Updated : 16 Jan 2022 15:44 IST

డబ్బూ లేదు కార్డూ లేదా.. ఏం ఫర్లేదు, మేమున్నాంగా..!

‘అరువు లేదు’... ఒకప్పుడు కిరాణా షాపుల్లోని ఈ బోర్డు చేతిలో నగదు లేకుండా దుకాణానికి వెళ్లేవారికి కొంచెం భయం పుట్టించేది. క్రెడిట్‌ కార్డులు వచ్చాక నగరాల్లో ఆ బోర్డే మాయమై పోయింది. ఇప్పుడిక ఆ క్రెడిట్‌ కార్డులకీ కాలం చెల్లినట్లే ఉంది. ‘మీ దగ్గర డబ్బూ కార్డూ ఏమీ లేకపోయినా పర్వాలేదు, మేమున్నాంగా...’ అంటున్నాయి కొత్త వ్యాపార సంస్థలు. వినియోగదారులు తమకి అవసరమైనవి కొనుక్కుని బిల్లు మొత్తాన్ని నెమ్మదిగా సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్న ‘బై నౌ పే లేటర్‌(బీఎన్‌పీఎల్‌)’ విధానానిదే భవిష్యత్తు అంతా అంటున్నారు ఆర్థికవేత్తలు. దానికి కారణం లేకపోలేదు... మొన్న దసరా దీపావళి పండుగ సీజన్‌లో ఈ వ్యాపారంలో వందశాతం పెరుగుదల నమోదైందట. అంటే... అప్పు దర్జాగా తీసుకుంటున్నట్లేగా..!

అవసరం చెప్పి రాదు...

గృహస్థు జేబు ఖాళీగా ఉందని వచ్చింది తిరిగి పోనూ పోదు..!

పెద్ద పండక్కి పిల్లలందరికీ బట్టలు కొనాల్సి రావచ్చు... వచ్చిపోయే బంధువులతో పిండివంటలతో... ఇంటి ఖర్చే తడిసి మోపెడు కావచ్చు. 

అందుకే తెలిసిన బట్టల దుకాణంలోకో... కిరాణా షాపులోకో... ఒకింత సంకోచంగా అడుగుపెట్టే మధ్యతరగతి మనిషిని ఆ దుకాణదారు ఇట్టే కనిపెట్టేసేవాడు.

‘రండి సార్‌... రండి తల్లీ... ఈ మధ్య కనిపించడమే మానేశారు. కొత్త సరకు వచ్చింది. కావలసినవి తీసుకెళ్లండి. డబ్బుది ఏముందండీ... ఇవాళ కాకపోతే రేపు ఇస్తారు. అయినా మీ దగ్గర డబ్బెక్కడికి పోతుంది. ఉన్నప్పుడే ఇద్దురుగానీ. డబ్బు లేదని పండుగ ఆగదు కదా...’ అంటూ అతను చేసే హడావుడి వచ్చినవారిలో బిడియాన్ని వదిలించేది. అమ్మయ్య... అని లోలోపల నిట్టూర్చి జాగ్రత్తగా అవసరం మేరకు మాత్రమే కొనుగోళ్లు చేసి, ప్రస్తుతానికి గండం గట్టెక్కిందనిపించేవారు. చేతికి డబ్బు అందగానే ఆ అప్పుని తీర్చేసేవారు.

చిన్న సర్దుబాటుతో ఇటు గృహస్థు అవసరమూ తీరేది, అటు దుకాణదారుకి వ్యాపారమూ జరిగేది. సరిగ్గా ఈ సూత్రమే కొత్తగా వచ్చిన ‘బై నౌ పే లేటర్‌- బీఎన్‌పీఎల్‌‘ విధానానికి ఆధారం. ‘ఇప్పుడు కొనుక్కోండి, తర్వాత చెల్లించండి’ అన్నది దాని అర్థం. అక్కడ వినియోగ దారుల మీద నమ్మకంతో దుకాణదారే సర్దుబాటు చేసుకుని అప్పిచ్చేవాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి వినియోగ దారులూ ప్రయత్నించేవారు. ఇక్కడ మాత్రం వారిద్దరికీ మధ్యవర్తిగా మరొకరు ఆ బాధ్యతని తీసుకుంటున్నారు. వ్యాపారికి చెల్లింపులు చేసేసి వినియోగదారు దగ్గర తాము నిదానంగా నిర్దిష్టమైన వ్యవధిలో ఆ డబ్బును ఒకేసారి కానీ సులభ వాయిదాల్లో కానీ తిరిగి వసూలుచేసుకుంటున్నారు. అవసరమైనప్పుడు చేబదులు తరహాలో చిన్న చిన్న అప్పులూ ఇస్తున్నారు.

ఎవరా మధ్యవర్తులు?

ఆన్‌లైన్లో దుస్తులూ నిత్యావసర సరకులూ లాంటివి కొనడానికి రకరకాల ఆప్‌లు ఉన్నట్లే బీఎన్‌పీఎల్‌ చెల్లింపులు చేయడానికీ కొత్త కొత్త ఆప్‌లు చాలా వచ్చాయి. అమెజాన్‌లోనో ఫ్లిప్‌కార్ట్‌లోనో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేటప్పుడు కావలసిన వస్తువులన్నీ ఎంచుకున్నాక బిల్లు కట్టడానికి చివరికి పేమెంట్‌ దగ్గరకి వెళ్తాం కదా... అక్కడ బిల్లు ఎలా చెల్లిస్తారూ అని అడుగుతుంది- క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు లాంటి ఆప్షన్లు చూపిస్తుంది. ఇప్పుడు కొత్తగా అక్కడ అమెజాన్‌ పే లేటర్‌, ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ లాంటి ఆప్షన్లు కూడా కన్పించడాన్ని గమనించే ఉంటారు. ఆ ఆప్షన్‌ని ఎంచుకుంటే బిల్లు మొత్తాన్ని బట్టి ఎన్ని వాయిదాల్లో చెల్లించవచ్చు లాంటి వివరాలూ వస్తాయి. అవన్నీ చూసి మనకు కావలసిన ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. అంటే పాతిక వేలు పెట్టి ఫ్రిజ్‌ కొన్నారనుకోండి. ఆ పాతికవేలూ ఒకేసారి చెల్లించనక్కర్లేదు. ఆరు లేదా పన్నెండు సమానవాయిదాల్లో చెల్లించవచ్చు. మధ్యతరగతి వారికీ, జీతం మీద ఆధారపడి బతికేవారికీ అది ఎంత గొప్ప వెసులుబాటు..! అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులే కాదు, ఇతరత్రా ఈ-కామర్స్‌ సైట్లలో షాపింగ్‌ చేసినా వాళ్లూ బీఎన్‌పీఎల్‌ ఆప్స్‌తో సులభ వాయిదాల చెల్లింపుకి అవకాశం కల్పిస్తారు. కొన్నిట్లో కొద్ది మొత్తం అడ్వాన్స్‌ చెల్లించి మిగతాదంతా వాయిదాల్లో కట్టవచ్చు. కొన్ని అసలేమీ చెల్లించనక్కర్లేకుండానే మొత్తం బిల్లుని వాయిదాల్లోకి మారుస్తాయి. వీటితో ఒకచోట అని కాదు, ఏ రకమైన బిల్లుల్నైనా చెల్లించవచ్చు. దాదాపు అన్ని ఆన్‌లైన్‌ షాపింగ్‌ సైట్లలోనూ, కొన్ని ఆఫ్‌లైన్‌ దుకాణాల్లోనూ కూడా ఇవి చెల్లుబాటు అవుతాయి. బీఎన్‌పీఎల్‌ ఆప్స్‌ ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి.

ఏవేవి?

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ పే లేటర్‌ లాంటివే కాకుండా జెస్ట్‌ మనీ, లేజీపే, సింపుల్‌, ఫ్లెక్స్‌ మనీ, ఈపే లేటర్‌, పేటీఎం పోస్ట్‌పెయిడ్‌, కాపిటల్‌ ఫ్లోట్‌, స్లైస్‌, యాక్సిస్‌ ఫ్రీచార్జ్‌, ట్రూ, బుల్లెట్‌, ఐసీఐసీఐ పే లేటర్‌ తదితర ఆప్స్‌ ఈ వెసులుబాటు కల్పిస్తాయి. వీటి సాయంతో కేవలం సరకులూ దుస్తుల్లాంటివి మాత్రమే కాదు ఎలక్ట్రానిక్స్‌ నుంచి కార్ల వరకూ ఏవైనా కొనుక్కోవచ్చు. అంతేకాదు, పిల్లల స్కూలు ఫీజులో, పెద్దవాళ్ల ఆస్పత్రి ఖర్చులో... ఏవైనా కాస్త పెద్ద మొత్తం వెంటనే కట్టాల్సి వస్తే అప్పు కూడా తీసుకోవచ్చు.

అదెలా..?

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసినప్పుడు బిల్లులు కట్టేసినట్లే అదే ఆప్‌లో మనీ ఆప్షన్‌ కూడా ఉంటుంది. ఉదాహరణకు జెస్ట్‌ మనీ ఆప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లయితే అందులో ముందుగా మన గుర్తింపు కార్డుని అప్‌లోడ్‌ చేయాలి. క్రెడిట్‌ లిమిట్‌ని నిర్ధారించుకుని యాక్టివేట్‌ చేసుకోవాలి. ఆప్‌లోని వర్చువల్‌ క్రెడిట్‌ కార్డులో ఆ మొత్తం జమవుతుంది. దాన్ని మనం ఆన్‌లైన్లో జీవితబీమా ప్రీమియం దగ్గర్నుంచి వివిధ రకాల బిల్లులు కట్టడానికి ఉపయోగించవచ్చు. వాడుకున్న డబ్బుని తొమ్మిది నెలల నుంచి రెండేళ్లలోపు వాయిదాల రూపంలో చెల్లించవచ్చు. ఆ వాయిదాలను నేరుగా మన బ్యాంకు ఖాతానుంచి కానీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా కానీ చెల్లించవచ్చు. క్రెడిట్‌ కార్డు కూడా అంతే కదా, ముందు కొనుక్కుని తర్వాత చెల్లిస్తున్నాం, దాంట్లోనూ డబ్బు తీసుకునే అవకాశం ఉంది కదా అన్న సందేహం రావచ్చు. కానీ క్రెడిట్‌ కార్డులో లేని కొన్ని వెసులుబాట్లు బీఎన్‌పీఎల్‌లో ఉన్నాయి.

ఏమిటవీ?

చేతిలో డబ్బు లేదని అవసరాలను వాయిదా వేసుకోనక్కరలేదు. గబుక్కున ఓ పాతిక వేలు అవసరమైతే ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎవరినైనా చేబదులు అడగాల్సిన అవసరం ఉండదు. మూడో కంటికి తెలియకుండా క్షణాల్లో సాఫీగా పని జరిగిపోతుంది. మోసపోతామన్న భయం ఉండదు. సులభంగా, సురక్షితంగా లావాదేవీలు నిర్వహించవచ్చు. ఉదాహరణకు ఐసీఐసీఐ పే లేటర్‌ సాయం తీసుకుంటే తక్షణం ఇరవై వేల రూపాయలు వస్తాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌కే కాకుండా యూపీఐ ఐడీ సాయంతో ఆ డబ్బుని మామూలు దుకాణాల్లో కూడా బిల్లులు చెల్లించడానికి వాడుకోవచ్చు. ‘స్లైస్‌పే’ ఆప్‌ అయితే యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆప్‌. దాంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయొచ్చు, సినిమా టికెట్లు తీసుకోవచ్చు, ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టొచ్చు, క్యాబ్‌ బుక్‌ చేసుకోవచ్చు, ఫోన్‌ రీచార్జ్‌ చేసుకోవచ్చు. ఏ ఆప్‌కైనా పదిహేను రోజుల వరకూ వడ్డీ అసలు ఉండదు. ఆ తర్వాత మొత్తం ఒకేసారి చెల్లించవచ్చు, లేదా సమాన వాయిదాల్లోకి మార్చుకోవచ్చు. సెజిల్‌ ఆప్‌లో అయితే కొనుగోలు సమయంలో బిల్లులో 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేసి వారాలకీ 25 శాతం చొప్పున మూడు వాయిదాల్లో మిగిలిన మొత్తం చెల్లించాలి. ఆరువారాలకీ వడ్డీ ఏమీ ఉండదు. ఈ ఆప్‌ ప్రతి కొనుగోలునీ ఇలా ఈఎంఐలో చెల్లించుకునేలా ప్రోత్సహిస్తుంది. దాంతో వినియోగదారుకి పెద్ద మొత్తం అప్పు భారం ఎప్పుడూ ఉండదు. 

అర్హతలేమీ అక్కర్లేదా?

అర్హతలంటూ పెద్దగా ఏమీ అక్కర్లేదు. పది రకాల ఫారాలు నింపాల్సిన పనిలేదు. పద్దెనిమిదేళ్లు నిండిన భారతీయ పౌరు లెవరైనా ఈ సౌకర్యాన్ని ఉపయోగించు కోవచ్చు. ఉద్యోగం చేస్తూ బ్యాంక్‌ ఖాతా కలిగివుంటే చాలు. పాన్‌ కార్డు, ఆధార్‌ కార్డు లాంటి గుర్తింపు కార్డు, ఫోన్‌ నంబరు ఇస్తే సరిపోతుంది. గూగుల్‌పే లాంటి వాటికి వాడుతున్నట్లు యూపీఐ ఐడీ ఉంటే చాలు. ఒక్కో ఆప్‌కీ ఒక్కో రకమైన పేమెంట్‌ విధానాలున్నాయి. మన అవసరానికి తగిన ఆప్‌ని ఎంచుకోవాలి. సరిగ్గా వాడుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. చాలా ఆప్‌లు లక్ష రూపాయల క్రెడిట్‌ లిమిట్‌ ఇస్తాయి. మొబైల్‌ ఆప్‌ ద్వారా లేక వెబ్‌సైట్‌ ద్వారా వీటిని ఉపయోగించుకోవచ్చు. అయితే మనం డబ్బు కట్టాల్సిన చోట- ఆ ఆప్‌ని ఉపయోగిస్తున్నారా లేదా తెలుసుకోవాలి. ఉదాహరణకు ‘క్యాష్‌ఇ’ వెబ్‌సైట్‌లోకి వెళ్తే ప్రోడక్ట్స్‌ కాలమ్‌లో దాన్ని ఎక్కడెక్కడ వాడొచ్చో లిస్టు ఉంటుంది. మింత్రా, బిగ్‌బజార్‌, ఉబర్‌,అపోలో ఫార్మసీ, బిగ్‌ బాస్కెట్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌... లాంటి చోట్ల దీని ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. వినియోగదారు జీతాన్ని బట్టి నాలుగు లక్షల వరకూ పర్సనల్‌ లోన్‌ ఇస్తుంది. అందులో మనకు కావలసినంత మొత్తాన్ని బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. మనం పెట్టుకున్న క్రెడిట్‌ లిమిట్‌ మించకుండా ఒకే చోట కాదు, ఎన్నిచోట్ల అయినా ఈ బీఎన్‌పీఎల్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈఎంఐ కట్టలేకపోతే..?

మామూలుగా బిల్లును ఈఎంఐలోకి మార్చినప్పుడు అవి ఎన్ని నెలలైనా సరే వడ్డీ ఉండదు. కానీ ఈఎంఐ కట్టడం ఆలస్యమైతే మాత్రం ఆ మొత్తంపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దాని ప్రభావం క్రెడిట్‌ స్కోర్‌ మీద పడుతుంది. ఆవిషయాన్ని మర్చిపోకూడదు.

మరి ఆ సంస్థలకు ఆదాయమెలా?

ఈ విధానం వల్ల వినియోగదారుల కొనుగోలు శక్తి పెరుగుతుంది. డబ్బున్నప్పుడే కొనుక్కోవచ్చు అని వాయిదా వేసుకోకుండా కోరుకున్న వస్తువును తక్షణం కొనుక్కోగలుగుతారు. దానివల్ల వ్యాపార సంస్థలకీ లాభమే కాబట్టి దాదాపుగా అన్ని సంస్థలూ వీటిని అనుమతిస్తున్నాయి. దాంతో వ్యాపార సంస్థల నుంచి ఈ ఆప్‌లకు ప్రతి కొనుగోలుకీ ఇంతని కమిషన్‌ అందుతుంది.

అసలీ విధానం ఎలా మొదలైంది?

పందొమ్మిదో శతాబ్దంలో సింగర్‌ కుట్టుమిషన్‌ కంపెనీ మొట్టమొదటిసారి వాయిదాల పద్ధతిని ప్రవేశపెట్టిందంటారు. పేదల స్వయం ఉపాధికి తోడ్పడేందుకు గాను మొదలెట్టిన ఈ విధానంలో మొదట ఒక డాలరు చెల్లిస్తే మిషను ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆ తర్వాత వారానికో డాలరు చొప్పున పూర్తి ధర చెల్లించే వెసులుబాటు కల్పించారు. అలా వినియోగ మార్కెట్‌లో ప్రవేశించిన వాయిదాల పద్ధతిని మొదట్లో ఫర్నిచరు, వ్యవసాయ పరికరాలు, కార్లు తదితర ఖరీదైన వస్తువులకు ఎక్కువగా వాడేవారు. క్రమంగా అన్ని రంగాలకూ విస్తరించిన ఈ వాయిదా పద్ధతే క్రెడిట్‌ కార్డుల కాన్సెప్ట్‌కి మూలమైంది. వాటికి మరో ముందడుగే బీఎన్‌పీఎల్‌. విదేశాలలో ఈ విధానం చాలా కాలంగా ఆచరణలో ఉంది. అఫిర్మ్‌, క్లార్నా, ఆఫ్టర్‌పే లాంటి ఆప్స్‌ పలు దేశాల్లో వాడుకలో ఉన్నాయి. మనదేశంలోనూ బీఎన్‌పీఎల్‌ ఆప్‌లన్నీ కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం వాటిని త్వరగా ప్రజలకు చేరువ చేసింది. వాడకాన్ని వేగవంతం చేసింది. చాలామందికి ఉద్యోగాలు పోవడం, కొందరికి జీతాలు తగ్గడం, వైద్య ఖర్చులు పెరగడం, పిల్లలకు ఆన్‌లైన్‌ చదువుల వల్ల గ్యాడ్జెట్స్‌ కొనాల్సి రావడం... తదితర అనూహ్య ఖర్చుల వల్ల ఈ విధానానికి గత ఏడాది మన దేశంలో ఆదరణ విపరీతంగా పెరిగింది. 2020లో అమెరికాలో ఈ పద్ధతిలో కొనుగోళ్లు 200 శాతం పెరిగాయట. మన దగ్గరా నెమ్మదిగా పుంజుకుని ఇటీవలి దసరా దీపావళి సీజన్‌లో వందశాతం పెరుగుదల నమోదైంది. మన దగ్గర ఇది వేగం పుంజుకోవడానికి మరో కారణమూ ఉంది.

ఏమిటది?

మన దేశంలో క్రెడిట్‌ కార్డుల వాడకం చాలా తక్కువ. వందమందిలో ఐదుగురు మాత్రమే క్రెడిట్‌ కార్డు వాడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. అందులోనూ ఒకరే రెండు మూడు కార్డులు వాడేవారు ఉండవచ్చు. దాంతో క్రెడిట్‌ కార్డులు లేనివారికీ, కార్డులు పొందేందుకు అవసరమైన క్రెడిట్‌ హిస్టరీ లేనివారికీ ఈ బీఎన్‌పీఎల్‌ విధానమే అండగా నిలుస్తోంది. ‘జెస్ట్‌ మనీ’కి గత అక్టోబరులోనే కస్టమర్ల సంఖ్య అంతకు ముందు ఏడాది కన్నా ఐదు రెట్లు పెరిగిందట. మూడు నెలల పండుగ సీజన్‌లో దాదాపు అన్ని బీఎన్‌పీఎల్‌ ఆప్‌లూ ఎన్నో రెట్ల అభివృద్ధిని నమోదుచేశాయి.

మనదేశంలోనే కాదు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కెట్‌ చాలా వేగంగా పెరుగుతోందంటున్నారు ఆర్థిక నిపుణులు. గ్లోబల్‌ బీఎన్‌పీఎల్‌ మార్కెట్‌ విలువ 2020లో ఆరు లక్షలకోట్లు కాగా అది ఏటా దాదాపు 46 శాతం చొప్పున పెరిగి పదేళ్లకల్లా దాదాపు నాలుగు ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. అంటే రూపాయల్లో మూడు కోట్ల కోట్లు. మన దేశంలో ఈ మార్కెట్‌ విలువ 2020లో సుమారు 52 వేల కోట్లు కాగా ఈ ఏడాది 82 వేల కోట్లకు పెరిగింది. 2028 నాటికి అది 4 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. అంటే ఒక దశాబ్దంలోనే 650 శాతం అభివృద్ధి. అందుకే భవిష్యత్తు అంతా ‘ముందు కొనండి, తర్వాత చెల్లించండి’ విధానానిదేననీ, క్రెడిట్‌ కార్డులకు కాలం చెల్లినట్లేననీ బల్లగుద్ది చెబుతున్నారు నిపుణులు. పైగా ఈ విధానంలో కొనుగోళ్లు జరుపుతున్న వారంతా 18- 30 ఏళ్ల మధ్య యువతేనని మార్కెట్‌ సర్వేలు చెబుతున్నాయి. అవును మరి... ఏ రుణం కావాలన్నా బ్యాంకులకు సెక్యూరిటీ కావాలి. నెల జీతం కచ్చితంగా ఉండే ఉద్యోగాన్ని చూపాలి. అవేవీ లేని, బ్యాంకుల భాషలో చెప్పాలంటే క్రెడిట్‌ హిస్టరీ లేని యువతకి అవసరానికి డబ్బు అందే మార్గమేదీ..? అందుకే వారంతా ఇప్పుడు ‘బై నౌ పే లేటర్‌’కి జై అంటున్నారు. చేతిలో రూపాయి లేకపోయినా డీలా పడిపోకుండా దర్జాగా సమయానికి కావలసినవి సమకూర్చుకుంటున్నారు. ఖర్చులకీ ఒక లెక్క ఉండేలా చూసుకుని ఆర్థిక క్రమశిక్షణని అలవరచుకుంటున్నారు. అదీ మంచిదేగా మరి..!


ఇవీ తేడాలు..!

క్రెడిట్‌ కార్డు, బీఎన్‌పీఎల్‌.. రెండిటికీ మధ్య ఉన్న ప్రధానమైన తేడాలివి..

క్రెడిట్‌ కార్డు

* క్రెడిట్‌ కార్డు పొందడం కొంచెం కష్టం. స్థిరమైన ఆదాయం ఉండి, లావాదేవీల విషయంలో తృప్తి చెందితేనే బ్యాంకు కార్డు ఇస్తుంది.

* క్రెడిట్‌ హిస్టరీలో ఏ కాస్త తేడా వచ్చినా క్రెడిట్‌ కార్డు సేవలు ఆగిపోతాయి.

* కార్డుల వెనక కొన్ని కనిపించని ఛార్జీలు ఉంటాయి. వార్షిక రుసుమూ చెల్లించాల్సి ఉంటుంది.

* వడ్డీ లేని వెసులుబాటు స్థిరంగా కొన్ని రోజులకు మాత్రమే వర్తిస్తుంది. నెలంతా జరిపిన కొనుగోళ్లన్నీ ఒకే బిల్లులో చెల్లించాలి.

* గడువు సమయానికి కనీస మొత్తం చెల్లించే వెసులుబాటు ఉన్నా ఆ తర్వాత మిగిలిన మొత్తంపై వడ్డీ భారీగా ఉంటుంది.

* కొనుగోళ్లపై క్యాష్‌బ్యాక్‌, రివార్డు పాయింట్లు లాంటి అవకాశాలు ఉంటాయి.

* క్రెడిట్‌ కార్డులను దాదాపుగా అన్నిచోట్లా అనుమతిస్తారు.

* వడ్డీ రేటు మారదు. నిర్దిష్టంగా 48 శాతం వరకూ ఉంటుంది.

బీఎన్‌పీఎల్‌

* ఎవరైనా వాడుకోవచ్చు. ఆన్‌లైన్‌లో తక్షణం పొందవచ్చు.

* మంచి క్రెడిట్‌ హిస్టరీ తప్పనిసరి కాదు. గత చరిత్రతో పనిలేదు.

* ఎలాంటి రహస్య రుసుములూ ఉండవు. అంతా పారదర్శకంగా ఉంటుంది.

* వడ్డీలేకుండా నాలుగు సంవత్సరాల వరకూ వెసులుబాటు ఉంటుంది. ప్రతి బిల్లునీ దేనికదే విడి విడి సులభ వాయిదాలుగా మార్చుకోవచ్చు.

* ఈఎంఐ మొత్తం ముందుగానే నిర్ణయమైపోతుంది కాబట్టి గడువు నాటికి కచ్చితంగా అది చెల్లించాలి.

* రివార్డులూ క్యాష్‌బ్యాక్‌ లాంటి ఆఫర్లు ఏమీ ఉండవు.

* బీఎన్‌పీఎల్‌ ప్రస్తుతానికి అన్నిచోట్లా లేకపోయినా వేగంగా విస్తరిస్తోంది. ఈ-కామర్స్‌ సంస్థలన్నీ ఆమోదిస్తున్నాయి.

* వడ్డీ రేటు వివిధ అంశాలపై ఆధారపడి మారుతూ ఉన్నా 24 శాతానికి మించదు.


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని