ఆలోచన మీది... అండాదండా మాది!

కంటి లోపలి ‘కార్నియా’ భాగం దెబ్బతింటేనో, పుట్టుకతో అసలు ఎదగకుంటేనో... దాన్ని పునఃసృష్టించే సాంకేతికత ఏదీ ప్రపంచంలో లేదు. కానీ... ఓ యువ తెలుగు శాస్త్రవేత్త దాన్ని సాధించగలిగాడు.

Published : 07 Jul 2024 01:22 IST

కంటి లోపలి ‘కార్నియా’ భాగం దెబ్బతింటేనో, పుట్టుకతో అసలు ఎదగకుంటేనో... దాన్ని పునఃసృష్టించే సాంకేతికత ఏదీ ప్రపంచంలో లేదు. కానీ... ఓ యువ తెలుగు శాస్త్రవేత్త దాన్ని సాధించగలిగాడు. తన ఆవిష్కరణ పునాదిగా ఓ స్టార్టప్‌ పెట్టాలనుకున్నాడుకానీ... ఎలా చేయాలో తెలియలేదు. ఆయన్ని ఆహ్వానించి ఓ స్టార్టప్‌ పెట్టించింది ఆ సంస్థ! ఇలా ఒకరూ ఇద్దరూ కాదు... వందకుపైగా శాస్త్రవేత్తల్ని పారిశ్రామికవేత్తలుగా మలిచింది ‘ఆస్పైర్‌- బయోనెస్ట్‌’. వైద్యావిష్కరణల పరంగా కొత్త విప్లవానికి నాంది పలుకుతున్న ఆ సంస్థ విశేషాలివి...

 ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎడ్‌ టెక్‌, ఫిన్‌ టెక్‌... ఈ రంగాల్లో ఓ కొత్త ఆలోచనకు రూపాన్నివ్వడానికి ఏడాది చాలు. రెండు కంప్యూటర్‌లూ ఇద్దరు సిబ్బందీ ఉంటే ఇట్టే స్టార్టప్‌ పెట్టేయొచ్చు. కానీ, వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలకి కారణమయ్యే ‘బయోసైన్సెస్‌’ రంగం అలాకాదు. ఓ ఆలోచన ఔషధంగా మారి ప్రజలకి అందుబాటులోకి రావాలంటే కనీసం పదేళ్ళయినా పడుతుంది! ప్రయోగాలు చేయడానికి అవసరమయ్యే పరికరాలు కొనాలంటే మూణ్ణాలుగు కోట్లయినా కావాలి. అందుకే- మనదగ్గర ఆ రంగంలో ఎక్కువగా ఆవిష్కరణలు కనిపించవు. ఆ తరహా స్టార్టప్‌లు ఎక్కువగా ఉండవు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేందుకు సంకల్పించింది హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని ‘ఆస్పైర్‌-బయోనెస్ట్‌’ సంస్థ. ఇందుకోసం ప్రపంచం నలుమూలల్లోని యువ శాస్త్రవేత్తలందరినీ ఆహ్వానిస్తోంది. కేవలం శాస్త్ర విషయాలకే పరిమితమైనవాళ్ళని పారిశ్రామికవేత్తలుగానూ మలుస్తోంది. వాళ్ళ ప్రయోగాల కోసం ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన యంత్రాల్ని ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు- కేంద్రప్రభుత్వం నుంచి గ్రాంట్‌లూ, పెట్టుబడిదారుల నుంచి నిధులూ తెప్పిస్తోంది. ఇప్పటిదాకా వందకోట్ల రూపాయల్ని అలా అందించింది!

దేశంలోనే ‘ది బెస్ట్‌’...

బయో ఇన్‌క్యుబేటర్స్‌ నర్చరింగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఫర్‌ స్కేలింగ్‌ టెక్నాలజీ... దీని సంక్షిప్త రూపమే ‘బయోనెస్ట్‌’. నిజానికిది కేంద్రప్రభుత్వ పథకం. బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్‌లని ప్రోత్సహించేలా ప్రతి విద్యాసంస్థ ఓ ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ పెట్టాలని 2018లో కేంద్రం పిలుపునిచ్చింది. ఎన్నో విద్యాసంస్థలతోపాటు హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ కూడా దీనికి ముందుకొచ్చింది. ‘ఆస్పైర్‌-బయోనెస్ట్‌’ పేరుతో ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ని ఏర్పాటుచేసుకుంది. కానీ- ఈ ఆరేళ్ళలో ఎన్నో విద్యాసంస్థలు ‘బయోనెస్ట్‌’ కేంద్రాల్ని కొనసాగించలేక చతికిలపడితే కేవలం ఓ ఐదారు మాత్రమే ముందుకు తీసుకెళుతున్నాయి. వాటిల్లో అటు రాశిలోనూ ఇటు వాసిలోనూ ‘ది బెస్ట్‌’ సంస్థగా పేరుతెచ్చుకుంది ‘ఆస్పైర్‌-బయోనెస్ట్‌’. సెంట్రల్‌ యూనివర్సిటీలో- పాతికవేల చదరపుటడుగుల విశాలమైన ప్రాంగణంలో దేశంలోనే అతిపెద్ద బయోనెస్ట్‌ సంస్థగా గుర్తింపూ అందుకుంది. ఇక్కడ అంకురిస్తున్న స్టార్టప్‌ల నాణ్యత, వాటికిస్తున్న ప్రోత్సాహాల పరంగా ‘బెస్ట్‌ ఎమర్జింగ్‌ బయోఇన్‌క్యుబేటర్‌’ అవార్డుని కేంద్రం నుంచి అందుకుంది. ఈ ఘనత సాధించిన ఏకైక బయోనెస్ట్‌ కేంద్రం ఇదొక్కటే! ఇక ఇక్కడ పురుడుపోసుకున్న స్టార్టప్‌ల విశేషాలు చూస్తే...  

జగన్మోహన్‌ రెడ్డిది అనంతపురం. బయోటెక్నాలజీలో డిగ్రీ చేసి స్వీడన్‌లో ఎమ్మెస్‌, పీహెచ్‌డీలు ముగించాడు. అక్కడ ఉన్నప్పుడే కంటిలోపలి కార్నియాని పునఃసృష్టించే పరిశోధనలో పాల్గొన్నాడు. మూడు పొరలు ఉండాల్సిన కార్నియాలో రెండు పొరల్ని సృష్టించగలిగాడు. ఆ విజయంతో హైదరాబాద్‌కి వచ్చి ఓ సంస్థని పెట్టాలనుకున్నాడు కానీ అప్పట్లో ఆ అవకాశం లేక ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రిలో పరిశోధకుడిగా చేరాడు. 15 ఏళ్ళు అక్కడ పని చేశాక ‘ఆస్పైర్‌-బయోనెస్ట్‌’ ఆవిర్భావం గురించి తెలిసి అప్లై చేసుకున్నాడు. ‘యూఆర్‌ అడ్వాన్స్‌డ్‌ థెరప్యుటిక్స్‌’ అన్న స్టార్టప్‌ని ఏర్పాటుచేసి అనుకున్నది సాధించాడు. ‘ఏఐ’ సాయంతో కార్నియాకి సంబంధించిన మూడో పొరని పునఃసృష్టించే సాంకేతికతనీ ఆవిష్కరించేశాడు!  

స్టెమ్‌సెల్‌ చికిత్స... రేపటి వైద్యరంగం ప్రధానంగా దీని చుట్టే తిరుగుతుందని చెబుతున్నారు. విదేశాలకే పరిమితమైన ఈ చికిత్సకి ఖర్చు కోట్లలో ఉంటుంది. దాన్ని వేలల్లోకి దించాలనే సంకల్పంతో ‘తులసి థెరప్యుటిక్స్‌’ అనే సంస్థని స్థాపించాడు డాక్టర్‌ అట్లూరి సాయికుమార్‌. అమెరికాలో పనిచేస్తూ వచ్చిన ఆయన అక్కడ మానేసి ‘ఆస్పైర్‌- బయోనెస్ట్‌’ డైరెక్టర్‌ - కో ఆర్డినేటర్‌ ప్రొఫెసర్‌ రాజగోపాల్‌, సీఓఓ అనిల్‌ కొండారెడ్డిలను ఆశ్రయించాడు. రెండేళ్ళలోనే లివర్‌ సిరోసిస్‌, ఫైబ్రోసిస్‌ వంటి వ్యాధులకి చవకైన స్టెమ్‌సెల్‌ చికిత్సని రూపొందించాడు.

ఇంకా...

శరీరంలోని ఎముకల్ని ఇష్టారాజ్యంగా ఎదిగేలా చేసే తీవ్ర ‘గౌట్‌’ వ్యాధికి అమెరికాలో మాత్రమే మందు ఉంటుంది. ఆరునెలల కోర్సుకి ఖర్చు మూడుకోట్ల రూపాయలవుతుంది. దాన్ని వేలరూపాయల్లో అందించేందుకు ‘బైకస్‌’ అన్న సంస్థ సిద్ధంగా ఉంది. శరీర అవయవాలన్నింటినీ 3డీ ప్రింట్‌ తీయగల ‘రీజీన్‌ బయోసైన్సెస్‌’, రక్తపరీక్షలేవీ అక్కర్లేకుండా ఐదునిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేసే ‘శాన్‌వీ’... ఇలా 35 సంస్థలు ఈ కేంద్రంలో ఉన్నాయి. రేపోమాపో మనదేశంలో వైద్యరంగాన్ని సరికొత్త మలుపు తిప్పడానికి సిద్ధమవుతున్నాయి!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..