జీవించేద్దాం... వందేళ్లు..!

సెంచరీలు కొట్టే వయస్సు మాది... అని యువత పాడుకొంటుంటే వయసులోనే సెంచరీ కొట్టి చూపిస్తున్నారు పెద్దలు. ప్రపంచమంతటా శతాధిక వయోవృద్ధుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.

Updated : 23 Nov 2022 11:08 IST

జీవించేద్దాం... వందేళ్లు..!

సెంచరీలు కొట్టే వయస్సు మాది... అని యువత పాడుకొంటుంటే వయసులోనే సెంచరీ కొట్టి చూపిస్తున్నారు పెద్దలు. ప్రపంచమంతటా శతాధిక వయోవృద్ధుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. ఇప్పుడు ఇరవైల్లో ప్రవేశించిన పిల్లల్లో కనీసం సగం మంది 103 ఏళ్లు బతుకుతారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు అమెరికా పరిశోధకులు. వాళ్లంటున్నట్లు నిజంగా నూరేళ్లూ బతకడమనేది మన చేతుల్లోనే ఉందా... పరిశోధనలు ఏం చెబుతున్నాయీ... ఆసక్తి రేపుతున్న ఆ విశేషాలేమిటో చూసేద్దామా..!

మొన్నామధ్య అబుదాబి విమానాశ్రయంలో భద్రతాధికారి ఓప్రయాణికుడి పాస్‌పోర్టు చూసి కంగుతిన్నాడు. పాస్‌పోర్టు ప్రకారం ఆయన వయసు 124 ఏళ్లు. నమ్మబుద్ధి కాకపోయినా ఎదురుగా మనిషి నవ్వుతూ నిలబడి ఉంటే ఏం చేయాలో తోచక స్టాంప్‌ వేసి పంపించేశాడు ఆ అధికారి.

ఆ ప్రయాణికుడు వారణాసికి చెందిన స్వామి శివానంద. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఆయనను బంధువులు ఒక ఆధ్యాత్మిక గురువుకు అప్పజెప్పారట. దాంతో గురువుతో పాటు వారణాసి ఆశ్రమంలోనే ఉండిపోయారాయన. రోజూ కాసేపు యోగా చేయడం, ఆశ్రమానికి వచ్చేవారికి నాలుగు మంచి మాటలు చెప్పడం, బస్తీల్లో తిరిగి పేదలకు ఆహారం పంచిపెట్టడం... ఇప్పుడాయన దినచర్య.

సరే, ఆయనదంటే- ఏ బాదరబందీలూ లేని ఆశ్రమజీవితం కాబట్టి దీర్ఘాయుష్కుడయ్యారనుకోవచ్చు. కానీ... తమిళనాడులో రిటైర్డు పోస్టుమాస్టరు, కేరళలో రైతు మహిళ, కర్ణాటకలో కొవిడ్‌ని గెలిచిన దంపతులు, ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు... ఎలా వంద దాటేశారన్నది ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్న.

‘చేతినిండా పని ఉంటే వయసు గురించి ఆలోచించే తీరికెక్కడ’ అంటాడు తమిళనాడులోని దిండిగల్‌కి చెందిన సూసై. 1918లో పుట్టిన ఆయన రిటైరవగానే సేద్యం మొదలెట్టాడు. కర్ర సాయంతోనైనా పొలమంతా తిరగనిదే నేటికీ అతనికి రోజు గడవదు. భార్య
చనిపోయిన తర్వాత వంటమనిషి వండి పెడుతోంది. ‘ఏ పూటకాపూట పెరట్లో తాజా కూరలు కోసి వండుకుంటాం. అదే నా ఆరోగ్య రహస్యమేమో’- అంటాడు సూసై. ఆత్మకథ రాయడంలో బిజీగా ఉన్న అతనికి డజను మంది సంతానమట.

అలైకుట్టి థామస్‌ 1930లో కొత్త పెళ్లికూతురుగా కురవిలంగాడు గ్రామానికి వచ్చింది. భర్తతో పాటు వ్యవసాయం చేస్తూ తొమ్మిదిమంది సంతానాన్ని కని, పెంచింది. ఇప్పటికీ తన పనులు తానే చేసుకుంటూ పొలం పని కూడా చేసే ఆమెకు కష్టాలేమీ లేవా అంటే- ‘ఎందుకు లేవు, భర్త పోయాడు, నా కళ్లముందే కన్నబిడ్డలు నలుగురు పోయారు. అందుకని ఏడుస్తూ కూర్చుని మిగిలినవాళ్లని బాధ పెట్టడం నాకిష్టం లేదు. మునిమనవల పెళ్లిళ్లు చూడగలిగే అదృష్టం దొరికిందని సంతోషిస్తా. మనసునీ శరీరాన్నీ ఖాళీగా ఉంచకపోతే చాలు, భూమ్మీద నూకలున్నంత కాలం నవ్వుతూ బతికేయొచ్చు’ అంటుంది అలైకుట్టి.

మొన్నటికి మొన్న కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఈరన్న(103), ఈరమ్మ(101) దంపతులు వయసునే కాదు, కొవిడ్‌నీ గెలిచి అభినందనలు అందుకున్నారు. ‘ఓపికున్నంత కాలం కష్టపడ్డాం. ఆ తర్వాత అనుభవాలను నెమరేసుకుంటూ బతుకుతున్నాం. వందేళ్ల జీవితంలో కబుర్లకేం కొదవ. మీ ఆరోగ్య రహస్యమేమిటీ- అని అడుగుతారందరూ. అదేమిటో మాకూ తెలియదు. ఉన్నంతలో సంతోషంగా ఉండడమే తెలుసు’ అంటారీ దంపతులు.

వీరందరినీ చూడగానే- ఆర్థికంగా బాగుండి, పిల్లలు ప్రేమగా చూసుకుంటే నూరేళ్లూ బతకొచ్చేమో... అనిపిస్తుంది కానీ, మరో సందర్భమూ చూద్దాం.

కరోనా రాక ముందు సంగతి.

అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని వయో వృద్ధ చారిటబుల్‌ ట్రస్టు వందేళ్లు నిండినవారిని సన్మానించా లనుకుంది. చుట్టుపక్కల వృద్ధాశ్రమాల్లో ఉన్నవారే 15 మంది తేలారు. ఆ ఆశ్రమాల్లో ఉంటున్న పెద్దలందరికీ కలిపి ఆటల పోటీలు పెడితే పరుగుపందెంలో మిగిలినవారిని ఓడించి 101 ఏళ్లు నిండిన వీరయ్య ఫస్టొచ్చాడు. వందేళ్ల సీతామహాలక్ష్మి మ్యుజికల్‌ చెయిర్స్‌లో సెకండ్‌ వచ్చింది. బతుకంతా ఎన్నో కష్టాలు పడి, అయినవారి ఆదరణ కరవై ఆశ్రమంలో తలదాచుకుంటున్న ఇలాంటివారి
పూర్ణాయుష్షుకు కారణమేమై ఉంటుంది..?

జన్యువులు కాదా..?

చాలాకాలం వరకూ ఆయుష్షుకి జన్యువులే కారణమనుకున్నారు పరిశోధకులు. ఆ దిశగా శోధించి కొన్ని ప్రత్యేక జన్యువుల్నీ గుర్తించారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఊహించని రీతిలో పెరుగుతున్న ఆయుఃప్రమాణాల్ని చూశాక శాస్త్రవేత్తలకూ సందేహం వచ్చింది. కేవలం జన్యువులే కారణమైతే కొన్ని కుటుంబాల్లోనే దీర్ఘాయుష్కులు ఉండాలి, కానీ అలా లేదు. కుటుంబంలో ఎవరూ వందేళ్లు బతికిన ఆనవాళ్లు లేకపోయినా కొందరు సెంచరీ కొట్టేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనేమో మొత్తంగా ఊళ్లకి ఊళ్లు శతాధిక వృద్ధులతో నిండి ఉంటున్నాయి. వైద్యరంగంలో సాధించిన ప్రగతి వల్ల సహజంగానే సగటు ఆయుర్దాయం పెరిగింది. కానీ దాంతో సంబంధం లేకుండా శతాధిక వృద్ధుల సంఖ్య పెరగడమే ఇప్పటి పరిశోధనలకు కీలకం అయింది. మనుషుల ఆయుష్షు విషయంలో జన్యువుల పాత్ర మూడో వంతేననీ మిగిలిన రెండొంతులూ ఆహారమూ, వ్యాయామమూ ఆక్రమిస్తాయనీ తెలిసింది. అందుకని వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుని జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకుంటే ఎవరికి వారే ఆయుష్షును పెంచుకోవచ్చంటున్నారు పరిశోధకులు. బ్లూజోన్స్‌లో నివసిస్తున్న వారి జీవనశైలి మీద పలు అధ్యయనాలు చేశాకే వారీ నిర్ణయానికి వచ్చారు.

బ్లూజోన్స్‌ అంటే..?

ఇటలీలోని సార్డీనియా, జపాన్‌లోని ఒకినావా, అమెరికాలోని లోమాలిండా, కోస్టారికాలోని నికోయా, గ్రీస్‌లోని ఇకారియా... ప్రాంతాల్ని ‘బ్లూ జోన్స్‌’ అంటారు. ప్రపంచంలో ఎక్కువ మంది శతాధిక వృద్ధులు ఈ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. తరతరాలుగా ఆయా ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాల వల్ల వారి జీవనశైలీ ఆహారపుటలవాట్లూ కలిసి ఆయుర్దాయాన్ని పెంచుతున్నాయి.

ఏమిటా జీవనశైలి?

క్లుప్తంగా చెప్పాలంటే అలాంటి జీవనశైలికోసం ముఖ్యంగా మూడు కోణాల్లో పనిచేయాలి. దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లు ఉండాలి. శరీరానికి అవసరమైన పోషకాల్నీ వ్యాయామాన్నీ అందించాలి. మానసికంగా సంతోషంగా ఉండాలి. అలా ఉండగలిగితే  ప్రతి ఒక్కరూ సూపర్‌ ఏజర్‌ కావచ్చట.

అంటే..?

తొంభై ఏళ్లు పైబడి ఆరోగ్యంగా జీవిస్తున్నవారిని ‘సూపర్‌ ఏజర్స్‌’ అంటున్నారు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ద అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌తో పాటు పలు యూనివర్సిటీలు వీరిపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఏం తేల్చాయంటే-

* ప్రియమైన వ్యక్తులతో గాఢమైన అనుబంధం ఆయుష్షును పెంచుతోందంటోంది పదిహేనేళ్లపాటు సూపర్‌ఏజర్స్‌ అలవాట్లను నిశితంగా పరిశీలించిన ‘ద 90ప్లస్‌’ అనే అధ్యయనం. తోబుట్టువులు, స్నేహితులు, భాగస్వామి- ఎవరైనా సరే వారితో రోజూ కాసేపు ఆనందంగా గడిపేవారి ఆయుష్షు 50శాతం పెరుగుతుందట.

* రోజుకు పావుగంటైనా వ్యాయామం చేసేవారు అసలు చేయనివారికన్నా ఎక్కువ కాలం జీవిస్తారనీ, క్రమం తప్పకుండా ప్రతిరోజూ 45 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే తిరుగులేని ఫలితం ఉంటుందనీ మరో పరిశోధన తేల్చింది. బ్లూజోన్స్‌లో ఉండేవారు ప్రత్యేకంగా వ్యాయామం చేయకపోయినా వారి దినచర్యలో నడక ముఖ్యమైన భాగం. పొద్దున్నే లేచి ఓ అరగంట నడవకుండా వారు ఏ పనీ చేయరట.

* తిండి తగ్గించినా ఆయుష్షు పెరుగుతుందట. 10నుంచి 30శాతం కెలొరీలను తగ్గించడం వల్ల జీవితకాలం బాగా పెరిగినట్లు గుర్తించారు. ఒకినావా ప్రజలు రోజుకు 1800-1900 కెలొరీల ఆహారం మాత్రమే తీసుకుంటున్నారనీ(ఇతర దేశాల్లో 2200- 3300 కెలొరీలు) అందుకే వాళ్లు సన్నగా ఉంటున్నారనీ(బీఎంఐ 18-22 మధ్య) నిపుణులు తేల్చారు.

* వ్యసనాలు చాలావరకూ అకాల మరణాలకు కారణాలన్నది తెలిసిన విషయమే. బ్లూజోన్స్‌లో నివసించేవారిలో ఏ వ్యసనాలూ లేకపోవడం వల్ల ఆరోగ్యం నిలకడగా ఉండి ఆయుర్దాయాన్ని పెంచుతోంది.

* నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చేస్తున్న ‘సూపర్‌ఏజింగ్‌ స్టడీ’లో దీర్ఘాయుష్కులు చాలామందికి వయసు తొంభై దాటినా జ్ఞాపకశక్తి మాత్రం 50 ఏళ్లవారితో సమానంగా ఉన్నట్లు గమనించారు. భౌతికంగానే కాక మానసికంగానూ ఆరోగ్యంగా ఉన్నప్పుడు వృద్ధాప్యం చాలా నెమ్మదిగా వస్తుందట. సాధారణంగా అరవైలూ డెబ్భైల్లో మొదలయ్యే మతిమరుపు లాంటి సమస్యలూ క్యాన్సర్‌, గుండెజబ్బుల్లాంటి రోగాలూ సూపర్‌ఏజర్స్‌లో ఓ పాతికేళ్లు ఆలస్యంగా మొదలవుతున్నాయి. అందుకే వాళ్లు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవిస్తున్నారట. వాళ్ల పిల్లలకు కూడా వయసుతో పాటు వచ్చే సమస్యలు తక్కువేనట.

* శాకాహారమూ, మాంసాహారంలో చేపలూ ఎక్కువ తీసుకునేవారిలో వృద్ధాప్య ఛాయలు చాలా నిదానంగా కన్పిస్తున్నాయి. ఒకినావా ప్రజలు ఒక్కొక్కరూ రోజుకు 300గ్రాముల పైనే కూరగాయలూ వారంలో మూడు రోజులు చేపలూ తింటారట. దాంతో షుగరూ క్యాన్సర్లూ గుండెజబ్బులూ రావు. వారి రక్తంలో వృద్ధాప్య చిహ్నాలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ చాలా తక్కువ.

* ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో చేసిన 35 అధ్యయనాలను క్రోడీకరించగా తేలిందేమిటంటే- మనసులో ఏ అసంతృప్తీ లేకుండా సంతోషంగా జీవితం గడిపేవారి ఆయుర్దాయం ఇతరులకన్నా 18శాతం ఎక్కువని.

* కంటినిండా నిద్ర పూర్ణాయుష్షుకు పరమౌషధమట. అరగంటకు మించకుండా పగటిపూట తీసే కునుకు దానికి బోనస్‌ అవుతుందట. రోజుకు 8-9 గంటలపాటు నిద్ర పోగలిగితే ఆయుష్షు 38 శాతం పెరుగుతుందనీ, మంచి నిద్ర ముసలితనాన్ని దరికి రానివ్వదనీ తేల్చారు పరిశోధకులు.

ఆయుష్షు సరే, మరి ఆరోగ్యమో?

ముసలితనంతో వచ్చే రోగాలూ రొష్టులతో వందేళ్లు బతకడం మనిషికే కాదు, సమాజానికీ భారమే. అందుకే దీర్ఘాయుష్షుకు మార్గాలు కనిపెట్టి ఊరుకోవడం లేదు శాస్త్రవేత్తలు. బతికినంత కాలమూ ఆరోగ్యంగా బతికేలా చూడడానికీ పరిశోధనలు చేస్తున్నారు. పెరుగుతున్న ఆయుష్షు ఆస్పత్రుల చుట్టూ తిరగడానికి కాకుండా జీవితాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడాలన్నదే ఈ పరిశోధకుల ఆకాంక్ష. వృద్ధాప్యంతో పాటు వచ్చే జబ్బుల్ని ఒక్కొక్కటిగా తగ్గించుకుంటూ వెళ్లాలంటే చాలా కాలం పడుతుంది. అలా కాకుండా మొత్తంగా వృద్ధాప్యాన్నే కాస్త నెమ్మదిగా వచ్చేలా చూడాలన్నది శాస్త్రవేత్తల లక్ష్యం. అందుకే వారు జన్యువులను ఇంకా ఇంకా శోధిస్తూనే ఉన్నారు.

అయితే మనిషి శరీరంలో ఉండే దాదాపు లక్ష జన్యువుల్లో ఒక్కో జన్యువు ఆనుపానుల్నీ పట్టుకుని ఈ పరిశోధనలన్నీ ఒక కొలిక్కి తేవటానికీ ఆ ఫలితాలు అందుబాటులోకి రావటానికీ... ఇంకెన్ని తరాలు పడుతుందో చెప్పలేం.

అందుకని మందులో మరొకటో వచ్చేస్తాయని ఆశపడి ఎదురుచూస్తూ కూర్చోకుండా మన జాగ్రత్తలో మనం ఉండటమే మంచిది.

జాగ్రత్త అంటే ఏమీ లేదు... ఆరోగ్య కరమైన జీవనశైలితో ప్రస్తుతానికి సెంచరీ కొట్టడం మీద దృష్టి పెడితే చాలు... అప్పుడు పిల్లలకు ఆస్తులతో పాటు ఆయుష్షునీ వారసత్వంగా అందించవచ్చు.

ఎందుకంటే- దీర్ఘాయుష్కుల పిల్లలకూ వృద్ధాప్యం ఆలస్యంగానే వస్తుందట మరి!

ఎంత పెరిగింది..!

రెండు శతాబ్దాల క్రితం అంటే 1800 సంవత్సరంలో ప్రపంచదేశాల్లో ప్రజల సగటు ఆయుర్దాయం 32 ఏళ్లు మాత్రమే ఉండేదట. 1950 నాటికి అది 48కి పెరిగింది. ఇప్పుడది దాదాపు డెబ్భై మూడేళ్లు. ఇక ముందు ఇది ఇంకా వేగంగా పెరుగుతుందనీ 2000 సంవత్సరంలో పుట్టిన పిల్లల్లో సగం మంది నూరేళ్లపైనే జీవిస్తారనీ అంటున్నాయి అమెరికాలో జరుగుతున్న పరిశోధనలు.

జీవితం... పరమార్థం!

కొన్ని శతాబ్దాలుగా దీర్ఘాయుష్షుకు పర్యాయపదంలా ఉంటోంది జపాన్‌. అక్కడే కాదు, బ్లూజోన్స్‌ అన్నిట్లో నివసించేవారి జీవనవిధానం దాదాపు ఒకేలా ఉంటుంది. వయసుకి సంబంధించి జరుగుతున్న పరిశోధనలన్నిటికీ ప్రేరణ ఆ జీవనవిధానాలే. అవేంటంటే...

* జీవితానికి ఒక ప్రయోజనమూ పరమార్థమూ ఉండాలి. దాన్నే జపాను వాళ్లు ‘ఇకిగాయ్‌’ అంటారు. పొద్దున్నే ఉత్సాహంగా నిద్రలేవగలిగినంత కాలం జీవితానికి ప్రయోజనం ఉన్నట్లేనట.

* పొట్టలో కాస్త ఖాళీ ఉంచు... చిన్నప్పటి నుంచీ జపాను వాళ్లు పిల్లలకు చెప్పే మాట. అలా తక్కువ తినడం అలవాటై పోతుంది కాబట్టే వారిలో స్థూలకాయులు అరుదు. తక్కువ పరిమాణంలో ఎక్కువ రుచుల్ని ఇష్టపడతారు. పండ్లూ కూరగాయలూ కలిపి రోజూ కనీసం ఏడు రంగులు తినాలన్నది వారి నియమం.

* ప్రపంచ సగటుకన్నా ఉప్పు తక్కువ తినేది ఇక్కడివారే. చెరకు పండించి రసం తాగుతారు కానీ చక్కెర వాడరు.

* జపాను భాషలో రిటైర్మెంట్‌ అన్న అర్థం వచ్చే పదమే లేదు. ఉద్యోగజీవితం ముగియగానే మరో ఉద్యోగంలో చేరతారు. తమకు నచ్చిన పని ఎంచుకుంటారు. ఎనభై, తొంభై ఏళ్లవారూ సాధ్యమైనంతకాలం పిల్లల మీద ఆధారపడకుండా జీవిస్తారు.

* సంఘజీవనాన్ని ఇష్టపడతారు. గ్రామాల్లో ప్రజలంతా అభిరుచులను బట్టి చిన్న చిన్న బృందాలుగా ఏర్పడతారు. నెల నెలా కొద్ది మొత్తం డబ్బు జమ చేసుకుని సంగీతం, నృత్యం, ఆటల పోటీల్లాంటివి పెట్టుకుని ఆనందిస్తారు. ఒత్తిడి అనేది అసలు ఉండదు. బృందంలో ఎవరికైనా ఆర్థిక అవసరాలు ఉంటే ఆ డబ్బు వారికిస్తారు. ఇల్లు కట్టుకోవడమైనా, పొలంపని అయినా... బృందం అంతా కలిసికట్టుగా సాయం చేసుకుంటారు. దాంతో అక్కడివారికి ఆర్థిక అభద్రత ఉండదు, రేపటి గురించి చింత ఉండదు.

* ప్రతి ఇంటికీ పెరటితోట ఉంటుంది. వారి ఆహారంలో మూడోవంతు ఆ పెరటితోటల నుంచే వస్తుంది. నూటపదేళ్ల వారు కూడా ఎండలో తోటపని చేస్తారు. చురుగ్గా ఉంటారు కానీ ఉరుకులు పరుగులు పెట్టరు. ఎక్కడికైనా నడిచి వెళ్లడానికే ఇష్టపడతారు. దారిలో కన్పించిన వారందరినీ నవ్వుతూ పలక రిస్తారు.

100... 150... అసలు జీవితకాలం ఎంత?

జీవనశైలి మార్చుకుని మంచి అలవాట్లతో ఆయుర్దాయాన్ని పెంచుకుంటాం సరే... అసలు మనిషి జీవితకాలం ఎంత... శరీరం ఎన్నేళ్లు మనగలుగుతుంది... అన్న సందేహాలు పరిశోధకులను ఎప్పటినుంచో వేధిస్తున్నాయి. దాంతో దీర్ఘాయుష్షుకు కారణమైన
జన్యువులపై పరిశోధన ఊపందుకుంది. గూగుల్‌ లాంటి పలు టెక్‌ సంస్థలు ఇప్పుడు దీనిపై పెట్టుబడి పెడుతున్నాయి. ఇప్పటివరకూ ఏం కనిపెట్టారంటే...

* దీర్ఘాయుష్షుకి కారణమైన జన్యువుని 1990వ దశకంలోనే కనిపెట్టారు. ఎఫ్‌ఒఎక్స్‌ఓ3ఎ అనే జన్యువులో చోటు చేసుకుంటున్న మార్పులే వందేళ్లు నిండినవారి ఆయుష్షుకు కారణమని యూరప్‌లో జరిగిన పరిశోధనలు తేల్చాయి. ఆ తర్వాత పలుచోట్ల జరిగిన పరిశోధనలు దానిని నిర్ధారించినా, అదొక్కటే కాదనీ మరికొన్ని జన్యువులూ అందుకు కారణమవుతున్నాయనీ తెలిసింది.

* ఇటీవల జరిగిన మరో పరిశోధన దీర్ఘాయుష్కుల జన్యువులను మొదటిసారి వివరంగా డీకోడ్‌ చేసి చూసింది. 105 ఏళ్లు దాటినా ఆ వృద్ధుల్లో సాధారణంగా వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్యాలేవీ లేక పోవడానికి కారణం- సిఓఎ1, ఎస్‌టికె17ఎ అనే రెండు జన్యువుల్లో జరిగిన మార్పులనీ, ఆ మార్పుల వల్ల డీఎన్‌ఏ మరమ్మతు జరుగుతోందనీ ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్‌ బొలోనా ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనలు తేల్చాయి. పలువురు శతాధిక వృద్ధులనుంచీ, యువకులనుంచీ రక్తనమూనాలను తీసుకుని జన్యుపటాలను తయారుచేసి తేడాలను పరిశీలించగా వృద్ధుల జన్యువుల్లో ఐదు తేడాలు కన్పించాయి. పైన చెప్పిన రెండు జన్యువులే ఆ తేడాలకు కారణమని తెలిసింది. సాధారణంగా వయసుపెరిగే కొద్దీ డీఎన్‌ఏ దెబ్బతింటుంది. కణాల్లోనూ మరికొన్ని మార్పులు జరిగి, క్యాన్సర్‌లాంటి వ్యాధులు వస్తాయి. ఈ రెండు జన్యువుల చర్యలు వాటిని అడ్డుకుంటున్నాయని తేల్చారు.

* ఇలా ఒక్కో జన్యువునీ విశ్లేషిస్తూ వెళ్తాం సరే, అసలు అవయవాలు ఎన్నేళ్లు మనగలుగుతాయో అదీ చూడాలనుకున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఆ దిశగా సాగిన చాలా పరిశోధనలు మనిషి శరీర అవయవాలు 120 ఏళ్లవరకూ మాత్రమే పనిచేస్తాయని చెప్పాయి. అయితే అదీ అందరిలో ఒకేలా ఉండదనీ మనిషిని బట్టి మారుతుంటుందనీ తెలిసింది. తాజాగా రష్యా, సింగపూర్‌, అమెరికాలకు చెందిన పరిశోధకులు కంప్యూటర్‌ మోడల్‌ సహాయంతో వివిధ అంశాలను విశ్లేషించి మనిషి జీవితకాలం 150 ఏళ్లని తేల్చారు. 70వేల మంది రక్త నమూనాలను పరీక్షించి సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని నిర్ధారించిన వారు బహుశా మరో మూడు శతాబ్దాల నాటికి ఇది సాధ్యం కావచ్చంటున్నారు.

* మౌంట్‌ డిజర్ట్‌ ఐలాండ్‌ బయోలాజికల్‌ లేబొరేటరీ ఆధ్వర్యంలో సాగిన మరో పరిశోధన మనిషి జీవిత కాలాన్ని ఏకంగా ఐదు రెట్లు పెంచొచ్చంటోంది. దీర్ఘాయుష్షుకు దోహదం చేసే సినర్జిస్టిక్‌ సెల్యులర్‌ పాత్‌వేస్‌ని కనుక్కున్నామనీ దీనివల్ల జీవిత కాలం 400-500 సంవత్సరాలు  అవుతుందనీ ఆ పరిశోధకులు చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..