పజిల్స్‌తో ప్రయోజనాలెన్నో..!

‘గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ... వచ్చిపోయేవారికి వడ్డించే బొమ్మ... ఎవరదీ..?’ ‘అయిదుగురిలో చిన్నోడు... పెళ్లికి మాత్రం పెద్దోడు... ఎవరో చెప్పుకోండి చూద్దాం..?’ ఏడెనిమిదేళ్ల వయసులో

Updated : 01 Sep 2022 17:13 IST

పజిల్స్‌తో ప్రయోజనాలెన్నో..!

‘గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ... వచ్చిపోయేవారికి వడ్డించే బొమ్మ... ఎవరదీ..?’
‘అయిదుగురిలో చిన్నోడు... పెళ్లికి మాత్రం పెద్దోడు... ఎవరో చెప్పుకోండి చూద్దాం..?’
ఏడెనిమిదేళ్ల వయసులో ఇలాంటి పొడుపు కథలతో మొదలై లెక్కలూ సైన్సు పజిల్స్‌ మీదుగా ప్రయాణించి పదవినోదాలూ సుడొకుల దగ్గర స్థిరపడతాం. బుర్రకు పనిచెప్పే ఈ పజిల్స్‌ లేకపోతే కొందరికి పొద్దే గడవదు. కాలక్షేపానికి అనుకుంటాం కానీ నిజానికి రేపటి మన ఆరోగ్యానికి ఇవే శ్రీరామరక్ష అంటున్నారు పరిశోధకులు. పజిల్స్‌తో మెదడుని చురుగ్గా ఉంచుకుంటే పనితీరు మెరుగవడమే కాదు, మతిమరపు వ్యాధినీ దూరంగా ఉంచవచ్చట.

దివారం పేపరు రాగానే అనుబంధం పుస్తకాన్ని తీసుకుని నేరుగా చివరి పేజీలోకి వెళ్లిపోయేవాళ్లు చాలామందే ఉంటారు.

కొందరికి అక్షరాలతో ఆట- పదవినోదం నింపడమంటే ఇష్టం.

మరికొందరికి అంకెల గారడీ- సుడొకు పరిష్కరించడమంటే సరదా.

గతవారం సమాధానాలను పోల్చి చూసుకుని అవన్నీ సరిగ్గా ఉంటే పెద్ద పరీక్ష పాసయినంత ఆనందం. అదేమీ పోటీ కాదు, అన్నీ సరిగ్గా రాసినవాళ్లకు మెచ్చి మేకతోలు కప్పేవారెవరూ ఉండరు. అయినా సరే... ఆత్మానందం ముందు అవన్నీ బలాదూర్‌.

అసలీ పజిల్స్‌ మన జీవితంలోకి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. భాషా సాహిత్యాలతో పాటు పలు దశల్లో అభివృద్ధి చెందుతూ వచ్చినవే. సమస్యాపూరణమనీ, అవధానమనీ... పండితులు తమ భాషాపాటవాల్ని ప్రదర్శించేవారు. సాధారణ ప్రజల దగ్గరకి వచ్చేసరికి పొడుపు కథలు ఎక్కువగా ఆదరణ పొందాయి. దాదాపు ప్రపంచమంతటా కూడా తొలి పజిల్స్‌గా చరిత్రకు ఎక్కింది పొడుపు కథలేనట. నేడు పదక్రీడలుగా పేరొందినవన్నీ ఆ తర్వాత వచ్చినవే. సాధారణ ప్రజల్లో ఈ పజిల్స్‌ ఒక హాబీగా మారింది మాత్రం ఓ వందేళ్ల క్రితమే. నేడు తెలుగు పత్రికల్లో మనం చూస్తున్న పదక్రీడలన్నిటికీ మూలం- ఆంగ్లంలో పుట్టి అన్ని భాషలకూ, దేశాలకూ విస్తరించిన క్రాస్‌వర్డ్‌ పజిల్‌.

యుద్ధం... కారణం

అవి మొదటి ప్రపంచ యుద్ధం మొదలయ్యే ముందు రోజులు. ఏ పేపరు తెరిచినా... యుద్ధం అనివార్యం, రేపో మాపో ఫిరంగులు పేలతాయి... లాంటి శీర్షికలే. దాంతో అంతటా ఒకలాంటి కల్లోల వాతావరణం నెలకొంది. ప్రజలకు మానసిక ప్రశాంతత కరవయ్యింది. అలాంటి సమయంలో ‘న్యూయార్క్‌ వరల్డ్‌’ అనే పత్రిక సీరియస్‌ వార్తలనుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తమ వినోద శీర్షికల విభాగంలో ఒక కొత్త ఆట ప్రారంభించాలనుకుంది. ఆ బాధ్యత చేపట్టిన ఆర్థర్‌ విన్‌ అనే సంపాదకుడు పిల్లల్నీ పెద్దల్నీ కూడా ఆకట్టుకోవాలంటే అంకెలకన్నా అక్షరాలతోనే ఏదైనా చేయాలనుకున్నాడు. పొడుపు కథల్లాంటివైతే అర నిమిషంలో చదివేసి పేపరు పక్కన పెట్టేస్తారు. అలా కాకుండా పాఠకులు పేపరుతో కాసేపు గడపాలీ అంటే ఆ ఆట అందరూ అర్థం చేసుకోగల భాషలోనే ఉండాలని ఆలోచించాడు. డైమండ్‌ ఆకృతిలో ఒక పెద్ద గడీ దాంట్లో పదాలు రాయడానికి వీలుగా చిన్నచిన్న గళ్లూ గీశాడు. ఆ పదాలను సూచించే అడ్డమూ నిలువూ ఆధారాలను కింద ఇచ్చాడు. 1913 డిసెంబరులో మొదట ప్రచురించిన ఆ పజిల్‌కి అతడు పెట్టిన పేరు- ‘వర్డ్‌ క్రాస్‌ పజిల్‌’. కొన్ని వారాల తర్వాత ప్రింటింగ్‌లో జరిగిన పొరపాటు వల్ల పేరులో పదాలు తారుమారై ‘క్రాస్‌వర్డ్‌ పజిల్‌’గా స్థిరపడిపోయింది.

ఆర్థర్‌ ఆశించినట్లుగానే క్రాస్‌వర్డ్‌ పజిల్‌ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లకే యుద్ధం రావడంతో నిజంగానే యుద్ధవార్తల నుంచి మనసు మళ్లించుకోవడానికి పాఠకులకు అది బాగా ఉపయోగపడింది. దాన్ని చూసి మిగతా పత్రికలన్నీ కూడా క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ని ప్రచురించడం మొదలుపెట్టాయి. లోపలి పేజీల్లో ఉన్న పజిల్‌ గురించి మొదటి పేజీలో పతాక శీర్షికల పక్కనే సూచికలు ఇస్తూ సీరియస్‌ వార్తల నుంచి ప్రజల దృష్టి మళ్లించేవారట. అలా పోటీ పెరగడంతో కొత్త కొత్త రూపాల్లో, పలు నియమాలతో క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ తయారయ్యాయి. అతి తక్కువ సమయంలోనే అన్ని దేశాలకీ భాషలకీ ఈ సంస్కృతి విస్తరించింది. పత్రికలన్నిటిలోనూ అదో తప్పనిసరి అంశంగా మారింది. అంతేకాదు, క్రాస్‌వర్డ్‌ పజిల్‌ థీమ్‌తో దుస్తులూ రకరకాల వస్తువులూ మార్కెట్‌లోకి వచ్చాయి. అలా మొదటి ప్రపంచ యుద్ధం మిగిల్చిన జ్ఞాపకంగా క్రాస్‌వర్డ్‌ పజిల్‌ చరిత్ర సృష్టించింది.

తెలుగులోకి వస్తే...

తెలుగులో మొదటిసారిగా 1937లో ఆంధ్రభారతి పత్రికలో ‘పదసమస్య బోధిని’ పేరుతో క్రాస్‌వర్డ్‌ పజిల్‌ ప్రచురితమైంది. దాన్ని తొలి అపరాధ పరిశోధక నవలారచయితగా పేరొందిన దేవరాజు వేంకట కృష్ణారావు రూపొందించారని చెబుతారు రచయిత సుధామ. ఆయన తెలుగు పజిల్స్‌ చరిత్రని పరిశోధించి వ్యాసాలు రాశారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి మాసపత్రికలో ‘శిష్టాక్షర పదబంధం’గానూ, ‘జ్యోతి’ మాసపత్రికలో ‘పదబంధ ప్రహేళిక’గానూ గళ్ల నుడికట్టుని కూర్చి దీనికి విస్తృత ఆదరణ తెచ్చింది మహాకవి శ్రీశ్రీ. ఆరోజుల్లో ఆయన వాడిన పదాల గురించి తెగ వాదోపవాదాలు జరిగేవట. ఆరుద్ర లాంటి వారంతా వాటి గురించి చర్చించేవారట. ఇతర సాహిత్య ప్రక్రియలకు తీసిపోని విధంగా అటు భాషని మెరుగుపరుచుకోవడానికీ ఇటు మెదడుకి మేతగానూ ఉపయోగపడేలా వీటిని కూర్చడం మొదలెట్టారు ఎందరో ప్రముఖులు. పలు వార, దిన పత్రికలు వాటిని క్రమం తప్పకుండా ప్రచురిస్తూ వస్తున్నాయి. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తాను కూర్చిన పజిల్స్‌తో సామాజిక మాధ్యమాల ద్వారా వాటికి ప్రచారం తేవడమే కాక - నుడి క్రీడ, ‘పన్‌’నీటి జల్లు, మేధామథనం లాంటి పుస్తకాలను ప్రచురించారు రచయిత ఎలనాగ.  

పద్దెనిమిదో శతాబ్దంలోనే...

చిన్న చిన్న ముక్కలను ఒక పద్ధతిలో పేర్చి చక్కటి బొమ్మకు రూపం ఇచ్చే జిగ్సా పజిల్‌ది మరో కథ. జాన్‌ స్పిల్స్‌బరీ వృత్తి మ్యాప్‌లు తయారుచేయడం. ఒకసారి కలపతో ప్రపంచ మ్యాప్‌ తయారుచేస్తూ ఒక్కో దేశాన్నీ ఒక్కో రంగు ముక్కగా కత్తిరించి అతికించాడు. అలా కత్తిరించిన క్రమంలో మిగిలిన ముక్కలను కూడా మళ్లీ సరైన ఆకృతిలో చిత్రిక పట్టి పిల్లలకు భూగోళశాస్త్రం పాఠం చెప్పేటప్పుడు ఉపయోగించేవాడు. ఒక్కో దేశాన్ని విడిగా చూపించి దానిచుట్టూ సరిహద్దు దేశాల బొమ్మలను పెడుతూ పాఠం చెబితే పిల్లలు బాగా అర్థం చేసుకోవడంతో ఉపాధ్యాయులందరూ వాటిని తయారుచేయించుకుని మరీ వాడేవారు. చాలాకాలం పాటు ఆ ముక్కలు బోధనోపకరణాలుగానే ఉండేవి. తర్వాతెప్పుడో జర్మనీకి చెందిన బొమ్మల తయారీ కంపెనీ రావెన్స్‌బర్గర్‌ వీటిని అభివృద్ధిచేసి జిగ్సా పజిల్స్‌ పేరుతో ఆటబొమ్మలుగా రూపొందించింది. కొత్తలో కలపతో తయారుచేసిన ఈ పజిల్స్‌ ఖరీదు ఎక్కువగా ఉండడంతో సంపన్నుల పిల్లలు మాత్రమే వాడేవారు. కార్డ్‌బోర్డుతో తయారుచేయడం మొదలెట్టాక జిగ్సా పజిల్‌ అందరికీ చేరువయింది. 1930ల్లో వచ్చిన పెను ఆర్థిక సంక్షోభం సమయంలో సమస్యలతో ప్రజలు పిచ్చివాళ్లు కాకుండా కాపాడింది ఈ పజిలేనంటారు.

ఎన్నో రకాలు...

చెబుతూ పోతే ఒక్కో పజిల్‌కీ ఒక్కో కథ ఉంది. క్రీస్తు పూర్వమే ఆర్కిమెడిస్‌ ఒక చదరాన్ని 14 ముక్కలుగా కత్తిరించి వాటితో ఎన్ని రకాలు తయారుచేయవచ్చో పరిశీలించమన్నాడట. ఆ లెక్కని ఇటీవలే కార్నెల్‌ యూనివర్సిటీకి చెందిన గణిత శాస్త్రవేత్త పరిశోధించి 536 పరిష్కారాలను సూచించాడు. అంటే ఆనాడు ఆర్కిమెడిస్‌ రేఖాగణితం నేర్పడానికి ఉపయోగపడుతుందని భావించిన ఒక సమస్యని పరిష్కరించడానికి రెండు వేల సంవత్సరాలు పట్టింది. పజిల్స్‌ అన్నీ ఇంత కష్టం కావు, అలాగని అన్నీ సులువూ కావు. వాటిల్లో నిజానికి ఎన్నో రకాలున్నాయి. మనిషిలో ఏదో ఒక సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్న లేదా పరీక్షని పజిల్‌ అంటున్నారు. అవి వినోదాత్మకంగా ఉండవచ్చు. విజ్ఞానాత్మకంగా ఉండవచ్చు. తర్కబద్ధంగా ఉండవచ్చు. పద్యాలతో సమస్యాపూరణాలూ, అవధానాలూ లాంటివి భాషా సాహిత్యాలు బాగా తెలిసినవాళ్లకే చేతనయ్యేవి. అలా కాకుండా సామాన్యప్రజలకీ అలాంటి ఆనందాల్ని చేరువ చేస్తోంది సులభంగా ఉండే క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ లాంటివే. వాటినే తెలుగులో పదవినోదం, పదకేళి, పదబంధం, నుడిక్రీడ, గడి-నుడి తదితర పేర్లతో పిలుస్తున్నారు. ఇవి కాకుండా భాషకి సంబంధించి ఇంకా పొడుపు కథలు, చిక్కుముడి విప్పడం, పదాల పూరణ, సమానార్థకాలూ వ్యతిరేకార్థాలూ వచ్చే పదాలతో పజిల్స్‌ లాంటివి ఉంటాయి. ఇంకా సుడొకు లాంటి గణిత పజిల్స్‌, రూబిక్‌ క్యూబ్‌ లాంటి మెకానికల్‌ పజిల్స్‌, పిల్లలు ఆడుకునే కన్‌స్ట్రక్షన్‌ పజిల్స్‌, బొమ్మలూ మ్యాప్‌లతో ఉండే జిగ్‌సా పజిల్స్‌, దారి తెలుసుకోమనే ‘మేజ్‌’ లాంటివీ, స్లైడింగ్‌ పజిల్‌... ఇలా ఎన్నో రకాలున్నాయి. వీటిల్లో చాలావరకూ పిల్లలకు బొమ్మల రూపంలో అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు వీటి ఆధారంగానే వీడియో గేమ్స్‌ కూడా తయారవుతున్నాయి.

కాలానుగుణంగా...

పుస్తకాలూ పత్రికలూ చదివే అలవాటు రాను రాను తగ్గుతున్న నేపథ్యంలోనూ ఈ పజిల్స్‌కి ఆదరణ తగ్గకపోగా ఇంకా పెరగడం విశేషం. అందుకు కారణం- అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలే. పజిల్‌ నింపాలంటే ప్రచురించిన పేపరు కావాలి. నింపడానికి చేతిలో పెన్నో పెన్సిలో ఉండాలి. అవి అందుబాటులో లేవన్న కారణంగా పజిల్‌ చేసే అవకాశాన్ని వదులుకోనక్కర లేదిప్పుడు. ఎప్పుడంటే అప్పుడే చేతిలో ఉన్న ఫోను ద్వారానే ఆన్‌లైన్‌లో పజిల్‌ నింపే ఏర్పాటు చేస్తున్నాయి పలు పత్రికలు. దీనివల్ల పజిల్స్‌కి ఆదరణ మరింతగా పెరుగుతోంది. పజిల్‌ ప్రియులంతా కలిసి ఏటా జనవరి నెలని పజిల్‌ మంత్‌గా నిర్వహించుకుంటున్నారు. ఆ సందర్భంగా అంతర్జాతీయ స్థాయి స్వచ్ఛంద సంస్థలు పోటీలు కూడా పెడుతున్నాయి. వరల్డ్‌ పజిల్‌ ఛాంపియన్‌షిప్‌, నేషనల్‌ పజిలర్స్‌ లీగ్‌, పజిల్‌హంట్స్‌, వరల్డ్‌ క్యూబ్‌ అసోసియేషన్‌... లాంటి వాటికి ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్‌ ఉంది. రూబిక్‌ క్యూబ్‌ విషయంలో అయితే పిల్లలు ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. గతేడాది బెంగళూరులో ఎనిమిదేళ్ల అధర్వ ఆర్‌.భట్‌ చేతులూ కాళ్లూ ఉపయోగించి ఒకటిన్నర నిమిషంలోపలే మూడు క్యూబ్‌లను పరిష్కరించి గిన్నిస్‌ రికార్డు సాధించాడు.

మంచి వ్యసనం

ఆర్నెల్లక్రితం ఇంటర్నెట్‌ సంచలనంగా మారింది ‘వర్డిల్‌’ అనే పజిల్‌. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న జాష్‌ వార్డిల్‌ భార్యకి క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌ నింపడమంటే ఇష్టం. దాంతో జాష్‌ తనే ప్రత్యేకంగా ఒక పజిల్‌ని రూపొందించి ప్రేమకానుకగా భార్యకు ఇచ్చాడు. ఆమెకు అది ఎంతో నచ్చి సాల్వ్‌ చేయడమే కాకుండా తమ కుటుంబ వాట్సాప్‌ గ్రూపుల్లో కూడా పెట్టేది. కొన్నాళ్లకే మొత్తం ఇద్దరి బంధువుల్లోనూ ఆ పజిల్‌కి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడింది. దాంతో జాష్‌ దాన్ని ఆన్‌లైన్‌లో పెట్టాడు. రెండు నెలలు తిరిగేసరికల్లా మూడు లక్షలమంది రోజూ దాన్ని పరిష్కరించడం మొదలెట్టారు. జాష్‌ తన ఇంటిపేరు వచ్చేలా ‘వర్డిల్‌’ అని పేరుపెట్టిన ఈ పజిల్‌లో రోజూ ఒక ఐదక్షరాల పదాన్ని ఆరు ప్రయత్నాల్లో సరిగ్గా ఊహించగలగాలి. కొద్దికాలంలోనే దేశదేశాల్లోనూ ఆదరణ పొందిన వర్డిల్‌ని ఒకప్పుడు పజిల్స్‌ని ఏమాత్రం ఇష్టపడని న్యూయార్క్‌ టైమ్స్‌ పెద్ద మొత్తం చెల్లించి కొనుక్కుంది. వర్డిల్‌కి ఆదరణ అలా కొనసాగుతుండగానే ఇప్పుడు సుడొకు తరహాలో ఆంగ్లపదాలతో ‘నాట్‌ వర్డ్స్‌’ అనే కొత్త పజిల్‌ వచ్చింది. గేమ్‌ డిజైనర్‌గా పేరొందిన జాక్‌ గేజ్‌ దీన్ని రూపొందించాడు. చూడటానికి సింపుల్‌గా కనిపిస్తూనే బుర్రకి చాలా పనిపెడుతుందిది. వర్డిల్‌ని అనుసరిస్తూ ఇప్పటికే తెలుగులోనూ ఓ పజిల్‌ తయారైంది. ఇవన్నీ చూస్తుంటే తెలుగులోనూ ఇంగ్లీషులోనూ కూడా ఈ పజిల్స్‌కి మంచి ఆదరణ లభిస్తున్నట్లే. అది సరే కానీ ఇలా పజిల్స్‌ నింపుతూ కూర్చుంటే పనికి ఆటంకం కాదూ... అనుకుంటున్నారా! అయితే మీకు పజిల్స్‌ వల్ల ప్రయోజనాలు తెలియదన్నమాట.

పజిల్స్‌ని పరిష్కరించడం అనేది ఎన్నో ఉపయోగపడే సైడ్‌ఎఫెక్టులు ఉన్న మంచి వ్యసనం అంటున్నారు నిపుణులు. దీన్ని ఎంత అలవాటు చేసుకుంటే అంత మంచిదట. పజిల్స్‌లో చాలా రకాలున్నాయి, ఎవరి అభిరుచికి తగినది వారు ఎంచుకోవచ్చు. పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా ఎప్పుడైనా వాటిని పరిష్కరిస్తూ మనసుని ఉల్లాసంగా ఉంచుకోవచ్చు. తద్వారా అటు చదువులూ ఉద్యోగ వ్యాపారాల్లోనూ రాణించవచ్చు, ఇటు వృద్ధాప్యంలో ఇబ్బందిపెట్టే వ్యాధుల్నీ దూరంగా ఉంచవచ్చు... అని హామీ ఇస్తున్నారు పరిశోధకులు. మరెందుకూ ఆలస్యం... పదవినోదం పేజీలోకి పదండిక..!


లాభాలెన్నో..!

జిల్స్‌ చేయడం మానసికోల్లాసం కలిగించే ఒక హాబీ మాత్రమే కాదు, మానసికారోగ్యానికి తోడ్పడే చికిత్స. పనితీరును మెరుగుపరిచే శిక్షణ.

ఉత్తేజం: ఒక పజిల్‌ని పూర్తి చేసినప్పుడు మనని అభినందిస్తూ మెదడు డోపమైన్‌ హార్మోన్‌ని ఉత్పత్తి చేస్తుంది. దాంతో మనసు ఉల్లాసంగా, ఉత్తేజంగా మారిపోతుంది. ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించడానికి సిద్ధమవుతుంది. ఉదాసీనంగా ఉన్న మనసును మళ్లించుకోడానికి ఇది చక్కని హాబీ.

వ్యాయామం: మన మెదడులో కుడిభాగం సృజనాత్మకంగానూ భావోద్వేగాలతోనూ ఆలోచిస్తే ఎడమభాగం తర్కబద్ధంగా ఆలోచిస్తుంది. పజిల్స్‌లో ఈ రెండు రకాలవీ ఉంటాయి కాబట్టి రెండు భాగాలూ కలిసి సమన్వయంతో ఆలోచించే ధోరణి అలవడుతుంది. అందుకే ఈ హాబీ వలన మెదడుకి మంచి వ్యాయామం అవుతుంది కాబట్టి ఎప్పుడూ చురుగ్గా ఉంటుందట.

సమన్వయం: పిల్లలకు తప్పటడుగులు వేసే వయసు నుంచే వేర్వేరు రంగులూ సైజులూ ఆకృతుల్లో ఉన్న బొమ్మలు ఇచ్చి వాటిని క్రమపద్ధతిలో అమర్చమంటాం. దానివల్ల కంటిచూపుకీ చేతి కదలికలకీ మధ్య సమన్వయం పెరుగుతుంది. ఒక పజిల్‌ పూర్తిచేయడానికి సమయం పడుతుంది కాబట్టి ఓపికా అలవడుతుంది.

ఐక్యూ: రోజూ 25 నిమిషాల పాటు పజిల్స్‌ పరిష్కరించే అలవాటు ఉన్నవారి ఐక్యూ నాలుగు పాయింట్లు పెరిగినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ మిషిగాన్‌ పరిశోధకుల అధ్యయనంలో తేలింది.

జ్ఞాపకశక్తి: మెదడుకి పని పెరిగినప్పుడే నాడీ మండలం హుషారుగా ఉంటుంది. కొత్త నెర్వ్‌ కనెక్షన్స్‌ ఏర్పడతాయి. ఆ క్రమంలో మెదడు సమాచారాన్ని భద్రపరచుకునే విభాగానికీ వ్యాయామం అవుతుంది కాబట్టి సహజంగానే జ్ఞాపకశక్తీ పెరుగుతుంది.

నైపుణ్యం: పజిల్స్‌ చేసేవాళ్లు సరైన పరిష్కారం రాబట్టడానికి ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ విధానాన్ని అనుసరిస్తూ భిన్నకోణాల్లో ఆలోచిస్తారు. అదే నైపుణ్యాన్ని వారు వృత్తి ఉద్యోగాల్లోనూ చూపగలుగుతారు. పనిలోనూ సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించి చక్కటి పరిష్కారాలతో రాగలుగుతారు. అంతేకాదు, భాషా నైపుణ్యాలూ లెక్కల్లో ప్రావీణ్యమూ పెరుగుతాయి.

ఉత్పాదకత: పజిల్స్‌ చేసే అలవాటు వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దాంతో చేసే పనిమీద దృష్టి నిలపగలుగుతారు. ఇది వారి ఉత్పాదకతను బాగా పెంచుతున్నట్లు పరిశోధనల్లో తేలింది. చదువులోనైనా, ఉద్యోగంలోనైనా మనసు పెట్టలేకపోతున్నవారు రోజూ కాసేపు పజిల్స్‌ చేసే హాబీ సాధనచేయాలంటున్నారు నిపుణులు.

బృంద సామర్థ్యం: ఉద్యోగులకు టీమ్‌ వర్క్‌ని అలవాటుచేయడానికి పజిల్స్‌ బాగా ఉపయోగపడతాయని యేల్‌ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. బృందాలవారీగా పనులు చేయాల్సిన కార్పొరేట్‌ సంస్థల్లో ఉద్యోగుల సామర్థ్యాన్నీ బృందస్ఫూర్తినీ పెంచడానికి పజిల్స్‌ని ఉపయోగించుకోమని సూచిస్తున్నారు.

బీపీ తగ్గుతుంది: ఒక పజిల్‌ చేసేటప్పుడు- మన మెదడు నిద్రలో కలలు కంటున్నప్పుడు ఏ దశలో ఉంటుందో అలా ఉంటుందట. నాడుల మధ్య బంధాలను బలోపేతం చేసి, ఒత్తిడిని నివారించి, మనసుని ఉల్లాసపరిచి, ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆ దశ- బీపీనీ గుండె కొట్టుకునే వేగాన్నీ కూడా తగ్గిస్తుందట.

మతిమరపు దూరం: పజిల్స్‌ వల్ల కలిగే ఈ ప్రయోజనాలన్నీ కలిసి మెదడుని చురుగ్గా ఉంచడం వల్ల మతిమరపు వ్యాధులైన డిమెన్షియా, ఆల్జీమర్స్‌లు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని పలు అధ్యయనాలు తేల్చిచెప్పాయి. మెదడులోని కణజాలానికి నష్టం కలిగితే మతిమరపు వస్తుంది. పజిల్స్‌ హాబీ ఆ నష్టాన్ని తగ్గిస్తుంది. అందుకే పజిల్స్‌ చేయండి ఆల్జీమర్స్‌కి దూరంగా ఉండండీ... అంటున్నారు పరిశోధకులు.


ఇంటెలిజెన్స్‌కి సవాలు

రెండో ప్రపంచయుద్ధం సమయంలో అబ్జర్వర్‌ పత్రికలో ప్రచురితమైన పజిల్‌ బ్రిటిష్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులను ముప్పతిప్పలు పెట్టింది. అందులో కన్పించిన కొన్ని పదాలు సైన్యంలోని దళాలకు పెట్టిన కోడ్‌ నేమ్స్‌ కావడంతో సంఘ విద్రోహశక్తులు వాటిని కనిపెట్టేశాయేమోనని కంగారుపడ్డ అధికారులు దర్యాప్తు చేశారు. ఆ పేర్లన్నీ సాధారణ వాడుక పదాలే కావడంతో కాకతాళీయంగా వాటిని వాడారే తప్ప అంతకుమించి ఏమీ లేదని తేలింది. 1990ల్లో మాత్రం ఎవరూ ఊహించని అసాధారణ పదాలను కోడ్‌వర్డ్స్‌గా పెట్టినా అవి కూడా పజిల్‌లో కన్పించాయి. ఆరా తీస్తే- పజిల్స్‌ తయారుచేస్తున్నది ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడనీ, తమకు తెలిసిన కొత్త కొత్త పదాలు చెప్పవలసిందిగా అతడు తన విద్యార్థులను కోరుతున్నాడనీ, వాళ్లేమో ఊరి చివర ఉన్న సైనికుల శిబిరాల దగ్గర తచ్చాడుతూ తాము విన్న కొత్త పదాల్ని ఆయనకు చెబుతున్నారనీ అలా అవి పజిల్‌లో చేరుతున్నాయనీ తెలిసి ఆశ్చర్యపోయారు అధికారులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..