అందాల పాపాయి.. అపురూప స్మృతులు

చిన్నారులకి సంబంధించిన ప్రతీదీ అపురూపంగానే అనిపిస్తుంది. అందుకే వాళ్లు ఎంత పెద్దయినా ఆనాటి చిట్టి రూపాన్ని తలచుకునో ఫొటోల్లో చూసుకునో ఆనందపడుతుంటారు తల్లిదండ్రులు. అయితే అది పాతసంగతి. పాపాయిల తొలిస్పర్శని గుర్తుతెచ్చే

Updated : 06 Sep 2022 15:43 IST

అందాల పాపాయి.. అపురూప స్మృతులు

చిన్నారులకి సంబంధించిన ప్రతీదీ అపురూపంగానే అనిపిస్తుంది. అందుకే వాళ్లు ఎంత పెద్దయినా ఆనాటి చిట్టి రూపాన్ని తలచుకునో ఫొటోల్లో చూసుకునో ఆనందపడుతుంటారు తల్లిదండ్రులు. అయితే అది పాతసంగతి. పాపాయిల తొలిస్పర్శని గుర్తుతెచ్చే ఆ బుల్లి చేతులూ పాదాలూ ఎప్పటికీ తమ కళ్లముందే ఉండేలా త్రీడీ నమూనాల రూపంలో భద్రపరచుకుంటోంది నేటితరం. తాజాగా వాటికి ఫొటోల్ని జతచేర్చి అందమైన ఫ్రేముల్లోనూ బంధిస్తోంది. అంతేకాదు, ఆ పసివాళ్ల వెంట్రుకలనీ గోళ్లనీ చప్పరించిన చనుబాలనీ సైతం పదిలపరిచి నగల రూపంలో ధరించడం సరికొత్త ట్రెండ్‌గా మారింది.

చిన్నపిల్లలున్న ఇంట్లోకి వెళితే గోడకి చిరునవ్వులు చిందిస్తూ రకరకాల భంగిమల్లో ఉన్న వాళ్ల ఫొటోలెన్నో కనువిందు చేస్తుంటాయి. తాజాగా ఆ గోడమీద చోటు సంపాదించుకున్నవే- త్రీడీ కాస్టింగ్‌ ఫొటో ఫ్రేమ్స్‌. వాటిల్లో సువర్ణ శిల్పాల్లా మెరిసిపోయే చిట్టి చేతులూ పాదాలతోపాటు చిన్నారులవీ అమ్మానాన్నలవీ ఫొటోలు కూడా కనిపిస్తాయి. అంతేకాదు,  మెడలోని లాకెట్టులోనో ఉంగరంలోనో ఆ చిన్నారి జ్ఞాపకం నిక్షిప్తమై ఉండొచ్చు. ఎందుకంటే పిల్లలు ఆనందంగా ఉండేందుకూ, ఆరోగ్యంగా పెరిగేందుకు కొనే వస్తువుల సంగతలా ఉంచితే, బుజ్జాయిలకు చెందిన ప్రతి అంశాన్నీ ఓ అపురూప జ్ఞాపకంగా భద్రపరుచుకుంటున్నారు మిలీనియల్‌ అమ్మలూ నాన్నలూ. అందులో భాగంగానే చనుబాలూ, పుట్టు వెంట్రుకలూ, తొలిసారి తీసిన గోళ్లతోనూ నగలు చేయిస్తున్నారు.

ఫొటో ఫ్రేముల్లో... పదిలంగా! 

ఎంత పెద్దయినా పుట్టిన పాపాయిని తొలిసారి చూసిన జ్ఞాపకం అమ్మ మదిలో ఎప్పటికే పదిలమే. ఆ రూపం ఎంతో అపురూపమే. అయితే మళ్లీ మళ్లీ ఆ రూపాన్ని తలచుకుని మురిసిపోవడమే ఒకప్పటి వాళ్లకి తెలుసు. కానీ సెల్‌ కెమెరాలూ వీడియోల పుణ్యమా అని పుట్టిన పాపాయి ప్రతి కదలికనీ క్లిక్‌మనిపించడం కామన్‌గా మారింది. ఆ తరవాత వచ్చినవే త్రీడీ కాస్టింగ్‌ ముద్రలు. 

ఎందుకంటే- పుట్టిన పాపాయి బుల్లి చేతులూ బుజ్జి పాదాలూ ఎవరికైనా ఎంతో ముద్దొస్తుంటాయి, అమ్మానాన్నలకైతే మరీనూ. అందుకే వాటిని పదేపదే తాకుతూ ముద్దుపెట్టుకుంటారు. కానీ కొన్నాళ్లకి ఆ చిన్నారి పెద్దగా అయిపోతుంది. దాంతో పిల్లల చేతుల్లోని రేఖలే కాదు, ఆ చేతుల రూపూ మారుతుంది. అమ్మకి ఆ చిట్టి చేతిని మరోసారి చూడాలనిపిస్తే అది ఫొటో ద్వారా సాధ్యమే. కానీ మళ్లీ తాకాలనిపిస్తేనో... అందుకే ఈతరం అమ్మలు ఆ జ్ఞాపకాల్ని త్రీడీ కాస్టింగ్‌ రూపంలో భద్రపరచుకుంటున్నారు. అయితే మొదట్లో కాస్టింగ్‌ నమూనాల్లా చేసిన చేతుల్నీ పాదాల్నీ ఫొటో లేదా గాజు ఫ్రేముల్లోనో లేదా నేరుగానో పెట్టుకునేవారు. అయితే ఇప్పుడు ఆ కాస్టింగ్‌ ముద్రల్నీ వాటి డిజిటల్‌ ప్రింట్స్‌నూ ఫ్రేముల్లోనూ అలంకరిస్తున్నారు. అంతేకాదు, వాటికి రకరకాల ఫొటోలను చేర్చి ఆ ఫ్రేముల్ని ఎంతో అందంగానూ డిజైన్‌ చేస్తున్నారు. ఎందుకంటే- ముద్రల్ని ఫొటోలో బంధిస్తే తాకడం కష్టం. అందుకే వాటిని గ్లాస్‌ బాక్సుల్లో భద్రపరచుకుని, వాటి తాలూకూ ఫొటోలను ఫ్రేముల్లో పెట్టుకుంటున్నారు. పైగా ఒకటే ముద్రతో బోలెడు ఫొటోలు చేయించుకోవచ్చు. వాటిని దూరంగా ఉన్న అమ్మమ్మలకీ తాతయ్యలకీ కూడా పంపించుకోవచ్చు. దాంతో ఈ బొమ్మలకి చూడచక్కని ఫొటోలనీ అక్షరాల్నీ జోడించి తమదైన సృజనతో ఫ్రేముల్ని తయారుచేసి ఇస్తున్నారు ఫొటో ఆర్టిస్టులు. ఈ త్రీడీ కాస్టింగ్‌కోసం జిప్సమ్‌ సిమెంట్‌ను నీళ్లల్లో కరిగించాక అందులో పాపాయి చేతిని ముంచి, ఆ ద్రవం గట్టిపడ్డాక తీసి, ఆ ఖాళీలో ద్రవరూపంలోని కాస్టింగ్‌ పొడిని పోస్తారు. అది గట్టిపడ్డాక అచ్చును జాగ్రత్తగా తీసి పాలిష్‌ చేసి, నచ్చిన మెటల్‌ కలర్‌ని పూత పూస్తారు. దీన్ని నేరుగా లేదా ఫొటో తీసి ఫ్రేమ్‌ని డిజైన్‌ చేస్తున్నారు. ఎవరికి వాళ్లు ఇంట్లో చేసుకునేలా జిప్సమ్‌ క్యాస్టింగ్‌ కిట్స్‌ కూడా దొరుకుతున్నాయి.

నగల రూపంలో..!

పిల్లల ఫొటోల్ని లాకెట్లలో పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. గోడలమీదా ఫోనులో ఆల్బమ్స్‌లో... ఇలా ఫొటోలు ఎక్కడైనా కనిపిస్తాయి. కానీ తొలికాన్పు లేదా మలికాన్పునాటి తీపి గుర్తులు కలకాలం ఉండాలన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యుయెలరీ. విదేశాల్లో పురుడు పోసుకున్న ఈ ఆలోచనకి క్రమంగా మనదేశంలోనూ ఆదరణ లభించింది. దాంతో చూస్తుండగానే ఇదో సృజనాత్మక వ్యాపారంగా మారింది. ఫలితమే మమ్మాస్‌ మిల్కీ లవ్‌, మమ్మాస్‌ మిల్కీ టేల్‌, బ్రెస్ట్‌మిల్క్‌ మెమొరీస్‌, ద లిక్విడ్‌ పెరల్‌ బ్రెస్ట్‌ మిల్క్‌ జ్యువెలరీ... వంటి సంస్థలెన్నో ఈ నగలు తయారుచేస్తున్నాయి.

ఇందుకోసం ముందుగా తల్లుల నుంచి సేకరించిన పాలను ఫ్రీజ్‌ చేసి, ఆపై నీడలోనే ఎండబెట్టి, మెత్తని పొడి చేసి రెజిన్‌ సాయంతో రత్నంలా మలిచి నగల్లో అమరుస్తున్నారు. కొందరైతే మరిగించాక అందులో మాడ్‌పాడ్జ్‌ అనే ప్రిజర్వేటివ్‌ పౌడర్‌, కార్న్‌స్టార్చ్‌లు కలిపి పేస్టులా చేస్తే అది ఆరాక మెత్తని పొడిలా చేసి మోల్డ్‌లో వేసి గుండ్రం లేదా అండాకారంలోని ముత్యంలా రూపొందించాక రెజిన్‌ పూత పూయడంతో అది పాలరాయిలా తయారవుతుంది. ఇందులోనే సిల్వర్‌ లేదా గోల్డ్‌ లీఫ్‌నీ చొప్పిస్తున్నారు. ఈ రకంగా రూపొందించిన మిల్క్‌ స్టోన్స్‌తో లాకెట్లతోపాటు ఉంగరాల్నీ చెవి పోగుల్నీ రూపొందిస్తున్నారు. పైగా ఈ పాల జ్యుయెలరీని ఎవరికి వాళ్లు చేసుకునేలా కిట్స్‌ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి. పాలతోపాటు తొలిసారి తీసిన గోళ్లూ వెంట్రుకలతోనూ నగలు చేయించుకుంటున్నారు. పాలల్లోనే వెంట్రుకల్నీ చొప్పించేవాళ్లూ ఉన్నారు. మొత్తమ్మీద పిల్లలకు చెందిన ప్రతీదీ ఓ అపురూప జ్ఞాపకమే అంటోంది నేటితరం.

అవునుమరి, చూస్తుండగానే చిన్నారులు ఎదిగిపోతారు... ఆటలనీ చదువులనీ తల్లిదండ్రులకి దూరంగా వెళ్లిపోతారు. ఆ బాధను మర్చిపోయి, పిల్లలు తమ చెంతనే ఉన్నారన్న భావన కలిగేందుకన్నట్లు కొందరు తల్లులు వాళ్లకు సంబంధించిన ప్రతీదాన్నీ పదిలంగా దాచుకుంటున్నారు. పెద్దయ్యాక తమ చిన్నారులకి వీటిని చూపించినప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో వర్ణించగలమా అంటున్నారు. అందుకే అవి ముద్రలు కావచ్చు, నగలు కావచ్చు... ఇవన్నీ బిడ్డ పట్ల తల్లికి ఉండే మమకారాన్ని చాటే తీపి గుర్తులే..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..