Published : 19 Nov 2022 23:17 IST

త్రీడీ కేకు... టూడీ లుక్కు!

సాదాగా మన ముందుకొచ్చిన కేకు... ‘అరె అచ్చంగా బ్యాగులానో, పండులానో ఉందే’ అనిపించేంత రియలిస్టిక్‌ లుక్కు వరకూ చేరి, మన అవసరానికి తగ్గట్టు ఒక్కో అవతారం ఎత్తుతూ వచ్చింది. రోజూ తింటే పెళ్లి భోజనమైనా బోర్‌ కొట్టేయదూ. అందుకే కేకు మీది ఆ ఆడంబరాలన్నింటినీ కాసేపు పక్కనపెట్టేసి సింపుల్‌ లుక్కుతో వచ్చేసింది ఈ ‘2డీ కామిక్‌ కేక్‌’.

రూప పుట్టిన రోజున స్నేహితులంతా కలిసి బర్త్‌డే సెలబ్రేషన్‌ ఏర్పాటుచేశారు. సర్‌ప్రైజ్‌గా కళ్లు మూసి కేక్‌ కటింగ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. కళ్లు తెరిచిన వెంటనే ‘ఇక్కడ కేక్‌ బొమ్మగీసి నాతో ప్రాంక్‌ చేస్తున్నారా ఏంటీ’ అనుకుందామె. కానీ కాసేపటికి అది నిజమైన కేక్‌ అని తెలిసి అవాక్కయింది. ఇంతకీ అలా ఎందుకు ఉందంటే... అది కొత్తగా వచ్చిన ‘2డీ కామిక్‌ కేక్‌’. చూడ్డానికి పెన్సిల్‌తో కాగితం మీద కేక్‌ ఆకారాన్ని గీసినట్టో, కేక్‌ బొమ్మను అక్కడ ఉంచినట్టో మాయ చేయడం దీని ప్రత్యేకత.పెద్ద వేడుకల్లోనే కాదు, చిన్న ఆనందకరమైన సందర్భాలొచ్చినా చాలు... అక్కడ కేక్‌ కటింగ్‌ జరగాల్సిందే. అది దృష్టిలో పెట్టుకునే ఎప్పటికప్పుడు తమ సృజనాత్మకతను జత చేస్తూ వెరైటీ ట్రెండ్స్‌ పుట్టిస్తుంటారు కేక్‌ తయారీదారులు. ఇప్పుడు అందులో భాగంగా వచ్చిందే ‘2డీ కామిక్‌ కేక్‌’. ఎక్కడో ఎవరో కళాకారుడు సృష్టించిన ఈ కేక్‌- ఈమధ్య నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టి అన్ని ప్రాంతాల్లోకి చేరిపోయింది. కొత్తదనం కోరుకునే ఈతరాన్ని మెప్పిస్తోంది.

ఎలా చేస్తారంటే...

కేకు చిత్రంలా కనిపించే దీన్ని తయారుచేయడానికి ముందు... మిగతా వాటిల్లానే నచ్చిన రూపంలో కేక్‌ మొత్తాన్నీ తయారుచేస్తారు. ఆ తర్వాత రకరకాల రంగుల చాక్లెట్‌ క్రీమ్స్‌తో చుట్టూ అవుట్‌ లైన్‌ వేస్తూ... గీసినట్టు కనిపించేలా రూపమిస్తారు. చూడ్డానికి ‘అయ్యో ఇదెంత పని’ అన్నట్టుగా ఉన్నా ఓర్పూనేర్పూ ఉంటేనే ఆ ఆకారాన్ని తీసుకురాగలరు. అచ్చంగా కార్టూన్‌ బొమ్మలా ఉండేందుకు... కేకుపైన ఉండే రకరకాల బొమ్మలూ, క్యాండిల్స్‌తో సహా కేక్‌ డెకరేషన్‌ మొత్తాన్నీ కూడా 2డీ రూపంలోనే తీర్చిదిద్దుతారు. త్రీడీ రూపంలో అక్కడ నిజంగా వస్తువు ఉందా అన్నట్టుండే కేకులకు బదులు... వేసిన బొమ్మల్లా మాత్రమే కనిపించేలా చేస్తున్నారన్నమాట. అదాటున చూడగానే ఉత్తుత్తి కేకుల్లా అనిపించే వీటిని- కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనమూ ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మరెందుకాలస్యం... ఈసారి ఇంట్లో రగబోయే వేడుకలో ఈ సరికొత్త కేక్‌తో సింపుల్‌ లుక్కుతోనే అందర్నీ ఆకట్టుకోండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts