రెస్టరెంట్‌కి వెళ్లి నచ్చిన టేబుల్ ఎంచుకుని కూర్చుని, మెనూ చూసి ఇష్టమైన వంటకాన్ని ఆర్డరివ్వడం పాత ట్రెండ్. రెస్టరెంట్ ముందు కారు ఆపితే వెయిటరే మన దగ్గరకి రావడం, ఆర్డరిచ్చిన వంటకాలను టేబుల్‌తో సహా కారులోకే తెచ్చివ్వడం... ఇప్పటి ట్రెండ్. కరోనాతో మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నదే ఈ ‘డైన్ ఇన్ కార్’ ట్రెండ్.
సాయంత్రంపూట సరదాగా బయటికెళ్లి అలా అలా తిరిగి, నచ్చిన రెస్టరెంట్‌కి వెళ్లి ఇష్టమైన బిర్యానీ తిని, ఏ రాత్రికో ఇంటికి చేరితే... అదో మజా. కానీ కరోనా భయంతో జనం హోటళ్లకి వెళ్లడమే తగ్గిపోయింది. ఎక్కువమంది ఉన్నచోటుకి వెళ్తే ఎవరి నుంచైనా వైరస్ అంటుకుంటుందేమో అని ఆలోచించడమే దీనిక్కారణం. అలా అని మరీ ఇంట్లోనే కూర్చోవాలన్నా బోరే. మరోపక్క వినియోగదారులు రాకపోవడంతో హోటల్ వ్యాపారం కూడా బాగా దెబ్బతింది. ఈ సమస్యలకు పరిష్కారంగా కొత్తగా పుట్టుకొచ్చిన ట్రెండే ‘డైన్ ఇన్ కార్’. అంటే, కారు రెస్టరెంట్ ముందుకి వెళ్తుంది. కానీ మనం లోపలికి వెళ్లం. వెయిటరే కారుదగ్గరికొచ్చి మనక్కావల్సిన వంటకాలన్నిటినీ ఆర్డర్ తీసుకుంటాడు. తర్వాత వేడివేడిగా వాటిని తెచ్చి వడ్డిస్తాడు. మనం కారులోనే ఉండి ఎంచక్కా వాటిని తినేయొచ్చు. ‘మరి, కారులో కూర్చుని తినడం అంత సౌకర్యంగా ఉండదుగా... అంటారా...’ దానికీ మంచి ఐడియానే కనిపెట్టారు.
కారులోకే టేబుల్!
ఎప్పుడైనా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇంటి నుంచి టిఫిన్ గానీ భోజనం గానీ తీసుకెళ్లి మధ్యలో కారు ఆపి తిందామంటేనే ఎక్కడ ఒళ్లో పడిపోతుందో అని భయపడతాం. ఇక, రెస్టరెంట్‌కి వెళ్తే ఒకటికి నాలుగు రకాలు ఆర్డరిచ్చి తింటాం. అందులో సూపులూ, స్టార్టర్లూ, రోటీలూ, బిర్యానీ, కూరలూ స్నాక్స్, జ్యూసులూ ఇలా ఏవేవో ఉంటాయి. వాటన్నిటినీ ఒళ్లో పెట్టుకుని తినడం కష్టమే. అందుకే, డైన్ ఇన్ కార్ కాన్సెప్టుతో నడిచే రెస్టరెంట్లూ కెఫేలూ హోటళ్లూ కారులో సౌకర్యంగా తినేందుకు ప్రత్యేకంగా సన్నగా పొడుగ్గా ఉండే బల్లల్ని చేయిస్తున్నాయి. వీటిని కారు ముందు సీటులో రెండు డోర్ల మధ్యలో ఇమిడేలా అమర్చుతారు. వాటిపైన వంటకాల గిన్నెల్ని ఉంచుతారు. కాబట్టి టేబుల్ మీద పెట్టుకుని తిన్నట్లే ఉంటుంది. ప్రతి టేబుల్నీ కారు దగ్గరకు తెచ్చాక వినియోగదారుల ముందే శానిటైజ్ చేస్తారు. బిల్లు కట్టడానిక్కూడా క్యూ ఆర్ కోడ్ ఉన్న కార్డుని ఆ టేబుల్‌కి అమర్చుతారు. ఇకపోతే హోటల్లోపలైతే మంద్రమైన సంగీతాన్ని ప్లే చేస్తుంటారు కాబట్టి మనం హాయిగా అది వింటూ తింటాం. అయితే, కారులో కూడా ఆ అవకాశాన్ని కల్పించేలా మరో క్యూ ఆర్ కోడ్‌ని స్కాన్ చెయ్యగానే మ్యూజిక్ ట్రాక్‌లు వచ్చే ఏర్పాట్లూ చేస్తున్నాయి కొన్ని రెస్టరెంట్లు. ఇంకేముందీ... కరోనా భయం లేకుండా ఎంచక్కా నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేయొచ్చు. అందుకే, మన దేశంలోని ప్రముఖ నగరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడీ ట్రెండ్ ప్రాచుర్యం పొందుతోంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్