పది కోట్ల లీటర్ల నీరు..!

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా కరవుకి పెట్టింది పేరు. వర్షాలు పడకా, పంటలు సరిగా పండకా ఎందరో రైతులు కూలీలుగా మారుతున్నారు. ఆ ప్రాంతంలోని పదల్షింగి గ్రామానికి చెందిన రైతు మారుతి బాజ్గుడే కూడా కరవు

Published : 17 Apr 2022 00:17 IST

పది కోట్ల లీటర్ల నీరు..!

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లా కరవుకి పెట్టింది పేరు. వర్షాలు పడకా, పంటలు సరిగా పండకా ఎందరో రైతులు కూలీలుగా మారుతున్నారు. ఆ ప్రాంతంలోని పదల్షింగి గ్రామానికి చెందిన రైతు మారుతి బాజ్గుడే కూడా కరవు వల్ల చాలా కాలంగా సాగుకు దూరంగా ఉంటున్నాడు. అలాగని అన్నం పెట్టే ఆ వృత్తిని వదులుకోవడం ఇష్టం లేని మారుతి ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం కనిపెట్టాలనుకున్నాడు. అందుకే తనకున్న పన్నెండున్నర ఎకరాల పంట భూమిలో ఇంకుడు గుంతలు తవ్వి మూడేళ్ల పాటు కాస్తో కూస్తో పడ్డ వాన నీటిని ఒడిసిపట్టుకున్నాడు. ఆ తరవాత ఎకరం విస్తీర్ణంలో 41 అడుగుల లోతు, 202 అడుగుల వైశాల్యంలో కుంటని తవ్వించాడు. అందుకోసం మూడు పొక్లెయిన్లనూ, పది ట్రక్కులనూ ఉపయోగించాడు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెరగడంతో కుంటలో నీళ్లు పడ్డాయి. దాదాపు పది కోట్ల లీటర్ల నీరు నిల్వ ఉండే సామర్థ్యమున్న ఆ కుంట లోపల చుట్టూ ఒక వరస ఇటుకలు గోడలాగా అమర్చి ప్లాస్టరింగ్‌ చేసేశాడు. ప్రస్తుతం ఆ కుంటలోని నీళ్లు మారుతి పన్నెండెకరాలకే కాదు చుట్టుపక్కల యాభై ఎకరాలకు కూడా సరిపోతాయి. పదేళ్లుగా పక్కన పెట్టిన వ్యవసాయాన్ని కుంట వల్ల తిరిగి మొదలుపెట్టిన మారుతి ప్రస్తుతం పండ్లతోటల పెంపకానికి సిద్ధమయ్యాడు. ఇదిలా ఉంటే ఈ పేద్ద కుంట తీయగా వచ్చిన మట్టిని ఆ దగ్గర్లోనే రోడ్లు వేస్తున్న ఆర్‌ అండ్‌ బీ డిపార్ట్‌మెంట్‌కీ, నల్లరాయిని స్టోన్‌ క్రషింగ్‌ మిల్లులకూ అమ్మేశాడు.


మీకు తెలుసా!

హాలీవుడ్‌ యాక్షన్‌ హీరో జాకీచాన్‌ తన తదనంతరం ఆస్తులన్నీ సంతానానికి కాకుండా అనాథాశ్రమాలకీ, ట్రస్టులకీ చెందేలా వీలునామా రాశాడు. తన డబ్బును ఖర్చుపెట్టుకుంటూ రికామీగా తిరగకుండా కొడుకే సొంతంగా కష్టపడి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతోనే జాకీచాన్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.


ఫస్ట్‌... ఫస్ట్‌..!

వేసవిలో విరివిగా వాడే నిమ్మను మన దేశంలో తొలిసారి సాగు చేసిన రాష్ట్రం అసోం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు