ఏసీ కల్యాణ మండపమే కాదు...పెళ్ళి సామగ్రి సైతం ఉచితమే..!

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కల్యాణం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ, పిల్లాపాపలతో పదికాలాలపాటు సుఖంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. అందుకే చుట్టుపక్కల నుంచే

Published : 17 Apr 2022 00:34 IST

ఏసీ కల్యాణ మండపమే కాదు...పెళ్ళి సామగ్రి సైతం ఉచితమే..!

అన్నవరం సత్యదేవుని సన్నిధిలో కల్యాణం చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందనీ, పిల్లాపాపలతో పదికాలాలపాటు సుఖంగా ఉంటారనేది భక్తుల నమ్మకం. అందుకే చుట్టుపక్కల నుంచే కాకుండా దూరప్రాంతాల నుంచీ వ్యయప్రయాసలకోర్చి మరీ ఏటా వేలాదిమంది రత్నగిరిమీద కొలువైన సత్యనారాయణస్వామి ఆలయానికి చేరుకుంటారు. దాంతో ఆ సమయంలో దేవస్థానంలో నెలకొనే రద్దీని తగ్గిస్తూ ఒకేసారి పన్నెండు జంటలు పైసా ఖర్చు లేకుండా హాయిగా వివాహం చేసుకునేలా ఏర్పాటయిందే ‘శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ మండపం’.

అన్నవరం గుడిలో పెళ్లిచేసుకోవాలని కొందరనుకుంటే, పసుపుబట్టలతోనే అక్కడికి వెళ్లి రమా సహిత వీరవెంకట సత్యనారాయణస్వామిని మనసారా దర్శించుకుని, ఆయన సమక్షంలో కనీసం సత్యనారాయణ స్వామి వ్రతమైనా చేసుకోవాలనుకునేవాళ్లు మరికొందరు. అందుకే ఆ దేవస్థానం నిత్యం నూతన వధూవరులతోనూ వారి బంధుమిత్రులతోనూ కళకళలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఒకేసారి అనేక జంటలు సత్యగిరికి చేరుకోవడంతో దేవస్థాన ప్రాంగణంతోపాటు అన్నవరంలోని కల్యాణమండపాలూ వసతి గృహాలూ అన్నీ కిక్కిరిసిపోతుంటాయి. అయితే స్వామి సన్నిధిలోనే పెళ్లిచేసుకోవాలనుకుని మొక్కుకున్నవాళ్లు కల్యాణవేదికలు అందుబాటులో లేనప్పుడు- ప్రాంగణం ఆరుబయటే నానా ఇబ్బందులూ పడుతూ పెళ్లి చేసుకుంటుంటారు. ఆ సమయంలో అనుకోకుండా వర్షం పడితే అది తగ్గేవరకూ వివాహ తంతుని నిలుపుచేయడం కనిపిస్తుంటుంది. ఇవన్నీ కొన్నేళ్లుగా గమనించారు పెద్దాపురానికి చెందిన శ్రీలలిత ఎంటర్‌ప్రైజెస్‌ ఇండస్ట్రీస్‌ ఎండీ మట్టే శ్రీనివాస్‌, ఆయన సతీమణి విద్యుల్లత. పైగా పెళ్లి అంటే మాటలు కాదు, సంపన్నుల సంగతెలా ఉన్నా సామాన్యులకు అది తలకి మించిన భారంగా మారింది. అందుకే ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే స్వామి సన్నిధిలో తమ పిల్లల పెళ్లి చేయాలనుకునే వారికి ఎలాంటి ఆర్థికభారం లేకుండా... అన్ని ఆధునిక సౌకర్యాలతో సుమారు రూ.3.50 కోట్ల వ్యయంతో సత్యగిరిపైన శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కల్యాణ వేదికను నిర్మించారు శ్రీనివాస్‌ దంపతులు. ఈ మండపంలో పెళ్లి చేసుకోవాలనుకునే వారికి వేదిక మాత్రమే కాదు... పెళ్లికి కావాల్సిన సామగ్రినీ ఉచితంగానే సమకూర్చుతారు. గత ఏడాది జులై 16న ప్రారంభమైన ఈ కల్యాణమండపంలో ఇప్పటికే వందలాది పెళ్లిళ్లు జరగడం విశేషం.

ఒకేసారి పన్నెండు పెళ్లిళ్లు...
పేరుకు ఇది కల్యాణమండపం అయినా... దీనిలోపల ఒకేసారి పన్నెండు జంటలు వివాహం చేసుకునేలా పన్నెండు అందమైన వేదికల్ని ఏర్పాటు చేశారు. ఒక్కో వేదికనీ రమా సమేత సత్యనారాయణస్వామి, పరమేశ్వరుడి చిత్రాలతోనూ వధూవరులూ వారి కుటుంబీకులూ కూర్చునేందుకు వీలుగా నిర్మించారు. పెళ్లి సమయంలో  50 మందికి సరిపడా కుర్చీలూ, జంబుఖానా, పెళ్లిపీటలూ, కాళ్లు కడిగే పళ్లెం, స్టీలు గ్లాసులూ, పళ్లేలూ, పాదుకలూ, దీపపు కుందె, కాడి... వంటివన్నీ కల్యాణ మండపమే అందిస్తుంది. వివాహతంతు పూర్తయిన తర్వాత వీటిని తిరిగి మండపం నిర్వాహకులకు అప్పగించాలి. పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేక గదులు, మరుగుదొడ్లు, స్నానపుగదులు... ఇలా అన్ని వసతులూ ఉంటాయక్కడ. మండపాలను ఏర్పాటుచేసిన హాలు పూర్తిగా సెంట్రల్‌ ఏసీతో నడుస్తుందనీ... విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలగకుండా సోలార్‌ ప్లాంట్లు ఏర్పాటుచేసి వాటిని ఆలయానికి అనుసంధానించామనీ చెబుతున్నారు కల్యాణమండపం నిర్వాహకులు.

సంప్రదించడం ఎలా...

సత్యగిరి కల్యాణ వేదికలో వివాహం చేసుకోవాలనుకునేవారు అక్కడున్న రిసెప్షన్‌ను సంప్రదిస్తే... పన్నెండు వేదికల్లో ఎన్ని ఖాళీలున్నాయో తెలుసుకోవచ్చు. వివాహ తేదీకి నెలరోజుల ముందుగా కాబోయే వధూవరులూ వారి తల్లిదండ్రులూ తమ ఆధార్‌ కార్డులనూ, పెళ్లి పత్రికనూ అందిస్తే మండపాన్ని కేటాయిస్తారు. వివాహం చేసుకునే రోజున పెళ్లి సామగ్రిని అందిస్తారు. ‘మేం కట్టించిన ఈ కల్యాణ మండపంలో ఇప్పటికే కొన్ని వందలమంది పెళ్లి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. స్వామి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలనుకునేవారి అవసరాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని వాళ్లకు ఏ ఇబ్బందీ కలగకుండా ఉండేలా ఈ వేదికను కట్టించాం. వీలైనంతమంది స్వామి సన్నిధిలో వివాహం చేసుకుని పదికాలాలు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నా’మని వివరిస్తారు దీన్ని కట్టించిన శ్రీనివాస్‌.

- పాకలపాటి వెంకటరాజు, న్యూస్‌టుడే, అన్నవరం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..