పూజలన్నీ ఫోనులో చూడచ్చు!

షిరిడీ సాయిబాబాకు రోజూ ఇచ్చే హారతులూ... కాశీ విశ్వేశ్వరుడికి చేసే అభిషేకాలూ చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. అలాగని ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లినా కూడా వాటన్నింటినీ చూడలేం. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనం

Updated : 13 Feb 2022 05:37 IST

పూజలన్నీ ఫోనులో చూడచ్చు!

షిరిడీ సాయిబాబాకు రోజూ ఇచ్చే హారతులూ... కాశీ విశ్వేశ్వరుడికి చేసే అభిషేకాలూ చూసేందుకు రెండు కళ్లూ చాలవంటారు. అలాగని ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్లినా కూడా వాటన్నింటినీ చూడలేం. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనం చేసుకునేందుకే బోలెడన్ని ఆంక్షలు. ఈ సమస్యలేవీ లేకుండా ఇప్పుడు ఎన్నో ఆలయాలూ, ఆప్‌లూ... లైవ్‌ దర్శన్‌ పేరుతో ఆయా గుడులలో దేవతలకు ప్రతిరోజూ జరిగే అన్నిరకాల పూజలూ, సేవల్ని ఇంట్లో ఉండే దర్శించుకునే ఏర్పాటు చేస్తున్నాయి.

కప్పుడు ఆలయానికి వెళ్లి... ఇష్టదైవాన్ని దర్శించుకుని అక్కడ కాసేపు గడిపితే అదో సంతృప్తి. కానీ గత రెండేళ్ళుగా కరోనా పేరుతో తీర్థయాత్రలకు వెళ్లడం బాగా తగ్గిందనే చెప్పొచ్చు. అయితేనేం... వెళ్లలేకపోయామనే బాధ లేకుండా, ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రముఖ దేవాలయాలు భక్తులకు ప్రత్యక్ష దర్శనం సౌకర్యాన్ని కల్పిస్తుంటే... కొన్ని ఆప్‌లూ ఆ బాట పడుతున్నాయి. కొన్నాళ్లక్రితం తిరుపతి, విజయవాడ, షిరిడీ, భద్రాచలం, శబరిమల... వంటి ప్రముఖ ఆలయాలు వెబ్‌సైట్లను ఏర్పాటు చేయడంతో ఆన్‌లైన్‌ ద్వారా కావాల్సిన పూజకు డబ్బులు కట్టి ఇంటికే ప్రసాదం తెప్పించుకోవడం పెరిగింది. ఇప్పుడు చాలా ఆలయాలు మరో అడుగు ముందుకేసి దేవతలకు తాము నిర్వహించే ప్రతి పూజనూ ప్రత్యక్షంగా ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. దానివల్ల ఉదయం చేసే సుప్రభాత సేవ నుంచి గుడి తలుపులు మూసేవరకూ ప్రతి పూజనూ ఇంటిదగ్గర కూర్చునే చూసేయొచ్చన్నమాట. అలా దర్శనం అందించే వాటిల్లో ముంబయిలోని సిద్ధివినాయక ఆలయం, షిరిడీ, ద్వారక, కొల్హాపూర్‌ మహాలక్ష్మి, స్వామినారాయణ్‌... వంటివెన్నో ఉన్నాయి. ఉదాహరణకు షిరిడీని తీసుకుంటే... స్వామికి రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ అయిదు రకాల హారతుల్ని ఇవ్వడంతోపాటూ విశేష పూజల్ని నిర్వహిస్తారు. వాటన్నింటినీ రోజూ చూడాలనుకునే భక్తులకోసమే షిరిడీ ప్రత్యక్ష ప్రసారాన్ని మొదలుపెట్టింది. కోరుకున్నప్పుడల్లా ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్తే షిరిడీలో స్వామి ఎదురుగా ఉన్నట్లే అనిపిస్తుంది. కాశీ, సోమనాథ ఆలయాలు కూడా అంతే... పరమేశ్వరుడికి నిత్యం నిర్వహించే అభిషేకాలూ, ఇతర పూజలనూ కళ్లారా చూసి తరించొచ్చు. తిరుమల మాత్రం స్వామివారికి నిర్వహించే ప్రత్యేక సేవలను టీటీడీ ఛానల్‌, యూట్యూబ్‌ ద్వారా లైవ్‌ ప్రసారం చేస్తుంది. 

ఒక్క క్లిక్‌తో...

చాలా ఆలయాలు ఆధ్యాత్మిక ఛానళ్లు, తమ వెబ్‌సైట్‌/యూట్యూబ్‌ ద్వారా ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసారం చేస్తున్నాయి కానీ.. వాటన్నింటినీ చూడాలంటే రకరకాల వెబ్‌సైట్లలోకి లాగిన్‌ అవ్వాలి. ఈ ఇబ్బందులేవీ లేకుండా కావాల్సిన ఆలయాలన్నింటినీ ఒకేచోట నేరుగా దర్శించుకునేందుకు వీలుగా ఇప్పుడు కొన్ని ఆప్‌లూ అందుబాటులోకి వచ్చాయి. ‘వీఆర్‌ డివోటీ’, ‘ఐ2ఐ’, ‘షెమారూ భక్తి’ ‘లైవ్‌ దర్శన్‌’, ‘లైవ్‌ టెంపుల్‌ దర్శన్‌’ అలాంటివే. ఉదాహరణకు ‘వీఆర్‌ డివోటీ’ని తీసుకుంటే.. ఇందులో ఇస్కాన్‌, మంత్రాలయం, అమృత్‌సర్‌... ఇలా చాలా ఆలయాలను చూడొచ్చు. ఈ ఆప్‌ లైవ్‌ దర్శనాన్ని చేయిస్తూనే వర్చువల్‌ రియాలిటీ సాయంతో ఆలయం మొత్తం చూసే సదుపాయాన్నీ కల్పిస్తోంది. ‘షెమారూ భక్తి’, ఆప్‌ కూడా ఇంచుమించు అలాంటిదే. వీటికి కాస్త భిన్నం ‘ఐ2ఐ’ ఆప్‌. ఇది దేశవ్యాప్తంగా 145 ఆలయాలకు సంబంధించిన అన్నిరకాల పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వాటితోపాటూ ఇంకేదైనా ఆలయం కూడా ఉంటే బాగుంటుందనుకునే భక్తులు... ఆ వివరాలను తెలియజేస్తూ అభ్యర్థించొచ్చు కూడా. ఈ ఆప్‌ల వల్ల అదనపు లాభం ఏంటంటే... వీటి సాయంతో పూజా సామగ్రి కొనుక్కోవడంతోపాటూ, ఆలయాల్లో పూజలు చేయించుకునేందుకు డబ్బులు కూడా వాటిద్వారా చెల్లించొచ్చు. కాబట్టి ఇంట్లో పెద్దవాళ్లు ఉండి... ఏమీ తోచట్లేదు అని గొడవ చేస్తుంటే వాళ్లకు నచ్చిన దేవుడిని కాసేపు చూపించేయండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..