కలిసికట్టుగా.. సంక్రాంతి

పుట్టి పెరిగిన ఊరి గాలి సోకగానే ఏదో పులకరింత...చిన్నప్పుడు ఆడుకున్న మట్టి, పరిసరాలు కనిపించగానే తెలియని ఉద్వేగం... అందుకే సంక్రాంతి పండక్కి పట్టణాలూ, నగరాల నుంచి వలసజీవులు పల్లెలకు వరుస కడుతుంటారు.

Updated : 09 Jan 2022 14:38 IST

కలిసికట్టుగా.. సంక్రాంతి

పుట్టి పెరిగిన ఊరి గాలి సోకగానే ఏదో పులకరింత...చిన్నప్పుడు ఆడుకున్న మట్టి, పరిసరాలు కనిపించగానే తెలియని ఉద్వేగం... అందుకే సంక్రాంతి పండక్కి పట్టణాలూ, నగరాల నుంచి వలసజీవులు పల్లెలకు వరుస కడుతుంటారు.  అయితే, ప్రతి గ్రామంలోనూ పండగని ఎవరింట్లో వారు చేసుకుంటే... పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వలిలో మాత్రం ఊరంతా కలిసి చేసుకుంటారు. సంప్రదాయాల్ని ఒంటబట్టించుకుని, సంతోషాల్ని మూటగట్టుకుని... తమతో  పాటు తీసుకుని వెళ్తుంటారు. అంతేనా, ఆ పండగను వేదికగా చేసుకుని గ్రామాభివృద్ధికి ప్రణాళికలూ వేసుకుంటారు.

పిండివంటలూ, భోగిమంటలూ, హరిదాసు కీర్తనలూ, గంగిరెద్దుల ఆటలూ, ముంగిట రంగవల్లులతో పల్లె సీమలు సంక్రాంతి శోభతో ఒకప్పుడు కళకళలాడుతూ ఉండేవి. పండగ చూడాలంటే పల్లెటూళ్లకే వెళ్లాలని అని ఇప్పటికీ అనుకుంటాం. అందులోనూ సంక్రాంతి మరీ ప్రత్యేకం. దానికోసమే ఎంత దూరంలో ఉన్నా మూటాముల్లె సర్దుకుని పెద్ద పండక్కి పల్లెబాట పడుతుంటారు. కానీ గ్రామాల్లో మునుపటి పండగ కళ ఇప్పుడు కనిపించట్లేదనేది చాలామంది ఆవేదన.

అదీ నిజమే! ధాన్యపు రాశులతో కళకళలాడే పల్లె సీమల్లో  సాగు చేసేవారి సంఖ్య తగ్గింది. ఉపాధికోసం యువత వలసెళ్లడంతో ఇళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒకవేళ పండగ పేరుతో ఇంటికి వచ్చినా...ఫోన్లూ, టీవీలతోనే కాలక్షేపం. పండగంటే పేకాటా, కోడిపందేలూ మాత్రమే అనుకునేవారూ ఉన్నారు. ఇవే ఆ ఊరివారిని ఆలోచింపజేశాయి. ఎలాగైనా దీన్ని మార్చాలనుకున్నారు. వెనకటి సంప్రదాయాలనూ, సంబరాలనూ నేటితరానికి పంచాలనుకున్నారు. గ్రామాభివృద్ధిలో మమేకమవ్వాలనుకున్నారు. అందులో భాగంగానే- ఊరంతా కలిసి సంక్రాంతి పండగను ఒకేచోట చేసుకోవాలనుకున్నారు. ఇందుకు 2013లో బీజం పడింది. ఎనిమిదేళ్లుగా ఊరంతా కలిసే పండగ చేసుకుంటున్నారు.

ఆహ్వాన పత్రికలతో...
ఈ ఆలోచన ఆ ఊరికే చెందిన వెలమాటి మనోహరిది. పదిహేనేళ్లపాటు చదువూ, ఉద్యోగం కోసం ఊరికి దూరంగా ఉన్న ఆమె పండక్కి వచ్చినప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాలేవీ కళ్లముందు కనిపించకపోవడంతో బాధపడింది. దేశ,విదేశాల్లో ఉన్న ఆ గ్రామస్థులందరితో చర్చించి ఊరి అభివృద్ధికి పాటుపడాలనుకుంది. మిగిలినవారూ సరేననడంతో అందరూ ‘గ్రామ్‌దీప్‌’ పేరుతో వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ల్లో గ్రూపుగా ఏర్పడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలకు రూపు తెచ్చేందుకు సంక్రాంతిని వేదికగా చేసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగా- దేశవిదేశాల్లో ఉన్న వారందరినీ... మన ఊరిలో జరిగే సంక్రాంతి పండక్కి ‘కుటుంబంతో రండి’ అంటూ ఆహ్వాన పత్రికలు కొట్టించి పిలిస్తే, ఊళ్లోవాళ్లని బొట్టు పెట్టి మరీ ఆహ్వానిస్తారు. 

ప్రకృతి నడక...
సంక్రాంతి వేడుకల్లో భాగమైన భోగిమంటలు, గోదాదేవి కల్యాణం, సంక్రాంతి లక్ష్మి పూజ, గొబ్బెమ్మల ఏర్పాట్లన్నీ గ్రామస్థులందరూ సమష్టిగానే చేస్తారు. మహిళంతా కలిసి పిండి వంటలు వండుతారు. మగవాళ్లు భోగిమంటలకోసం స్థలాన్ని చదును చేస్తే, ఆడవాళ్లు కళ్లాపి చల్లి ముగ్గులు పెడతారు. మహిళందరికీ చెక్కభజన, కోలాటం వంటి ఆటల్నీ నేర్పడంతో వాటిని పండగరోజుల్లో ఉత్సాహంగా ప్రదర్శిస్తారు. ముగ్గుల పోటీలు ఉండనే ఉంటాయి. వివిధ వృత్తులు తెలిసేలా చిన్న చిన్న స్టాల్స్‌నీ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ ఒకెత్తయితే... వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లకు నేచర్‌వాక్‌ పేరుతో పంట కాలువలూ, పొలం గట్ల వెంట సరదాగా పర్యటించే అవకాశం దొరుకుతుంది. అలానే తిరుగు ప్రయాణంలో వెంట తీసుకెళ్లడానికి పిండివంటలు సిద్ధం చేస్తారు. గ్రామ సమస్యలపై చర్చించి అవసరమైన నిధుల సాయం దొరికేలా చూస్తారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఈ కలిసికట్టు సంక్రాంతిని చూడటానికి ఇతర ప్రాంతాల వారూ వెళ్లొచ్చు. అయితే ముందుగా ఆ విషయం వారికి తెలియచేయాలి. గ్రామీణ పర్యటకాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఇలా వచ్చే వారికోసం ప్రత్యేక ఆతిథ్యమూ అందిస్తున్నారు. బాగుంది కదా!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..