Updated : 10 Oct 2021 06:38 IST

అదానీ సంపాదన గంటకు రూ.42 కోట్లు!

ఓ కప్పు కాఫీ తాగడానికి కనీసం అయిదు నిమిషాలు పడుతుంది. సినిమాకెళ్తే తెలీకుండానే రెండు మూడు గంటలు గడిచిపోతాయి. మరి మీకు తెలుసా... ఆ కొద్ది సమయంలోనే మనదేశంలోని అత్యంత ధనవంతులు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించేస్తున్నారని. భారత్‌లో తొలి పదిస్థానాల్లో ఉన్న కుబేరుల ఆదాయం గంట గంటకూ ఎంతెంత పెరిగి పోతోందో ఓసారి మీరూ చూడండి!

డు లక్షల పద్దెనిమిదివేల కోట్ల రూపాయలు... ఇదేదో దేశ బడ్జెట్‌ కాదు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబం ఆస్తి విలువ. అందుకే, ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా 2021 సంవత్సరానికి గానూ విడుదల చేసిన అత్యంత సంపన్నులైన భారతీయుల లిస్టులో వరుసగా పదోసారి తొలిస్థానం దక్కించుకున్నాడాయన. మనదేశంలోనే కాదు, ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడైన వ్యక్తి కూడా ముకేశ్‌ అంబానీనే. గత ఏడాది కాలంగా ఆయన సంపాదన రోజుకి రూ.163 కోట్లు పెరుగుతూ వచ్చింది. అంటే ప్రతి గంటకూ అంబానీ ఖాతాలో చేరుతున్న మొత్తం రూ.6.8 కోట్లకు పైమాటే.


గౌతమ్‌ అదానీ...గంటకు రూ.42 కోట్లు!

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ఎంతోమంది ఉద్యోగాలు పోయాయి. ఎన్నో వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కానీ ఇలాంటి సమయంలోనూ గౌతమ్‌ అదానీ కుటుంబం ఆస్తులు మాత్రం 261 శాతం పెరిగాయి. 2020 హురున్‌ లిస్టులో అదానీ సంపద 1.4 లక్షల కోట్ల రూపాయలు ఉండగా ప్రస్తుతం అది రూ.5.05 లక్షల కోట్లకు ఎగబాకింది. అంటే, గత ఏడాది గౌతమ్‌ అదానీ ఆదాయం గంటకు దాదాపు రూ.42 కోట్లు. రోజుకి రూ.1002 కోట్లు. అందుకే, అదానీ భారత్‌తో పాటు, ఆసియాలోనే అత్యంత ధనవంతుల లిస్టులో రెండోస్థానంలో నిలిచారు.


శివ్‌నాడార్‌... రూ.11 కోట్లు!

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌ అధినేత శివ్‌నాడార్‌ కుటుంబ సంపద గత ఏడాది కాలంగా రోజుకి 260 కోట్లు పెరుగుతోంది. ఆ లెక్కన ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి గంటకూ ఆయన ఆస్తుల ఖాతాలోకి సుమారు రూ.11 కోట్లు చేరిపోతుంటాయన్నమాట. శివ్‌నాడార్‌ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.2.36 లక్షల కోట్లకు పైమాటే.


ఎస్పీ హిందుజా... రూ.9 కోట్లు!

హిందుజాగ్రూపుకి చెందిన అశోక్‌ లేల్యాండ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లు గతేడాది రాబట్టిన ఉత్తమ ఫలితాల కారణంగా వాటి షేర్లు వరుసగా 74%, 61% చొప్పున పెరిగాయి. ఇంకేముందీ... హిందుజా కుటుంబం ఆస్తుల విలువ ప్రతి గంటకూ సుమారు రూ.9 కోట్లు చొప్పున రోజుకి 209 కోట్ల రూపాయలు పెరుగుతూ రూ.2.20 లక్షల కోట్లకు చేరింది.


లక్ష్మీ మిట్టల్‌... రూ.13 కోట్లు!

ప్రపంచంలోనే అతిపెద్ద స్టీలు ఉత్పత్తి కంపెనీ అయిన ఆర్సెలర్‌ మిట్టల్‌కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ అయిన లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ కుటుంబం సంపద విలువ రోజుకి రూ.312కోట్లు పెరిగిపోతోందట. ఉక్కుకి గిరాకీ ఎక్కువవడం, ఆ వెనకే ధరలు బాగా పెరగడంతో ఆ కంపెనీ షేర్లు మూడింతలై గతేడాదిలోనే మిట్టల్‌ సంపద 187శాతం పెరిగి రూ. 1.74 లక్షల కోట్లకు చేరింది. ఆ లెక్కన ప్రతి అరవై నిమిషాలకూ రూ.13 కోట్లు పోగైనట్లేనన్నమాట.


సైరస్‌ పూనావాలా... రూ.8కోట్లు!

కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ని తయారుచేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత సైరస్‌ ఎస్‌ పూనావాలా సంపద ఏడాదిగా ప్రతి గంటకూ దాదాపు రూ.8కోట్లు పెరుగుతోందట. మొత్తం సంపద రూ.1.63 లక్షల కోట్లు.


రాధా కిషన్‌ దమానీ... రూ.7.6 కోట్లు!

డి-మార్ట్‌... అందరికీ తెలిసిన పేరే. చిన్న పట్టణాల్లోనూ విస్తరించిన ఈ దుకాణాలు ప్రజల్లో అంతగా ప్రాచుర్యం పొందాయి. అందుకే, వాటి షేర్లూ ఒక్కసారిగా 500శాతం పెరిగాయి. ఫలితంగా- దాని అధినేత రాధా కిషన్‌ దమానీ ఆస్తిలో గంట గంటకూ రూ.7.66 కోట్లు చేరిపోయాయి. ఆయన మొత్తం సంపద విలువ రూ.1.54 లక్షల కోట్లు. ఇలాగే... గౌతమ్‌ అదానీ తమ్ముడైన వినోద్‌ శాంతీలాల్‌ అదానీ అత్యంత సంపన్నులైన భారతీయుల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉండగా ఆయన సంపాదన ప్రతి గంటకూ రూ.10.2 కోట్లు పెరుగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో ఉన్న కుమార మంగళం బిర్లా గంటకు రూ.10 కోట్లు సంపాదిస్తుండగా స్కేలర్‌ కంపెనీ అధినేత జయ్‌చౌదరి ప్రతి అరవై నిమిషాలకూ రూ.6.37 కోట్లు ఆర్జిస్తున్నారు.


చాలామంది జీవితాంతం కష్టపడినా రాని కోట్లు వీళ్లు గంటలో సంపాదిస్తున్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ..!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని