ఆకుకూరలు... ఎర్రగా పండుతున్నాయ్‌!

పచ్చదనంతో నిండిన ఆకుకూరల్లోని పోషకాలు పుష్కలంగా ఉంటాయనీ అవి రోగనిరోధకశక్తిని పెంచుతాయనీ తెలిసిందే. అయితే ఎరుపు రంగు ఆకుకూరలూ ఉన్నాయి. పచ్చనివాటితో పోలిస్తే ఇవి ఆరోగ్యానికి మరింత మేలుచేస్తాయన్న కారణంతో వీటిని  సూపర్‌ఫుడ్స్‌ జాబితాలోకి చేర్చేశారు పోషక నిపుణులు.

Published : 22 May 2022 00:53 IST

ఆకుకూరలు... ఎర్రగా పండుతున్నాయ్‌!

పచ్చదనంతో నిండిన ఆకుకూరల్లోని పోషకాలు పుష్కలంగా ఉంటాయనీ అవి రోగనిరోధకశక్తిని పెంచుతాయనీ తెలిసిందే. అయితే ఎరుపు రంగు ఆకుకూరలూ ఉన్నాయి. పచ్చనివాటితో పోలిస్తే ఇవి ఆరోగ్యానికి మరింత మేలుచేస్తాయన్న కారణంతో వీటిని  సూపర్‌ఫుడ్స్‌ జాబితాలోకి చేర్చేశారు పోషక నిపుణులు. దాంతో బెండ, క్యారెట్‌... వంటి కూరగాయల్ని సైతం ఎరుపు రంగులోనూ పండించేస్తున్నారు ఆధునిక రైతులు.

సాధారణంగా ఆకుకూరలన్నీ ఆకుపచ్చని రంగులోనే ఉంటాయి. తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, గంగవాయల, బచ్చలి...ఇలా అన్నింటా పచ్చదనమె.  కానీ ఈమధ్య సూపర్‌ మార్కెట్లలో ఎర్రని తోటకూర,
పాలకూర, బచ్చలి... వంటి ఆకుకూరలూ కనిపిస్తున్నాయి. ఎర్ర తోటకూరని అయితే పెరటితోటల్లోనూ పెంచుతున్నారు.

అయినా తోటకూర ఎర్రగా ఉంటేనేం...  పచ్చగా ఉంటేనేం... అనిపించడం సహజం. కానీ  పోషకాహార నిపుణులు భోజనం ప్లేటులో రెయిన్‌బో కలర్స్‌ ఉండాలి అని పదే పదే చెబుతున్నారు. దాంతో స్టార్‌షెఫ్‌లు సైతం రంగుల కూరగాయలతో వంటకాలు చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆకుకూరల్నీ, కూరగాయల్నీ విభిన్న రంగుల్లో పండిం చేందుకు ప్రయత్నిస్తున్నారు నేటి రైతులు.

నిజానికి ఎర్రని ఆకుకూరల్లో కొన్ని సహజంగా ఉన్నవయితే, మరికొన్ని సంకరీకరణ ద్వారా వృద్ధి చేసినవే. అయితే నిన్నటివరకూ అవన్నీ కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ఉదాహరణకు ఎర్రని తోటకూర స్వస్థలం ఇండియానే. లాల్‌ సాగ్‌ పేరుతో బెంగాలీలు ఎప్పటినుంచో దీన్ని ఇష్టంగా తింటున్నారట. మహారాష్ట్ర, గోవాల్లో దీనికి కాస్త కొబ్బరి జోడించి మరీ వండుతారు. కెంపు సొప్పు, చీర అవియల్‌ పేరుతో కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోనూ దీంతో రకరకాలు వండేస్తారు. మనదగ్గర ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఈ రకం తోటకూర మైక్రోగ్రీన్స్‌ వాడకమూ బాగానే పెరిగింది.

పాలకూర: పాలక్‌ పనీర్‌, పాలకూర పప్పు రుచుల గురించి తెలిసిందే. అయితే అవీ ఇకనుంచి ఎరుపు రంగుని సంతరించుకోవచ్చు. ఎందుకంటే అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ సర్వీస్‌ ‘యూఎస్‌డిఏ రెడ్‌’ పేరుతో తొలిసారిగా నిజమైన ఎర్రని పాలకూరని గుర్తించింది. అమరాంథస్‌ జాతులకి చెందిన ఎర్రని తోటకూరనే చాలామంది ఇంతకాలం ఎర్ర పాలకూరగా పిలుస్తున్నారు. కానీ ఎర్రకాడతో ఉండే పాలకూర రకం(బోర్డియాక్స్‌) ఒకటి కొన్నిచోట్ల వాడుకలో ఉంది. దీన్నుంచే అసలైన ఎర్ర పాలకూర పుట్టుకొచ్చిందని గుర్తించారు. ఈ సరికొత్త ఎర్ర పాలకూర ప్రస్తుతం అమెరికాలోనే లభిస్తుంది. ఇందులో బీటాసైనిన్‌ సాధారణ పాలకూరలో కన్నా యాభై శాతం ఎక్కువగా ఉందనీ; దీనికి ఇన్‌ఫ్లమేషన్‌, క్యాన్సర్లను  తగ్గించే గుణాలు ఎక్కువనీ గుర్తించడమే కాదు, సూపర్‌ఫుడ్‌ జాబితాలోకీ చేర్చేశారు.

చుక్కకూర: ఇందులో మనకు తెలిసింది ఒకటే రకం. కానీ లేతాకుపచ్చ రంగుమీద డిజైన్‌ గీసినట్లుగా ఎర్రని ఈనెలతోనూ కాడలతోనూ ఉంటుందీ ఎర్ర చుక్కకూర. అచ్చం నిమ్మలానే పుల్లగా ఉండే దీన్ని కేవలం ఆకుకూరగానే కాదు, పూర్వం నుంచీ ఔషధ మొక్కగానూ వాడుతున్నారు. దీన్నే కొన్నిచోట్ల సోర్‌ వీడ్‌ అనీ అంటారు. సి-విటమిన్‌ ఎక్కువగా ఉండటంతో జ్వరం, స్కర్వీ వ్యాధుల నివారణకీ ఈ ఆకుల్ని మరిగించి తాగించేవారట. ఉత్తర అమెరికన్లయితే విషానికి విరుగుడుగానూ క్యాన్సర్ల నివారణలోనూ వాడుతుంటారు. దీన్ని మరిగించి, కాస్త చక్కెర కలుపుకుని షర్బత్‌ రూపంలోనూ తాగుతారు. ఇది డిటాక్సిఫికేషన్‌కీ ఉపయోగపడుతుంది. మైక్రోగ్రీన్స్‌గానూ దీని వాడుక ఎక్కువే.

గోంగూర: విటమిన్‌-ఎ, సిలతోపాటు బి6, ఫోలేట్‌, ఐరన్‌ సమృద్ధిగా ఉండే గోంగూర రుచి తెలియంది కాదు. అయితే మంచి గోంగూర, పుల్ల గోంగూర అన్న రెండు రకాలే మనకి సుపరిచితం. కానీ ఆఫ్రికాకి చెందిన ఎర్రని ఆకులతో ఉండే క్రాన్‌బెర్రీ గోంగూరని ఈమధ్య అంతటా పెంచుతున్నారు. దీని పువ్వులూ కాయలతోపాటు ఆకుల్నీ మరిగించి టీ రూపంలో తీసుకుంటారు. చర్మ సమస్యలతోపాటు నాడీ సంబంధ వ్యాధులకీ ఇది మంచిదట. ఇందులోని బి-విటమిన్‌ వల్ల రోజంతా శక్తిమంతంగా అనిపిస్తుంది. వయసుతోపాటు పెరిగే మతిమరుపుని తగ్గించే గుణం కూడా ఈ ఆకులకి ఎక్కువే. లేతగా ఉన్న ఆకుల్ని నేరుగానూ తింటుంటారు.

రెడీకియో: ఎర్ర క్యాబేజీని తలపించేలా ఉండే మరో ఆకుకూరే రెడీకియో. దీన్నే ఇటాలియన్‌ చికోరీ అంటారు. తెల్లని ఈనెలతోనూ ఎర్రని ఆకులతోనూ వగరూ ఘాటూ కలగలిసిన రుచితో ఉండే ఈ ఆకుకూర ఇప్పుడు మనదగ్గరా పండుతోంది. రక్తశుద్ధికీ నిద్రలేమికీ పనిచేస్తుందట. ఇందులోని ఇంటిబిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ నొప్పుల్ని తగ్గించే మంచి మందు. ఇతర చికోరీ మొక్కల వేళ్ల మాదిరిగానే ఈ మొక్క వేళ్లనీ కాఫీలో కలుపుతారట. దీని ఎర్రరంగుకి కారణమైన ఆంథోసైనిన్లకు కాలేయ క్యాన్సర్‌ కణాల్ని నిర్మూలించే శక్తి ఉన్నట్లు పరిశీలనల్లో తేలిందట. విటమిన్‌-కె పుష్కలంగా ఉండటంవల్ల ఎముకల ఆరోగ్యానికీ జీర్ణశక్తికీ మంచిదే. అందుకే సలాడ్ల రూపంలో తినడంతోపాటు క్యాబేజీలానూ వండుకుంటున్నారు.

ఇంకా, బచ్చలి, గంగవాయల... వంటి ఆకుకూరలతోపాటు రెడ్‌ స్విస్‌ కార్డ్‌ రకాల్ని కూడా కొందరు పెంచుతున్నారు. రెడ్‌ స్విస్‌ కార్డ్‌ ఆకులయితే లేతగా ఉన్నప్పుడు తీపీ వగరూ కలగలిసిన రుచితో ఉంటాయి. అందుకే సలాడ్లలో వీటి వాడకం ఎక్కువ. స్విస్‌కార్ట్‌ ఆకుల్లోకన్నా కాడల్లో బెటలైన్‌ వర్ణద్రవ్యం ఎక్కువగా ఉండటంతో వాటినీ వంటల్లో వేస్తుంటారు.

ఆకుకూరలనే కాదు, బెండకాయలు, క్యారెట్లు, మునక్కాడల్ని సైతం కొందరు రైతులు ఎర్రెర్రగా పండిస్తున్నారు. కాశీలాలిమ అనే ఎరుపు రంగు బెండ విత్తనాల్ని వారణాశి యూనివర్సిటీ కొత్తగా ప్రవేశపెట్టడంతో కొందరు రైతులు దీన్ని పండిస్తూ అధిక లాభాల్ని ఆర్జిస్తున్నారు. సాధారణ బెండకన్నా ఇందులో పోషకాల శాతం ఎక్కువట. ఎర్ర బెండలో రకాలూ ఉన్నాయి. రెడ్‌ వెల్వెట్‌, రెడ్‌ బర్గండీ, డ్వార్ఫ్‌ లిటిల్‌ ల్యూసీ... వంటి రకాల్ని అమెరికాలో ఎప్పటినుంచో పండిస్తున్నారు. లైకోపీన్‌, ల్యూటెన్‌, ఫెనొలిక్‌ ఆమ్లాల శాతం ఎక్కువగా ఉండే తియ్యని ఎర్రని క్యారెట్‌ రకాన్నే మనదగ్గర గాజర్‌గా పిలుస్తారు. స్వీట్ల తయారీలోనే దీని వాడుక ఎక్కువ. కానీ నారింజ రంగు క్యారెట్లలోకన్నా ఇందులో పోషకాలశాతం ఎక్కువన్నది తెలిశాక దీన్నీ ఎక్కువగా సాగు చేస్తూ ఇష్టంగా తినేస్తున్నారు మరి.

ఎరుపే ఎందుకు?

సాధారణంగా ఆకులన్నీ ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. క్లోరోఫిల్‌ అనే వర్ణద్రవ్యమే ఇందుకు కారణం. అయితే కొన్నింటిలో అది లోపించడం లేదా తక్కువగా ఉండటంతోపాటు ఎరుపూ, ఊదా రంగులోని బెటాలెయిన్స్‌ లేదా బెటాసైనిన్లు అనే పిగ్మెంట్లు ఎక్కువగా ఉంటాయి. నైట్రోజన్‌తో కూడిన ఈ వర్ణద్రవ్యాల వల్లే ఆకులు ముదురు ఎరుపు నుంచి వంకాయ వర్ణంలో ఉంటుంటాయి. ఈ పిగ్మెంట్లు శరీరంలోని రసాయనాల నియంత్రణకి ఉపయోగపడతాయట. అలాగే టొమాటో, క్యాప్సికమ్‌, మిర్చి...వంటి కాయగూరలన్నీ పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చరంగులోనూ పండాక ఎరుపూ పసుపూ రంగులోకీ మారడం చూస్తుంటాం. బీట్‌రూట్‌, ఎరుపూ-ఊదా కలగలిసిన క్యాబేజీ, బ్రస్సెల్‌స్ప్రౌట్స్‌... వంటివి సహజంగానే ఆయా రంగుల్లో పండుతాయి. పండాక మారినా సహజంగానే ఉన్నా వీటిల్లో మిగిలినవాటిల్లో కన్నా లైకోపీన్‌ పిగ్మెంట్‌ శాతం ఎక్కువ. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. అంతేకాదు, ఎర్రని ఆకుల్లో ఇతరత్రా పోషకాలూ ఎక్కువే. ఉదాహరణకు ఎర్ర తోటకూరలో పచ్చదానికన్నా మూడురెట్లు కాల్షియం, ఐదు రెట్లు నియాసిన్‌ ఉంటుంది. సి, ఎ విటమిన్లూ ఖనిజాలూ పుష్కలమే. ఈ రంగు ఆకుల్ని ఉడికించినప్పుడు సువాసనతో కూడిన రుచి వస్తుంది. అదీగాక ఎరుపు రంగు ఆకర్షణీయంగా ఉండటంతో చూడగానే తినాలనిపిస్తుంది. కాబట్టి గార్నిషింగ్‌కీ వాడుకోవచ్చు.

ఎర్రని ఆకుకూరలూ, కాయగూరలన్నింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో అవి క్యాన్సర్లను అడ్డుకుంటాయి. పీచు, పొటాషియం, కాల్షియం, నైట్రేట్‌ల శాతమూ ఎక్కువే. బీట్‌రూట్‌తో పోలిస్తే ఎర్రతోటకూరలో నైట్రేట్‌ శాతం ఐదు రెట్లు ఎక్కువ. ఈ నైట్రేట్‌ రక్తప్రసరణకు దోహదపడుతుంది. అందుకే ఎర్ర పాలకూర, తోటకూర... లాంటివి అథ్లెట్లకీ వృద్ధులకీ మేలు చేస్తాయని ఆక్లాండ్‌కి చెందిన మాసే యూనివర్సిటీ పరిశోధనల్లోనూ స్పష్టమైంది. వీటివల్ల కండరాల పెరుగుదలా బాగుంటుందట. ఇందులో ఉండే ఎక్డీస్టెరాన్‌ దెబ్బతిన్న కండరాల్ని బాగుచేసేందుకూ తోడ్పడుతుంది. ఎరుపురంగు ఆకుల్లోని ఫైటోస్టెరాల్స్‌ కొలెస్ట్రాల్‌ శాతాన్ని అదుపులో ఉంచడం ద్వారా గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. 

ఐరన్‌ లోపంతో బాధపడేవాళ్లు రెండుమూడు కట్టల ఎర్ర తోటకూరని శుభ్రంగా కడిగి ఉడికించి మెత్తని జ్యూస్‌లా చేసుకుని కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని ఓ వారంపాటు తాగితే తక్షణ ఫలితం ఉంటుందట. కాబట్టి నెలసరిలో అధిక రక్తస్రావంతో బాధపడేవాళ్లకి ఇందులోని ఐరన్‌ మేలు చేస్తుంది. ఇది కంటిచూపుకీ, శిరోజాల పెరుగుదలకీ కూడా దోహదపడుతుంది. మొత్తమ్మీద ఎర్రని ఆకుల్లోని పోషకాలన్నీ కలిసి రోగనిరోధకశక్తిని పెంచి, తక్షణ శక్తినిస్తాయి. అందుకే భోజనం ప్లేటులో ఆకుపచ్చని ఆకుకూరలు ఒక్కటే కాదు, అందుబాటులో ఉన్న ఎర్రని ఆకుల్నీ చేర్చండి అంటున్నారు పోషక నిపుణులు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..