Published : 11 Jul 2021 01:22 IST

ఒకరికొకరు తోడుగా...

సోంలో నోటున్‌ లీకుల్‌ అనే ఓ పల్లెటూరుంది. ఆ ఊళ్లో ఎవరింట్లోనైనా ఆహార పదార్థాలు మిగిలిపోయినా, ఇంకెవరి దగ్గరైనా వాళ్లకు పనికిరాని పుస్తకాలూ, దుస్తులూ, ఇతర వస్తువులూ ఉన్నా... వాటిని చక్కగా తీసుకెళ్లి ఆ ఊళ్లో కొత్తగా ఏర్పాటు చేసిన ‘బ్లెస్సింగ్‌ హట్‌’లో ఉంచుతారు. అవసరమైన వాళ్లు వచ్చి హాయిగా వాటిని తీసుకుని వెళుతుంటారు. ఈ కరోనా కష్టకాలంలో చాలాచోట్ల చాలామంది పనులు లేక కడుపునిండా తినడానికే నానా అవస్థలు పడుతున్నారు. ఈ ఊళ్లో అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికే ఈ బ్లెస్సింగ్‌ హట్‌ని ప్రారంభించారట. అందరూ కలిసి ఒకరికొకరు సాయం చేసుకుంటూ నిత్యావసరాల్ని తీర్చుకుంటున్నారట. ‘కావాల్సినవి తీసుకెళ్లండి. ఇవ్వగలిగేవి ఇవ్వండి’ అనే బోర్డుతో కనిపించే ఈ ‘బ్లెస్సింగ్‌ హట్‌’ చిన్నదే అయినా దాని వెనకున్న ఆదర్శం పెద్దది కదూ!


గుర్రం డాక్టరుగారు!

ఫ్రాన్స్‌లోని ‘క్యాలెయ్‌’ అనే ఆసుపత్రిలోని పేషెంట్లందరూ డాక్టర్‌ పెయో కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ డాక్టరుగారు గది లోపల అడుగుపెట్టగానే జబ్బూగిబ్బూ మరిచిపోయి ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. రోగులకు అంత సంతోషాన్ని పంచే ఆ డాక్టర్‌ ఎవరో కాదు, ఓ గుర్రం. ఈ ఆసుపత్రిలో క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికోసం పెయో ఓ థెరపిస్ట్‌గా అవతారమెత్తింది, అందరి చేతా ‘డాక్టర్‌ పెయో’ అనిపించుకుంటోంది. అసలీ గుర్రం, డాక్టర్‌ ఎలా అయ్యిందంటే... కాస్త డల్‌గా ఉన్న వ్యక్తుల దగ్గరికి పెయో వెళ్లి వారితో చనువుగా ఉంటూ వారిని సంతోషపెట్టేదట. అది గమనించిన దీని యజమాని చావుతో పోరాడుతున్న పేషెంట్లని కాసేపైనా ఆనందంగా ఉంచాలనుకుని, దాన్ని ఆసుపత్రికి తీసుకురావడం మొదలుపెట్టాడు. దీంతో వారానికి రెండుసార్లు ఆసుపత్రికి వస్తూ ప్రేమగా పేషెంట్లని పలకరించి వాళ్ల ముఖాల్లో నవ్వుల్ని పూయిస్తోందీ డాక్టర్‌ గుర్రం.


కల కన్నాడు... రూ.56 లక్షలు గెలిచాడు!

‘కలలు నిజమవుతాయా... ’ అని మనలో ఎవరినైనా అడిగితే సరిగా చెప్పలేమేమో! అదే అమెరికాలోని కెన్సస్‌కు చెందిన మేసన్‌ క్రెంట్స్‌ను అడిగారనుకోండి... ‘ఆఁ ఎందుకు కావూ. నా కల నిజమైందిగా’ అంటూ సంతోషంగా తన డ్రీమ్‌స్టోరీ చెప్పేస్తాడు. అసలా కల కమామిషు ఏంటంటే- మొన్నీమధ్య ఓ రోజు క్రెంట్స్‌కి 25000 డాలర్ల (దాదాపు రూ.18 లక్షలు) లాటరీ తగిలినట్టు కలొచ్చింది. ‘అబ్బ, ఆ కల నిజమైతే ఎంత బాగుండో’ అనుకుంటూ పొద్దున్నే లేచి ఓ లాటరీ టిక్కెట్టు కొన్నాడు. తనకొచ్చిన కల గురించి అందరికీ చెబుతూ కచ్చితంగా తనకే ఆ లాటరీ వస్తుందని ఎదురుచూశాడు. రెండురోజుల తర్వాత అందరూ ఆశ్చర్యపోయేలా ఆ లాటరీ జాక్‌పాట్‌ కొట్టేశాడు. కలలో వచ్చినదానికి మూడు రెట్లు... 75000 డాలర్ల (దాదాపు రూ.56 లక్షలు) డబ్బును సొంతం చేసుకున్నాడు. కల నిజమైనందుకు ఉబ్బితబ్బిబ్బవుతూ ఇప్పుడా డబ్బుల్ని ఎలా ఖర్చుపెట్టాలో లెక్కలేసుకుంటున్నాడు.


సకుటుంబ సపరివార రక్తదానం!

క్తదానంపైన ఎంతో అవగాహన వచ్చిందనుకున్నా... ఇప్పటికీ దానిపైన ఎన్నో అపోహలు ఉంటూనే ఉన్నాయి. ప్రతి ఇంటా ఎవరో ఒకరు అందుకు అడ్డుచెప్పేవాళ్లు కనిపిస్తూనే ఉంటారు. కానీ ఈ ఉమ్మడి కుటుంబంలోని వాళ్లంతా ఒక్కమాట మీద నిలిచి 257 సార్లు రక్తదానం చేశారు! కడప జిల్లా పులివెందుల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన సుబ్బరాయుడి కుటుంబం అది. ఆ ఇంట చోటుచేసుకున్న ఓ విషాదం వాళ్లని ఇలా రక్తదాతలుగా మార్చిందట. ఇరవై ఎనిమిదేళ్లకిందట... సుబ్బారాయుడు, ఆయన భార్య లక్ష్మమ్మల్ని బెంగళూరుకు విహారయాత్రకి తీసుకెళ్లారట వాళ్ల నలుగురు పిల్లలు. అక్కడ రోడ్డుప్రమాదం జరిగి లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెకి శస్త్రచికిత్సకి కావాల్సిన రక్తం కోసం ఆ పిల్లలు ఎన్నో అవస్థలు పడ్డారు. ఎట్టకేలకు రక్తం దొరికి శస్త్రచికిత్స చేసినా... లక్ష్మమ్మ చనిపోయారు. దాంతో ఎవరూ తమలా రక్తం కోసం ఇబ్బందులు పడకూడదని ప్రతి 90 రోజులకోసారి రక్తదానం చేయడం మొదలుపెట్టారు ఆ దంపతుల మూడో కుమారుడు వేణుగోపాల్‌. వేణుగోపాల్‌ని స్ఫూర్తిగా తీసుకుని ఆయన సోదరులు చంద్రశేఖర్‌, శ్రీనివాస్‌, మధుసూదన్‌, భార్య రేవతి, వదినలు లక్ష్మీదేవి, ఇందిరమ్మ, మరదలు లక్ష్మీదేవి, సోదరుల పిల్లలు సిద్ధార్థ, శరత్‌చంద్ర, సంధ్యాదీపిక, శ్వేత సైతం రక్తదానం చేస్తున్నారు. ప్రస్తుతం కడపలోని చిట్వేలు మండలకేంద్రంలో ఉంటున్న ఈ కుటుంబం ఏడాదిలో పలుమార్లు సొంత డబ్బులతోనే రక్తదాన శిబిరాలూ నిర్వహిస్తోంది.


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని