ఇక్కడ ఎగేసి.. అక్కడ పోగేసి.. ఇదీ సం‘పన్నుల’ బండారం!
కొందరు... న్యాయంగా కష్టపడి సంపాదించుకుంటారు. ప్రభుత్వానికి ఠంచనుగా పన్నులు చెల్లిస్తారు. మరికొందరు... రకరకాల మార్గాల్లో చాలా సంపాదిస్తారు. ఆ సంపాదన మీద పన్నులు ఎగవేయడానికి అడ్డదారులు వెతుకుతారు. చట్టం కళ్లు కప్పి సంపదని విదేశాలకు తరలిస్తారు. నల్లడబ్బుని తెల్లడబ్బుగా మార్చుకుని జల్సా చేస్తారు.ఫలితంగా సమాజంలో పేదలు మరింత పేదలుగా మిగిలిపోతోంటే, ధనికులు మరింతగా ధనికులవుతున్నారు. మొన్న పనామా పేపర్లు... నిన్న ప్యారడైజ్ పేపర్లు... తాజాగా పండోరా పేపర్లు... బయటపెట్టింది అలాంటి వారి బండారాన్నే. ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ వార్తల వెనక ఉన్నది ఐసీఐజే అనే ఒక స్వతంత్ర సంస్థ.
ఒక పేద దేశానికి రాజు ఆయన. ఆర్థిక సాయం కింద అమెరికా నుంచి ఆ దేశానికి ఏటా వేలకోట్ల డాలర్ల సాయం అందుతుంది. అందులోనుంచి కొంత మొత్తాన్ని మెల్లగా పక్కదారి పట్టించాడు. ఆ డబ్బుతో వివిధ దేశాల్లో లెక్కలేనన్ని సొంత ఆస్తులు ఏర్పరచుకున్నాడు. ఖరీదైన ప్రాంతాల్లో 14 విలాసవంతమైన ఇళ్లు కొనుక్కున్నాడు. దేశంలో ఏటా తన పేరున ప్రభుత్వ సంస్థలకూ ఉద్యోగులకూ ‘పారదర్శకత అవార్డు’ ఇచ్చే జోర్డాన్ రాజు వెలగబెట్టిన ఈ బండారం పండోరా పేపర్లలో బయటపడింది.
ఆరెంజ్ జ్యూస్ తయారీ, ఎగుమతీ చేసే పెద్ద వ్యాపారవేత్త అతడు. రైతుల నుంచి పండ్లను తక్కువ ధరకు కొనుక్కోవడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రభుత్వమే సరే అన్నాక ఇక అతడి వ్యాపార లావాదేవీల్ని ప్రశ్నించే వారెవరు! దాంతో అతడి వ్యాపారం మూడు పండ్లూ ఆరు జ్యూస్ సీసాలుగా పెరిగింది. విదేశాల్లో ఒక ట్రస్టు పెట్టి వచ్చిన లాభాలన్నీ దానికి మళ్లించాడు. ట్రస్టు పేరుతో విలాసవంతమైన భవనాలూ ప్రైవేటు విమానాలూ ఎందుకున్నాయా అని అనుమానం వచ్చినవారు ఎవరో తీగ లాగారు... బ్రెజిల్ నారింజ వ్యాపారి డొంకంతా కదిలింది.
కేమెన్ ఐలాండ్స్... మూడు చిన్న చిన్న దీవులు కలిసిన దేశం. బీచ్‌ల అందాలు చూడడానికీ స్కూబా డైవింగ్ చేయడానికీ విదేశీ పర్యటకులు వస్తా రక్కడికి. అక్కడ ఉన్న ఒక భవనం చిరునామా వరసగా 12వేల కంపెనీలకు కన్పిస్తోంటే ‘ఎంత పెద్ద భవనమై ఉంటుందదీ...’ అని ఆశ్చర్యపోతూ ఆరా తీశారు. తీరా చూస్తే భవనం చాలా చిన్నదే. అన్ని కంపెనీలూ ఎలా పట్టాయంటే అవి కాగితాలమీదే తప్ప నిజంగా లేవు కాబట్టి. దాదాపు నలభై కోట్లు పెట్టి బినామీ పేరున కొన్న ఇంట్లో ఉంటున్నది ఒక మామూలు మధ్యతరగతి మహిళ. అంత డబ్బు పెట్టి ఆమె ఆ ఇల్లు ఎలా కొనగలిగిందీ అని విచారిస్తే- ఓ దేశాధ్యక్షుడితో ఆమెకున్న స్నేహం సంగతి తెలిసింది.
ఇటీవల వెలువడిన పండోరా పేపర్స్ ఇలాంటి కథలెన్నో చెప్పాయి... వివిధ దేశాల్లోని ప్రముఖుల దొంగచాటు వ్యవహారాలన్నిటినీ బయటపెట్టాయి. ఒకటీ రెండూ కాదు, కోటీ ఇరవై లక్షల డాక్యుమెంట్లను ఆరు వందల మంది జర్నలిస్టులు ఏడాది పాటు శోధించి ఏకంగా 32 ట్రిలియన్ డాలర్ల దాకా నిధులు సొంత దేశాలనుంచి ఇతర దేశాలకు అక్రమంగా మళ్లినట్లు తేల్చారు. ఒక ట్రిలియన్ డాలర్లంటే 75 లక్షల కోట్ల రూపాయలు. 32 ట్రిలియన్లంటే ఎన్నికోట్ల కోట్లవుతాయో ఆలోచించండి. పైగా ఇది నగదు మాత్రమే, స్థిరాస్తులూ విమానాలూ ఓడలూ నగలూ లాంటివి కూడా కలిపితే ఇంకెంత అవుతాయో! అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ మింగలేక కక్కలేక అన్నట్లుగా లోలోపల మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అక్రమాల పుట్ట పగిలింది ఐసీఐజే అన్న ఒక్క సంస్థ పూనుకుని చేపట్టిన యజ్ఞం వల్ల... దానికి ఉప్పందించిన కొందరు బాధ్యతగల ప్రజల వల్ల.
ఏమిటీ ఐసీఐజే?
అమెరికాలో ఉన్న ఓ స్వతంత్ర వార్తా సంస్థ... ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్. దీన్నే క్లుప్తంగా ఐసీఐజే అంటారు. 1997లో చార్ల్స్ చెక్ లెవిస్ అనే జర్నలిస్టు దీన్ని ప్రారంభించాడు. మొదట సామాజిక బాధ్యత గల పౌరుల్ని సమన్వయపరిచేందుకు మాత్రమే దీన్ని ప్రారంభించినప్పటికీ వారి పరిశోధనలు నెమ్మదిగా సరిహద్దులు దాటాయి. బహుళజాతి సంస్థల పొగాకు స్మగ్లింగ్‌తో మొదలుపెట్టి ఇరాన్, అఫ్ఘనిస్థాన్ యుద్ధ ఒప్పందాలవరకూ ఎన్నెన్నో అక్రమాలను వెలుగులోకి తెచ్చాయి. సొంత విలేకరుల బృందంతో పాటు వివిధ దేశాల్లో ఉన్న పత్రికా సంస్థలూ విలేకరుల సహకారం తీసుకుని ఈ సంస్థ ప్రపంచం నలుమూలలా ఎక్కడ ఎలాంటి చట్ట ఉల్లంఘన జరుగుతున్నా సమాచారం సేకరిస్తుంటుంది. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు ఒక చోటునుంచి వచ్చిన సమాచారానికి ఇంకెక్కడో లింకు దొరుకుతుంది. వాటిని నిశితంగా పరిశీలిస్తూ దొరికిన ఆధారాలను పేర్చుకుంటూ ఎన్నో కుంభకోణాలను వెలుగులోకి తెచ్చింది. అవినీతి సామ్రాజ్యాల పునాదుల్ని కదిలించింది. ఇటీవల నోబెల్ శాంతి బహుమతి పొందిన మారియా రెస్సా ఈ సంస్థ సభ్యురాలే. పనామా పేపర్స్‌కి పులిట్జర్ అవార్డు లభించింది.
పనామా పేపర్స్ వాళ్లు తెచ్చినవేనా?
జర్మనీకి చెందిన ఓ పత్రికా సంస్థ ఐసీఐజేతో కలిసి చేసిన దర్యాప్తు ఫలితంగా బయటపడినవే పనామా పేపర్లు. అసలిదంతా ఎలా జరిగిందంటే- తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ వ్యక్తి జర్మనీలోని పత్రికా కార్యాలయానికి కొన్ని డాక్యుమెంట్లను అందజేశాడు. అవన్నీ న్యాయసేవలు అందించే ఒక ప్రైవేటు సంస్థ నుంచి రహస్యంగా బయటకు వచ్చిన పేపర్లు. మొత్తం కోటీ 15 లక్షలున్న ఆ డాక్యుమెంట్లను పలువురు జర్నలిస్టులు అంతర్జాలం సాయంతో నెలల తరబడి శోధించగా బయటపడిన సమాచారాన్నే ఐదేళ్ల క్రితం మనం పనామా పేపర్లలో చూశాం.
ఏముంది వాటిల్లో?
పనామా అనేది అరకోటి జనాభా కూడా లేని చిన్న దేశం. ఆ దేశంలో మొసాక్ ఫోన్సెకా అనే న్యాయసేవల సంస్థ ఉంది. 40 దేశాల్లో ఆఫీసులు పెట్టుకున్న ఈ సంస్థ సంపన్నులకు ట్రస్టులూ ఫౌండేషన్లూ ఏర్పాటుచేయడం, విదేశాలలో నిర్వహించాలనుకునే ఆర్థిక, వ్యాపార లావాదేవీలను చేసిపెట్టడం, పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి సలహాలివ్వడం... లాంటి పనులు చేసిపెట్టేది. ఇదంతా పైకి చెప్పుకోవడానికి. కానీ చేసింది మాత్రం అన్నీ అన్యాయమైన పనులే. చవగ్గా వెయ్యి డాలర్లకే ప్రపంచంలో ఏ అడ్రసుతోనైనా ఒక బినామీ కంపెనీని సృష్టించి ఇచ్చేది. బ్యాంకులకు సైతం మనీ లాండరింగ్(అక్రమ మార్గాల్లో సంపాదించిన డబ్బుని చలామణీలోకి తెచ్చే పని)లో సహాయపడేది. ఆ సంస్థ డేటా బేస్ నుంచి లీకైన సమాచారమే పనామా పేపర్లకు మూలం. అలా బయటపడ్డ డాక్యుమెంట్లని ఆధారంగా చేసుకుని శోధించగా దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన సంపన్నులూ ఉన్నతాధికారులూ సంస్థలకు సంబంధించి రెండు లక్షలకు పైగా అక్రమ లావాదేవీల సమాచారం బయటపడింది. ఈ సమాచారాన్ని లీక్ చేసింది మొసాక్ ఫోన్సెకా సంస్థ ఉన్న పనామా నుంచే కాబట్టి ఆ పేపర్స్‌ని పనామా పేపర్స్ అన్నారు. ఆ డాక్యుమెంట్స్‌లో మొసాక్ ఫోన్సెకా సృష్టించిన వేలాది డొల్ల కంపెనీల(కాగితాల్లో మాత్రమే ఉండే ఉత్తుత్తి కంపెనీలు) వివరాలూ వాటి ద్వారా జరిగిన అక్రమాలూ పన్నుల ఎగవేత లాంటివన్నీ ఉన్నాయి. వాటిల్లో ఒక డజను మంది దేశాధినేతలూ 130 మంది ఉన్నతాధికారులూ రాజకీయనాయకులూ వందలాది సెలెబ్రిటీలూ సంపన్నులైన వ్యాపారవేత్తలూ ఉన్నారు.
దీనివల్ల లాభమేంటి?
ఊహించని రీతిలో ఈ అక్రమాలన్నీ బయటపడేసరికి ప్రభుత్వాల్లో చలనం వచ్చింది. పలు దేశాల్లో ప్రజలు ఆందోళనలు జరిపారు. దాంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు రాజీనామాలు చేశారు. కొందరిని అరెస్టు చేశారు. అన్ని దేశాల్లోనూ పన్నులు ఒకే రకంగా ఉండాల్సిన అవసరం గురించి చర్చమొదలైంది. కంపెనీలన్నీ తమ అసలు యజమాని ఎవరో ప్రకటించి తీరాలని ఇండొనేషియా ప్రభుత్వం చట్టం చేసింది. అవినీతి, అక్రమాలను అరికట్టడానికి పలు నిబంధనలు తెచ్చింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలు కూడా పలు చట్టాల్ని పటిష్ఠం చేశాయి. అమెరికా, జర్మనీ, దక్షిణ కొరియా... దాదాపు అన్ని దేశాల్లోనూ అనుమానాలున్న సంస్థలన్నిటి మీదా ప్రభుత్వాలు విచారణ జరిపాయి. దీర్ఘకాలంగా పన్నులు ఎగ్గొడుతున్న ఎందరినుంచో ముక్కుపిండి వసూలు చేశాయి. మన దేశంలో పనామా పేపర్స్ వెలువడిన తర్వాత ఆదాయపన్ను శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా బ్లాక్ మనీ చట్టం కింద 400 మందికి తమకి ఉన్న విదేశీ ఆస్తుల్ని వెల్లడి చేయలేదని నోటీసులిచ్చారు. దర్యాప్తులో అది నిజమని తేలితే వారంతా 120 శాతం ట్యాక్స్‌తో పాటు మరో పది లక్షలు జరిమానా కట్టాలి.
మరి పండోరా పేపర్లేమిటి?
పనామా పేపర్లతోనే అంతా అయిపోలేదు. తర్వాత ఏడాదిన్నరకి ప్యారడైజ్ పేపర్లు వచ్చాయి. మొసాక్ ఫోన్సెకా లాగానే బెర్ముడాలో ఉన్న యాపిల్బై, సింగపూర్‌లోని ఆసియాసిటీ అనే కంపెనీల నుంచి లీకైన సమాచారం వీటికి మూలం. బ్రిటన్ రాణి, లైబీరియా అధ్యక్షురాలు తదితర ప్రముఖుల పేర్లతోపాటు మన దేశం నుంచి 700 మందికి పైగా పేర్లు వీటిల్లో ఉన్నాయి. పన్ను ఎగవేతదారుల స్వర్గాలుగా పేర్కొనే ప్రాంతాల్లో వీరంతా నిధులు దాచినట్లు
వెల్లడిస్తున్న ఈ పేపర్లను ప్యారడైజ్ పేపర్లన్నారు. ఆ తర్వాత వచ్చినవి పండోరా పేపర్లు. పనామా పేపర్లకు మొసాక్ ఫోన్సెకా అనే ఒక్క కంపెనీనుంచి లీకైన సమాచారం ఆధారం కాగా, పండోరా పేపర్లకు 14 సంస్థల నుంచి బయటపడిన సమాచారం ఆధారం. మొత్తం 27వేల కంపెనీలూ 29 వేలమంది లబ్ధిదారులకూ సంబంధించిన విషయాలున్నాయి. పనామా పేపర్లకన్నా దాదాపు రెట్టింపు ఎక్కువ. ఇప్పటివరకు 336 మంది రాజకీయ
నాయకుల పేర్లు వెల్లడి కాగా అందులో 35 మంది ప్రస్తుత, మాజీ దేశాధినేతలున్నారు. ఇంకా 45 దేశాలకు చెందిన వందలాది బిలియనీర్లూ సెలెబ్రిటీలూ వ్యాపారవేత్తలకు సంబంధించిన విషయాలు బయటపడ్డాయి. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాల్లో చోటు పొందిన 130 మంది ఇందులో ఉన్నారు. ఇందులోనూ 300 మంది భారతీయుల పేర్లున్నాయి. ఇప్పటివరకూ వెల్లడైన ఆర్థిక మోసాల్లో అత్యంత పెద్దది ఇదే. అందుకే దేశాలన్నీ ఇప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. అక్రమాలు పూర్తిగా బయట పడితే పలు దేశాల్లో ప్రభుత్వాలు ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుంది.
పనామా అయినా పండోరా అయినా... అవి జరుగుతున్న మోసాలకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి. ఆయా దేశాల ప్రభుత్వాలే పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్ల క్రితం వెలువడిన పనామా పేపర్లలోని సమాచారం మీదే ఇంకా దర్యాప్తులు పూర్తి కాలేదు. ఈ లెక్కన పండోరా పేపర్ల అంతు చూడడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో మరి. ఈలోపల మరో లీక్ ఐసీఐజేకి దొరక్కపోదు... ఎందుకంటే ఈ సంస్థకి జర్నలిస్టులే కానక్కరలేదు, అవినీతీ అక్రమాలకు సంబంధించిన సమాచారం తెలిసిన సాధారణ ప్రజలు ఎవరైనా ఉప్పందించవచ్చు. వెబ్సైట్ ద్వారా తమ దగ్గరున్న ఆధారాలను వారికి తెలియజేస్తే సంస్థ సిబ్బందే పరిశోధించి అక్రమాల గుట్టు విప్పుతారు.
పన్ను ఎగ్గొడితే ఏమవుతుంది?
ఇది కేవలం డబ్బుకి సంబంధించిందే కాదు. ధనికులకీ పేదలకీ మధ్య, అధికారంలో ఉన్నవారికీ ప్రజలకీ మధ్య అగాధాన్ని సృష్టిస్తున్న మోసం. సంపన్నులు చట్టాలకు దొరక్కుండా తప్పించుకోవడానికి సృష్టించుకున్న సమాంతర ప్రపంచం. తాము కట్టాల్సిన పన్నుల్ని ఎగవేయడమే కాదు, దేశాల ఖజానాలను దోచుకోవడం, లంచాలూ ముడుపులూ తీసుకుని అవినీతిని పెంచడం, పెద్ద మనుషుల ముసుగులో అక్రమాలను ప్రోత్సహించడం... అన్నిటినీ మించి నమ్మి నాయకులుగా ఎన్నుకున్న ప్రజలనూ, విశ్వాసంతో సేవలందిస్తున్న ఉద్యోగులనూ మోసం చేయడం.
ఉదాహరణకు బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీబ్లెయిర్ భార్య చెర్రీ బ్లెయిర్ లీగల్ ప్రాక్టీస్‌కి కార్యాలయం కోసం లండన్‌లోనే నాలుగంతస్తుల భవనం కొన్నాడు. ఓ విదేశీ కంపెనీ పేరుతో ఉన్న భవనాన్ని తాము పెట్టిన కంపెనీ పేరున కొన్నాడు. ఈ అమ్మకం జరిగాక విదేశీ కంపెనీ రద్దయింది. అంటే కేవలం భవనం కొనుగోలు వ్యవహారం కోసం రెండు కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఎవరి నుంచి ఎవరు కొన్నారు అన్నది తెలియకుండా ఆస్తి చేతులు మారింది. అలా కొనడంవల్ల బ్లెయిర్ దంపతులకు మూడుకోట్ల పాతిక లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ మినహాయింపు లభించింది. చట్టపరంగా అది తప్పు కాకపోవచ్చు. కానీ నైతికంగా చూస్తే ఒకప్పటి ప్రధాని సొంత ప్రభుత్వాన్ని మోసం చేయడం తప్పేగా. ఆయన లాంటి వాళ్లు డబ్బుంది కాబట్టి విదేశీ సంస్థల సాయంతో పన్నులు కట్టకుండా తప్పించుకోగలరు. కానీ సామాన్యులకు అలాంటి వెసులుబాటు ఉండదు. వాళ్లు మాత్రం తమ కష్టార్జితంలోనుంచి నయాపైసలతో సహా పన్నులు కట్టాల్సిందే. ఇలాంటి చర్యల వల్ల ప్రపంచమంతటా సమాజంలో అసమానతలు ఇంకా పెరుగుతాయనీ మొత్తంగా ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతుందనీ సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారు చెబుతున్న మరో చిన్న ఉదాహరణ చూద్దాం...
ఒక వంద కోట్లు ఉంటే ఏం చేయొచ్చు..?
ఒక ఊరికి కావలసిన మౌలిక సదుపాయాలు- రోడ్లూ బడీ ఆస్పత్రీ... అన్నీ కల్పించవచ్చు. ఒకసారి అవన్నీ ఏర్పడితే ఆ ఊరి అభివృద్ధికి గట్టి పునాది పడినట్లే. మరి లక్షల కోట్ల డబ్బు విదేశాలకు వెళ్లిపోతోంటే... ఎన్ని ఊళ్లు ఆ అభివృద్ధికి దూరమైపోతున్నాయీ..?
ఇప్పుడు ప్రపంచ దేశాల ప్రజలందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే!
పన్ను ఎగవేతదారుల స్వర్గాలివి!
కొన్ని దేశాలు పన్ను ఎగవేతదారుల పాలిట స్వర్గాలుగా మారడానికి కారణం అక్కడి చట్టాలు. విదేశీ సంపన్నులను ఆకట్టుకోవడానికి పన్ను చట్టాల్లో వెసులుబాటు కల్పిస్తున్నాయివి. ఈ దేశాల్లో ఖాతాలు తెరవాలన్నా, కంపెనీలూ ట్రస్టులూ పెట్టాలన్నా అక్కడ నివసించాల్సిన పనిలేదు, వ్యాపారం చేయాల్సిన అవసరమూ లేదు. పనామా, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, లగ్జెంబర్గ్, కేమెన్ ఐలాండ్స్, బెర్ముడా, నెదర్లాండ్స్ లాంటి దేశాలూ అమెరికాలోని కొన్ని రాష్ట్రాలూ నామమాత్రపు పన్నులకూ బినామీ ఖాతాల నిర్వహణకూ పేరొందాయి. ఈ దేశాల్లో విదేశీ మారకం మీద నియంత్రణ ఉండదు. దాంతో ఎక్కడినుంచి అయినా ఎంత మొత్తమైనా పెట్టుబడి, వ్యాపారం వంకతో ఇక్కడి ఖాతాల్లోకి బదిలీ చేసుకోవచ్చు. ఆ చట్టాలను అడ్డం పెట్టుకుని మొసాక్ ఫోన్సెకా లాంటి సంస్థలు డొల్ల కంపెనీల వ్యాపారం చేస్తోంటే కొన్ని పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు తమ దేశాల్లో పన్ను తప్పించుకుంటున్నాయి. ఉదాహరణకు నైకి కంపెనీ బెర్ముడాలో ఆఫీసు పెట్టి అమెరికాలో పన్నునీ, నెదర్లాండ్స్‌లో ఆఫీసు పెట్టి డచ్ దేశాల్లో పన్నునీ తగ్గించుకుంటోంది. ఇదే కాదు, గూగుల్‌తో సహా ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో సగానికి పైగా ఇలాంటి దేశాల చట్టాలను వాడుకుంటున్నాయి.
పనామా పేపర్స్... పరిణామాలు!
ఐదేళ్ల క్రితం వెలువడిన పనామా పేపర్స్ ప్రపంచ దేశాల మీద చూపిన ప్రభావం సాధారణమైనది కాదు. మొత్తం 82 దేశాల్లో సీరియస్‌గా దర్యాప్తులు మొదలయ్యాయి.
* వెలువడిన రెండోరోజే విదేశాల్లో బినామీ ఆస్తులున్నందుకు ఐస్లాండ్ ప్రధాని రాజీనామా చేశాడు. పాకిస్థాన్‌లో నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి పోవడానికీ అదే కారణం. ఇతర దేశాల్లోనూ ఉన్నత పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేశారు.
* పన్నులు ఎగవేసి బినామీ కంపెనీల్లో డబ్బు దాచుకున్నందుకు ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీ రెండేళ్లు జైల్లో ఉన్నాడు.
* మొసాక్ ఫోన్సెకా కంపెనీ వ్యవస్థాపకులిద్దర్నీ అరెస్టు చేశారు. కంపెనీ మూతపడింది.
* ట్రస్టు చట్టాల్లోని లొసుగుల్ని వాడుకుని మనీలాండరింగ్‌కి పాల్పడుతున్నారని తేలడంతో న్యూజిలాండ్ చట్టాల్ని పటిష్ఠం చేయడంవల్ల అక్కడ ఏటా కొత్తగా ఏర్పాటయ్యే విదేశీ ట్రస్టుల సంఖ్య ఏకంగా మూడొంతులు తగ్గిపోయింది.
* బ్రిటన్‌లో పన్నుల ఎగవేతపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు జరిపి కొందరిని అరెస్టు చేసింది. మిగిలినవారి ఆస్తుల్ని మళ్లీ లెక్కలు వేసి దాదాపు రెండువేల కోట్ల రూపాయల పన్నుల్ని అదనంగా వసూలుచేసింది.
* బెల్జియంలో పోలీసులు ఒక ప్రభుత్వ బ్యాంకుని సోదా చేయగా అది అనుబంధ శాఖ ద్వారా 1500 డొల్ల కంపెనీలు పెట్టడానికి తోడ్పడినట్లు తెలిసింది.
* మొత్తంగా 22 దేశాల్లో లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాల చేతికి వచ్చింది.
భారత్‌లో 20వేల కోట్లు!
పనామా పేపర్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో గత జూన్ వరకు మన దేశంలో 20,078 కోట్ల అప్రకటిత ఆస్తులను గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ప్రకటించింది. ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటి వరకూ ఇదే పెద్ద మొత్తం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బోర్డు సమాధానం ఇచ్చింది. వీటి మీద పన్నులు వసూలు చేస్తున్నామనీ, ఇప్పటికే 46 కేసుల్లో వేర్వేరు కోర్టుల్లో విచారణ జరుగుతోందనీ, మరో 83 కేసులు దర్యాప్తు దశలో ఉన్నాయనీ వివరించింది.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్