‌ పాలసీ తీసుకొచ్చింది. సైబరాబాద్‌లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఐటీ కంపెనీలను ప్రోత్సహించేందుకు దీన్ని తెచ్చింది. కాలుష్యకారక పరిశ్రమలన్నిటినీ అవుటర్‌ బయటకు తరలించడంతో ఆయా పారిశ్రామిక స్థలాలు ఖాళీ అవుతాయి. ఇక్కడ ఐటీ, వాణిజ్య భవనాలు వచ్చే అవకాశం ఉంది. ఔషధ కంపెనీలు ఫార్మాసిటీకి తరలిపోతే అక్కడి స్థలాలు అందుబాటులో ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని