Updated : 27 Jun 2021 06:52 IST

బ్రాడ్‌మన్‌ బ్యాట్‌... పుణెలో చూడొచ్చు!

ఆస్ట్రేలియన్‌ బ్యాటింగ్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ ఆడిన బ్యాట్‌ చూడాలనుకుంటున్నారా..? సచిన్‌ తెందూల్కర్‌ జెర్సీ, మొదటి డే/నైట్‌ టెస్టులో వాడిన పింక్‌ బాల్‌... ఇవి మాత్రమే కాదు, క్రికెట్‌ దిగ్గజాలు వినియోగించిన వస్తువులు వేల సంఖ్యలో పుణెలోని ‘బ్లేడ్స్‌ ఆఫ్‌ గ్లోరీ’ క్రికెట్‌ మ్యూజియంలో దర్శనమిస్తాయి!

రోహన్‌ పాటే... అండర్‌-19 వరకూ మహారాష్ట్ర జట్టు తరఫున క్రికెట్‌ ఆడాడు. తర్వాత అతడికి అవకాశాలు రాలేదు. కానీ క్రికెట్‌పైన ప్రేమ మాత్రం తగ్గలేదు. టీమ్‌ ఇండియా ఎక్కడ పర్యటించినా అక్కడ వాలిపోయేవాడు. అలా వెళ్లినపుడు లండన్‌లోని లార్డ్స్‌ మైదానంలోని ఎమ్‌సీసీ మ్యూజియాన్నీ, ఆస్ట్రేలియాలోని బ్రాడ్‌మన్‌ మ్యూజియాన్నీ చూశాడు. రోహన్‌కి అవి క్రికెట్‌ దేవాలయాలుగా తోచాయి. క్రికెట్‌ను భక్తిగా కొలిచే ఇండియాలో అలాంటి దేవాలయాలు లేవనిపించి తానే ఏర్పాటుచేయాలనుకున్నాడు.  

సచిన్‌ బ్యాట్‌తో మొదలు...
రోహన్‌ కుటుంబం పుణెలో స్థిరాస్తి వ్యాపారం చేస్తోంది. తండ్రితో చెప్పి దాని ప్రచారకర్తగా 2010లో సచిన్‌ని నియమించాడు రోహన్‌. అలా చేస్తే సంస్థకు ప్రచారం దొరకడంతోపాటు తనకు సచిన్‌తో పరిచయం ఏర్పడుతుందనేది అతడి ఆలోచన. మాస్టర్‌ బ్లాస్టర్‌తో పరిచయమయ్యాక ఓ బ్యాట్‌ సంపాదించాలనుకున్నాడు. రోహన్‌ అది వరకు సచిన్‌ బ్యాట్‌ని వేలంలో కొనాలని చూశాడు కానీ వీలు పడలేదు. సచిన్‌తో పరిచయమయ్యాక తనకు పాత బ్యాట్‌ కావాలని రోహన్‌ అడిగినపుడు కాదనకుండా బ్యాట్‌ ఇచ్చాడు. ‘సచిన్‌ బ్యాట్‌ సంపాదించానంటే, ప్రపంచంలో ఇక ఏ క్రికెటర్‌ వస్తువులనైనా సంపాదించగలనన్న నమ్మకం వచ్చింది. ఆ తర్వాత నుంచి క్రీడా పరికరాల్ని సేకరించడం మొదలుపెట్టా’ అంటాడు రోహన్‌. అలా సేకరించిన 600 వస్తువులతో 2012లో ‘బ్లేడ్స్‌ ఆఫ్‌ గ్లోరీ’ మ్యూజియం ప్రారంభించాడు. పుణెలో ఉన్న ఈ మ్యూజియంలో క్రికెట్‌ దిగ్గజం డొనాల్డ్‌ బ్రాడ్‌మన్‌ బ్యాట్‌, మొదటి డే/నైట్‌ టెస్టులో వాడిన పింక్‌ బాల్‌, వివిధ దేశాలకు ప్రపంచకప్‌ గెల్చిన జట్టులోని ఆటగాళ్లు సంతకం చేసిన బ్యాట్‌లూ, జెర్సీలూ... టెస్టుల్లో 10వేలకుపైగా పరుగులు చేసిన బ్రియాన్‌ లారా, జాక్వెస్‌ కలిస్‌ లాంటి ఆటగాళ్లకు చెందిన క్రికెట్‌ బ్యాట్లూ కనిపిస్తాయి. ఇవి కాకుండా వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లు సంతకాలు చేసిన బ్యాట్‌లూ, బంతులూ, స్టంపులూ, హెల్మెట్‌లూ ఉంటాయి. సచిన్‌, విరాట్‌ కొహ్లీలకు ఈ మ్యూజియంలో ప్రత్యేకమైన విభాగాలు ఉన్నాయి. కపిల్‌దేవ్‌ సాయంతో క్లైవ్‌ లాయిడ్‌, మాల్కమ్‌ మార్షల్‌, డెస్మండ్‌ హేన్స్‌... లాంటి వెనకటి తరం ఆటగాళ్ల జెర్సీలూ, బ్యాట్‌లూ సంపాదించాడు రోహన్‌. ఈ మ్యూజియాన్ని ఇప్పటివరకూ సునీల్‌ గవాస్కర్‌, కపిల్‌ దేవ్‌, రాహుల్‌ ద్రవిడ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లీ, క్లైవ్‌ లాయిడ్‌, ఆండీ రాబర్ట్స్‌, వసీం అక్రమ్‌, ముత్తయ్య మురళీధరన్‌...లాంటి 450కిపైగా అంతర్జాతీయ క్రికెటర్లు సందర్శించారు.
13 లక్షల మంది సామాన్యులూ వెళ్లిచూశారు.

ఇతర నగరాలకూ...

మ్యూజియం నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. వస్తువుల సేకరణకూ ఎంతో శ్రమించాలి. అందుకే క్రికెట్‌ బోర్డులూ, ప్రభుత్వాలే ఆ పనిచేస్తాయి. అలాంటిది రోహన్‌ ఒక్కడే వేల వస్తువుల్ని సేకరించాడు. ‘మ్యూజియం ఏర్పాటు వెనక ఉద్దేశం క్రికెట్‌ దిగ్గజాల్ని గుర్తించడం, వారిని జ్ఞాపకం చేసుకోవడం, ఘనమైన క్రికెట్‌ చరిత్రను భద్ర పరచడమని చెప్పినపుడు చాలామంది సహకరించారు’ అని చెబుతాడు రోహన్‌. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ మ్యూజియాల్లో ఇదొకటి. ఈ మ్యూజియంలో 2000 వస్తువుల్ని మాత్రమే ప్రదర్శనకు ఉంచాడు. తన దగ్గర ఇంకా కొన్ని వేల వస్తువులు ఉన్నాయనీ, వాటితో ముంబయి, దిల్లీ, బెంగళూరుల్లో కూడా మ్యూజియాలు తెరవాలనుకుంటున్నాననీ చెబుతాడు రోహన్‌. ఏంటీ, ఇప్పుడే ఈ మ్యూజియాన్ని చూసేయాలనిపిస్తోందా, కొవిడ్‌ ముప్పు పోయేవరకూ ఆగండి. ఆగలేమనుకుంటే ‘గూగుల్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌’లో కనిపిస్తుంది, చూసేయండి!

 


దూసుకెళ్తాం... అలలమీద!

హుస్సేన్‌ సాగర్‌ని ట్యాంక్‌బండ్‌ పైనుంచో నెక్లస్‌రోడ్డు దగ్గరనుంచో చూస్తే సరస్సు మధ్యలో రెపరెపలాడుతూ తెరచాపలు కనిపిస్తాయి. ఆ పడవలను నడుపుతున్నది ప్రొఫెషనల్‌ క్రీడాకారులు అనుకుంటారెవారైనా. కానీ వాటిని నడిపేది పేదింటి బిడ్డలు. ఖరీదైన ఈ క్రీడలోకి పేద కుటుంబాలకు చెందిన పిల్లలూ అడుగుపెట్టే అవకాశం ఇస్తోంది ‘హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌’. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అలలమీదా దూసుకెళ్తున్నారా పిల్లలు!
మణిదీప్‌... వయసు పదేళ్లు. కూలీ చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న అతడి తల్లిదండ్రులు తమ జీవితంలో వెలుగు రేఖల్ని ఇప్పుడప్పుడే చూస్తారనుకోలేదు. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో వాళ్లబ్బాయి బెంగళూరులోని ఆర్మీ స్పోర్ట్స్‌ స్కూల్‌కి ఎంపికయ్యాడు. అక్కడ చదువుకుంటూనే పది తర్వాత నేరుగా ఆర్మీలో ఉద్యోగిగా చేరుతాడు. మణిదీప్‌తోపాటు నితిన్‌, అభిరామ్‌, హర్షవర్ధన్‌... కూడా ఇదే స్కూల్‌కి ఎంపికయ్యారు. సెయిలింగ్‌లో ప్రతిభ చూపడం ద్వారా వీరికా అవకాశం దొరికింది. జంట నగరాల్లో ఇలాంటి పిల్లలకు సెయిలింగ్‌లో శిక్షణ ఇస్తోంది సుహీమ్‌ షేక్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌. ఐఐటీ మద్రాసులో చదువుకున్న సుహీమ్‌... హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ప్రారంభించాడు. కాలేజీ రోజుల్లో సెయిలింగ్‌లో జాతీయ ఛాంపియన్‌గా నిల్చినా ఆర్థిక భారంతో ఆటకు మధ్యలోనే స్వస్తిచెప్పాడు. అయినా సెయిలింగ్‌ను మర్చిపోలేకపోయాడు. ఈ క్రీడలో ఆర్థికంగా ఉన్నత కుటుంబాలకు చెందినవాళ్లూ, ఆర్మీ, నేవీలకు చెందిన అధికారులూ కనిపిస్తారు. ఆ సంప్రదాయాన్ని మార్చాలనుకున్నాడు సుహీమ్‌.

ముగ్గురితో మొదలు...

తన క్లబ్‌ద్వారా పేద పిల్లలకు అవకాశాలు ఇవ్వాలనుకున్నాడు సుహీమ్‌. 2009లో తన ఆలోచన గురించి అధికారులతో పంచుకుంటే హుస్సేన్‌సాగర్‌ని ఆనుకుని ఉండే సంజీవయ్య పార్క్‌ దగ్గర జెట్టీ కేటాయించారు. జంట నగరాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి సెయిలింగ్‌మీద అవగాహన కల్పించి ఆసక్తి ఉన్నవాళ్లని చేర్చుకోవాలనేది సుహీమ్‌ ప్రణాళిక. కానీ పిల్లల్ని నీటిలోకి పంపడానికి తల్లిదండ్రులు మొదట భయపడ్డారు. వాళ్లతో మాట్లాడి పిల్లలకు ఏం కాదనే భరోసా ఇచ్చాడు సుహీమ్‌. ముగ్గురు విద్యార్థులతో మొదటి బ్యాచ్‌ను ప్రారంభించారు. 7-12 ఏళ్ల వయసు పిల్లలకు పరుగులాంటి శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించి ఎంపికచేస్తారు. వారికి మొదట ఈత ఆపైన పడవ నడపడంలో తర్ఫీదు ఇస్తారు. సెయిలింగ్‌ అంటే నీటి పోటును ఎదుర్కొని, గాలికి అనుకూలంగా పడవను తిప్పగలిగేంత బలం కావాలి. అందుకే పిల్లలకు పోషకాహారాన్నీ అందిస్తారు.
క్లబ్‌ నిర్వహణలో స్వచ్ఛంద సంస్థలూ, స్పాన్సర్లూ, మిత్రులూ సుహీమ్‌కు సాయపడతారు. పిల్లల నుంచి ఫీజు తీసుకోరు. పోటీలకు వెళ్లేందుకు అయ్యే ఖర్చుల్నీ క్లబ్‌ భరిస్తుంది. ఇప్పటివరకూ దాదాపు 700 మంది ఈ క్లబ్‌లో శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం 140 మంది శిక్షణలో ఉండగా వారికోసం 130 పడవలు ఉన్నాయి.  

ఒలింపిక్‌ పతకమే లక్ష్యం...

ఈ యాట్‌ క్లబ్‌కు చెందిన సెయిలర్లు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో 75 వరకూ పతకాలు గెలిచారు. అంతర్జాతీయ పోటీల్లోనూ పాల్గొన్నారు. 15 మంది బాలలు ఆర్మీ, నేవీలు నిర్వహించే స్పోర్ట్స్‌ స్కూల్స్‌కి ఎంపికయ్యారు. ఇంకొందరు  శిక్షకులుగా మారారు. బాలికల కోసం ప్రత్యేకంగా ‘నావికా’ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో భాగంగా శిక్షణకు ఎంపికైన పేదింటి బిడ్డలు ఝాన్సీ, వైష్ణవి ఇటలీలో ఈ జులైలో జరిగే ప్రపంచ సెయిలింగ్‌ ఛాంపియన్‌షిప్‌ అండర్‌-16 విభాగంలో పోటీపడబోతున్నారు. ‘మాకు పిల్లలు లేరు. ఈ పిల్లలే మా కుటుంబం అనుకుంటా. హుస్సేన్‌ సాగర్‌లో నీటి నాణ్యత లేకపోయినా, దాన్నో అడ్డంకిగా భావించకుండా పిల్లలు ముందుకు వస్తున్నారు. నా శిష్యులు ఒలింపిక్‌ పతకం తేవాలనేది జీవిత లక్ష్యం’ అని చెబుతారు సుహీమ్‌. 

- శనిగారపు చందు


మాస్క్‌ ఎలా వచ్చిందంటే...

కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు ఈరోజున అంతా వాడుతోన్న మాస్క్‌ సృష్టికర్త ఎవరో తెలుసా... డా. వూ లీన్‌ టె. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో వైద్య విద్య అభ్యసించిన తొలి చైనీయుడు. 1910-11... ఈశాన్య చైనా అంతా భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించిన రోజులవి. ఏడాది కాలంలో దాదాపు 60 వేల మంది మరణించారు. దీన్నే తరవాత మంచూరియన్‌ ప్లేగ్‌గా పిలిచారు. ఉడుత జాతికి చెందిన మామట్‌ అనే జంతువుల్ని వేటాడి వాటి చర్మాన్ని ఒలిచి విక్రయించేవాళ్లలో దీన్ని మొదటిసారిగా గుర్తించారట. వ్యాధి సోకిన వాళ్లకు వైద్యం చేస్తున్న వైద్యులూ సిబ్బందీ కూడా మరణిస్తున్నారు. దాంతో నాటి కింగ్‌ పాలనా యంత్రాంగానికి ఆ వ్యాధేమిటో ఎలా అరికట్టాలో అర్థం కాలేదు. కేంబ్రిడ్జ్‌ నుంచి వచ్చిన డా. వూ లీన్‌ టేకి ఆ బాధ్యత అప్పగించారు. అంతకుముందు ఐరోపా, ఆసియా దేశాల్ని వణికించిన భయానక బుబానక్‌ ప్లేగు వ్యాధికి కారణమైన యెర్సీనియా పెస్టిస్‌ అనే బ్యాక్టీరియానే దీనికీ కారణమై ఉండొచ్చని భావించాడు వూ. అయితే ఇది ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల శ్వాస ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకుతుందనీ కాటన్‌, గాజు క్లాత్‌ని కలిపి కుట్టిన మాస్క్‌ను ముఖానికి కట్టుకోవడం ద్వారా దీన్ని తగ్గించవచ్చనీ చెప్పాడు. కొన్ని వేల మాస్క్‌లు కుట్టించి వెంటనే అందరూ దాన్ని కట్టుకునేలా చేశాడు. ఆరోగ్య సిబ్బంది వాటిని తప్పని సరిగా ముక్కుకి కట్టాలనే నిబంధన విధించాడు. ఆ సమయంలో ప్రయాణాలు చేయవద్దనీ తప్పనిసరై వెళ్లినా క్వారంటైన్‌లో ఉండాలనీ స్టెరిలైజేషన్‌ అవసరమనీ సూచించాడట. చైనా సంప్రదాయానికి విరుద్ధంగా మృతదేహాల్ని దహనం చేయించాడు. దాంతో క్రమంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది. అలా ఆ చైనా డాక్టర్‌ కారణంగానే మహమ్మారిని నియంత్రించడానికి మాస్క్‌ వాడటం అనేది మొదటిసారిగా వాడుకలోకి వచ్చింది. నాటి మాస్కే సర్జికల్‌, ఎన్‌-95 మాస్క్‌ల ఆవిష్కరణకు కారణమైంది. చైనీస్‌ మెడికల్‌ అసోసియేషన్‌ను సైతం నెలకొల్పి మరణించేవరకూ వైద్యసేవలు అందించిన వూ నోబెల్‌ గ్రహీత కూడా!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని