శునకాలకూ లగ్జరీ హోటల్‌.. 

ఎవరినైనా తిట్టాలనుకుంటే ‘కుక్క బతుకు’ అనే పదం వాడుతుంటాం. ఇది చదివాక మాత్రం ‘ఆహా... ఏం బతుకురా కుక్కలది’ అనుకోవడం ఖాయం. ఇంతకీ విషయమేంటంటే... సాధారణంగా స్టార్‌ హోటళ్లు అనగానే వాటిల్లో కస్టమర్లకు అందించే

Updated : 13 Feb 2022 05:53 IST

శునకాలకూ లగ్జరీ హోటల్‌.. 

వరినైనా తిట్టాలనుకుంటే ‘కుక్క బతుకు’ అనే పదం వాడుతుంటాం. ఇది చదివాక మాత్రం ‘ఆహా... ఏం బతుకురా కుక్కలది’ అనుకోవడం ఖాయం. ఇంతకీ విషయమేంటంటే... సాధారణంగా స్టార్‌ హోటళ్లు అనగానే వాటిల్లో కస్టమర్లకు అందించే సౌకర్యాలే గుర్తుకువస్తాయి. తాజాగా పెంపుడు శునకాలకూ ఈ తరహా సేవలు అందించేందుకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ‘సూపర్‌వూఫ్‌’ పేరిట ఓ సిక్స్‌ స్టార్‌ హోటల్‌ను ప్రారంభించారు. ఇందులో 24 గంటల పర్యవేక్షణతోపాటు కుక్కలకు స్నానం, గ్రూమింగ్‌, బ్రషింగ్‌, మెడికేషన్‌ సౌకర్యాలతోపాటు, డిజైనర్‌ వేర్‌ దుస్తులనూ అందిస్తున్నారట. ప్రత్యేక మూలికలు కలిపిన నీటినే తాగిస్తామనీ టీకాలు వేయించిన వాటికే ప్రవేశం కల్పిస్తామనీ చెబుతున్నారు నిర్వాహకులు.  


తండ్రి.. కొడుకు.. ఓ ఒప్పందం!

పిల్లలతో జీవితం మామూలుగా ఉండదు. నిద్రలేపడం దగ్గర్నుంచి తినిపించడం, బడికి పంపించడం, హోంవర్క్‌ చేయించడం, నిద్రపుచ్చడం వరకూ తల్లిదండ్రులకు ప్రతి రోజూ సవాలే. అందుకే, ఓ తండ్రి తన కొడుకుతో నేరుగా ఒక ఒప్పందమే చేసేసుకున్నాడు మరి! ఉత్తర భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి తన ఆరేళ్ల కొడుకు అబిర్‌తో ఓ అంగీకారానికొచ్చాడు. అదేంటంటే... ప్రతి రోజూ ఎన్నింటికి నిద్రలేవాలి... ఎప్పుడు తినాలి... ఎంతసేపు టీవీ చూడాలి... తదితర వివరాలన్నీ ఓ కాగితం మీద రాసుకొని ఇద్దరూ సంతకం కూడా చేశారు. అంతేకాదు.. ఆ టైంటేబుల్‌ను కచ్చితంగా పాటించడంతో పాటు ఏడవకుండా, అల్లరి చేయకుండా ఉంటే రోజుకు రూ.10, వారం మొత్తం అలాగే పద్ధతిగా ఉంటే రూ.100 కొడుక్కి ఇస్తాడట ఆ తండ్రి. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌ అయి, ఇతర తల్లిదండ్రులూ తమ అనుభవాలను పంచుకుంటున్నారు.  


అగ్నిపర్వతంపైన రెస్టరంట్‌!

అందరిలా అయితే కిక్‌ ఏముంటుందని అనుకున్నారో ఏమో గానీ స్పెయిన్‌లో ఏకంగా అగ్నిపర్వతంపైనే రెస్టరంట్‌ని నిర్మించి ఔరా అనిపిస్తున్నారు. ఏదైనా భవనాన్ని నిర్మించాలంటే పునాదులు తవ్వుతారు. కానీ, అగ్నిపర్వతంపైన తొమ్మిది పొరలుగా సున్నపు రాయిని వేసి దాని మీద ఈ ‘ఎల్‌ డయాబ్లో’ రెస్టరంట్‌ని కట్టారట. లావా బయటకు వచ్చే ప్రాంతాన్ని ఏకంగా గ్రిల్‌లా మార్చేశారు. కింద లావా కుతకుతమంటుంటే ఆ వేడికి గ్రిల్‌ పైన పదార్థాలు ఉడుకుతాయట. ‘మరి లావా పొంగితే ఎలా?’ అనే అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే, 1824 నుంచి ఇప్పటివరకూ ఆ అగ్నిపర్వతం బద్దలవ్వలేదట. ఆ నమ్మకంతోనే వెరైటీగా ఉండాలని ఏర్పాటు చేసిన ఈ రెస్టరంట్‌కు కస్టమర్లు వరస కడుతున్నారట. ఎంతైనా అక్కడ తినాలంటే బోలెడు ధైర్యం ఉండాలి మరి!


అమ్మకు జేజేలు... జవాన్‌కు వందనాలు

మ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. విధి నిర్వహణలో అమరుడైన కుమారుడి విగ్రహాన్ని కట్టించి మరీ వాత్సల్యాన్ని చాటుకుందో మాతృమూర్తి. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బసిల్‌ టొప్పో జవాన్‌గా విధులు నిర్వర్తించేవాడు. 2011లో నక్సలైట్ల కాల్పుల్లో అతడు ప్రాణాలు విడిచాడు. దేశసేవలో ఉండగానే అమరుడైన కుమారుడి జ్ఞాపకార్థం అతడి తల్లి సొంత భూమిలోనే ప్రత్యేకంగా గది నిర్మించి, అందులో అతడి విగ్రహం పెట్టించింది. ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా గదితో పాటు విగ్రహానికీ రంగులు వేసి అక్కడే జెండా వందనం నిర్వహించిందామె. ఇన్ని రోజులూ ఆ ఊరి వరకే తెలిసిన ఈ విషయం సోషల్‌ మీడియా పుణ్యమాని వైరల్‌గా మారింది. అంతేకాదు... ఏటా రక్షాబంధన్‌ రోజు ఆ సైనికుడి సోదరితో పాటు స్థానిక మహిళలూ విగ్రహానికి రాఖీ కడుతుంటారు. ఈ విషయం తెలిసిన వారందరూ ఆ తల్లిని అభినందిస్తూ... అమరవీరుడికి నివాళి అర్పిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..