కార్తికం.. జ్యోతిర్లింగ దర్శనం!

కార్తికం... పరమశివుడికి ప్రీతికరమైన మాసం... ఆ సమయంలో ఏడేడు జన్మల్లో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయన్న నమ్మకంతో పవిత్ర శైవక్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనా

Updated : 16 Nov 2022 16:51 IST

కార్తికం.. జ్యోతిర్లింగ దర్శనం!

కార్తికం... పరమశివుడికి ప్రీతికరమైన మాసం... ఆ సమయంలో ఏడేడు జన్మల్లో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయన్న నమ్మకంతో పవిత్ర శైవక్షేత్రాలైన ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనా దర్శించుకోవాలనుకుంటారు భక్తులు. కుదరనివాళ్లు  ‘సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం!...’ అంటూ జ్యోతిర్లింగ స్తోత్రాన్నయినా స్మరించుకుంటారు. అందుకే ఆ జ్యోతిర్లింగ స్వరూపాల గురించి..

ఆద్యంతాలు లేనిదే లింగం. అనంత నిరాకార పరబ్రహ్మానికి సంకేతం. ఓ సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ‘ఎవరు గొప్ప’... అంటూ తలెత్తిన సంవాదాన్ని అడ్డుకుంటూ వారికి లింగరూపంలో దర్శనమిస్తాడు పరమేశ్వరుడు. ఆ అనంత లింగ కిరణాలు పడిన ప్రదేశాలే జ్యోతిర్లింగాలనీ, అవి 64 వరకూ ఉన్నాయనీ వాటిల్లో 12 మాత్రం అత్యంత ప్రాచుర్యం పొందాయనీ చెబుతారు. అయితే ఈ క్షేత్రాల్లో వేటి ప్రాశస్త్యం వాటిదే.


మల్లికార్జునం

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న నల్లమల కోనలో ఉందీ క్షేత్రం. ఇక్కడి కృష్ణాతీరంలోని శిఖరమ్మీద నందీశ్వరుడు చేసిన ఘోరతపస్సుకి మెచ్చి శివుడు భ్రమరాంబికాసమేతుడై వెలశాడనేది ఓ పౌరాణిక గాథ. శిలాపాదుడనే రుషి పుత్రుల్లో ఒకడైన శ్రీపర్వతుడు, శివుడి అనుగ్రహం కోసం తపస్సు చేయగా హరుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు తాను శిఖర రూపు దాలుస్తాననీ అక్కడ పరమశివుడు కొలువుండాలనీ కోరడంతో ఆ బోళాశంకరుడు మల్లికార్జునుడుగా వెలిసినట్లు పద్మపురాణం పేర్కొంటోంది. భ్రమరాంబికాదేవి సైతం ఇక్కడ వెలవడంతో ఈ క్షేత్రం శక్తిపీఠంగానూ వెలుగొందుతోంది. వనవాస సమయంలో శ్రీరాముడు ప్రతిష్ఠించిన సహస్ర లింగాలూ, పాండవులు ప్రతిష్ఠించిన ఐదు లింగాలూ ఇక్కడ ఉన్నాయి. ఆదిశంకరాచార్యులు శివానందలహరిని ఇక్కడే రాశారట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కాళ్లైనా కడుక్కోకుండా ఆ జ్యోతిర్లింగ స్వరూపుడిని స్పృశించగలిగే ధూళి దర్శనం శ్రీశైల క్షేత్ర ప్రత్యేకం.


సోమనాథేశ్వరం

గుజరాత్‌లోని ప్రభాస్‌ ప్రాంతంలోని సోమనాథ్‌ లింగం జ్యోతిర్లింగాలన్నింటిలోకీ ప్రాచీనమైనది. ఇక్కడి లింగాన్ని చంద్రుడే ప్రతిష్ఠించాడని అంటారు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలు 27 మందినీ చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. అయితే రూపవతి అయిన రోహిణిపై ఆ శశాంకుడు అధిక ప్రేమ కనబరుస్తున్నాడని మిగిలినవాళ్లు తండ్రికి చెప్పడంతో- పక్షపాతం వద్దని అల్లుడికి చెబుతాడు. చంద్రుడు వినకపోవడంతో దక్షుడు- క్షయరోగివి కమ్మని శపిస్తాడు. అంతట చంద్రుడు దేవతల సలహా మేరకు ప్రభాస క్షేత్రంలో శివునికోసం తపస్సు చేయగా- ఆ భక్తవశంకరుడు పక్షంలో సగం రోజులు వృద్ధి చెంది మిగిలిన సగం రోజులు క్షయం చెందేలా శాపాన్ని మార్చి అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడట. ఆ కృతజ్ఞతతో చంద్రుడు ఈశ్వరుడికి సువర్ణ దేవాలయాన్ని కట్టించాడట.


మహాకాళేశ్వరం

మధ్యప్రదేశ్‌లోని క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఉజ్జయిని సప్త మోక్షదాయక పట్టణాల్లో ఒకటి. యుగాల క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన దూషణాసురుడిని సంహరించిన రుద్రుడు ఇక్కడ మహాకాళేశ్వరుడిగా వెలశాడనేది స్థలపురాణం. మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం ఇది. ఉజ్జయినీ నగరంలో 7 సాగర తీర్థాలు, 30 శివలింగాలు, అష్టభైరవులు, ఏకాదశరుద్రులు, వందలాది దేవతా మందిరాలు, జలకుండం ఉన్నాయి. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా ఉండడం, ఒకసారి పూజించిన బిల్వ పత్రాలతోనే కాళేశ్వరుడిని అర్చించడం, గర్భగుడిలో శ్రీచక్ర యంత్రం తిరగవేసి ఉండటం ఈ క్షేత్రానికున్న ప్రత్యేకత.


ఓంకారేశ్వరం

మధ్యప్రదేశ్‌లోని వింధ్య పర్వత సానువుల్లో నర్మదానది రెండు పాయలుగా చీలిన చోట ఆ ప్రణవ స్వరూపుడు వెలసిన క్షేత్రమే ఓంకారేశ్వరం. సుదీర్ఘకాలంపాటు జరిగిన దేవదానవుల యుద్ధంలో దానవులు గెలిచారనీ, అంతట దేవతలు పరమేశ్వరుడిని వేడుకోగా ఓంకారేశ్వరుడుగా వెలసి దానవులని ఓడించి, నర్మదా తీరంలో జ్యోతిర్లింగ రూపంలో కొలువయ్యాడనీ అంటారు. ఆపై దేవతల కోరిక మేరకు రెండుగా చీలి, ఓంకారేశ్వరుడు, అమలేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడనీ అంటారు. ఆదిశంకరాచార్యుల గురువైన గోవింద భగవత్పాదులు ఈ క్షేత్రంలోని చిన్నగుహలోనే నివసించేవారనేది స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి.


కేదారనాథేశ్వరం

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో బద్రీనాథ్‌కు సమీపంలో ఉందీ క్షేత్రం. సముద్రమట్టానికి 12 వేల అడుగుల ఎత్తులోని రుద్ర హిమాలయాల్లో మందాకినీ నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలోని జ్యోతిర్లింగం ఎద్దు మూపురం ఆకారంలో ఉంటుంది. ఏడాదిలో ఆరునెలలు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయంలోని లింగాన్ని విష్ణుమూర్తి లోక కల్యాణంకోసం ప్రతిష్ఠించినట్లు పురాణ కథనం. పాండవులు స్వర్గారోహణం చేసింది ఇక్కడి నుంచేననీ ఆ సమయంలో ఆలయాన్ని సర్వాంగసుందరంగా అలంకరించారనీ ప్రతీతి. నేటికీ పాండవులూ ద్రౌపదిల విగ్రహాలు అంతరాలయంలో ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధినీ, శివపార్వతుల తపోభూమినీ ఇక్కడ దర్శించుకోవచ్చు.


భీమశంకరం

మహారాష్ట్ర, పుణెకు సమీపంలోని భావగిరి గ్రామంలో శివుడు భూతనాథుడుగా కొలువుతీరిన ప్రదేశమే భీమశంకరం. ఇక్కడ ఈశ్వరుడు ఢాకినీ శాకినీ ... తదితర క్షుద్రశక్తులతో పూజలందుకుంటున్న భయంకరుడుగానూ భక్తులకు శుభాలు కలిగించే భీమశంకరుడుగానూ సుప్రసిద్ధుడు. కుంభకర్ణుడి కుమారుడైన భీమాసురుణ్ణి సంహరించేందుకు శివుడు ఇక్కడ వెలశాడనేది స్థలపురాణం. ఈ జ్యోతిర్లింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుంటుంది. రౌద్రరూపం దాల్చి భీమాసురుడితో యుద్ధం చేసేటప్పుడు శివుడి శరీరం నుంచి రాలిన స్వేదమే భీమానదిగా మారిందట.


నాగేశ్వరం

శ్రీకృష్ణుని పవిత్ర నగరమైన ద్వారకలో వెలసిన నాగభూషణుడే నాగేశ్వరుడు. ఇక్కడ వెలసిన స్వామి జ్యోతిర్లింగాన్ని సాక్షాత్తూ ఆ లీలామానుష వేషధారి అయిన కృష్ణుడే రుద్రాభిషేకంతో ప్రసన్నం చేసుకున్నాడని ప్రతీతి. దారూకుడనే రాక్షసుడు సముద్రంలో దారుకావనమనే నగరాన్ని నిర్మించుకుని అందరినీ హింసించేవాడనీ ఒకసారి సుప్రియుడనే శివభక్తుడిని బంధించి చిత్రహింసలు పెడుతుంటే రుద్రుడు ప్రత్యక్షమై దారుకుణ్ణి సంహరించి ఇక్కడే జ్యోతిర్లింగమై వెలశాడనీ అంటారు. రుద్రసంహితలోనూ దారుకావన నాగేశం అని నాగేశ్వరుని ప్రస్తావన కనిపిస్తుంది. ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయాలని ప్రయత్నించినప్పుడు శరీరం నిండా పాముల్నీ, చేతుల్లో త్రిశూలాల్నీ ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఔధ్‌గ్రామ్‌, ఆల్మోరా అనే మరో రెండుచోట్లా నాగేశ్వర ఆలయాలు ఉన్నాయట.


ఘృష్ణేశ్వరం

మహారాష్ట్రలోని దౌలతాబాద్‌ సమీపంలో ఉన్న ఈ ఆలయం వేరుల్‌ గ్రామంలో ఉంది. ఇక్కడ ఘృష్ణేశ్వరుణ్ని ఘశ్మేశ్వరుడుగానూ పిలుస్తారు. ఈ నగరాన్ని పూర్వం దేవగిరి అనేవారట. సుధర్ముడు, సుదేహ అనే దంపతులకు ఎంతకాలమైనా పిల్లలు పుట్టకపోవడంతో సుదేహ తన చెల్లెలు ఘశ్మను భర్తకిచ్చి పెళ్లి జరిపిస్తుంది. వారిద్దరికీ బిడ్డ పుట్టాక అసూయతో ఆ బాలుణ్ణి ఏటిలో పారేస్తుంది. శివపూజా దురంధరురాలైన ఘశ్మ 101 పార్థివలింగాలను ఆ నీటిలోకి వదిలి, సర్వేశ్వరుడిని సేవించడంతో ఆమె భక్తికి మెచ్చి, కొడుకుని బతికించడంతోపాటు, ఆమె కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపంలో ఘృష్ణేశ్వరుడుగా వెలశాడనీ చెబుతారు.


వైద్యనాథేశ్వరం

‘సౌరాష్ట్రే సోమనాథంచ...’ అన్న శ్లోకంలో వచ్చే ‘వైద్యనాథం చితాభూమౌ’ అన్నదాని ప్రకారం ఝార్ఖండ్‌లోని సంతాల్‌ పరగణా దేవ్‌గఢ్‌ ప్రాంతంలోనిదే అసలైన వైద్యనాథ జ్యోతిర్లింగం. ఈ లింగాన్ని పూజిస్తే వ్యాధులు నయమవుతాయని ఇక్కడి జ్యోతిర్లింగాన్ని వైద్యనాథుడిగా కొలుస్తారు. యముడి వెంటబడి సావిత్రి సత్యవంతుడి ప్రాణాలు దక్కించుకున్నదీ, మార్కండేయుడు చిరంజీవిగా వరం పొందినదీ ఇక్కడేనట. ఈయనను అమృతేశ్వరుడనీ అంటారు. సాగరమథనం తరవాత అమృతాన్ని ఈ లింగంలో దాచారనీ ఈ లింగాన్ని స్పృశిస్తే అమృతం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. అయితే కొన్నిచోట్ల ‘పర్ల్యాం వైద్యనాథం’ అనీ ఉంటుంది. వాటి ప్రకారం మహారాష్ట్రలోని పర్లి గ్రామంలో ఉన్న శివలింగాన్నీ వైద్యనాథుడిగా చెబుతారు.


కాశీ విశ్వేశ్వరం

వారణాసిగా పేరొందిన కాశీ క్షేత్రంలో ఉందీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం. గంగకు ఉపనదులైన వారుణ, అసి సంగమించే చోటు కాబట్టి ఈ నగరానికి వారణాసి అని పేరు. చరిత్రకందని ఈ పురాతన నగరాన్ని దేవతలు నివసించే పుణ్యక్షేత్రంగా భావిస్తారు. ఇది శక్తి పీఠం కూడా. ఇక్కడి అమ్మవారు విశాలాక్షి. విశ్వేశ్వరాలయం సువర్ణ శిఖరాలతో ఉంటుంది. కాశీలో ఎన్నో ఆలయాలూ, మరెన్నో స్నానఘట్టాలూ ఉన్నాయి. కాశీనాథుణ్ణి దర్శించుకుంటే మిగిలిన జ్యోతిర్లింగాలన్నింటినీ చూసినంత పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ స్నానం, దానం, హోమం ఏది చేసినా మరుజన్మ ఉండదనీ ఇక్కడే మరణిస్తే ముక్తి దొరుకుతుందనీ అంటారు. కాశీ క్షేత్రం పరమశివుడి నివాసంగానూ ప్రసిద్ధి.


త్రయంబకేశ్వరం

మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో ఉందీ ఆలయం. బ్రహ్మవిష్ణువులతో కలిసి శివుడు స్వయంభువుగా వెలసిన క్షేత్రం ఇది. గౌతమ రుషి తన పంటచేలో మేస్తోన్న గోవుని వధించిన పాపపరిహారం కోసం తపస్సు చేయగా, సర్వేశ్వరుడు ప్రత్యక్షమై గంగను ఆ ప్రాంతంలో ప్రవహించేలా చేయడంతోపాటు త్రయంబకేశ్వరుడుగా కొలువుతీరతాడు. అందుకే గౌతముడి తపోఫలాన దివి నుంచి భువికి గంగమ్మతల్లి గోదావరిగా దిగిన చోటుగా దీన్ని అభివర్ణిస్తారు. ఇక్కడి జ్యోతిర్లింగం మూడు ముఖాలతో గుంటలోపలికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతీకగా ఉంటుంది.


రామేశ్వరం

రావణుడిని సంహరించి సీతాసమేతంగా అయోధ్యకు బయలుదేరిన శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకాన్ని పొగొట్టుకునేందుకు రామేశ్వరం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. అందుకోసం శివుడి ఆత్మలింగాన్ని తెమ్మని మారుతిని కాశీకి పంపగా, ఎంతకీ రాకపోవడంతో సీతమ్మవారు ఇసుకతో చేసిన లింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే రామేశ్వర లింగం. ఆ తర్వాత అక్కడకు చేరుకున్న హనుమ, తాను వచ్చేదాకా ఆగలేదని అలగడంతో రాముడు ఆ లింగాన్నీ ప్రతిష్ఠిస్తాడు. అదే విశ్వేశ్వర లింగం. రామేశ్వరంలో హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని పూజించిన తరవాతే రామలింగేశ్వరుణ్ణి పూజించేట్టుగా వరమిస్తాడు.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..