Updated : 24 Apr 2022 01:54 IST

2037లో మనం..!

పొద్దున్నే లేచేసరికి పొగలు కక్కుతూ కాఫీ, స్నానం చేసొచ్చేసరికల్లా వేడిగా టిఫిన్‌... టేబుల్‌ మీద రెడీగా ఉంటే... డ్రైవ్‌ చేసే పనిలేకుండా కారే భద్రంగా ఆఫీసుకు తీసుకెళ్తే... ఆరోగ్యం బాగాలేక రాలేదని మనం సంజాయిషీ ఇచ్చుకోనక్కరలేకుండా బాస్‌కి నేరుగా మెడికల్‌ రిపోర్ట్‌ వెళ్లిపోతే... భలే ఉంటుంది కదూ..! బహుశా ఓ పది... మహా అంటే పదిహేనేళ్ల తర్వాత ఇది నిజమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ఇవే కాదు, మన నిత్యజీవితంలో ఇంకా చాలా పనులు పూర్తిగా మారిపోతాయట..! 2037 నాటి ప్రపంచం ఎలా ఉండబోతోందన్న విషయంపై విభిన్న రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలన్నిటినీ క్రోడీకరిస్తే... ఇదిగో, ఇలా ఉంటుంది... రండి ఓసారి భవిష్యత్తులోకి అలా తొంగి చూసొద్దాం..!

వి నెమ్మదిగా కళ్లు తెరిచాడు. అతడిని నిద్ర లేపడానికి ఆ స్మార్ట్‌ ఇల్లు పదినిమిషాలు కష్టపడాల్సి వచ్చింది. ఇల్లు కష్టపడటమేంటంటారా..! రవి లేవాల్సిన సమయాన్ని గుర్తించి కిటికీల తెరలు వాటంతటవే తెరుచుకున్నాయి. తెరుచుకున్నాయి అనేకంటే తెరుచుకున్న ఫీలింగ్‌ లోపలవున్నవాళ్లకి కలిగేలా ప్రవర్తించాయి- అంటే సరిపోతుంది. బయట వాతావరణమేమో మబ్బుపట్టి మసక మసగ్గా ఉంది. కానీ నిద్రపోతున్నవారికి తెల్లవారిన అనుభూతి కలగాలంటే సూర్యుడి లేలేత కిరణాల వెలుగు కనిపించాలి. అందుకని బయట సూర్యుడు లేకపోయినా కిటికీ తెరలు ఆ బాధ్యత తీసుకున్నాయి. కృత్రిమమేధ సాయంతో నిదానంగా గదిలో పగటి వెలుతురు పరుచుకుంది.

రవి ఒళ్లు విరుచుకుంటూ లేచాడు. ఫోన్‌ మంద్రంగా సంగీతాన్ని వినిపిస్తూ గుడ్‌ మార్నింగ్‌ చెప్పింది. రవి బాత్‌రూమ్‌లోకి వెళ్లి బ్రష్‌ చేసుకుంటూ అద్దంలో ఉదయం వార్తలన్నీ విన్నాడు. అంటే- టీవీలో వచ్చిన వార్తలకే అద్దం ప్రొజెక్టరులా పనిచేసిందన్నమాట. మనిషి ఎక్కడ ఉంటే అక్కడ వార్తలు తెలుసుకోవడానికి వీలుగా ఇలా కొన్ని వస్తువులు ఆటోమేటిక్‌గా కొత్త పనిలోకి మారిపోతుంటాయి ఆ స్మార్ట్‌ హౌస్‌లో. బాత్‌రూమ్‌ నుంచి బయటకు వచ్చేసరికి బాల్కనీలో చప్పుడైంది. చూస్తే కాఫీ టిఫిన్ల పార్సిల్‌ని డ్రోన్‌ డెలివరీ చేసి వెళ్లింది. వాటిని లోపలికి తెచ్చుకున్నాడు. ఒకవేళ ఇంట్లో చేసిన ఫిల్టర్‌ కాఫీ కావాలన్నా ఒక్కమాట చెబితే చాలు ఫ్రిజ్‌లో ఉన్న రెడీమేడ్‌ డికాక్షన్‌తో క్షణాల్లో తయారుచేసిస్తుంది అతడి రోబో అసిస్టెంట్‌. ఆ ఇంట్లో ఉన్న పరికరాలన్నీ వైఫైతో అనుసంధానమై ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ పనులన్నీ చేసేస్తాయి.

రాత్రి తుపాను వచ్చినట్లుంది. అసలు కరెంటు ఉందో లేదో, గరాజ్‌లో ఉన్న తన రెండు ఎలక్ట్రిక్‌ కార్లూ చార్జి అయ్యాయో లేదో అన్న అనుమానం వచ్చింది రవికి. అది ఒక్క క్షణమే. కరెంటు సరఫరాకి అంతరాయం కలగలేదని అలెక్సా నిర్ధారించింది. ఒకవేళ పొరపాటున ఏ కారణంగానైనా ఇంటికి కరెంటు సరఫరా నిలిచిపోతే ఆ కార్లే జనరేటరుగా మారి ఇంటికి కరెంటుని ఇస్తాయి. కాబట్టి కరెంటు పోతుందన్న భయమే లేదు. అయినా చిన్నప్పటి అనుభవాలు రవిని వదలడం లేదు. కరెంటు పోతే తను క్యాండిల్‌ దగ్గర హోంవర్కు చేసుకోవడం అతడికి బాగా గుర్తు. ఆ తర్వాత మాత్రం ఏం మారిందీ... విద్యుత్‌ వాహనాలు రోడ్డు మీదికి వచ్చాయన్న మాటే కానీ డ్రైవర్లకి నిత్యం ఆందోళనే. ఎప్పుడు చార్జింగ్‌ అయిపోతుందో, దగ్గర్లో చార్జింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందోనని తెగ టెన్షన్‌ పడుతుండేవారు. ఇప్పుడో... ఎక్కడ పడితే అక్కడ ఫాస్ట్‌ చార్జింగ్‌ సెంటర్లు. స్కూటర్లనుంచి ట్రక్కుల వరకూ ఏ వాహనానికైనా పనికొస్తాయి. అంతేకాదు, కావాల్సినచోటికి వచ్చి చార్జింగ్‌ చేసిపెట్టే మొబైల్‌ చార్జర్లూ ఉన్నాయి. అసలు చాలా దుకాణాలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఫ్రీచార్జింగ్‌ సదుపాయమూ కల్పిస్తున్నాయి. దాంతో ఇప్పుడు చార్జింగ్‌ సమస్యే కాదు.

స్నానంతోపాటే స్కానింగ్‌..!

టిఫిన్‌ తిని ఇవాళ్టి ఆఫీసు పని షెడ్యూల్‌ ఏమిటో చూసుకున్నాడు రవి. ఇంటినుంచే పని పూర్తి చేయొచ్చనిపించింది. అయితే స్నానం చేసేటప్పుడు ఆటోమేటిగ్గా అయ్యే బాడీ స్కానింగ్‌, షేవింగ్‌ చేసుకునేటప్పుడు అద్దం తీసిన ఫేస్‌ స్కానింగ్‌, అతడి భావోద్వేగాలను గమనిస్తూ ఉండే మూడ్‌ మానిటర్స్‌... అన్నీ ఏం చెబుతున్నాయంటే- కళ్లకింద చర్మం వదులై సంచుల్లా తయారవబోతోందనీ, ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలనీ. అంతేకాదు, వాతావరణంలో మార్పు అవసరమనీ సూచించాయి  కాబట్టి ఆఫీసుకు వెళ్లడమే మంచిది. అందుకని ఆ రిపోర్టులన్నిటినీ మరోసారి పరీక్షించి బయటి వాతావరణాన్నీ, ట్రాఫిక్‌నీ, అతడి ఆరోగ్యాన్నీ పోల్చి చూసి ఏ సమయంలో అతడు ఆఫీసుకు బయల్దేరి వెళ్లాలో నిర్ణయిస్తుంది ఇల్లు.

అంతేకాదు, బయటి వాతావరణాన్ని గమనించి ఆరోజు కరెంటుకి డిమాండు ఎంతుంటుందో చెప్పగలదు ఆ సూపర్‌ స్మార్ట్‌ ఇల్లు. ఒకవేళ బయట డిమాండ్‌ ఎక్కువుంటే రవి తన ఎలక్ట్రిక్‌ కారుని వాడకుండా ఆ కరెంటుని గ్రిడ్‌కి అమ్ముకోవచ్చు. ఆఫీసుకు వెళ్లడానికి ఒక చిన్న వాయిస్‌ కమాండ్‌తో ఇంటి ముందుకు ట్యాక్సీ తెప్పించుకోవచ్చు. డ్రైవరు అవసరం లేకుండా నడిచే అటానమస్‌ కార్లే ట్యాక్సీలుగా అందుబాటులో ఉన్నాయి. అది చవకేమీ కాదు కానీ, ట్రాఫిక్‌ గొడవ లేకుండా ప్రత్యేకమైన లేన్‌లో హాయిగా వెళ్లిపోడానికి ఆమాత్రం పెట్టొచ్చనుకుంటాడు రవి. అసలు కార్ల టెక్నాలజీనే బాగా అభివృద్ధి చెందింది. స్మార్ట్‌ఫోనూ కారూ కలిసిపోయాయి. అవును, ఆపిల్‌ కూడా ఐ-కార్‌ తెచ్చింది మరి. ఇప్పుడసలు కారులో కూర్చుని చేయలేని పని లేదు. అలాగని అన్నిరకాల సాంకేతికతలతో ఉన్న కారు కొనడం మామూలు విషయమేమీ కాదు. మొట్టమొదట కొనుక్కున్న హైఎండ్‌ కారుకి- రవి దాదాపు ఇంటికి పెట్టినంత ధర పెట్టాడు. గతంలోలాగే ఇప్పుడూ సంపన్నులకీ, సాధారణ మధ్య తరగతి వారికీ విలాస వస్తువుల విషయంలో తారతమ్యం కొనసాగుతూనే ఉంది. విద్యుత్‌ వాహనాల ధర ఎంత తక్కువగా ఉన్నా దాన్ని అందుకోలేని వాళ్లూ సమాజంలో ఉన్నారు. కొందరు కారన్నా కొనగలరు కానీ పార్కింగ్‌ స్థలాన్ని కొనలేరు. అలాంటివారు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్‌వీ హైడ్రోజెన్‌తో నడిచేవీ బస్సులూ ట్రైన్లూ నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. చిన్నప్పుడు అమ్మ ఆఫీసుకు బస్సులో వెళ్లి వస్తూ ఆ తిప్పల గురించి కథలు కథలుగా చెప్పడం తరచూ గుర్తొస్తుంది రవికి. దాంతో పోలిస్తే ఇప్పుడు ప్రజా రవాణా వందల రెట్లు మెరుగైనట్లు. ఆలోచనల్లో పడిన రవికి ఆఫీసుకు బయల్దేరమంటూ సంకేతం ఇచ్చింది చేతిలోని ఫోను.

తెలివైన కారు

రవి గరాజ్‌కి వెళ్లాడు. ట్రాఫిక్‌ స్మూత్‌గా ఉందని అలెక్సా చెప్పేసరికి అతడు తనకిష్టమైన ఎస్‌యూవీ తీశాడు. దాన్ని డ్రైవ్‌ చేయొచ్చు, అవసరం అయితే ఆటోపైలట్‌ మోడ్‌లోనూ పెట్టొచ్చు. అప్పుడది డ్రైవరుతో పని లేకుండా అటానమస్‌ కారులాగా తనంతట తనే వెళ్లిపోతుంది. రోడ్డెక్కాక ఆ పని చేసి, సీట్లో వెనక్కివాలి ఆఫీసుకు వెళ్లగానే హాజరవ్వాల్సిన మీటింగ్‌కి అవసరమైన సమాచారాన్ని చదువుకున్నాడు రవి. వరసగా వెళ్లే కార్లన్నీ ముందూ వెనకా ఉన్న కార్లతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా ఒకదాన్ని ఒకటి తాకకుండా సిగ్నల్స్‌ చూసుకుంటూ సాఫీగా ప్రయాణిస్తున్నాయి. ఈసారి కొనుక్కోబోయే కారు ఇలా కాకుండా అచ్చంగా అటానమస్‌ మోడల్‌ కొనుక్కోవాలనుకున్నాడు రవి. అందులో అసలు స్టీరింగ్‌ కూడా ఉండదు. ఇంటీరియర్‌ అంతా ఆఫీసు పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రోడ్డు మీద వాటికోసం ప్రత్యేకంగా లేన్‌ ఉంటుంది. రోడ్డువైపు చూసే పని లేకుండా ఇంటి నుంచి ఆఫీసుకు నిమిషాల్లో చేరుకోవచ్చు. పార్కు చేయాల్సిన పనీ ఉండదు. రవిని గుమ్మం ముందు దించి కారు తనంతట తానే పార్కింగులో తన చోటు వెతుక్కుని ఆగుతుంది. అంతేకాదు, తనని ఆఫీసులో దించాక స్కూలుకెళ్లి పిల్లాడిని ఇంటి దగ్గర దించిరమ్మని చెబితే ఆ పనీ చేసి బుద్ధిగా తిరిగొచ్చే కారుకోసం ఎంత ఖర్చయినా పెట్టొచ్చంటాడు రవి. అందుకుగాను నెలనెలా ప్రభుత్వానికి కట్టే బిల్లు పెరిగినా పర్వాలేదట. ప్రతి కారూ ఏ లేన్‌లో ఏ సమయంలో ఎంతసేపు ఎన్ని మైళ్లు ప్రయాణించిందీ, దాని నుంచి ఎంత కాలుష్యం వెలువడిందీ... అన్నీ ఆటోమేటిగ్గా రికార్డవుతాయి. వాటి ఆధారంగా నెలనెలా వచ్చే బిల్లు కట్టాలి. పొరపాటున అది కట్టకపోతే కారు మళ్లీ రోడ్డెక్కడానికి వీలుండదు.

ఎంత మార్పు

తన చిన్నప్పటికీ ఇప్పటికీ ఎంతగానో మారిన వాహనాల వాడకం విషయం ఆలోచించినప్పుడల్లా రవికి ఆశ్చర్యంగా అన్పిస్తుంది. తనని స్కూల్లో దించడానికి తీసుకెళ్తూ తండ్రి స్కూటర్లో పెట్రోల్‌ పోయించడం, ఆ వాసనా, డుగ్‌ డుగ్‌ మన్న శబ్దమూ అతడికి తరచూ జ్ఞాపకమొస్తాయి. ఆ విషయాల గురించి చెబితే అతడి కొడుకూ కూతురూ విసుక్కుంటారు. కాస్త వాసన వచ్చినా, పొగ కనపడినా ‘అమ్మో పొల్యూషన్‌’ అంటూ కంగారు పడిపోయే తరం ఇది. అదే ఎలన్‌ మస్క్‌ హైపర్‌లూప్‌ గురించీ, ఎగిరే కార్ల గురించీ ఆరోజుల్లో తాము ఎలా ఊహించుకునేవారో తండ్రి చెబుతుంటే మాత్రం ఆసక్తిగా వింటారు. మస్క్‌కి మార్స్‌ మీద ఇష్టం పెరిగి హైపర్‌లూప్‌ని కొన్నిచోట్ల మాత్రమే కట్టి వదిలేశాడనీ, ఎగిరే కార్లు అనుకున్న స్థాయిలో వినియోగంలోకి రాలేదనీ తెలుసుకుని ఆశ్చర్యపోతారు. పిల్లలూ భార్యా గుర్తొచ్చేసరికి రవికి బెంగగా అనిపించింది. ఈసారి సెలవు పెట్టి ఒక వారం అక్కడే ఉండాలనుకున్నాడు. సాఫ్ట్‌వేర్‌ సంస్థలన్నీ తమ ఆఫీసుల్ని ఎలాంటి కాలుష్యాలూ లేని స్మార్ట్‌ సిటీల్లో పెట్టాయి. రవి భార్య పనిచేసే కంపెనీ మరో నగరంలో ఉంటుంది. రవి కూడా మొదట అక్కడే ఉండేవాడు కానీ ఈమధ్యే వాళ్ల కంపెనీ కొత్త శాఖని ప్రారంభించి అతణ్ణి ఇక్కడికి బదిలీ చేసింది. దాంతో కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటూ వారాంతాల్లో వెళ్లివస్తున్నాడు.

కారూ ఇల్లే... సర్వస్వం

ఆఫీసులో మీటింగ్‌ అయిపోగానే లంచ్‌ చేసి పనిలో నిమగ్నమైన రవిని కంప్యూటర్‌ ఇంటికి వెళ్లే టైమ్‌ అయిందని హెచ్చరించింది. బయల్దేరుతున్నానని చెప్పాడు. డెస్క్‌టాప్‌ ఆటోమేటిక్‌గా స్లీప్‌ మోడ్‌లోకి మారిపోయింది. లైట్లన్నీ ఆరిపోయాయి. ఏసీ ఆగిపోయింది. రవి బయటకు వచ్చి కారు ఎక్కి కూర్చుని సీట్‌బెల్ట్‌ పెట్టుకున్నాక ఆటోపైలట్‌లోకి మార్చాడు. అలెక్సాకి డిన్నర్‌ ఆర్డర్‌ చేయమని చెప్పి సీట్లో వెనక్కి వాలాడు. కారు ఇంటికి చేరేసరికి ఏడంబావు అవుతుందనీ, ఏడున్నరకల్లా డ్రోన్‌ డిన్నర్‌ని డెలివరీ చేస్తుందనీ అలెక్సా చెప్పింది. రెగ్యులర్‌గా అతడు డిన్నర్‌ తెప్పించుకునే రెస్టరెంట్‌లో రోబోలే పదార్థాలన్నీ తయారుచేస్తాయి. ప్యాక్‌ చేసి డ్రోన్లతో పంపించేదీ అవే.

రవి పెట్టుకున్న స్మార్ట్‌ సీట్‌ బెల్ట్‌ ఈలోపల అతడి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు అతడిని డిస్టర్బ్‌ చేశాయి. బీపీ కాస్త ఎక్కువున్నట్లు మానిటర్‌ చూపిస్తోంది. దాంతో కారులో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మనసుని సాంత్వన పరిచేలా లేత నీలిరంగు కాంతి వ్యాపించింది. ఏసీనుంచి వచ్చే గాలి- మల్లెలూ నిమ్మ పరిమళాలను నింపుకుని రావడం మొదలెట్టింది. సీట్‌ తనంతటతాను సర్దుకుని అతడి వెన్నెముకని మర్దనా చేస్తోంది. కాసేపట్లో సాధారణ పరిస్థితి రాకపోతే వెంటనే అతడి వ్యక్తిగత వైద్యుడికి సమాచారం వెళ్లిపోతుంది. అలెక్సా అతనికి ఇష్టమైన పాటలు ప్లే చేస్తోంది. ఆ పాటలు వింటూ రవి మళ్లీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోయాడు. రేడియో, టేప్‌ రికార్డరు లాంటి పరికరాలే కాదు, ఇంట్లోనూ ఆఫీసులోనూ వ్యక్తిగత సహాయకుడిలా... ఎన్నో ప్రాతలు పోషిస్తున్న అలెక్సా లాంటి వర్చువల్‌ అసిస్టెంట్లు ఇప్పుడు అసలు సెర్చింజన్లతో పనిలేకుండా చేసేయడం అతడికి అబ్బురంగా ఉంటుంది. నాలుగు పదుల తన జీవితకాలం లోనే ఇన్ని మార్పులు చూస్తే రేపు తన పిల్లలు మరెన్ని చూస్తారో అన్న ఆలోచన రాగానే అతడి పెదవులు చిరునవ్వుని అద్దుకున్నాయి. బీపీ నార్మల్‌కి వచ్చింది. కారులో పసుపుపచ్చని కాంతి పరుచుకుంది.

*  *  * 

ఇదంతా ఊహించుకుంటుంటే ఏదో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలాగా అనిపిస్తోందా..! కారూ కరెంటూ కంప్యూటరూ కూడా ఒకప్పుడు అందమైన ఊహలే. అవి ఆలోచనలుగా మనసును తొలిచేసి, పరిశోధనలుగా ప్రాణం పోసుకుని, ఆవిష్కరణలుగా మన ముందు నిలిచాయి. పైన చెప్పుకున్న మార్పులైనా అంతే. నేడో రేపో నిజమై తీరతాయి. మరి... ఆ సూపర్‌ స్మార్ట్‌ ప్రపంచానికి మనమూ ఫాస్ట్‌గా రెడీ అయిపోదామా..?


ఇంకా ఎన్నో..!

కటి రెండు దశాబ్దాల్లో మన జీవనశైలే పూర్తిగా మారిపోతుందంటున్నారు నిపుణులు.

* ఇంట్లో బెడ్‌రూమూ డ్రాయింగ్‌ రూమూ అంటూ వేర్వేరుగా ఉండవు. చిన్న ఇంట్లోనే ఫర్నిచర్‌ అంతా అవసరానికి అనుగుణంగా మారిపోతుంది. నిద్ర లేవగానే బెడ్‌ కాస్తా సోఫాగా, బెడ్‌సైడ్‌ టేబుల్‌ డైనింగ్‌ టేబుల్‌గా మారిపోతాయి. అనవసరమైన వస్తువు ఏదీ ఇంట్లో ఉండదు.

* రోజంతా పనిచేసి అలసి వచ్చిన మనిషి హాయిగా పడుకుని బాగా నిద్రపోతేనే విశ్రాంతి లభిస్తుంది. అందుకు స్మార్ట్‌ పరుపు తోడ్పడుతుంది. అందులో ఉన్న సెన్సార్లు శరీరంలో ఏ భాగం ఒత్తిడికి లోనైందో తెలుసుకుని దానికి సాంత్వన కలిగేలా మర్దన చేస్తాయి. శరీర ఉష్ణోగ్రతనీ గుండె వేగాన్నీ నియంత్రిస్తాయి. ఎంతసేపు ఎంత గాఢంగా నిద్రపట్టిందీ లాంటి సమాచారమంతా రికార్డవుతుంది. దాని ఆధారంగా ఆహారం, వ్యాయామాల్లో చేయాల్సిన మార్పులేమిటో ఫోనులో మెసేజ్‌ వచ్చేస్తుంది.

* నేలంతా రసాయనాలూ క్రిమిసంహారకాలతో సాగుకు పనికిరాకుండా పోవడంతో ధాన్యంతో సహా కూరగాయలూ పండ్లూ అన్నీ భవనాల మీద వర్టికల్‌, హైడ్రోపోనిక్‌ విధానాల్లో సాగుచేస్తారు. కోళ్ల ఫారాలూ చేపలచెరువులూ ఉండవు. మాంసాహారం అంతా లేబొరేటరీలో తయారుచేసిందే సూపర్‌మార్కెట్లలో అమ్ముతారు.

* తాళమూ తాళం చెవీ మ్యూజియంలోకి వెళ్లిపోతాయి. ఏ పరికరాన్నైనా డిజిటల్‌ కీస్‌, డిజిటల్‌ లాక్‌తోనే లాక్‌ చేసుకోవచ్చు, మామూలు తాళం అక్కర్లేదు. ఒకవేళ ఫోన్‌ పోతే మరో
ఫోన్‌ నుంచి ఫేస్‌ ఐడీ సాయంతో మీ ఫోన్‌కి లాగిన్‌ అయి డిజిటల్‌ కీస్‌ మార్చేయొచ్చు. అప్పుడది ఎవరికీ పనిచేయదు. కాబట్టి చోరీలు తగ్గిపోతాయి.

* మామూలు కళ్లద్దాలే అవసరాన్ని బట్టి వర్చువల్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీ అద్దాలుగా మారిపోతాయి. వాటితో ఆన్‌లైన్‌ షాపింగూ చేయవచ్చు, ఆహ్లాదకరమైన పార్కులో కాసేపు తిరిగొచ్చిన అనుభూతీ పొందవచ్చు.

* ప్రతి ఇంట్లోనూ గరాజ్‌లో ఒక బ్యాటరీ ఉంటుంది. సోలార్‌ పవర్‌ని అందులో నిల్వ చేసుకోవచ్చు. భారీ తుపాన్‌ వచ్చి ఒకటి రెండు రోజులపాటు కరెంటు సరఫరాకి అంతరాయం కలిగినా ఇబ్బంది ఉండదు.

* మందులూ వైద్యచికిత్సలూ అన్నీ కస్టమైజ్‌ అయిపోతాయి. వ్యక్తుల శరీరతీరును బట్టి మందుల మిశ్రమాలను కలిపి ఇస్తారు.

* అవయవాల మార్పిడి అవసరమైనప్పుడు దాతలు దొరికేదాకా వేచి ఉండక్కర్లేేదు. గుండె, కాలేయం, క్లోమగ్రంథి... అన్నీ ల్యాబ్‌లో తయారవుతాయి.

* కరెన్సీ నోట్లు- సేకర్తల దగ్గర తప్ప బయట కనపడవు.


రిహార్సల్స్‌ మొదలయ్యాయి..!

గూగుల్‌ మాతృసంస్థ అల్ఫాబెట్‌కి ‘వింగ్‌’ అనే డ్రోన్‌ డెలివరీ కంపెనీ ఉంది. భవిష్యత్తులో అన్నీ డ్రోన్‌లే డెలివరీ చేస్తాయని నమ్ముతున్న ఆ కంపెనీ చాలాకాలంగా అందుకు రిహార్సల్స్‌ చేస్తోంది. ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో 2020 ఏప్రిల్‌లో మొదటిసారి బ్రాహ్‌ అనే కాఫీ కంపెనీతో కలిసి వర్జీనియాలో తెల్లవారుతూనే కాఫీ, పేస్ట్రీలను ప్యాక్‌ చేసి హోం డెలివరీ చేసింది. కాఫీ ఏమాత్రం తొణక్కుండా వేడి తగ్గకుండా డెలివరీ చేయగలిగామని ప్రకటించింది. కాఫీలూ పేస్ట్రీలూ కప్‌కేకులూ ఆర్డర్లు తీసుకుని పంపుతున్న కంపెనీ ఇప్పటివరకు తమ డ్రోన్లు గాలుల్నీ కొద్దిపాటి వానల్నీ కూడా తట్టుకుని వెళ్తున్నాయని చెబుతోంది.

పిన్నీసుల దగ్గర్నుంచి ప్లాటినం నగల దాకా అన్నిరకాల వస్తువుల్నీ డోర్‌ డెలివరీ చేసే అమెజాన్‌- డ్రోన్లని ఉపయోగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఒక జపాన్‌ టెక్నీషియన్‌కి. వెంటనే ఆ ఐడియాని వీడియోగా చేసి ఇంటర్నెట్లో పెట్టేశాడు. లాక్‌హీడ్‌ మార్టిన్‌ హైబ్రిడ్‌ ఎయిర్‌షిప్‌ ఒకటి ప్రధాన మార్గంలో వెళ్తూ ఉంటుంది. దాంట్లో నుంచి చిన్న చిన్న డ్రోన్లు పాకెట్లతో బయటకు వచ్చి వీధుల్లోకి వెళ్లి డెలివరీ చేసి మళ్లీ ఎయిర్‌షిప్‌లోకి వచ్చేస్తుంటాయి. అంటే వందలాది డెలివరీలను ఒకేసారి చేసేయొచ్చన్నమాట. బయటకు వెల్లడి చేయడంలేదు కానీ అమెజాన్‌ ఈ ఆలోచనని అభివృద్ధిచేస్తూ ఉండి ఉంటుందన్నది నిపుణుల అంచనా.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts