Updated : 10 Oct 2021 06:11 IST

అన్నింటా.. దుర్గమ్మే

దసరా వేడుకల సందర్భంగా ఎటు చూసినా ఆ సుందర మహేశ్వరీ రూపమే. మండపంలో కొలువుదీరిన విగ్రహాలతోపాటు నగలూ దుస్తులూ మాస్కులూ అన్నీ ఆ పరమేశ్వరి రూపాలే..


దసరాకు దుర్గమ్మ నగలు!

సరా... తొమ్మిది రోజుల పండుగ. ప్రతిరోజూ పూజా కార్యక్రమాలుంటాయి. ఆ సందర్భానికి తగ్గట్లూ అందంగా, ఆధ్యాత్మికంగా కనిపించేలా వస్తున్నవే ఈ దుర్గమ్మ మట్టి పెండెంట్‌ నగలు. అమ్మవారి రూపాలతో వస్తున్న ఈ నగల్ని ధరిస్తే ఆదిపరాశక్తిని కొలిచే వేళ ఆ తల్లే మెడలో కొలువైనట్లుండదూ! బంగారం, వన్‌గ్రామ్‌గోల్డ్‌, వెండి నగల్లో అమ్మవారి రూపాలున్నా అవి ఏదో ఒక రంగులోనే ఉంటాయి. కాబట్టి, ఫొటోలోనూ విగ్రహం రూపంలోనూ మనం ఆరాధించే దుర్గమ్మలా కనిపించవు. కానీ మట్టి నగల్లో అమ్మవారి ముఖం అచ్చం విగ్రహంలో ఉన్నట్లే స్పష్టమైన రంగులతో ఉండి ఫొటోలో కనిపించినంత ఆకర్షణీయంగానూ ఉంటుంది. అందుకే, పూసలూ, రంగుల దారాలకూ గుచ్చిన ఈ పెండెంట్‌లను వేసుకుంటే పూజకు తగ్గట్టూ మన అలంకరణలోనూ భక్తి భావన కనిపిస్తుంది.  


మాస్కులోనూ అమ్మ రూపమే!

రన్నవరాత్రులు... దాండియా నృత్యాలూ రామలీలా నాటకాలూ పులివేషాలూ బంగారు బతుకమ్మలూ కోలాటాల కోలాహాలూ షడ్రుచుల నైవేద్యాలూ ప్రత్యేక పూజావిధానాలూ విశిష్ట అలంకారాలూ... ఇలా దేశమంతా ఒకటే సందడి. కరోనా భయంతో గతేడాది ఆ సంరంభం తగ్గిందనేది తెలిసిందే. ఇటీవల వైరస్‌ తీవ్రత తగ్గడం, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయడంతో ఈసారి వేడుకల్లో భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఉత్సవం చిన్నదైనా పెద్దదైనా సమూహంలోకి వెళ్లినప్పుడు మాస్క్‌ మాత్రం తప్పనిసరి కదా. అందుకే ఎటు చూసినా అమ్మ రూపమే గోచరించేలా ఆ మాస్కుల్నీ దుర్గమ్మ బొమ్మలతోనే రూపొందిస్తున్నారు ఉత్పత్తిదారులు... ఎదుటివారి ముఖంలోకి చూసినప్పుడు ప్రశాంతమైన ఆదిశక్తి రూపాన్ని చూడగానే కరోనా భయం వీడి, అందరూ భక్తిపారవశ్యంతో మునిగిపోతారని కాబోలు. కారణమేదయితేనేం... భక్తులందరూ ఆ మాస్కుల్ని ఇష్టంగా కొనుక్కుంటున్నారు.


  మనిషా... ప్రతిమా...!

ణేశ నవరాత్రుల సమయంలోలానే దసరా సమయంలోనూ మందిరాలను ఏర్పాటుచేసి దుర్గామాత విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు జరిపిస్తారు. అయితే అవన్నీ ఎంత అద్భుతంగా అలంకరించినా చూసేవాళ్లకు విగ్రహాలనే తలపిస్తాయి. కానీ మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ‘అటల్‌ జిరాఫే ఆర్ట్స్‌ గ్యాలరీ’లోని దేవతా ప్రతిమల్ని చూస్తే ఎవరైనా కాసేపు తత్తరపాటుకు గురవడం ఖాయం. అది విగ్రహమా లేక నిజరూపమా అన్నంత సజీవంగా ఉంటాయక్కడి అమ్మవారి విగ్రహాలు. కేవలం దుర్గామాత అనే కాదు, మంగళగౌరీ, మహాలక్ష్మీ, గణేశుడు... ఇలా ఏ ప్రతిమైనా అటల్‌ చేతిలో ఎంతో సహజంగా రూపుదిద్దుకుంటుంది. ఆ కట్టూ బొట్టూ నగల అలంకరణా తీర్చిదిద్దినట్లుగా ఉంటాయి. దాంతో ఎవరైనా సరే ‘విగ్రహమా... మనిషా...’ అన్న సందేహంతో ఒకటికి పదిసార్లు ఆ మూర్తినే తదేకంగా చూస్తుండిపోవాల్సిందే మరి!


‘బంగారు’ తల్లి

కప్పుడు ఎవరైనా ఒంటినిండుగా నగలు ధరిస్తే ‘అమ్మోరులా ఉన్నావు’ అంటూ ఆటపట్టించేవారు. అయితే ఇప్పుడు అమ్మవారిని సైతం నగల రూపంలో ధరించడమే తాజా ట్రెండ్‌. పైగా వేడుకల సమయంలో ఎంత నిండుగా అలంకరించుకుంటే అంత అందంగానూ ఆడంబరంగానూ ఉంటుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే జ్యువెలరీ సంస్థలు సైతం తమదైన విశిష్టతను చాటుకునేందుకు నగల డిజైన్లలో ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ దుర్గామాత హారం అలా రూపొందించినదే. గుజరాత్‌కు చెందిన జె. రామచంద్ర అనే వ్యాపారి దీన్ని తయారుచేయించాడట. ఇది ధరిస్తే అమ్మవారు గుండెలమీద కొలువుదీరినట్లు ఉండదూ!


 


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని