పిజ్జా... ఇంటిముందే!
ఎప్పుడైనా పిజ్జా తినాలనిపించి ఆర్డరిస్తే అది ఇంటికి రావడానికి కనీసం అరగంట సమయం పడుతుంది. తీరా వచ్చాక చూస్తే కొన్నిసార్లు చల్లబడిపోయి ఉంటుంది. పిజ్జాను ఎంతో ఇష్టంగా తినే అశుతోష్ మహేంద్రుకు కూడా పిజ్జా విషయంలో ఇలాంటి అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. అందుకే బాగా ఆలోచించి ‘మై లవ్ ట్రయాంగిల్’ అనే మొబైల్ కిచెన్ సేవల్ని అందుబాటులోకి తెచ్చాడు. అంటే... వీళ్ల వెబ్సైట్లోకి వెళ్లి పిజ్జాను ఆర్డరిస్తే ఆ వ్యాను కస్టమరు ఇంటిముందుకు వచ్చేలోపే కోరుకున్న పిజ్జాను తయారుచేసి టెర్రకోట పాత్రలో పెట్టి వేడివేడిగా అందిస్తారు అందులో ఉండే చెఫ్‌లు. ‘మాది ఫుడ్‌ట్రక్ కాదు. మా వ్యాను ఎవరింటి ముందుకైనా వెళ్తుంది. ఇక, పిజ్జా ఎక్కువ సేపు వేడిగా ఉంటుందనే ఆలోచనతోనే ఇలా టెర్రకోట పాత్రలో పెట్టి ఇస్తున్నాం. వినియోగదారులు తరువాత ఆ పాత్రను ఉపయోగించుకోవడానికి వీలుంటుంది కూడా...’ అని చెప్పే అశుతోష్ ప్రస్తుతం గుడ్గావ్లో ఈ సేవల్ని ప్రారంభించినా త్వరలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నంలో ఉన్నాడు.
టెన్త్ ఫెయిలా... అయితేనేం!
ఆమిర్‌ఖాన్ నటించిన ‘త్రీ ఈడియట్స్’ గుర్తుందా... ఆ సినిమా చివర్లో పిల్లలు రకరకాల వస్తువులు తయారుచేస్తున్న పాఠశాలను ఆమిర్‌ఖాన్ ప్రారంభించి విద్యావిధానానికి కొత్త అర్థం చెప్పిన వైనం ఆకట్టుకుంది కదూ... అచ్చంగా అలాంటి స్కూలే లద్దాక్‌లో ఉంది. అక్కడ కూడా పిల్లల్లో సృజనాత్మకతను పెంచే అంశాల్లో శిక్షణ ఇస్తారు కానీ అందులో చేరాలంటే మాత్రం పదోతరగతి ఫెయిల్ అవ్వాలి. మీరు విన్నది నిజమే. ఏ కారణంతోనైనా పిల్లలు పదో తరగతి ఫెయిల్ అయితే వాళ్లకు ఆ సంవత్సరమంతా వృథానే. అలా కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే లద్దాక్‌లోని కొందరు యువత ఈ స్కూలును కేవలం టెన్త్ ఫెయిల్ అయిన వాళ్లకోసమే ప్రారంభించి చదువుతోపాటు కొన్నిరకాల కోర్సుల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఒక్కసారి అడ్మిషన్ దొరికితే గనుక వాళ్లు అక్కడే ఉండి అన్నీ నేర్చుకోవచ్చు. ప్రస్తుతం లద్దాక్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ పాఠశాల పేరు ‘ద స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లద్దాక్’.
సీసాల సాయంతో బస్కీలు
రకరకాల వ్యాయామాలను అవలీలగా చేసేవాళ్లు కూడా పుషప్స్ అనగానే ‘అమ్మో కాస్త కష్టమే’ అనేస్తారు. బోర్లా పడుకుని బరువంతా చేతులపైన వేస్తూ పైకి లేచి, మళ్లీ కిందకు వెళ్లడం అంటే మాటలు కాదు మరి. అంత కష్టమైన పుషప్స్‌ను కర్ణాటకకు చెందిన డి.ఎస్.తేజస్ అనే కరాటే విద్యార్థి అవలీలగా చేసేసి ‘ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సాధించాడు. అది కూడా మూడు సీసాలను ఆసరాగా చేసుకుని అరనిమిషంలో ఇరవైఏడు పుషప్స్ని పూర్తిచేశాడట. ప్రస్తుతం కర్ణాటకలోని మహారాజా కళాశాలలో బీఏ ఆఖరి సంవత్సరం చదువుతున్న తేజస్ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో కరాటేలో శిక్షణ కూడా తీసుకుంటున్నాడు. సరదాగా ఏదో ఒక ప్రయోగం చేసి రికార్డు సృష్టించాలనుకున్న లక్ష్యంతోనే ఇలా పుషప్స్ చేశానని అంటాడు తేజస్. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నానని ఆనందంగా చెబుతున్న ఇతను ఇప్పటికే కరాటేలో జాతీయస్థాయిలో బోలెడు అవార్డులు అందుకోవడం విశేషం.
స్పైడర్ ఉమన్
ఎత్తైన కొండలూ, టవర్లూ, భవనాలనూ ఎక్కాలంటే కొందరికి భయం. ఒకవేళ కష్టపడుతూ ఎక్కినా అంత పైనుంచి కిందకు చూడమంటే చాలు... ‘అమ్మో కళ్లు తిరుగుతున్నాయి’ అనేస్తారు. రష్యాకు చెందిన ఏంజెలా నికొలౌకు మాత్రం అలాంటి భయాలేవీ ఉండవు. అందుకే ప్రపంచంలో ఎత్తైన భవనాలూ, కొండలూ, వంతెనలూ, టవర్లూ... ఎక్కడెక్కడ ఉన్నాయో వెతుక్కుని మరీ ఆ ప్రాంతానికి వెళ్లి, వాటిని చకచకా ఎక్కేసి, ఓ సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పెట్టేస్తుంది. ఒకప్పుడు ఏంజెలా ఎత్తైన టవర్లూ, గుట్టలనూ చూసి భయపడేదట. అది పోగొట్టుకునేందుకే వాటిని ఎక్కడం మొదలుపెట్టిన ఆమెకు ఇప్పుడది ఓ వ్యసనంలా అయిపోయిందట. అందుకే తరచూ అలాంటివి ఎక్కేస్తూ ఫొటోలు దిగుతానని చెబుతోంది.
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్