మా ఇద్దరి అల్లరి భరించలేకపోయేవారు
భళ్లాలదేవుడిగా బాహుబలిలో విశ్వరూపం చూపించిన రానా ఆ తరువాత కూడా వైవిధ్యమైన పాత్రల్నే ఎంచుకుంటూ, వివిధ భాషల్లో నటిస్తూ... తనకంటూ స్టార్డమ్ సృష్టించుకున్నాడు. త్వరలో విరాటపర్వం, భీమ్లానాయక్‌లతో అలరించనున్న రానా తన ఇష్టాయిష్టాలూ మనసులోని ముచ్చట్లను పంచుకుంటున్నాడిలా..
కలవనిచ్చేవారు కాదు
చాలామంది స్నేహితులు ఉన్నా కానీ... స్కూల్లో చదువుతున్నప్పటినుంచీ ఇప్పటివరకూ రామ్‌చరణే నా బెస్ట్ ఫ్రెండ్. అవును, చిన్నప్పటినుంచీ మేమిద్దరం కలిసే చదువుకున్నాం. మా అల్లరి పనుల్ని భరించలేక ఇంట్లోవాళ్లు మమ్మల్ని కలవనివ్వకుండా విశ్వప్రయత్నాలు చేసేవారు కానీ వాళ్లవల్ల అయ్యేది కాదు. మా స్కూల్లో ఉపాసన, అల్లు స్నేహ కూడా చదువుకున్నారు. ఉపాసన నాకు జూనియర్ అయితే స్నేహ నా క్లాస్మేట్.
అన్నీ తినేసేవాడిని
వీఎఫ్ఎక్స్లో పనిచేస్తున్నప్పుడు నా ఫిజిక్‌ని అస్సలు పట్టించుకునేవాడిని కాదు. ఏది పడితే అది తినేసేవాడిని. వ్యాయామం అసలు ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానో అప్పటినుంచీ నా అలవాట్లన్నీ పూర్తిగా మార్చుకున్నా. డైటింగ్, వ్యాయామాలు...నా జీవితంలో ఓ భాగంగా చేసుకున్నా. ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నా.
నటుడు కాకముందు...
సినిమాల్లోకి రాకముందు వీఎఫ్ఎక్స్ రంగంలో పనిచేశా. ‘సైనికుడు’కి పనిచేశాక నంది అవార్డు కూడా వచ్చింది. తరువాత ‘లీడర్’తో నా కెరీర్‌ని ప్రారంభించా. అప్పటినుంచీ ప్రతి సినిమానూ కొత్తగానే ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా.
ఆ అమ్మాయి నచ్చేది
నేను ఏడో తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్లో ఓ అమ్మాయి చేరింది. నాకు సీనియర్ అయినా అందరు అబ్బాయిల్లానే నేనూ తనతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడిని. తరువాత కొన్నాళ్లకు ఫేస్బుక్లో తనకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించా. మ్యూచువల్ఫ్రెండ్స్గా మా స్కూల్‌మేట్స్ ఉండటంతో తను కూడా ఒకే చేసింది కానీ ఆ తరువాత కూడా నన్ను గుర్తుపట్టలేకపోయింది. ఇప్పుడు తెలుసుకుని ఉండొచ్చు.
షూటింగ్‌లు లేకపోతే
కుటుంబంతో గడుపుతా. ఆ తరువాత పుస్తకాలు ఎక్కువగా చదువుతా. అన్నింట్లోకీ మహా భారతం అంటే చాలా ఇష్టం.
సాంబార్ ఇష్టం
నేను అన్నిరకాల ఆహారపదార్థాలనూ ఇష్టపడినా మా నానమ్మ చేసే సాంబార్ ఉంటే మొదటి ప్రాధాన్యం దానికే. చిన్నప్పుడైతే రోజూ సాంబార్ ఉండాలని గొడవచేసేవాడిని.
ఇష్టమైన నటీనటులు
కమల్‌హాసన్, శ్రీదేవి. నేను నటించే సినిమాల్లో కమల్‌హాసన్‌ను అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటా కూడా.
వదులుకోలేని అలవాటు
బూట్లు ఎక్కువగా కొనడం. ఎక్కడికి వెళ్లినా నేను షాపింగ్చేసే వాటిల్లో మొదట అవే ఉంటాయి.
హీరో కాకపోయి ఉంటే...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ని అయ్యేవాడిని.
పెళ్లి వీడియోలు పంపాం
కరోనా కారణంగా నా పెళ్లికి కేవలం ముప్పైమందినే ఆహ్వానించడంతో మిగిలిన బంధువులూ, స్నేహితులకు ఆ వేడుకను వీఆర్‌లో రూపొందించి హెడ్సెట్లూ, మిఠాయిలూ, ఇతర కానుకలతో పంపించాం. దాంతో దగ్గరుండి మా పెళ్లి చూస్తున్నంత ఆనందపడ్డారు వాళ్లంతా.
నచ్చే దర్శకులు
మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ. వాళ్ల సినిమాలను చూస్తూనే పెరిగా.
చైతన్య ఒకఅడుగు ముందే
చైతన్య నా కన్నా చిన్నవాడే కానీ నిదానంగా ఉంటూనే విజయాలనూ సాధిస్తాడు. మొదటినుంచీ అన్నివిషయాల్లో ఒక అడుగు ముందే ఉన్నాడు. చదువు ముందే పూర్తయ్యింది. సినిమాల్లోకీ త్వరగా వచ్చాడు, మా బాబాయితోనూ సినిమా చేశాడు. ఇవన్నీ చూసి నప్పుడు ఆనందంగా అనిపించినా ‘వెంకీమామ’ చేసిన తరువాత మాత్రం కొద్దిగా ఈర్ష్యగా అనిపించింది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్