Updated : 13 Feb 2022 09:01 IST

ఈ పక్షులకు పాటలు గుర్తుంటాయి!

సైన్స్‌ సంగతులు

క్షులు వాటిదైన భాషలో రకరకాలుగా శబ్దాలు చేస్తూ కూస్తుంటాయి. మన భాషలో అవే పాటలన్నమాట. అయితే అవి ఆ సమయానికి తమకి వచ్చినట్లుగా కూస్తుంటాయి. కానీ వాటిని గుర్తుపెట్టుకుని మళ్లీ అలాగే కూయవు. అయితే ఉత్తర అమెరికాలో ఎక్కువగా కనిపించే సాంగ్‌ స్పారో జాతికి చెందిన మగ పిచ్చుకలు మాత్రం మనుషుల్లో మాదిరిగా ఒకలాంటి రిథమ్‌తో కూస్తుంటాయట. అదీ ఎలాగంటే ముందుగా ఒక ట్యూన్‌ను కడతాయి. అది బాగుంది అనిపిస్తే దాన్ని గుర్తుపెట్టుకుని పాట మధ్యలో పల్లవిని తీసుకొచ్చినట్లుగానే ముందు కూసిన ట్యూన్‌ని మధ్యమధ్యలో కలుపుతూ కూస్తుంటాయట. సాధారణంగా వాటి కూత లేదా ట్యూన్‌ రెండు సెకన్ల నిడివి ఉంటుంది. అలాంటివి వరసగా పన్నెండు ట్యూన్‌లను అవి గుర్తుపెట్టుకుని కూస్తుంటాయట. అంటే ఈ పక్షులు కూడా తమకు నచ్చిన ట్యూన్‌లను గుర్తుపెట్టుకుని మళ్లీ మళ్లీ ఆలపిస్తాయని డ్యూక్‌ యూనివర్సిటీకి చెందిన బయాలజీ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ నౌకి చెబుతున్నారు. అది కూడా అప్పటికప్పుడు ఆలపించినది మాత్రమే కాదు. అరగంట క్రితం కూసిన కూతల్ని సైతం గుర్తు తెచ్చుకుని మళ్లీ కూస్తున్నట్లు గమనించారు. దీన్నిబట్టి అవి కావాలనే ఆయా పాట(కూత)ల్ని మళ్లీ మళ్లీ ఆలపిస్తున్నాయనీ ఆడపక్షుల్ని ఆకట్టుకునేందుకే అవి ఇలా చేస్తున్నాయనీ అంటున్నారు.


రోబో సర్జరీ!

ప్పటికే అనేకచోట్ల రోబోలు చాలా పనుల్లో సాయం చేస్తున్నాయి. వైద్యచికిత్సలూ చేస్తున్నాయి. అయితే తాజాగా జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీకి చెందిన స్మార్ట్‌ టిష్యూ అటానమస్‌ రోబో మనిషి సాయం లేకుండా ల్యాప్రొస్కోపిక్‌ సర్జరీని విజయవంతంగా చేసిందట. పెద్దపేగుకి శస్త్రచికిత్స చేయడానికి ఎంతో నైపుణ్యం కావాలి. ఏమాత్రం చేయి వణికినా కుట్టు కాస్త అటూ ఇటూ పడుతుంది. దాంతో పేగుకి రంధ్రం పడి చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే అక్కడ కణజాలం మృదువుగా ఉంటుంది. అందుకే ముందుగా పందుల్లో దీన్ని పరిశీలించి చూడగా స్టార్‌ రోబో చాలా చక్కగా కుట్లు వేసిందట. కాబట్టి మున్ముందు ఆటోమేటెడ్‌ రొబొటిక్‌ సిస్టమ్‌ ద్వారా ల్యాప్రొస్కోపీలను నిర్వహించవచ్చు అని భావిస్తున్నారు.


మాస్క్‌లతో బ్యాటరీలు!

ఇంతకాలం ప్లాస్టిక్కు బాటిళ్లూ కవర్ల వ్యర్థాలే మనకు ఎక్కువగా కనిపించేవి. కానీ గత రెండేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోన్న కొవిడ్‌-19 కారణంగా- భూగోళమంతా, వాడిపారేసిన సర్జికల్‌ మాస్క్‌లతో నిండిపోతోంది. ఎందుకంటే ఏ లెక్కన చూసినా నెలకి కనీసం 13 వేల కోట్ల మాస్క్‌లు పారేస్తున్నామట. ఇదిలానే కొనసాగితే కొంతకాలానికి భూభాగంతోపాటు సముద్రాలూ నిండిపోతాయి. అలాగని చెత్త మాదిరిగా వాటిని మండిస్తే, వాటి నుంచి వెలువడే విషపూరిత వాయువులతో గాలీ నిండిపోతుంది. దాంతో మాస్క్‌లు పర్యావరణానికి పెద్ద సవాల్‌గా మారాయి. అందుకే వాటిని రీసైక్లింగ్‌ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు నిపుణులు. అందులో భాగంగా నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన నిపుణులు రీసైకిల్డ్‌ బ్యాటరీల్ని రూపొందించారు. ముందుగా మాస్క్‌లను శుద్ధి చేసి ఆపై కరిగించి చేసిన ఈ బ్యాటరీలు లిథియం బ్యాటరీల మాదిరిగానే సమర్థంగా పనిచేస్తున్నాయట. పైగా ఇవి పలుచగానూ ఎలా అంటే అలా వంగేలానూ ఉంటాయనీ చౌకధరకే లభిస్తాయనీ చెబుతున్నారు.


టీవీ మరింత ప్రకాశవంతంగా!

ప్రస్తుతం టీవీల్లో ఓఎల్‌ఈడీ స్క్రీన్లదే హవా. ఈ కొత్త టెక్నాలజీ కారణంగా తెరమీద బొమ్మ ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. దీన్ని తొలిసారిగా రూపొందించిన ఎల్‌జీ కంపెనీనే, దాన్ని మరింత అప్‌గ్రేడ్‌ చేస్తూ ఓఎల్‌ఈడీ-ఎక్స్‌ టెక్నాలజీని తీసుకురానుంది. ఎల్‌ఈడీతో పోలిస్తే ఓఎల్‌ఈడీ టీవీలో బ్యాక్‌లైటింగ్‌తో సంబంధం లేకుండా ప్రతీ పిక్సల్‌నుంచీ కాంతి వెలువడుతుంది. దాంతో తెరమీద బొమ్మలోని ప్రతీ అంశమూ రంగులూ కూడా ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి. ఇందుకోసం ప్రస్తుతం హైడ్రోజన్‌ అణువుల్ని వాడుతున్నారు. అయితే ఇప్పుడు దానికి బదులుగా డ్యుటీరియంను వాడటంతో బొమ్మ మరింత ప్రకాశవంతంగా ఎలాంటి డిస్టార్షన్‌ లేకుండా కనిపిస్తుందట. అంతేకాదు, టీవీ మందాన్ని కూడా 6 మి.మీ. నుంచి 4 మి.మీ.లకు తగ్గిస్తున్నారట. దాంతో అంచులదగ్గర మరింత పలుచగా ఉండటంతో తెర ఇంకాస్త పెద్దగా కనిపిస్తుందన్నమాట. త్వరలోనే అంటే- ఈ ఏడాది మధ్యలోనే వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉంది ఎల్‌జీ కంపెనీ.


ప్రేమంటే..

ఒకరి చేతిరాతను మళ్ళీమళ్ళీ చదువుతున్నారంటే...ఒకరు పక్కన ఉన్నప్పుడు వీలైనంత మెల్లగా నడుస్తున్నారంటే...ఒకరి కంఠస్వరం విన్నప్పుడు పెదాలమీద చిరునవ్వు కదలాడిందంటే...ఈ కొటేషన్‌ చదివేటప్పుడు మీ మనస్సులో ఎవరైనా మెదిలారంటే...వారిని మీరు ప్రేమిస్తున్నారన్నమాటే..!


ఫస్ట్‌... ఫస్ట్‌..!

నదేశంలోని గంగా యమునా నదులకి... మామూలు మనుషుల్లాగే గత ఏడాది పౌరహక్కుల్ని కల్పించింది సుప్రీంకోర్టు. అయితే, నదులకి ఇలా పౌరసత్వాన్నిచ్చిన తొలి దేశం... న్యూజిలాండ్‌!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని