ఆ మొక్క బ్రూఫెన్‌లానే..

ఒళ్లునొప్పులుగా అనిపిస్తే ఓ బ్రూఫెన్‌ ట్యాబ్లెట్‌ వేస్తే తగ్గి పోతుంది అనుకుంటాం. అయితే ఇలాంటివాటికి సంప్రదాయ వైద్యులు ఏదో ఆకునో కాండాన్నో నూరి ఇస్తుంటారు. సమోవా దీవుల్లో మటలాఫి అనే ఒక రకం..

Updated : 12 Aug 2022 15:29 IST

ఆ మొక్క బ్రూఫెన్‌లానే..

ళ్లునొప్పులుగా అనిపిస్తే ఓ బ్రూఫెన్‌ ట్యాబ్లెట్‌ వేస్తే తగ్గి పోతుంది అనుకుంటాం. అయితే ఇలాంటివాటికి సంప్రదాయ వైద్యులు ఏదో ఆకునో కాండాన్నో నూరి ఇస్తుంటారు. సమోవా దీవుల్లో మటలాఫి అనే ఒక రకం మొక్క ఆకుల్లో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించే గుణాలు మెండుగా ఉన్నాయనీ, ఇది అచ్చంగా బ్రూఫెన్‌లా పనిచేస్తుందనీ చెప్పుకొస్తున్నారు వెల్లింగ్‌టన్‌లోని విక్టోరియా యూనివర్సిటీ నిపుణులు. అందుకే అక్కడ తరతరాల నుంచీ ఈ ఆకుల్ని నూరిన ముద్దను చర్మ సంబంధిత సమస్యలకీ జ్వరంతో వచ్చే ఒళ్లునొప్పులకీ వాపులకీ వాంతులకీ పొట్ట సమస్యలకీ మందుగా ఇస్తారట. ముఖ్యంగా ఈ ఆకుల్లోని పదార్థాలకి ఐరన్‌ని బంధించి ఉంచే గుణం ఉండటంతో అవి అదనంగా ఉన్న ఐరన్‌ని పీల్చుకుంటు న్నాయట. దాంతో శరీర కణాల్లో ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గినట్లు గుర్తించారు. మెదడు కణాల్లో కూడా ఐరన్‌ గాఢత ఎక్కువగా ఉండటం వల్లే ఆల్జీమర్స్‌... వంటి అనేక నాడీ సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకులు గతంలోనే గుర్తించారు. పైగా ఈ మొక్కలోని రుటిన్‌, నికొటిఫ్లోరిన్‌... వంటి పదార్థాలు జన్యు సంబంధిత ఊబకాయం, మధుమేహం, హృద్రోగాలు, క్యాన్సర్లకు కారణమైన జన్యువులతో కూడా చర్య పొందుతున్నట్లు గుర్తించారు. దాంతో దీనిమీద మరింత సమగ్రంగా అధ్యయనం చేసి ఈ మొక్కను అంతటా వాడుకలోకి తీసుకువచ్చేలా చేయాలనుకుంటున్నారు.


వాసనతోనే మనుగడ సాధ్యమా?

నిషి శరీరంలోని జ్ఞానేంద్రియాలన్నీ కీలకమే. వాటిల్లో వాసనకి ఎంతో ప్రాధాన్యం ఉంది అంటున్నారు స్వీడన్‌లోని కరొలింకా ఇన్‌స్టిట్యూట్‌కి చెందిన పరిశోధకులు. ఎందుకంటే- దుర్వాసన రాగానే ఆటోమేటిగ్గా ముక్కుకి చెయ్యి అడ్డుపెట్టుకుంటాం. ఇలా చెడు వాసనల్ని గుర్తించడం అనేది మనుగడలో కీలకమైన అంశమనీ ఇది మెదడు పనితీరుకి నిదర్శనమనీ చెబుతున్నారు. వాసనని పసిగట్టే ఆల్ఫాక్టరీ గ్రంథి మెదడులో ఐదు శాతం ఉంటుంది. ఇది వేల రకాల వాసనల్ని గుర్తించగలదు. కేవలం మనుషుల్లోనే కాదు, ఇతర ప్రాణులు సైతం ఘ్రాణశక్తి ద్వారానే తమ ఆరోగ్యాన్ని కాపాడుకోగలవు. రసాయనాలూ కుళ్లిన ఆహారాన్ని వాసన ద్వారానే తెలుసుకుని వాటికి దూరంగా ఉంటాం. వాసనకు సంబంధించిన సంకేతాలు మెదడుకు 100 నుంచి 150 మిల్లీ సెకన్లలో చేరుకుంటాయి. అంటే- అంత వేగంగా గుర్తించగలుగుతాం. అయితే దుర్వాసన రాగానే ‘ఈ వాసన మంచిది కాదు’ అన్న విషయాన్ని కేంద్రనాడీవ్యవస్థ ఏ రకంగా కనిపెడుతుందనేది మాత్రం ఇంతవరకూ కనిపెట్టలేకపోయారు. తాజా పరిశోధనల్లో చెడువాసన వచ్చినప్పుడు మెదడులో జరిగే మార్పుల్ని స్కానింగుల ద్వారా తెలుసుకున్నారట. దీని ఆధారంగా వృద్ధాప్యంలో ఘ్రాణశక్తి తగ్గితే చికిత్స చేయవచ్చు అంటున్నారు.


కరోనా వైరస్‌తో గుండెజబ్బు!

రోనా సోకిన వాళ్లకి ఊపిరితిత్తులే ఎక్కువగా దెబ్బతింటాయి అనుకునే వారు మొదట్లో. కానీ కరోనా సోకి ఆసుపత్రి పాలయిన వాళ్లలో అనేకమంది  గుండెజబ్బుల బారిన పడ్డారు. దీనికి కారణం వైరస్‌ రక్తనాళాలను దెబ్బతీయడమేనని టెల్‌ అవీవ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. సార్స్‌కోవ్‌ వైరస్‌కి చెందిన ఐదు రకాల ప్రొటీన్లు రక్తనాళాల్ని బాగా దెబ్బతినేలా చేస్తున్న విషయాన్ని వీళ్లు గుర్తించారు. అదెలా అంటే- కరోనా వైరస్‌లో ఉన్నవి మొత్తం 29 రకాల ప్రొటీన్లే. కాబట్టి ఆ ప్రోటీన్లు అన్నింటినీ ల్యాబ్‌లో పరిశీలించినప్పుడు- వాటిల్లో ఐదు ప్రొటీన్లు రక్తనాళాల ఉపరితల కణాల్ని బాగా దెబ్బతినేలా చేశాయట. అందువల్లే వైరస్‌ బారినపడినవాళ్లలో కొందరిలో రక్తం గడ్డకడుతుందనీ తద్వారా గుండెజబ్బులు, పక్షవాతం బారిన పడుతున్నారనీ అంటున్నారు. ఇందుకు కారణమైన ప్రొటీన్లను గుర్తించడం వల్ల వాటి నిర్మూలనకి మందులు వాడటం ద్వారా వైరస్‌ వల్ల రక్తనాళాలకు నష్టం జరగకుండా చూడొచ్చు అంటున్నారు పరిశోధకులు.


నిద్రమీద చంద్రుడి ప్రభావం!

నిషిమీద గ్రహాల ప్రభావం ఉంటుందా లేదా అన్నది పక్కన పెడితే, చంద్ర భ్రమణం వల్ల మనిషి నిద్రావేళల్లో మార్పులు చోటుచేసుకుంటాయనేది మాత్రం నిజమే అంటున్నారు స్పెయిన్‌లోని ఉపాసల యూనివర్సిటీకి చెందిన న్యూరోసైన్స్‌ నిపుణులు. చంద్రుడు భూమిచుట్టూ తిరగడం వల్ల నెలలో సగం రోజులు వృద్ధి చెందుతూ మిగిలిన సగం రోజులూ తగ్గుతుంటాడు. నెలవంక తరవాత క్రమంగా పెరుగుతూ పూర్ణచంద్రుడులా కనిపించేది  పౌర్ణమి అనీ, ఆ తరవాత రోజు నుంచీ క్రమంగా తగ్గుతూ కనీకనిపించని గీతలా ఉండేది అమావాస్య అంటారనేది తెలిసిందే. అయితే అవి మనిషి నిద్రమీద ఎలాంటి ప్రభావాన్ని కనబరుస్తున్నాయనేదాన్ని పరిశీలించి చూసినప్పుడు- అమావాస్య నుంచి పౌర్ణమి వరకూ ఎక్కువగానూ, పౌర్ణమి నుంచి అమావాస్య వరకూ తక్కువగానూ నిద్రపోతున్నట్లు గుర్తించారు. పైగా స్త్రీలతో పోలిస్తే చంద్రుడి ప్రభావం మగవాళ్లపైనే ఎక్కువగా ఉందట. దీని ఆధారంగా రాత్రివేళల్లో చుట్టుపక్కల ఉండే కాంతి మగవాళ్ల మెదడుని ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది.


సిల్లీ పాయింట్‌

అమెరికాకు చెందిన ఎర్నెస్ట్‌ విన్సెంట్‌ రైట్‌ రాసిన ‘గాడ్స్బి’ నవల ఆంగ్ల అక్షరం ‘ఇ’ లేకుండా రాసిన అతిపెద్ద నవల. దీన్లో 50,000 పదాలున్నాయి.

* గబ్బిలం నాలుక.. దాని శరీరంకన్నా ఒకటిన్నర రెట్లు పొడవైంది. మరే జంతువుకీ ఈ రికార్డు లేదు!
* చూయింగ్‌ గమ్‌, చాకొలెట్‌ రెండింటినీ కలిపి తింటే... చూయింగ్‌ గమ్‌ కూడా చాక్లెట్‌లాగే అప్పటికప్పుడు కరిగిపోతుంది. ప్రయత్నించి చూడండి..!
* బతికున్నవాళ్లు చచ్చిపోయినట్టు కొందరు భ్రమపడుతూ ఉంటారు.. ఈ మానసిక సమస్యని ‘మండేలా ఎఫెక్ట్‌’ అంటారు. 1980లో, అప్పటికింకా జైల్లోనే ఉన్న ఆఫ్రికన్‌ నేత నెల్సన్‌ మండేలా చనిపోయినట్టు ఫియానా బ్రూమ్‌ అనే సైకో ఎనలిస్ట్‌ కల కని దాన్నే ప్రచారం చేయడంతో.. ఈ పేరొచ్చింది!
* మనం నీళ్లలో నిలబడిన కొద్దిసేపటికే అరిచేతులూ కాళ్లలోని చర్మం ముడతలుపడినట్లవుతుంది. నీటిలో కాళ్లు జారిపోకుండానూ చేతులు దేన్నైనా పట్టుకునేందుకు పట్టు కుదిరేలానూ శరీరం తనకు తనే ఇలా మార్చుకుంటుందని పరిశోధనలు తేల్చాయి.
* ఐబీఎం సంస్థ కంప్యూటర్‌లని తయారుచేయడానికి ముందు.. టైప్‌రైటర్‌లని ఉత్పత్తి చేస్తుండేది.
* అలస్కాలోని బారో నగరం ఉత్తర ధృవానికి దగ్గరగా ఉండడం వల్ల అక్కడ ఏటా నవంబర్‌ నెల మధ్య నుంచి 65రోజుల పాటు చీకటే ఉంటుంది.
* హమ్మింగ్‌ బర్డ్‌లు రెండంగుళాల కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయంతే. ఎంత చిన్నగా అంటే వాటిని చూసి పురుగేమో అని భ్రమ పడేంత.
* మద్యం కేవలం ఆరు నిమిషాల్లో మెదడు మీద ప్రభావం చూపుతుంది.


మనదేశంలోని రైల్వే పట్టాల నడుమ కొలత 5.6 అడుగులు. దీన్ని మనం బ్రాడ్‌గేజ్‌ అంటుంటాం.  అదెందుకోకానీ దీన్ని మిగతాదేశాలు... ‘ఇండియన్‌ గేజ్‌’ అనే పిలుస్తాయి!


బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 బయటికొచ్చినప్పుడు వేసుకునే దుస్తుల గురించిన వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేస్తారు. దాని ప్రకారం- ఆమె ఓరోజు వేసుకున్న దుస్తులూ టోపీలను మళ్లీ ధరించాలంటే కొన్నేళ్ల సమయం పడుతుందట.


సీతాకోక చిలుకలు కళ్లు తెరుచుకునే నిద్రపోతాయి... వాటికి కనురెప్పలు ఉండవు మరి!


ఈజిప్టు రాజచరిత్రలో ఏడుగురు క్లియోపాత్రాలున్నారు. మనందరికీ తెలిసిన క్లియోపాత్రా..ఆ వంశంలో చిట్టచివరి రాణి మాత్రమే!


1970 వరకూ ఫుట్‌బాల్‌ పందెంలో విజయం ఎటూ తేలకపోతే... బొమ్మాబొరుసు వేసి విజేతలని నిర్ణయించేవారు!


అంతరిక్షంలో స్పేస్‌సూట్‌ లేకుండా కేవలం పదిహేను సెకన్లే బతకగలరు.


పసిఫిక్‌ మహా సముద్రంలో ఉండే పఫర్‌ చేపలు తమ నోరు, మొప్పల సాయంతోనే సముద్రం అడుగున చక్కటి సైకత శిల్పాల్ని సృష్టిస్తాయి. ఆడ చేపల్ని ఆకర్షించడానికి మగ పఫర్‌ చేపలు ఈ అందమైన గుండ్రటి చిత్రాలను తీర్చిదిద్దుతాయట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు