Published : 03 Jul 2021 23:38 IST

కొవిడ్‌ టీకాల కోసం... ఓ తెలివైన ఫ్రిజ్‌!

కొవిడ్‌పైన పోరాటానికి టీకాయే బ్రహ్మాస్త్రం. కానీ రక్షణ కవచంలాంటి ఆ టీకాలూ కొన్ని రాష్ట్రాల్లో 30 శాతం దాకా వృధా అవుతున్నాయట. ప్రస్తుతం టీకాని మారుమూల ప్రాంతాలకి చేరవేయడానికి ఐస్‌ బాక్సుల్నీ, కొన్నిచోట్ల ఫ్లాస్కుల్లాంటివాటినీ వాడుతున్నాం. కానీ 3-4 గంటల తర్వాత వాటిలో చల్లదనం కాస్త తగ్గుతుంది. దాంతో టీకాలు పాడవుతున్నాయి! అందుకు విరుగుడుగానే ఈ ‘తెలివైన ఫ్రిజ్‌’ని కనిపెట్టారు ఆ ముగ్గురూ!

‘జాతిరత్నాలు’ అన్న పదానికి ఇప్పుడైతే అర్థం మారిందికానీ... దేశక్షేమం కోసం తమ కంపెనీ లక్ష్యాన్నే మార్చుకున్న ఆ ముగ్గుర్నీ అసలైన జాతిరత్నాలు అనొచ్చు. మయూర్‌ షెట్టీ, డాన్సన్‌ డిసౌజా, అశ్లేష్‌ భట్‌... ముగ్గురిదీ మణిపాల్‌. ఇంటర్‌దాకా కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత డాన్సన్‌ మంగళూరు యూనివర్సిటీకి వెళ్తే మిగతా ఇద్దరూ మణిపాల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోనే బీటెక్‌ చదివారు. పట్టా పుచ్చుకునేనాటికి మయూర్‌ షెట్టీ, డిసౌజా కలిసి బ్లాక్‌ఫ్రాగ్‌ టెక్నాలజీస్‌ అనే స్టార్టప్‌ని ఏర్పాటుచేశారు. ఆ సంస్థ ద్వారా కాలేజీలూ, స్కూళ్లకి అవసరమైన ల్యాబ్‌ పరికరాలని తక్కువ ధరకి తయారుచేసి అందిస్తుండేవారు. ఓ రోజు మయూర్‌ షెట్టీ మేనల్లుడికి పోలియో టీకాలు వేయడానికని ఇంటికి ఓ ఆశా కార్యకర్త వచ్చారట. ఓ ఫ్లాస్క్‌లో ముందు ఐస్‌ ముక్కలు వేసి, పైన టీకాని ఉంచి తెచ్చారట ఆమె. ‘ఫ్లాస్కులో టీకా ఏమిటీ!’ అని ఆశ్చర్యపోతుంటే మారుమూల ప్రాంతాలకి ఇలాగే చేరవేస్తామని చెప్పారట ఆ ఆశా కార్యకర్త.

మనదేశంలో పిల్లలకి వాడే 15 టీకాల్లో తొమ్మిది ‘ఫ్రీజ్‌ సెన్సిటివిటీ’తోనే ఉంటాయి. అంటే, 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలోనే వాటిని నిల్వ ఉంచాలి. అంతకంటే పెరిగినా తగ్గినా టీకాలు పాడైపోతాయి. అందువల్లే టీకాలు తయారు చేసే కంపెనీలూ, వాటిని భారీస్థాయిలో రవాణా చేసే వాహనాలూ, రాష్ట్ర జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో ఈ టీకాలని ఉంచేందుకు ప్రత్యేకమైన ‘మెడికల్‌ రిఫ్రిజిరేటర్‌’లని వాడతారు. కానీ, ఆ జిల్లాకేంద్రాల నుంచి మారుమూల ప్రాంతాలకి తీసుకెళ్లేందుకు ఐస్‌ బ్యాగుల్నీ అవీ దొరక్కుంటే ఫ్లాస్కుల్నీ వాడతారు. ఈ ఐస్‌బ్యాగులు గంటన్నర దాకా ఉష్ణోగ్రతని కాపాడగలవు కానీ ఆ తర్వాత తేడా వచ్చేస్తుంది. మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో జిల్లాకేంద్రం నుంచి కొన్ని మండలాలకీ అక్కడి నుంచి గ్రామాలకీ చేరుకోవడానికి కనీసం మూణ్ణాలుగు గంటలు పట్టడం వల్ల... ఈ టీకాలు పాడవుతాయి. దేశవ్యాప్తంగా ఏటా 25 శాతం టీకాలు ఇలా వృధా అవుతుంటాయి. అంటే, ప్రతి నాలుగు టీకాల్లో ఒకటి ఇలా పనికిరాకుండా పోతోందన్నమాట. ఆ వృధా విలువ ఏటా... సుమారు 55 కోట్ల రూపాయలు! ఇవన్నీ తెలుసుకున్నాక ఆ ఐస్‌బ్యాగ్‌ స్థానంలో అత్యాధునిక రిఫ్రిజిరేటర్‌ని తయారుచేసి దేశానికి ఇవ్వాలనుకున్నారు మయూర్‌. తన పాత మిత్రుల కొత్త లక్ష్యం నచ్చి అశ్లేష్‌ భట్‌  వీరితో కలిశాడు. ముగ్గురూ కలిసి ఎన్నో ఆర్థికపోరాటాల తర్వాత ‘సంజీవని’ అనే ఫ్రిజ్‌ని రూపొందించారు!

కొవిడ్‌ నేపథ్యంలో...
విదేశాల్లోని ‘సాలిడ్‌ స్టేట్‌ రిఫ్రిజిరేషన్‌’ ఫ్రిజ్‌ల ఆధారంగా ఉష్ణోగ్రతని నియంత్రించే ‘సంజీవని’ని రూపొందించారు ఈ ముగ్గురు మిత్రులు. వాటిని మణిపాల్‌లోని ప్రభుత్వాసుపత్రుల్లో వాడుతూ వచ్చారు. కొవిడ్‌-19 మహమ్మారి రాకతో వీళ్ల దృష్టి కరోనా టీకాల నిల్వపైన పడింది. సంజీవని కంటే ఎక్కువ సామర్థ్యమున్న ఫ్రిజ్‌ అవసరమని భావించి మరెన్నో కొత్త ఫీచర్లతో ‘ఎమ్వోలియో’ అనే ఫ్రిజ్‌ని రూపొందించారు. వాటిని తమిళనాడు, మణిపూర్‌, కర్ణాటక, ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలతోపాటూ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ కింద కేంద్రప్రభుత్వమూ వాడుతోందిప్పుడు!

‘ఎమ్వోలియో’లో ఒకేసారి 30 నుంచి 50 కొవిడ్‌ టీకాల ‘వయెల్స్‌’ని ఉంచి తీసుకెళ్లొచ్చు. అంటే, ఒక్క ఫ్రిజ్‌ ద్వారా దాదాపు ఐదొందల టీకాలని అందించొచ్చన్నమాట! ఇది 12 గంటలపాటు టీకాలని కాపాడుతుంది. ప్రధాన కేంద్రాల నుంచి మారుమూల ప్రాంతాల్లో టీకాలు వేసేదాకా వాటి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు ఈ ఫ్రిజ్‌ పర్యవేక్షిస్తూనే ఉంటుంది. ఏ చిన్న తేడా వచ్చినా... టీకాలు మిగిలినా జిల్లా అధికారులకి వెంటనే సమాచారం అందిస్తుంది. అంతేకాదు, టీకాల వయెల్స్‌నీ, లబ్ధిదారుల ‘వ్యాక్సినేషన్‌ కార్డు’ (కొవిన్‌ నంబర్‌) వివరాలనీ అనుసంధానించి ఫలానా టీకాను నిజంగానే లబ్ధిదారులకే వేశారా లేదా అన్నది కూడా ఎమ్వోలియో చెబుతుంది. అందుకే అంటున్నారంతా... ఇది తెలివైన ఫ్రిజ్‌ అని!


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని