ప్రశ్న... అడగనివ్వండి..!

యుద్ధభూమిలో చుట్టూ ఉన్న బంధుమిత్రులను చూసి ‘ఇప్పుడు నా కర్తవ్యమేమిటీ’ అన్న అర్జునుడి ప్రశ్న... మనకు భగవద్గీతను ఇచ్చింది.

Updated : 12 Mar 2024 15:52 IST

యుద్ధభూమిలో చుట్టూ ఉన్న బంధుమిత్రులను చూసి ‘ఇప్పుడు నా కర్తవ్యమేమిటీ’ అన్న అర్జునుడి ప్రశ్న... మనకు భగవద్గీతను ఇచ్చింది. ‘చెట్టుమీద నుంచి కాయ కిందికే ఎందుకు పడిందీ’ అన్న ప్రశ్న న్యూటన్‌ని శాస్త్రవేత్తను చేసింది. అయినా ఎందుకో మనకి ప్రశ్న అంటే చిన్నచూపు. పసివాడు ఏదన్నా అడగడం ఆలస్యం... ‘చెప్పింది చెయ్యకుండా యక్షప్రశ్నలూ నువ్వూనూ...’ అని కసిరి పడేస్తాం. ఇంకేముంది... అడగడం తప్పన్న అభిప్రాయం ఆ చిన్ని మనసులో స్థిరపడిపోతుంది. మారాకు వేయబోతున్న మొక్కను రెండు వేళ్లతో పీకి అవతల పడేసినట్లు ఎదిగే పిల్లల మనసులో తెలుసుకోవాలనే జిజ్ఞాసని ఒక్క కసురుతో తుంచి పడేస్తున్నాం! ఆ తప్పు చేయవద్దని హెచ్చరిస్తున్నారు నిపుణులు!

డాది బిడ్డను ఒళ్లో కూర్చోబెట్టుకుని- నీ కళ్లేవీ... చెవులేవీ... ముక్కు చూపించు... బొజ్జ చూపించు... అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలేస్తాం. వాళ్లు ఆ మాటల్ని అర్థం చేసుకుని చేతి సైగల ద్వారా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే- అబ్బో చిట్టితండ్రికి అన్నీ తెలిసిపోయాయే... అని మురిసిపోతాం. పాకమనీ, నడవమనీ, పాడమనీ, డాన్స్‌ చేయమనీ... వాళ్లచేత బంధువుల ముందు ప్రదర్శనలు ఇప్పిస్తాం. రెండు మూడేళ్ల దాకా సాగే ఈ ప్రహసనం అక్కడినుంచీ హఠాత్తుగా తిరగబడుతుంది. అప్పటివరకూ చెప్పింది చేసిన పిల్లలు ఇక ఎదురు ప్రశ్నించడం మొదలెడతారు.

‘అదేంటి..?’

‘ఇదెందుకు..?’

‘వాళ్లు ఎవరు..?’

ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తారు. మొదట్లో తల్లులూ తండ్రులూ మురిపెంగానే సమాధానాలు చెబుతారు. కానీ ఆ ప్రశ్నల పరంపర ఒక్క సమాధానంతో ఆగదు. ‘ఇది పువ్వు’ అని చెబితే...

‘అంటే ఏంటీ’ అని అమాయకంగా అడుగుతారు. ఎక్కడిది, ఎలా వచ్చింది... ఇలా దాని పుట్టుపూర్వోత్తరాలన్నీ చెప్పాల్సివచ్చేలా వరస ప్రశ్నలు సంధిస్తారు.

అది చూసి జడిసిపోతారు తల్లిదండ్రులు. ‘మావాడొక క్వశ్చన్‌ బ్యాంక్‌. వాడికి సమాధానాలు చెప్పలేక ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి బయటపడతామా అన్పిస్తుంది’ అని ఫిర్యాదు చేస్తుంటారు. కొన్నాళ్లకు ఆ దశ కూడా దాటి కసురుకోవడం మొదలుపెడతారు.

‘అరేయ్‌ నా బుర్ర తినకురా. కాసేపు అవతలికి పో’

‘వెధవప్రశ్నలు కట్టిపెట్టి చెప్పింది చెయ్యి’

‘హోంవర్కు చేసుకోక ఈ పనికిమాలిన ప్రశ్నలన్నీ ఎందుకు నీకు’

... అంటూ కోప్పడి పిల్లల్ని అవతలికి గెంటేసి తమ పని తాము చేసుకుంటారు.

మీరూ అలాంటి పెద్దలే అయితే ఇది మీకోసమే!

‘ప్రశ్నించడం ఎలాగో తెలిసి దానిమీద పట్టు సాధించిన వ్యక్తి చాలా అంశాలపై పట్టు సాధించగలడు’ అంటారు రచయిత టెడ్‌ అగాన్‌. ‘ద హ్యూమన్‌ కీ’(తెలుగు అనువాదం: ప్రశ్న ఎందుకు- విశాలాంధ్ర ప్రచురణ) పేరుతో ఆయన రాసిన పుస్తకం ప్రశ్న ఎంత గొప్పదో వివరిస్తుంది.

‘పిల్లవాడి ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఆరోజుకు తృప్తిపడతాడు. ప్రశ్న అడగడం నేర్పండి, జీవితాంతం లాభపడతాడు...’ అంటారు టెడ్‌. ఆలోచన, నేర్చుకోవడం, వ్యక్తీకరణ... ప్రధానంగా ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే ఈ పుస్తకం ఏం చెబుతుందంటే...

అన్నీ కాదు...

పసిపాపాయిని పలకరించగానే బోసినవ్వులు చిందిస్తుంది. ఆకలైతే ఏడుస్తుంది. అంతకు మించి ఏమీ తెలియదు. అదే ఓ ఏడెనిమిది నెలలు వచ్చాక కోప్పడి చూడండి. బిక్కమొహం వేస్తుంది. తనని ఎవరు ప్రేమగా ఎత్తుకుంటున్నారో ఎవరు విసుక్కుంటున్నారో కనిపెట్టగలుగుతుంది. తనకు నచ్చే పనులు చేయించుకోవడానికి రకరకాల హావభావాలు ప్రదర్శిస్తుంది. అనుభవాలు పెరిగే కొద్దీ మెదడు మారుతుంది. ఆ మార్పులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోగల శక్తి బాల్యంలోనే ఎక్కువగా ఉంటుంది. అందుకే  పిల్లల తెలివితేటలూ జీవననైపుణ్యాలలో 85శాతం వరకూ ఐదేళ్లలోపే అభివృద్ధి చెందుతాయంటారు. వేడిగా ఉన్న కుక్కర్‌ కాలుతుంది ముట్టుకోవద్దు అని మనం చెప్పిన దానికన్నా ఒకసారి కాలితేనే వాళ్లకి బాగా గుర్తుంటుంది. మరోసారి కుక్కర్‌ జోలికి వెళ్లరు. అంతమాత్రాన వారికి మంచీ చెడూ లాభనష్టాలూ పనికొచ్చేదీ పనికిరానిదీ లాంటి విషయాలన్నీ కూడా అర్థం అయిపోతాయనుకోకూడదు. ముద్దుముద్దుగా బోలెడు కబుర్లు చెప్పే మూడేళ్ల పిల్లలు ఫోనూ రిమోట్‌ లాంటి వస్తువుల్ని విసిరికొట్టడం, పదార్థాల్ని పారబోయడం వంటి అల్లరి పనులు చేసేది అందుకే. ‘ఇన్ని కబుర్లు చెబుతావు, పగిలిపోతుందని తెలియదా...’ అని అమ్మోనాన్నో కోప్పడడం తరచూ వింటూనే ఉంటాం. పిల్లల్లో ఈ నైపుణ్యాలు పెరగడానికి తోడ్పడే మెదడులోని కార్టెక్స్‌ అనే భాగం అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. భావోద్వేగాలను కూడా నియంత్రించే ఈ భాగం దాదాపు పాతికేళ్లు వచ్చేవరకూ పెరుగుతూనే ఉంటుంది. టీనేజీ పిల్లల్లో ఆవేశం, అస్థిరత్వం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లాంటివి కన్పించడానికి కారణం ఇదే. కాబట్టి ‘ఇది తెలిసినప్పుడు అదెందుకు తెలియదూ’ అని పోల్చుకోవద్దు.

నేర్చుకునే యంత్రాలు

బాల్యంలో పిల్లలు నేర్చుకునే యంత్రాల్లాగా ఉంటారు. ప్రశ్నించే గుణం ఆ వయసులో సహజంగానే ఉంటుంది. దాన్ని మనం నేర్పనక్కర లేదు, చేయాల్సిందల్లా వాళ్ల కుతూహలం మీద నీళ్లు చల్లకుండా ప్రోత్సహించడం. జీవితం కూడా ఒక భవనం లాంటిదే. దాని పునాది దశలో పొరపాట్లు చేస్తే భవనం గట్టిగా నిలబడదు. మెత్తని లేత మెదళ్లను మనం నైపుణ్యాలతో ఎంత బలంగా తీర్చిదిద్దితే జీవితంలోనూ వారు అంతే దృఢంగా నిలబడగలుగుతారు. ‘అయ్యో, మా పిల్లలు పెద్దవాళ్లయిపోయారే, బడికి వెళ్లిపోతున్నారు, ఇప్పుడిక చేసేదేం లేదు’ అనుకోవద్దు. పదేళ్లొచ్చినా, పదిహేనేళ్లొచ్చినా పర్వాలేదు. మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఎందుకంటే మెదడు అభివృద్ధి చెందడమనేది నిరంతర ప్రక్రియ. అందుకని ఇప్పటినుంచైనా మొదలుపెట్టమంటారు టెడ్‌. ఆలోచించడమూ, నేర్చుకోవడమూ, వ్యక్తీకరణా... ఈ మూడూ లేకుండా వ్యక్తిత్వ వికాసమే ఉండదు మరి.

నేర్చుకోవలసిన విషయాల్లో మొట్టమొదటిది ఆలోచన అంటే ఏమిటో తెలుసుకోవడం. మనం నిత్యం ఈ మాటను వాడుతూనే ఉంటాం, కానీ నిజంగా ఆలోచన అంటే ఏమిటో తెలియదు. ఆలోచన అంటే మనని మనం ప్రశ్నించుకునే ప్రక్రియ. జవాబు లేని ప్రశ్నలు ఉండవచ్చు కానీ ప్రశ్నలు లేని జవాబులు ఉండవు.

ఆలోచన, ప్రశ్నించడం- రెండూ ఒకే ప్రక్రియకున్న రెండు పేర్లు. ఆలోచనే ప్రశ్నను రేకెత్తిస్తుంది. ప్రశ్నిస్తున్నారూ అంటే ఆలోచిస్తున్నారు అని అర్థం. ప్రశ్నకు సమాధానం రావడంతో అది ఆగదు. ఇంకా ఇంకా కొత్త ప్రశ్నలు వస్తాయి. అంటే- ఆలోచన అనే రైలుబండిని నడిపే ఇంజను ప్రశ్న. అలాంటి ఎన్నో ప్రశ్నల ఫలితమే- సమస్యలకు పరిష్కారాలూ, చర్యలూ, ఆవిష్కరణలూ, సిద్థాంతాలూ, తీర్పులూ లాంటివన్నీ. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎందరో మేధావుల ఆలోచనల ఫలితమే- నేటి మన సమాజ ప్రగతి. పంటకు విత్తనం ఎలాగో ప్రగతికి ప్రశ్న అలా. ప్రశ్నించడం ద్వారా అజ్ఞానం నుంచి జ్ఞానంలోకీ, అంధకారం నుంచి వెలుతురులోకీ ప్రయాణిస్తాం.

ప్రశ్న... తాళంచెవి

పసిపిల్లలను గమనించండి. ఏదైనా ఒక బొమ్మ ఇస్తే దాన్ని తేరిపార చూస్తారు. ఏమిటిదీ అన్నట్లుగా నొసలు చిట్లిస్తారు. చేత్తో పట్టుకుంటారు. నోట్లో పెట్టుకుంటారు. దాన్ని అనుభూతి చెందడానికి వాళ్లు చేసే పనులు అవన్నీ. అదేమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస వాళ్లనలా చేయిస్తుంది. మాట వచ్చాక అదే ప్రశ్నల రూపం సంతరించుకుంటుంది. చిన్నపిల్లల నుంచి వచ్చే ప్రశ్నల సునామీ తాకిడిని తట్టుకోలేక వాళ్లను అదుపు చేస్తున్నామంటే వాళ్ల మానసిక వికాసాన్ని కుదిస్తున్నామన్నమాటే. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా
జరిగేది అదే. జిజ్ఞాస పరిశోధనలకి పెట్టుబడి. అది ఏ రంగంలోనైనా సరే. శాస్త్రవేత్తలు పిల్లల్లాగా ఎప్పుడూ జిజ్ఞాస చూపడంలో ముందుంటారు. ఇవాళ మన ఇంట్లో నిరంతరం ప్రశ్నలు సంధించే పిల్లవాడు రేపు ఏ శాస్త్రవేత్తో, ఆవిష్కర్తో కావచ్చు. అధ్యాపకుడో, మేధావో కావచ్చు. అందుకే ప్రశ్నించే నైపుణ్యాన్ని పిల్లలకు అలవర్చాలి. ఎందుకంటే అది వారి జీవితాన్నే మలుపు తిప్పుతుంది. ప్రశ్నే లేకపోతే ఏ శాస్త్రమూ లేదు. ప్రశ్నని మరింత మెరుగుపర్చుకున్న కొద్దీ నేర్చుకునేది పెరుగుతుంది.

చిన్నతాళం చెవి పెద్ద తలుపులను తెరుస్తుందని సామెత. ఆలోచనా ప్రపంచంలోకి ప్రవేశించడానికి ద్వారాన్ని తెరిచేది చిన్న ప్రశ్నే. పిల్లలకు మనం ఇవ్వగల గొప్ప కానుకల్లో మొదటిది ప్రేమ, రెండోది ప్రశ్నించే కళను నేర్పడం. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి... ఆలోచించని వాళ్లు ప్రశ్నించరు, ప్రశ్నించని వాళ్లు ఆలోచించరు. ప్రశ్నల ద్వారా జ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. ప్రశ్నలు మర్చిపోతాం కానీ జవాబులు గుర్తుంటాయి. ఇప్పుడీ ప్రపంచంలో మనకి అందుబాటులో ఉన్న ప్రతి సమాచారపు తునక వెనకాలా నమోదుకాని ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్న మానవ నాగరికతకు కూకటి వేరు.

తప్పించుకోవద్దు

‘ఎందుకు..?’... ఈ పదం పిల్లలు వేసే ప్రశ్నల్లో ముఖ్యమైనది. చాలా సందర్భాల్లో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేమూ తప్పించుకోలేమూ అన్నట్లుంటుంది పెద్దల పరిస్థితి. కానీ తప్పించుకోకూడదు. వారి ప్రశ్నలకు సానుకూలంగా స్పందించాలి. ఇబ్బందికరమైన లేదా సమాధానం తెలియని ప్రశ్నలైతే- తప్పించుకున్నట్లు తెలియకుండా చాకచక్యంగా వ్యవహరించాలి. కొంచెం పనిలో ఉన్నాను, మళ్లీ చెబుతాను అని అప్పటికి దృష్టి మళ్లించవచ్చు. కొన్నిసార్లు ఆ ప్రశ్నల్ని తిరిగి పిల్లల్నే అడగడం ద్వారా కూడా ఆ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ‘నువ్వేమనుకుంటున్నావు, నువ్వైతే ఏం చేస్తావు’ అని వాళ్లను మరికాస్త ఆలోచించేలా చేసి దీని గురించి మనం మళ్లీ మాట్లాడుకుందాం... అని చెప్పవచ్చు. తర్వాత తీరిగ్గా ఆలోచించి వారడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడం మాత్రం మరవద్దు. అది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

కొన్ని కుటుంబాల్లో పెద్దల్ని ప్రశ్నించడాన్ని తప్పుగా అవిధేయతగా భావిస్తారు. తమ ఆధిపత్యానికి తెరపడుతుందని జడిసి సంస్కృతీ సంప్రదాయాల సాకుతో నోళ్లు మూయిస్తారు. అది సరికాదు. పిల్లల్లో తెలుసుకోవాలనే కుతూహలాన్ని అణచేవాళ్లు పిల్లల భవిష్యత్తుతో పాటు సమాజ భవిష్యత్తునీ అణచివేస్తున్నట్లే. కాలంతో పాటు మారని మనిషీ మారని సమాజమూ... జీవన్మృతుల కిందే లెక్క. ప్రశ్నించడం అంటే మనిషిగా ఉండటం. మనిషిగా ఉండాలంటే ప్రశ్నించాలి. ప్రశ్నించడం, ఆలోచించడం, నేర్చుకోవడం వచ్చినవారు భావ వ్యక్తీకరణలోనూ ముందుంటారు.

సానపట్టాలి!

సరిగ్గా ఆలోచించని, బద్ధకించే పిల్లల్ని చూసి ‘ఆ బుర్రకి కాస్త పనిచెప్పు’ అంటుంటారు. అలాంటివాళ్లు మెదడులో కొంత భాగాన్నే వాడుతుంటారని కొందరి అభిప్రాయం. నిజానికి అలాంటిదేమీ లేదు. ఏ స్థాయి తెలివి గలవారైనా మెదడుని నూటికి నూరుశాతం వాడాల్సిందే. మెదడు మనకు తెలియకుండానే నిరంతరం ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు చెప్పుకుంటూ ఉంటుంది. అనుభవాలూ జ్ఞాపకాల ఆధారంగా మనకు తెలిసిన సమాచారాన్నంతా ప్రాసెస్‌ చేస్తుంది. దానికి అనుగుణంగానే మన దృక్కోణం, అవగాహనా మారుతుంటాయి. అయితే మెదడుకి ఉన్న ఈ శక్తిని సాధనతో పెంచుకోవచ్చు. ప్రశ్నించే కళని నిరంతరం సాధన చేస్తే ఆ శక్తి క్రమేణా అభివృద్ధి చెందుతుంది. మెదడుని ఎంత ఎక్కువ ఉపయోగిస్తే అంత ఎక్కువ అందుబాటులోకి వస్తుంది.

పెద్దలతో పోలిస్తే ఐదేళ్లలోపు పిల్లలు నేర్చుకోవడంలో మేధావుల కింద లెక్క. ప్రతివిషయం చూసి, విని నేర్చేసుకుంటారు. వాళ్లకు భాష పనిగట్టుకుని ఎవరూ నేర్పరు. సొంతంగా నేర్చుకుంటారు కాబట్టే వాళ్లకు వచ్చిన ప్రతి సందేహాన్నీ ప్రశ్నలుగా అడగడానికి సిగ్గుపడరు, సందేహించరు. ఒకోసారి అడిగిన ప్రశ్ననే మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. అదే వారికి సాధన. అందుకే మనమూ విసుక్కోకుండా సమాధానం చెబుతూనే ఉండాలి. ప్రశ్నించే నేర్పరితనాన్ని పెంచడంవల్ల పిల్లల్లో సృజనశక్తీ సామర్థ్యాలూ పెరుగుతాయి. లేత వయసులో మనం ఆ పని చేస్తే ఆ మొక్క పెరిగి జీవితకాలం ఫలితాలను ఇస్తూనే ఉంటుంది. శారీరక వ్యాయామాలతో కండరాలు బలిష్ఠంగా తయారైనట్లే ప్రశ్నలూ ఆలోచనలతో మెదడు సమర్థంగా తయారవుతుంది. ఆలోచనల్లో పొరపాట్లు జరగడం సహజం. పర్వాలేదు, అవి మరిన్ని ప్రశ్నలను రేకెత్తిస్తాయి. విజయాల ద్వారా కన్నా పొరపాట్ల ద్వారానే మనిషి ఎక్కువగా నేర్చుకుంటాడు.

అడగనివ్వండి!

‘ప్రశ్న అడిగినవాడిని ఐదు నిమిషాలు తెలివి తక్కువవాడు అనుకోవచ్చు. అడగనివాడు ఎప్పటికీ తెలివి తక్కువవాడే’ అని చైనా సామెత. తనకు అర్థం కాని విషయం గురించి తరగతి గదిలో టీచర్ని అడగడానికి కొందరు పిల్లలు సిగ్గుపడతారు. ఇంట్లో అమ్మానాన్నా కొడతారేమోనని భయపడతారు. తల్లిదండ్రులూ టీచర్లూ కూడా దాన్ని గమనించి వారి సంకోచాన్ని పోగొట్టాలి. ఆధునిక జీవన విధానంలో సమస్యలకు పరిష్కారాలు ప్రశ్నల ద్వారానే లభిస్తాయి. వైద్యం, విద్య, ఆర్థిక భద్రత, సాంఘిక స్థిరత్వం, పౌరహక్కులు... అన్ని రంగాల్లో సాధించినవన్నీ ప్రశ్నల ద్వారానే సాధ్యమయ్యాయి. అందుకే... ప్రశ్న మన రోజువారీ జీవితంలో భాగం కావాలి. దానికి పునాది చిన్నవయసులోనే పడాలి. నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోవడమే- జీవితంలో ముఖ్యమైన నైపుణ్యం అంటారో రచయిత. ఇక్కడ ఎవరికి వారే గురువులు. నేర్చుకోవడాన్ని ఎంత బాగా సాధన చేస్తే అంత బాగా రాణించగలరు. అందుకే కొన్ని విద్యావిధానాల్లో టీచర్లు పాఠాలు చెప్పరు. పిల్లలు తమంతట తాము చదువుకుంటారు. చదివినదాని గురించి ఆలోచిస్తారు. నలుగురు కలిసి చర్చించుకుని దాని లోతుల్ని అర్థం చేసుకుంటారు. వాళ్లు సరైన దారిలోనే వెళ్తున్నారా లేదా అని పర్యవేక్షించడం మాత్రమే అక్కడి టీచర్ల బాధ్యత. ‘నేనెవరికీ ఏమీ నేర్పలేను, వాళ్లు ఆలోచించేలాగా మాత్రం చెయ్యగలను’ అన్న సోక్రటిస్‌ విధానాన్ని ఇప్పుడు చాలా న్యాయవిద్యా కళాశాలల్లో అమలుచేస్తున్నారు కూడా. తమంతట తాము నేర్చుకునే స్వభావం పిల్లల్లో సహజంగానే ఉంటుంది కాబట్టే వాళ్లు ప్రశ్నిస్తారు. రెండు నుంచి ఐదేళ్ల మధ్య పిల్లలు సగటున 40 వేల ప్రశ్నలు అడుగుతారట. ఆరో ఏడాదికి ఆ సంఖ్య వందల్లోకి జారిపోతోందట. కారణాలు ఏమై ఉంటాయన్నది మనం ఊహించలేనిది కాదు కదా!

మూర్ఖులు ప్రశ్నించరు, తెలివితక్కువ వాళ్లు ప్రశ్నించలేరు. బానిసలు ప్రశ్నించే సాహసం చేయరు. అజ్ఞానికి ప్రశ్నించి సమాధానాన్ని రాబట్టే సహనం ఉండదు.

కాబట్టి... మీ ఇంట్లో పిల్లలు ప్రశ్నిస్తున్నారూ అంటే- వాళ్లు తెలివిగా ఉన్నారూ, సరైన మార్గంలోనే వెళ్తున్నారూ అని అర్థం. అందుకే... ప్రశ్నించనివ్వండి..!


ప్రశ్న విలువ

ప్రశ్నకి విలువ కట్టగలమా, అది సాధ్యమా అంటే- నిజానికి మానవ జీవితంలో అది అసాధ్యం. కానీ నేటి వ్యాపార ప్రపంచంలో సాధ్యమేనంటారు టెడ్‌ అగాన్‌. ఏ చిన్న సందేహం వచ్చినా మనం ఏం చేస్తాం..? గూగుల్‌ని అడుగుతాం. ప్రజలు అడిగే రకరకాల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ద్వారా గొప్ప వ్యాపారాన్ని నిర్మించింది ఈ సంస్థ. తన పేరు మీదుగా గూగ్లింగ్‌ అనే కొత్త క్రియా పదాన్నే సృష్టించి, 1.431 ట్రిలియన్‌ డాలర్ల విలువతో ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీల్లో నాలుగో స్థానంలో ఉంది. ప్రశ్నమీద పెట్టిన పెట్టుబడి ఫలితం అది!


మంచి ప్రశ్నలు... ఇలా!

పిల్లల్లో స్వతహాగా జిజ్ఞాస ఉంటుంది. దాన్ని తీర్చుకునే సాధనం ప్రశ్నించడమే. పిల్లల స్వభావమూ చుట్టూ ఉన్న పరిస్థితులూ ఒకోసారి వారిని వెనకాడేలా చేస్తాయి. అందుకని ప్రశ్నలు అడిగేలా పిల్లల్ని ప్రోత్సహించడానికి ఏం చేయాలంటే...

* భయమూ బిడియమూ లేని వాతావరణాన్ని సృష్టించాలి. తరగతి గదిలో ఇబ్బందిపడుతున్నట్లయితే, పిల్లల్ని చిన్న బృందాలుగా విడదీసి అప్పుడు అడగమంటే నెమ్మదిగా అలవాటుపడతారు.

* వాళ్లు ఎలా అడిగినా, అది ఎలాంటి ప్రశ్న అయినా- అడిగినవారిని విమర్శించవద్దు. పిచ్చి ప్రశ్న అని చిన్నబుచ్చవద్దు. అడిగినందుకు మెచ్చుకోవాలి. కోప్పడకుండా కూల్‌గా సమాధానం చెప్పాలి. మంచి ప్రశ్నని చక్కగా అడిగినవారిని మరికాస్త ఎక్కువ మెచ్చుకోవాలి.

* ప్రశ్నించడంలో చాలా రకాలున్నాయి. సందర్భాన్ని బట్టి పెద్దలు రకరకాలుగా ప్రశ్నలు సంధిస్తారు. అయితే పిల్లలతో మాట్లాడేటప్పుడు అవి పనికిరావు. పెద్దల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి పిల్లల ముందు మర్యాదగా కుతూహలంతో ప్రశ్నించడాన్ని అలవరచుకుంటే వాళ్లూ అనుసరిస్తారు. చిన్న పిల్లల దగ్గర వెటకారం, వ్యంగ్యం, హాస్యం లాంటివి వద్దు.

* ఇంట్లో కథ చెప్పినా, బడిలో పాఠం చెప్పినా... అయిపోయాక దాని గురించి ప్రశ్నలు అడగమని పిల్లల్ని ప్రోత్సహించాలి. ఒక ప్రశ్నతో ఊరుకోకుండా ఉప ప్రశ్నలు అడిగేలా శిక్షణ ఇవ్వాలి. సాధనతోనే ప్రశ్నల నాణ్యత పెంచవచ్చు. అసలు ప్రతి దేశంలోనూ ఏటా ‘జాతీయ ప్రశ్నా వారోత్సవాలు’ నిర్వహించాలంటారు టెడ్‌.


ఏమవుతుంది?

ప్రశ్నించడం వల్ల ఏం జరుగుతుందీ అంటే...

* కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు. సమాచారాన్నీ, ఇతరుల అభిప్రాయాల్నీ తెలుసుకోవచ్చు.

* ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎన్నో పనులు జరుగుతాయి. వ్యక్తుల, సమాజ అవసరాలు తీరతాయి.

*  ప్రశ్నలు విషయంలో లీనమయ్యేలా చేస్తాయి. కాబట్టి నేర్చుకోవడం తేలికవుతుంది. నేర్చుకున్నది గుర్తుంటుంది.

* ఒకరు ప్రశ్నించారూ అంటే- దాన్నీ దాని జవాబునీ వినేవాళ్లు ఎందరైనా ఉండవచ్చు. భావప్రసారం జరుగుతుంది.

* ప్రశ్నించడం హేతుబద్ధమైన ప్రక్రియ. అది మనిషి మేధస్సుకి ఒక శైలినీ సౌందర్యాన్నీ క్లిష్టతనూ జోడిస్తుంది. మనం అడిగే ప్రశ్నలు మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. సృజనాత్మకంగా ఆలోచించడం అంటే సృజనాత్మకంగా ప్రశ్నించడమే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..