Published : 03 Jul 2021 23:33 IST

ఒక్కడు... వంద ఇళ్లు కట్టించాడు!

గోడలు, పైకప్పుని సైతం రేకులతో కట్టిన చిన్న షెడ్డు అది. వర్షంతో పాటు వస్తున్న గాలికి రేకులు ఊగుతున్నాయి. మరోపక్క వాటి మధ్య ఉన్న ఖాళీల్లో నుంచి వాన జల్లు లోపలికి కొడుతోంది. ఆ పరిస్థితుల్లో తడవకుండా ఉండేందుకు ఆ మహిళ పడుతున్న యాతన చూసిన ఓ ఫాదర్‌ మనసు చలించిపోయింది. ఆమెకు ఇల్లు కట్టించాలనుకున్నాడు. కట్టించాడు. కానీ ఆ మంచితనం అక్కడితో ఆగలేదు. మరో 110 మందికి ఇళ్లు కట్టించే వరకూ కొనసాగింది.

2018, ఆగస్టు 16... కనీ వినీ ఎరుగని రీతిలో ఆ రోజున వచ్చిన వరదలు కేరళను కోలుకోలేని దెబ్బ తీశాయి. ఎన్నో ఊళ్లు ఏరులయ్యాయి. వేల ఇళ్లు కనుమరుగయ్యాయి. లక్షలమందికి నిలువ నీడ లేకుండా పోయింది. మధ్యతరగతి, పేద వాళ్లకు ఒక్కసారి ఇల్లు కట్టుకోవాలంటేనే మహా కష్టం. అలాంటిది ఇల్లూ ఇంట్లోని సామగ్రి, విలువైన వస్తువులూ అన్నీ నీటిపాలైపోయాక ఇంకా ఏం మిగిలి ఉంటుంది. కన్నీరు తప్ప. అలాంటి పరిస్థితుల్లో వరద ఉధృతి తగ్గాక బాధితులకి సహాయం అందించేందుకు స్నేహితులతో కలసి వెళ్లారు స్థానిక ఇడుక్కి జిల్లాకు చెందిన ఫాదర్‌ ‘జిజొ కురియన్‌’. అప్పుడే...

రేకుల షెడ్డులో వర్షంలో తడుస్తూ ఇబ్బంది పడుతున్న ఓ మహిళను చూసి తల్లడిల్లి పోయారు. వెంటనే తన స్నేహితుడితో ‘మనం ఆమెకు ఓ లక్ష రూపాయల్లో మంచి ఇల్లు కట్టించి ఇవ్వగలమా...’ అని అడిగారు. దానికి అతడు ‘నువ్వు చెయ్యగలనంటే డబ్బుని నేను సర్దుతా’ అన్నాడు. ఆ మాటను పట్టుదలగా తీసుకున్న కురియన్‌ తక్కువ ధరలో అన్ని సౌకర్యాలతోకట్టించగలిగే ఇళ్ల గురించి ఆరా తీశారు. అలా తెరమీదికొచ్చినవే క్యాబిన్‌ హౌస్‌లు.అనుకున్నదానికన్నా కాస్త ఎక్కువగారూ.ఒకటిన్నర లక్షలతో ఆ మహిళకు చిన్న ఇంటిని కట్టించి ఇచ్చారు. అదే స్ఫూర్తితో తర్వాత మూడేళ్లలో ఇళ్లులేని వారికి దాదాపు 110 ఇళ్లను నిర్మించారు.

రెండు పడకగదుల ఇళ్లు...
క్రైస్తవ మఠంలో ఉండే ఫాదర్‌ కురియన్‌కి సొంతంగా అన్ని ఇళ్లు కట్టించే స్థితిగతులు లేవు. కానీ గూడు లేని వాళ్లకు ఏదో రకంగా ఓ ఇంటిని కట్టించి ఇవ్వాలనుకున్నారు. అందుకే, తనలాంటి ఆలోచనలున్న మరికొందరితో కలసి డబ్బు సమకూర్చేవారు. బేస్‌మెంట్‌కి సిమెంటు దిమ్మలనూ, గోడలకు పైపులూ ఫైబర్‌ సిమెంట్‌ బోర్డులనూ, పైకప్పు కోసం పెంకులనూ వాడి నిర్మించే ఈ క్యాబిన్‌ హౌస్‌లన్నీ 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటాయి. వీటిలో చిన్న కుటుంబం కోసం అయితే రూ.1.5 నుంచి 2.5లక్షల ఖర్చుతో ఒక పడకగది, వంటగది, హాలు, స్నానాల గదిని నిర్మిస్తారు. అదే... ఇంట్లో ఎక్కువమంది ఉండాల్సి ఉంటే రెండు పడకగదుల ఇళ్లను నిర్మిస్తారు. దీనికి రూ.రెండు నుంచి నాలుగు లక్షల వరకూ ఖర్చవుతుంది. జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఇవి కూడా మామూలు ఇళ్లలానే ఎక్కువకాలం నిలిచి ఉంటాయట. అన్నట్లూ ఈ ఇళ్లు చూడ్డానిక్కూడా అందంగా కనిపిస్తున్నాయి.

ఇళ్లను కట్టించేందుకు ముందుగా వలంటీర్లు- ప్రభుత్వ పథకాల కిందికి రాని పేదలూ, దివ్యాంగులూ, ఒంటరి మహిళలూ, వృద్ధులను ఎంపిక చేస్తారు. ‘మా సేవల్ని చూసి ఎంతోమంది తామూ ఒక ఇంటి ఖర్చుని భరిస్తాం అంటూ ముందుకొస్తున్నారు. అలాంటి వారిని మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ఇల్లు అవసరమైనవారికే కలుపుతున్నాం. మేము ఏర్పాటు చేసిన అయిదు బృందాల వలంటీర్లు పనులు బాగా జరుగుతున్నాయా... లేదా అనిదగ్గరుండి చూసుకోవడంతో పాటు, తమవంతుగా ఏదో ఒక పని చేస్తారు. అలా నెలకు అయిదు నుంచి ఏడు ఇళ్లను కట్టేలా చూస్తాం. కొన్ని స్వచ్ఛంద సంస్థలూ సాయం చేస్తున్నాయి. మొదట్లో ఇడుక్కి జిల్లాలో మాత్రమే ఇళ్లను నిర్మించిన మేము దాతల సాయంతో ఆ సేవను పక్క జిల్లాలకూ విస్తరించాం. పొదరిల్లులాంటి ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెడుతున్నప్పుడు పేదల కళ్లల్లో కనిపించే సంతోషమే మరిన్ని ఇళ్లు నిర్మించడానికి నాకు స్ఫూర్తినిస్తోంది’ అంటారు ఫాదర్‌ కురియన్‌. చాలా గొప్ప విషయం కదూ..!


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని