Published : 22 Aug 2021 00:17 IST

రాఖీ... తీరుకొకటీ పేరుకొకటీ!

‘అన్నయ్యా! ఎప్పటికీ నువ్వు ఆనందంగా ఉండాలీ... తమ్ముడూ! విజయాలెన్నో సాధిస్తూ ముందుకెళ్లాలీ’ అంటూ తోబుట్టువుల బాగు కోరుతూ అమితమైన ప్రేమతో రాఖీ కట్టేస్తారు అక్కాచెల్లెళ్లు. వసివాడని ఆ అనుబంధాన్ని రక్షా బంధనాల్లోనూ చూపాలని ఏ సోదరి మాత్రం కోరుకోదూ! అందుకే, అభిరుచులకి తగ్గట్టు మార్కెట్లో తీరొక్క రాఖీలొచ్చేస్తున్నాయి.

మ బంధం కలకాలం బలంగా, పచ్చగా ఉండాలని ఆశిస్తూ సోదరీసోదరులు కట్టుకునే రక్షా బంధనం... ప్రాణం పోసుకుని అనునిత్యం ఆ ఆప్యాయతను గుర్తుకు చేస్తే... ఈసారి కట్టే రాఖీ పర్యావరణహితమైనదైతే... చిట్టి తమ్ముడి కోసం వాడు మెచ్చే ప్రత్యేకమైన రాఖీని కొంటే... ఆ రాఖీపండుగ ఎంత సంబరంగా ఉంటుందో కదూ! ఎన్నెన్నో హంగులద్దుకుని వస్తున్న ఈ సరికొత్త రాఖీలు వేడుకకు కొత్తదనాన్నీ, నిండుదనాన్నీ తీసుకొచ్చేయవూ!

ఈసారి పండుగకు చేసిన స్వీట్‌ మరో వేడుకకు చేస్తే బోర్‌గా ఫీలవుతాం. అలాంటిది మన ప్రేమను వ్యక్తపరిచే వస్తువు విషయంలో ఇంకెంత వెరైటీని కోరుకుంటాం! అందుకే అన్నాచెల్లెళ్ల స్వచ్ఛమైన ప్రేమకు గుర్తుగా కట్టే రాఖీల్ని తయారీదారులు ఏటికేడు కాస్త విభిన్నంగా రూపొందిస్తూ ఆకట్టుకుంటున్నారు. అందులో కంటికి ఇంపైన రాఖీల దగ్గర్నుంచీ ప్రకృతికి మేలు చేసే రాఖీల వరకూ చాలా రకాలు ఉన్నాయి.

ఎన్నెన్నో!
ఒకప్పుడంటే రాఖీ అనగానే రంగుల దారాలే. కానీ ఇప్పుడలా కాదు, అభిరుచికి తగ్గట్టు ఎంచుకోవచ్చు. అన్నయ్య ప్రకృతి ప్రేమికుడైతే ప్లాస్టిక్‌కి దూరంగా ఉండే క్లే, ఉడ్‌, సీడ్స్‌ రాఖీల్ని కొని రక్షాబంధన్‌ కట్టేయొచ్చు. విత్తనాలతో వస్తున్న రాఖీల్ని పండుగ తర్వాత మట్టిలో ఉంచి అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా మొక్కల్ని పెంచుకోవచ్చు. అన్నయ్యతోపాటూ వదినమ్మకీ కట్టడానికి ‘భయ్యా-భాభీ రాఖీలు’ సందడి చేస్తున్నాయి. బుజ్జాయిల కోసం సుతిమెత్తటి రాఖీలూ.. బ్రేస్‌లెట్‌లా తొడిగేసుకునే రక్షా బంధనాలూ, బ్యాండ్లూ.. ఇడ్లీ, వడా, మిఠాయిలతో నోరూరిస్తున్నట్లుండే బోలెడన్ని ఫుడ్‌ రాఖీలూ, పిల్లలకు ఇష్టమైన కార్టూన్‌పాత్రల రాఖీలూ రకరకాల ఆకారాల్లో, రంగురంగుల్లో దొరుకుతున్నాయి. ఇక పెద్దలకైనా, పిల్లలకైనా.. వాళ్లఫొటోతోనో, మన మనసులోని మాటతోనో వచ్చే పర్సనలైజ్డ్‌ రాఖీల్నీ కట్టామంటే సంతోషంతో మురిసిపోకుండా ఉండగలరా! వీటితోపాటూ మీనాకారీ అందాలూ, రాళ్ల చమక్కులూ, బంగారు మెరుపులూ, దేవుళ్ల చిత్రాలూ రాఖీలపైకి చేరిపోయి కనువిందుచేస్తున్నాయి. ఆలస్యం దేనికీ... కుదిరితే వీటిల్లో ఏ రాఖీతోనో ఈరోజు మీ ప్రేమను చూపించేయండి!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts