ఎంత మాయ చేస్తున్నారో..!

పుట్టినరోజుకో పెళ్లిరోజుకో పదిమందినీ పిలుచుకుని ఇంట్లో చిన్నపాటి వేడుకలు చేసు కోవడం, అందుకోసం బ్యాక్‌డ్రాప్‌ డెకరేషన్‌ చేయించుకోవడం తెలిసిందే. అయితే అన్ని సందర్భాల్లోనూ తాజా పూలతో అలంకరణ చేయించుకోవాలంటే బోలెడు ఖర్చు. కానీ ఆ డెకరేషన్‌ లేకపోతే ఫొటోల్లో నిండుదనం ఉండదు.

Updated : 30 Jan 2022 01:17 IST

ఎంత మాయ చేస్తున్నారో..!

పుట్టినరోజుకో పెళ్లిరోజుకో పదిమందినీ పిలుచుకుని ఇంట్లో చిన్నపాటి వేడుకలు చేసు కోవడం, అందుకోసం బ్యాక్‌డ్రాప్‌ డెకరేషన్‌ చేయించుకోవడం తెలిసిందే. అయితే అన్ని సందర్భాల్లోనూ తాజా పూలతో అలంకరణ చేయించుకోవాలంటే బోలెడు ఖర్చు. కానీ ఆ డెకరేషన్‌ లేకపోతే ఫొటోల్లో నిండుదనం ఉండదు. అందుకే ఇప్పుడు నిజంగానే అక్కడేదో పూలతో అలంకరించిన ఫీల్‌ కలిగించే త్రీడీ బ్యాక్‌డ్రాప్‌ స్క్రీన్లూ వచ్చేస్తున్నాయి!

శైలజ వాళ్లమ్మాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. పెళ్లి కూతురు నుంచి తద్దిపేరంటాల వరకూ అన్ని కార్యక్రమాలకీ డెకరేషన్‌ అదిరిపోయింది. ఆ డెకరేటర్లు ఎవరోగానీ... తాజాపూలతో హాలునీ వేదికని ఎంత బాగా అలంకరించారో అని చుట్టపక్కాలంతా చెప్పుకున్నారు. ఆ వేడుకకి హాజరైన అనుపమకి కూడా ఆ అలంకరణ తెగ నచ్చేసింది. వాళ్లమ్మాయి పుట్టినరోజుకీ అలా పూలతో చేయిస్తే ఎంత బాగుంటుందో అనుకుంది. ఆ డెకరేటర్ల నంబరు తీసుకుని ఎంత అని అడిగింది. కానీ ఆ ధర విన్నాక... వద్దులే అనుకుంది. అప్పుడు తట్టిందో ఆలోచన... త్రీడీ డిజిటల్‌ స్క్రీన్స్‌. వెంటనే ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టేసింది. ఇంకేముందీ... పుట్టినరోజుకి వచ్చిన స్నేహితులంతా ఆశ్చర్యపోయారు. ఇంట్లో చేసే వేడుకకి కూడా ఎంత బాగా అలంకరించిందో అనుకున్నారు. దగ్గరకు వెళ్లి చూశాక గానీ అర్థం కాలేదు. అక్కడేమీ లేదు... అదంతా ఆ తెర మాయేనని. అవునండీ... ఇప్పుడు త్రీడీ తెరలతో చాలామంది వేడుకల్ని సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు. ముఖ్యంగా ఓ గంట ఫంక్షన్‌కి అంత ఖర్చు ఎందుకూ... దండగ అనుకుని ఎంచక్కగా త్రీడీ బ్యాక్‌డ్రాప్‌ స్క్రీన్స్‌ కొంటున్నారు. పైగా వీటిని ఒక ఫంక్షన్‌ అనేముందీ... ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. అలాగని ఈ తెరలు మరీ కొత్తవేం కాదు. నాలుగైదేళ్ల నుంచీ వస్తున్నాయి. అయితే అవన్నీ ఏవో ముగ్గులూ దేవుడి ఫొటోలతో మాత్రమే ఉండేవి. వాటినే బ్యాక్‌డ్రాప్‌గా పెట్టి దానిమీద పూలదండల్ని వేలాడేసి అలంకరించుకునేవారు. ఇప్పడు ఆ బాధ లేకుండా డెకరేటర్లు చేసిన వేదికల ఫొటోలను యథాతథంగా తెరమీదకి తెచ్చేస్తోంది త్రీడీ ప్రింటింగ్‌ టెక్నాలజీ. దాంతో అలంకరణ ఖర్చు దాదాపుగా తగ్గిపోయింది. పూలు లేకుండానే ఫొటోల్లో పూల అలంకరణ కనిపించేస్తుంది. నిజానికి ఈ రకం తెరల్ని మొదట్లో స్టూడియోల్లో ఫొటోగ్రాఫర్లు మాత్రమే వాడేవారు. వెనకాల ఓ మంచి సీనరీ కోసం కర్టెన్‌ని పెట్టి నిజంగా ఏ పూలతోటలోనో అడవిలోనో పెద్ద మేడలోనో ఉన్నట్లుగా ఫొటో తీసేవారు. అయితే ఫొటోకోసం వెనకాల ఏదో తెర పెట్టారనేది తెలిసిపోయేది. కానీ  డిజిటల్‌ ప్రింటింగ్‌ వచ్చిన తరవాత ప్రతి దృశ్యం మన కళ్ల ముందు ఉన్నట్లే ఉంటుంది. దాంతో ఇంట్లోకే అడవులూ నడిచొస్తున్నాయి. సాగరజలాలూ ముంచెత్తుతున్నాయి. కొబ్బరిచెట్లూ మొలుస్తున్నాయి. ఇప్పుడు వేడుకల్లోనూ త్రీడీ తెరలు సందడి చేస్తున్నాయి. పైగా అది కర్టెన్‌ అని తెలియకుండా ఉండేందుకు రాడ్‌ కనిపించకుండా ఉండేలానూ దాన్ని తగిలిస్తున్నారు. సో, ఇంట్లో డెకరేషన్‌... భలే చౌక బేరం కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు