Updated : 26 Jun 2022 00:44 IST

ఇది ‘సినిమా స్పెషల్‌’ రెస్టరంట్‌!

ఈ రెస్టరంట్‌లో కనిపిస్తున్న రైలు మామూలు రైలు కాదు. మాధవన్‌ ‘సఖి’, సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ తదితర సినిమాలని గుర్తుకుతెచ్చే రైలు! ఆటో... ధనుష్‌ ‘మాస్‌’ మూవీలోది. కారు రజినీకాంత్‌ నటించిన సినిమాలోది. మదురైలో ఉన్న ఈ రెస్టరంట్‌ విశేషాలు ఇంత మాత్రమే కాదు...

తెలుగు సినిమాలకి సంబంధించినంత వరకూ ఓ సినిమా హిట్టా ఫ్లాపా అన్న విషయం... తూర్పుగోదావరి జిల్లాయే నిర్ణయిస్తుందని చెబుతారు. అక్కడ సినిమా ఆడితే... తెలుగు రాష్ట్రాలన్నింటా ఆడినట్టు, లేకుంటే... అన్నిచోట్లా పోయినట్టు అని సినిమావాళ్లలో ఓ నమ్మకం ఉంది. తమిళ సినిమాకి సంబంధించినంత వరకూ మదురై అలాంటిదే. సినిమాలపైన అంత వ్యామోహం ఉన్న నగరంలో కొత్తగా ఏర్పాటుచేసే రెస్టరంట్‌ కూడా దాన్ని అడుగడుగునా ప్రతిబింబించాలనుకున్నారు విచిత్రా రాజాసింగ్‌. అందుకు తగ్గట్టే... తమ రెస్టరంట్‌ని తీర్చిదిద్ది ‘సినీ సువై’ (సినీ రుచి... అని) అని పేరు పెట్టారు.

‘ప్రవేశం’ నుంచే...

ఈ రెస్టరంట్‌ ముఖద్వారం ‘ఆర్ట్‌ డెకో’ వాస్తు శైలిలో.... 1980ల నాటి సినిమా థియేటర్లలా ఉంటుంది. లోపలికి అడుగుపెట్టగానే పాత తరం సినిమా బిల్‌బోర్డుల్ని పోలిన ప్రకటనల్ని చూడొచ్చు. ఈ రెస్టరంట్‌లో మొత్తం 300 డైనింగ్‌ సీట్లున్నాయి. వాటిని తొమ్మిది విభాగాలుగా చేసి... ప్రతిదాన్నీ భిన్నమైన సినిమా థీమ్‌తో అలంకరించారు. ఇందులో మొదటిది రైలుబోగీ. రైల్వేశాఖవాళ్లు దీన్ని తుక్కుకింద వేలం వేస్తుంటే దాన్ని విచిత్రా రాజాసింగ్‌ కొని... సినిమా హంగులన్నీ చేర్చి డెభ్భైమంది భోజనం చేసేలా తీర్చిదిద్దారు. ట్రెయిన్‌లో ఉండేలాంటి ఎమర్జెన్సీ చెయినూ, వాష్‌ బేసిన్‌లాంటివే ఉంటాయి కానీ... కిటికీల స్థానంలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఉంటాయి. అందులో 1960ల నుంచి ఇప్పటిదాకా రైలు థీమ్‌తో వచ్చిన సినిమాల పోస్టర్‌లూ, డైలాగులూ వస్తుంటాయి. ఈ రైలు పక్కనే ఉన్న భాగాన్ని అసలైన ప్లాట్‌ఫామ్‌లా తీర్చిదిద్దారు. ఇందులోనే రజినీకాంత్‌ ‘పడిక్కాదవన్‌’(తెలుగులో ‘దెబ్బకు దెబ్బ’ అని డబ్‌ అయింది) తమిళ సినిమాలో వాడిన కారు ఆహ్వానిస్తుంది. ఒకప్పటి ఫియట్‌ ‘పద్మిని’ రకం కారు ఇది. దాన్ని ఓ పాత కార్ల దుకాణంలో కొని... దాని బాడీ కేస్‌ని కొత్తదిగా మార్చి ఇక్కడ పెట్టారు. ఇందులో నలుగురు కూర్చుని తినొచ్చు. ధనుష్‌ ‘మాస్‌’ సినిమాలో ఉపయోగించిన ‘ఆటో’లాంటిదాన్నీ ఇలాగే ఉపయోగిస్తున్నారు. సిద్ధార్థ్‌ నటించిన ‘జిల్‌ జంగ్‌ జగ్గు’ అన్న తమిళ సినిమాలో కనిపించే గులాబీ రంగు అంబాసిడర్‌ని కూడా ఇక్కడే చూడొచ్చు. ఆ తర్వాత కమల్‌హాసన్‌ 1980ల్లో నటించిన ‘డిస్కో’ పాటల థీమ్‌ కోసం ఓ ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటుచేశారు. ఇందులో అలనాటి రంగురంగుల లైట్లూ, తళుకుబెళుకుల తెరలూ ఉంటాయి. లైట్లన్నీ మైకుల్లాగానూ, పాత ఎల్‌పీఎం రికార్డుల్లాగానూ ఉంటాయి.

అక్కడితో అయిపోలేదు...

వీటికి పక్కనే క్యాసినో థీమ్‌తో కూడిన టేబుళ్ళు ఉంటాయి. దానిపైన అజిత్‌ గ్యాంబ్లర్‌ సినిమాలో వాడిన ‘రేస్‌’ బైక్‌లాంటిదాన్నీ చూడొచ్చు. దీనికి పూర్తి భిన్నంగా సినిమాల్లో చూపించే గ్రామీణ వాతావరణంతో మరో విభాగం ఉంటుంది. ఒకప్పటి మన సినిమా డ్యూయట్‌ పాటలన్నీ పార్కుల్లోనే తీసేవారు కదా! ఇక్కడా అచ్చం అలాంటి పచ్చటి గొడుగులతో కూడిన పార్కు థీమ్‌నీ ఏర్పాటుచేశారు. రెయిన్‌సాంగ్స్‌ కోసమూ ఓ ప్రత్యేక విభాగం ఉందండోయ్‌! చివరిగా 150 మంది కూర్చోగల బ్యాంకెట్‌ హాలు ఉంది. రజినీకాంత్‌ సినిమా ‘దర్బార్‌’ థీమ్‌తో దీన్ని ఏర్పాటుచేశారు!

‘కమల్‌’ ఆర్డర్‌ తీసుకుంటారు...

చుట్టూ ఉన్న వాతావరణమే కాదు... ఇక్కడున్న బేరర్‌లూ సినిమా నటుల్నే అనుకరిస్తుంటారు. ‘బాషా’లో ఆటోడ్రైవర్‌ రజినీకాంత్‌, ‘దొమ్మి’ సినిమాలోని కమల్‌హాసన్‌, ‘అదిరింది’లో విజయ్‌... ఇలా, హీరోలని పోలిన ఆహార్యం, అనుకరణలతో వస్తారు వాళ్లు. ఇక్కడున్న టిష్యూ పేపర్‌ బాక్స్‌ క్లాప్‌బోర్డులాగే ఉంటుంది. బిల్లు చెల్లించే బాక్సును కూడా సినిమా రీలులాగే  ఏర్పాటుచేశారు. అంతెందుకు, అక్కడక్కడా సెన్సార్‌ సర్టిఫికెట్‌ని పోలిన వాల్‌పోస్టర్‌ ఒకటి కనిపిస్తుంటుంది. కాకపోతే అందులో ‘సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫుడ్‌ సినిమా’ అని రాసి ఉంటుంది... అంతే తేడా! మరి ఆహారం విషయమో అంటారా...

కాంటినెంటల్‌, ఇండియన్‌, చైనీస్‌, థాయ్‌ అంటూ ప్రతిరోజూ 200 రకాల వంటలు చేస్తారు ఇక్కడ. జపాన్‌ వంటకం సుషిని మదురై నగరానికి పరిచయం చేసింది ఈ రెస్టరంటేనట!


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


ఇంకా..

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని