Updated : 14 Nov 2021 06:09 IST

బాంబుల్నీ, దొంగల్నీ ఎలా గుర్తిస్తాయంటే..!

ఓ పెద్ద షాపింగ్‌మాల్‌లో బాంబు ఉందనే సమాచారం అందడం ఆలస్యం... హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగుతారు. వాళ్లతోపాటూ పోలీసు జాగిలం కూడా వచ్చి ఆ ప్రాంగణమంతా తిరిగేసి ఓ సూట్‌కేస్‌ దగ్గర ఆగుతుంది. ఆ తరువాత బాంబు దొరకడం, సిబ్బంది దాన్ని నిర్వీర్యం చేయడం సినిమాల్లో చూసినప్పుడు... ఎలాంటి ఆశ్చర్యం కలగదు. కానీ ఓ సాధారణ శునకం పోలీసు జాగిలంలా మారి, అనుమానిత వస్తువుల్నీ, వ్యక్తుల్నీ గుర్తించడం వెనుక ఎంతో కఠోర శిక్షణ ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా..

కొన్నేళ్ల క్రితం పోలీసులకు ఓ చోట మత్తుపదార్థాలు దొరికాయి. తీగలాగితే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోనూ ఉండొచ్చని తెలిసింది. అక్కడికెళ్లి గాలిస్తే రెండు బ్యాగుల్లో మత్తుపదార్థాలు దొరికాయి.దాదాపు పద్నాలుగేళ్లక్రితం.. హైదరాబాద్‌లోని మక్కా మసీదులో రెండుచోట్ల బాంబుపేలుళ్లు జరిగాయి. అక్కడే మరొక బాంబూ ఉండొచ్చని పోలీసుల దర్యాప్తులో తేలడంతో తరువాత దాన్ని గుర్తించారు.ఈ రెండు సందర్భాల్లో పోలీసుల తరువాత కీలక పాత్ర పోషించింది పోలీసు జాగిలాలేనని చెబుతారు సిటీ సెక్యూరిటీ వింగ్‌(సీఎస్‌డబ్ల్యూ)లో పాలనా విభాగంలో పనిచేస్తున్న జంగయ్య. ‘లాబ్రడార్‌, గోల్డెన్‌ రెట్రీవర్‌, జెర్మన్‌షెపర్డ్‌... వంటి జాతి కుక్కల్ని కెనెల్స్‌ నుంచి నాలుగు- ఆరునెలల వయసు ఉన్నప్పుడు తెస్తాం. తరువాత వాటికి మొయినాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్‌ ఇంటలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో ఎనిమిది నెలలు శిక్షణ ఉంటుంది. మా సిటీ భద్రతకు తగినట్లుగా వాటికి శిక్షణ ఇప్పిస్తే, ఇంటలిజెన్స్‌, గ్రేహౌండ్స్‌ విభాగాలు తమకు ఉపయోగపడేలా వాటిని మార్చుకుంటాయి...’ అని వివరిస్తారు. 

అన్నీ నేర్పిస్తారు.. 

శిక్షణలో భాగంగా ప్రతి ఒక కుక్కకూ ఇద్దరు సిబ్బంది (హ్యాండ్లర్‌) - వాటితోపాటు ఎనిమిది నెలలు శిక్షణ తీసుకుంటారు. మొదటి రెండుమూడు నెలలు ఆ సిబ్బంది వాటిని మచ్చిక చేసుకుంటూనే కూర్చోమనడం, నిల్చోమనడం, సెల్యూట్‌ కొట్టించడం, తమతో సమానంగా నడిపించడం... విధుల్లో చురుగ్గా ఉండేందుకు వేగంగా పరుగెత్తించడం, హర్డిల్స్‌ పై నుంచి దూకించడం లాంటివీ నేర్పిస్తారు. ఆ సిబ్బంది మాటలు అర్థమయ్యేలా ప్రత్యేక పదాలను (కమాండ్లు) వాడుతూ వాటి మెడమీద చిన్నగా తాకుతారు. కొన్నాళ్లకు ఏదయినా కమాండ్‌ ఇచ్చి మెడమీద తాకగానే చెప్పినట్లు చేస్తాయి. అదయ్యాక నార్కోటిక్స్‌ ఐడెంటిఫికేషన్‌ (మత్తుపదార్థాలను పసిగట్టడం), ట్రాకింగ్‌ (అనుమానిత వస్తువులూ, వ్యక్తుల్ని గుర్తించడం), బాంబ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ (పేలుడు పదార్థాల గుర్తింపు)... వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఉదాహరణకు... మత్తుపదార్థాలను గుర్తించేందుకు వాటికి కొకైన్‌, హెరాయిన్‌, మార్జువానా, ఓపియం వంటివి వాసన చూపిస్తే... బాంబ్‌ ఎక్స్‌ప్లోజివ్‌ల కోసం ఆర్డీఎక్స్‌, టీఎన్‌టీ, గన్‌పౌడర్‌ లాంటివి ఉపయోగిస్తారు. ట్రాకింగ్‌లో భాగంగా పెర్‌ఫ్యూమ్‌, మాంసంలో రక్తం కలిపి వాసన చూపిస్తారు. దాంతో రోజులు గడిచేకొద్దీ ఆ పదార్థాన్ని ఎక్కడ దాచినా పసిగట్టేస్తాయవి. అవి సరిగ్గా నేర్చుకుంటున్నాయో లేదో తెలుసుకునేందుకు వాటికి అప్పుడప్పుడూ మాక్‌డ్రిల్స్‌నీ నిర్వహిస్తారు. శిక్షణాకాలం పూర్తయ్యాక వాటికీ పాసింగ్‌ అవుట్‌పరేడ్‌ నిర్వహించి విధుల్లోకి పంపిస్తారు. వాటిని డ్యూటీకి తీసుకెళ్తున్నప్పుడు ఆ శునకాల మెడలో ఓ బెల్ట్‌ని వేసి ‘లీస్‌’ అన్నాక అవి డ్యూటీకి సిద్ధమై చెప్పినట్లుగా చేస్తాయి. ఆ బెల్టు తీసేశాక అవి కూడా సాధారణ పెంపుడు కుక్కల్లానే హాయిగా ఆడుకుంటాయి. ‘ఓ నేరం జరిగినప్పుడు అనుమానితుల్ని గుర్తించి... పోలీసులకు తెలియజేసే ఈ శునకాలు అందించే సహకారం అంతాఇంతా కాదు. కొన్నాళ్లక్రితం సికింద్రాబాద్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. మా సిబ్బంది జాగిలాన్ని తీసుకెళ్తే అది ఆ ఇల్లంతా తిరుగుతోందే తప్ప బయటకు వెళ్లడంలేదు. అనుమానంతో ఆ ఇంటివాళ్లనే నిలదీస్తే వాళ్లలో ఒకరు దొంగని రుజువైంది. ఇలాంటి సంఘటనలు చాలానే ఉంటాయి. ఓ కేసుకు సంబంధించి మాకు సమాచారం అందాక మొదట మాదైన దర్యాప్తు చేసి తరువాత వీటిని రంగంలోకి దింపుతా’మని వివరిస్తారు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌. 

రోజువారీ డ్యూటీలో...

ఈ పోలీసు జాగిలాలు రోజూ పని చేస్తూనే ఉంటాయి. నిజానికి రోజూ ఒకటి, రెండు జాగిలాలు ముఖ్యమంత్రి కార్యాలయం - ఇల్లు, గవర్నర్‌ నివాసాల్ని  పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తాయి. మరికొన్ని ప్రముఖ కార్యాలయాలూ, హైకోర్టూ, మాల్స్‌, ఆలయాలూ, మసీదులూ... వంటివాటిని తనిఖీ చేసే పనిలో ఉంటాయి. అవి విధుల్లో చురుగ్గా పనిచేసేలా వాటికి వేళకు ఆహారం, నడక, పరుగు, దూకడం వంటి వ్యాయామాలతోపాటూ అన్నిరాకల జాగ్రత్తలూ తీసుకుంటారు. అవి దాదాపు పదేళ్లు పనిచేశాక వాటికీ పదవీ విరమణ ప్రకటిస్తారు. తరువాత అవి చనిపోయేవరకూ వాటి సంరక్షణ బాధ్యతను పోలీసు విభాగమే తీసుకుంటుంది. సో... పోలీసు జాగిలం అంత కచ్చితంగా పనిచేయడం వెనుక ఇంత కథ ఉంటుంది మరి.


మీకు తెలుసా!

నమైతే బీచ్‌లో ఆడుతూ ఎంచక్కా ఇసుకతో గూళ్లు కట్టేసుకుంటాం. కానీ ఇటలీలోని ఎరాక్లియాలో ఇసుకతో అలా పిచ్చుకగూళ్లు కట్టడం చట్టవిరుద్ధం. సముద్రతీరంలో సరదాగా గడపడానికి వచ్చే పర్యటకులకు అడ్డు ఉండరాదనే కారణంతో ఈ వింత చట్టం తెచ్చారట.


కారుని కరిగించిందో భవంతి!

ది 2013 సంవత్సరం. లండన్‌లోని ఫెన్‌చర్చ్‌ వీధి. మార్టిన్‌ లిండ్‌సే అనే ఆయన ఆ వీధిలోకి వచ్చి కారు నిలిపి పక్క షాపుకు వెళ్లాడు. రెండు గంటల తర్వాత తిరిగి వచ్చాడు. అప్పుడు తనకు కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోతూ కళ్లెళ్లబెట్టాడు. ఆ వింత విషయం ఏంటంటే... ఆయన కారు తలుపు పైభాగం కరిగిపోతూ కనిపించింది. ‘ఇదేంటీ’ అని ఆరా తీస్తే... ఆ వీధిలో ఉన్న ‘వాకీటాకీ’ అనే భవంతి వల్లే ఇలా జరిగిందని తెలిసింది. 525 అడుగుల ఎత్తు, 37 అంతస్తుల్లో ఉన్న ఈ ఆకాశహర్మ్యం కార్లను కరిగించడానికి కారణం... దీని నిర్మాణమేనట. వాకీటాకీ ఆకారంలో ఉండే ఈ భవంతి అద్దాలపైన పడ్డ సూర్యకిరణాలు నేలపైన కొన్నిచోట్ల అతితీక్షణంగా ప్రతిఫలిస్తుంటాయి. దాంతో అక్కడ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు రోజులో రెండు గంటల పాటు అత్యధిక ఉష్ణోగ్రత ఏర్పడుతోందట. మార్టిన్‌ కారుని ఇక్కడే పెట్టడంతో కారు కాస్త కరిగిందన్నమాట. ఈ వాకీటాకీ భవంతి వల్ల జరిగిన నష్టానికి మార్టిన్‌కు యాజమాన్యం 1000 పౌండ్ల (దాదాపు రూ.లక్ష) పరిహారం కూడా చెల్లించాల్సి వచ్చిందట. ఆ తర్వాత రోజురోజుకీ పెరిగిపోతున్న ఇలాంటి ఇక్కట్లతో అక్కడ వాహనాలు నిలపొద్దని హెచ్చరిక కూడా జారీ చేశారట. అయినా ప్రజల నుంచి విమర్శలు రావడంతో వాకీటాకీపైన ఎండ తీవ్రత లేకుండా ఉండటానికి షాడో విండోల్ని ఏర్పాటు చేసి ఆ సమస్యను ఓ కొలిక్కితెచ్చారు.


బడికెళ్లే పిల్లలకు  భలే కుకీలు..!

‘స్కూల్‌బ్యాగు తిందామా, షార్ప్‌నర్‌ తిందామా...’ ‘నువ్వు పెన్సిల్‌ తిను, నేను పుస్తకం తింటా..!’ స్కూల్లోని ఓ తరగతిలో పిల్లలు ఇలా మాట్లాడుకుంటుంటే అప్పుడే తరగతికి వచ్చిన టీచర్‌కి ఓ నిమిషం ఏమీ అర్థం కాలేదు. ‘ఈ పిల్లలకి ఏమైందీ’ అనుకుంటూ వారినే ఆరా తీయగా తెలిసిందేంటంటే... కుకీలే పలక, పుస్తకం, పెన్సిల్‌... ఆకారాల్లో ఉన్నాయని. కరోనా కారణంగా ఎంతోకాలం ఎదురు చూసిన తర్వాత బడికి వెళ్తున్న పిల్లలకోసం ఇలా ‘బ్యాక్‌ టూ స్కూల్‌’ కుకీలను తయారుచేస్తున్నారు మరి..!

ఎంత సెలవులంటే ఇష్టపడే పిల్లలైనా రెండు నెలలు వేసవి సెలవులు ఇస్తే... తిరిగి స్కూలుకి వెళ్లేసరికి స్నేహితులకూ బడికీ దూరమైపోయినట్లూ బాధపడిపోతారు. అలాంటిది కరోనా కారణంగా ఏకంగా రెండేళ్లపాటు పిల్లలు పాఠశాల ముఖాన్ని చూడకుండా గడిపేశారు. ఆశ్చర్యం ఏంటంటే... అంతకు ముందు మాటిమాటికీ ‘ఒక్కరోజు సెలవు తీసుకుంటా మమ్మీ’ అని మారాం చేసే పిల్లలు కూడా ఇప్పుడు ‘స్కూలు ఎప్పుడు మొదలవుతుందమ్మా’ అని పదే పదే అడుగుతున్నారు. పాఠశాలలు తెరుస్తున్నారంటే ఎగిరి గంతేస్తున్నారు. వారి ఆ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేస్తే బాగుంటుంది కదా... అన్న ఆలోచనతో తయారవుతున్నవే ‘బ్యాక్‌ టూ స్కూల్‌’ కుకీలు.

పిల్లలకు నచ్చేలా... 

మామూలుగా ఆత్మీయులను చాలాకాలం తర్వాత కలుస్తున్నామంటే... ఆ సంతోషాన్ని పంచుకునేందుకు వారికి స్వీట్లు, చాక్లెట్లు తీసుకెళ్తాం. అయితే, చిన్నారులకు ఇచ్చేటప్పుడు రుచితో పాటు వాటి ఆకారం కూడా భిన్నంగా ఉంటే వాళ్లు మరింత ఇష్టంగా తింటారు. అందుకే, బడికి దూరమయ్యామన్న వారి బాధను పోగొడుతూనే ఎంచక్కా తినేలానూ స్కూల్‌ థీమ్‌తో కుకీలను తయారుచెయ్యడం మొదలుపెట్టారు బేకరీ నిర్వాహకులు. స్కూలుబ్యాగులు, పుస్తకాలు, పెన్సిళ్లు, పలకలు, స్కేళ్లు, స్కూలు బస్సు, షార్ప్‌నర్‌, యూనిఫామ్‌ వేసుకుని బడికెళ్తున్న విద్యార్థులు... లాంటి రూపాల్లో తయారు చేస్తున్న ఈ కుకీలను చూస్తే అసలు బిస్కెట్లలానే అనిపించవు. దీనికోసం మౌల్డుల సాయంతో కుకీలను ఆయా రూపాల్లో తయారుచేసి, వాటిపైన ఐసింగ్‌ క్రీముతో రంగురంగుల్లో కావల్సిన ఆకారాన్ని సృష్టిస్తారు. ఉదాహరణకు స్కూలు బ్యాగులాంటి కుకీని తయారు చెయ్యాలంటే ఎంచుకున్న రంగు ఐసింగ్‌ క్రీముతో కుకీపైన ఆ రూపాన్ని చేసి, ఫుడ్‌ కలర్‌తో జిప్‌ల్లాంటివాటిని తీర్చిదిద్దుతారు. దాంతో ఇవి అచ్చంగా బుల్లి బ్యాగుల్లానే అనిపిస్తాయి. కావాలంటే ఈ కుకీలమీద టీచర్లూ స్నేహితులకోసం మనసులోని మాటను సందేశాల రూపంలో కూడా రాయించుకోవచ్చు. అంటే గ్రీటింగుల్లానూ ఇవ్వొచ్చన్నమాట. ఇక, ఇలాంటి కుకీలను ఇస్తే వాటిని స్నేహితులతో పంచుకోడానికి పిల్లలు బడికి పరుగులు తీస్తారనడంలో సందేహమేముందీ..?


Advertisement


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని