చల్లని వేళ... వేడివేడి పునుగులు

ఇంట్లో ఇడ్లీ లేదా దోశ పిండి మిగిలితే... అందులో కాసిని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి పునుగుల్లా వేయడం తెలిసిందే. కానీ అవేవీ లేకుండానే సులువుగా వేసుకోగలిగే పునుగుల వెరైటీలు మరికొన్నీ ఉన్నాయి.

Updated : 13 Nov 2022 03:49 IST

చల్లని వేళ... వేడివేడి పునుగులు

ఇంట్లో ఇడ్లీ లేదా దోశ పిండి మిగిలితే... అందులో కాసిని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కలిపి పునుగుల్లా వేయడం తెలిసిందే. కానీ అవేవీ లేకుండానే సులువుగా వేసుకోగలిగే పునుగుల వెరైటీలు మరికొన్నీ ఉన్నాయి. అవేంటో చూసేసి... నచ్చిన వాటిని ప్రయత్నం చేయండి మరి.


సగ్గుబియ్యంతో...

కావలసినవి: సగ్గుబియ్యం: కప్పు, నీళ్లు: రెండు కప్పులు, ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, ఉప్పు: తగినంత, జీలకర్ర: అరచెంచా, అల్లం: చిన్నముక్క, పచ్చిమిర్చి: రెండు, మిరియాలపొడి: పావుచెంచా, వేయించిన పల్లీలు: పావుకప్పు, కొత్తిమీర: కట్ట, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: స్టౌమీద కడాయి పెట్టి సగ్గుబియ్యాన్ని వేసి నాలుగైదు నిమిషాలు వేయించుకుని తీసుకోవాలి. ఆ తరువాత సగ్గుబియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులో నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. పావుగంటయ్యాక ఈ మిశ్రమంలో బంగాళాదుంపల తురుము, పల్లీల పొడితోపాటు నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని మరోసారి కలపాలి. అవసరాన్ని బట్టి మరికాసిని నీళ్లు పోసి పునుగుల పిండిలా చేసుకోవాలి. ఈ పిండిని పావుగంట నాననిచ్చి ఆ తరువాత కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకుని వేయించుకుని తీసుకోవాలి.


పెసలతో...

కావలసినవి: పెసరపప్పు: కప్పు, బియ్యప్పిండి: రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం: చిన్నముక్క, పచ్చిమిర్చి: నాలుగు, ఉల్లిపాయ: ఒకటి పెద్దది, కొత్తిమీర: కట్ట, కరివేపాకు రెబ్బలు: అయిదు, జీలకర్ర: చెంచా, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: పెసరపప్పును అయిదు గంటల ముందు నానబెట్టుకుని ఆ తరువాత మిక్సీలో తీసుకుని అల్లం, పచ్చిమిర్చితో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను కలిపి మూత పెట్టాలి. పదినిమిషాలయ్యాక ఈ పిండిని కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి.


ఆలూతో...

కావలసినవి: పెద్ద బంగాళాదుంపలు: నాలుగు, సెనగపిండి: ముప్పావుకప్పు, బియ్యప్పిండి: రెండు పెద్ద టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి, అల్లం తరుగు: చెంచా, పచ్చిమిర్చి: నాలుగు, కారం: అరచెంచా, పసుపు: పావుచెంచా, గరంమసాలా: అరటేబుల్‌స్పూను, కొత్తిమీర: కట్ట, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా, దనియాలపొడి: చెంచా.  

తయారీ విధానం: బంగాళాదుంపల్ని ఉడికించుకుని పొట్టుతీసి ఓ గిన్నెలో వేసుకుని మెత్తగా అయ్యేవరకూ గరిటెతో మెదుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, అల్లం తరుగు, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర, కారం, పసుపు, గరంమసాలా వేసుకుని బాగా కలపాలి. తరువాత సెనగపిండి, బియ్యప్పిండి వేసి నీళ్లు చల్లుకుంటూ కాస్త గట్టి పిండిలా చేసుకోవాలి. ఇప్పుడు స్టౌమీద బాణలిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక కొద్దికొద్దిగా పిండిని తీసుకుంటూ పునుగుల్లా వేసుకుని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే వీటిపైన ఉప్పు కలిపిన దనియాలపొడిని చల్లుకుంటే చాలు.  


గోధుమపిండితో...

కావలసినవి: గోధుమపిండి: కప్పు, బియ్యప్పిండి: పావుకప్పు, పుల్లటి పెరుగు: కప్పు, ఉల్లిపాయముక్కలు: అరకప్పు, కొత్తిమీర తరుగు: పావుకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తరుగు: చెంచా, జీలకర్ర: అరచెంచా, ఉప్పు: తగినంత, వంటసోడా: పావుచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలను వేసుకుని బాగా కలపాలి. తరువాత నీళ్లు పోస్తూ పునుగుల పిండిలా చేసుకుని మూత పెట్టాలి. ఈ పిండిని రెండు గంటలు నాననిచ్చి ఆ తరువాత కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకుంటూ ఎర్రగా వేయించుకుని తీసుకుంటే సరిపోతుంది.  


కార్న్‌-కూరగాయలతో...

కావలసినవి: స్వీట్‌కార్న్‌ ముద్ద: మూడు కప్పులు, ఉల్లిపాయ: ఒకటి, క్యాప్సికం: ఒకటి, క్యారెట్‌ తురుము: పావుకప్పు, మెంతికూర తరుగు: పావుకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, మిరియాలపొడి: చెంచా, దనియాలపొడి: ఒకటిన్నర చెంచా, సెనగపిండి: ఒకటిన్నర కప్పు, మొక్కజొన్నపిండి: రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, నూనె: వేయించేందుకు సరిపడా.

తయారీ విధానం: ఓ గిన్నెలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నింటినీ వేసుకుని బాగా కలపాలి. ఒకవేళ పిండి మరీ గట్టిగా ఉందనుకుంటే కొద్దిగా పుల్లమజ్జిగ కలుపుకోవచ్చు. ఇలా తయారుచేసుకున్న పిండిని పది నిమిషాలు నాననిచ్చి ఆ తరువాత కాగుతున్న నూనెలో పునుగుల్లా వేసుకుంటూ బాగా వేయించుకుని తీసుకోవాలి. వీటికి టొమాటోసాస్‌ మంచి కాంబినేషన్‌.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు