ఈ బస్సు టిక్కెట్టు రూ.15 లక్షలు

దిల్లీ నుంచి లండన్‌కి బస్సు అనగానే ఒకింత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. రెండు ఖండాలు దాటి 18 దేశాల మీదుగా వెళ్లే ఆ బస్సు ఎక్కాలంటే వీసా కావాలా, టికెట్‌ ధర ఎంతుంటుందీ... వంటి ఎన్నో ప్రశ్నలు ఈ పాటికే బుర్రలోకి వచ్చి ఉంటాయి కదూ!  ఇదిగో చదివేయండి, లండన్‌ వెళ్లే ఆ ఎర్రబస్సు విశేషాలు...

Updated : 27 Feb 2022 01:30 IST

ఈ బస్సు టిక్కెట్టు రూ.15 లక్షలు

దిల్లీ నుంచి లండన్‌కి బస్సు అనగానే ఒకింత ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. రెండు ఖండాలు దాటి 18 దేశాల మీదుగా వెళ్లే ఆ బస్సు ఎక్కాలంటే వీసా కావాలా, టికెట్‌ ధర ఎంతుంటుందీ... వంటి ఎన్నో ప్రశ్నలు ఈ పాటికే బుర్రలోకి వచ్చి ఉంటాయి కదూ!  ఇదిగో చదివేయండి, లండన్‌ వెళ్లే ఆ ఎర్రబస్సు విశేషాలు...

దిల్లీకి చెందిన అడ్వెంచర్స్‌ ఓవర్‌లాండ్‌ అనే సంస్థ  దిల్లీ-లండన్‌ బస్సు సర్వీసుకు శ్రీకారం చుట్టింది. దిల్లీ నుంచి బయల్దేరే ఆ బస్సు 20వేల కిలోమీటర్లు ప్రయాణించి లండన్‌కు చేరుకుంటుంది. సాధారణంగా ఆ రోడ్డు మార్గంలో వెళ్లాలంటే యాభైరోజులకు తక్కువే పడుతుంది. కానీ మార్గ మధ్యంలోని దేశాల్లో బస్సును ఆపి పర్యటకప్రాంతాల్ని చూపించాలనుకుంటోంది ట్రావెల్‌ ఏజెన్సీ. అందుకే లండన్‌కు చేరుకోడానికి 70 రోజులు పడుతుంది.

* దిల్లీలో బయల్దేరిన బస్సు మయన్మార్‌, థాయ్‌లాండ్‌, లావోస్‌, చైనా, కిర్గిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, కజికిస్తాన్‌, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలెండ్‌, చెక్‌రిపబ్లిక్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, ఫ్రాన్స్‌ మీదుగా ప్రయాణించి లండన్‌కు చేరుకుంటుంది. ఇండియాతో కలిపి 18 దేశాలలో బస్సు ప్రయాణిస్తుంది.

* 18 దేశాల మీదుగా వెళ్లేటప్పుడు వీసా ఎలా అనే అనుమానం వచ్చిందా. అవన్నీ ట్రావెల్‌ ఏజెన్సీనే చూసుకుంటుంది. సదుపాయాలూ, వీసా కోసం కలిపి రూ.15లక్షల రూపాయల ఛార్జీ వసూలు చేస్తున్నారు. మన వివరాల తాలూకు డాక్యుమెంట్లు అందజేస్తే రవాణా మంత్రిత్వ శాఖ, కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ అనుమతులన్నీ ఏజెన్సీనే పొందుతుంది. వీసా సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతుంది.

* ఈ ట్రిప్పు కోసం వోల్వో బస్సును ఎంచుకుని 20 మంది సౌకర్యంగానూ, విలాసంగానూ ప్రయాణించేలా మార్పులూ చేర్పులూ చేశారు. ఈ సీట్లలో కూర్చోవచ్చూ పడుకోవచ్చూ. నిరంతరం వైఫై సేవలుంటాయి. ప్రతి సీటు దగ్గరా సినిమాలూ వీడియోలూ చూడటానికి ఒక స్క్రీన్‌, ఛార్జింగ్‌ పెట్టుకోవడానికి పాయింట్‌, ప్రయివేట్‌ లాకర్‌ అందుబాటులో ఉంటాయి. మంచినీళ్లూ, చాక్లెట్లూ పెట్టుకోవడానికి మినీ ఫ్రిజ్‌ అమర్చి ఉంటుంది. ప్రయాణంలో శాకాహారం, రెడీ టూ ఈట్‌ పదార్థాల్ని ఇస్తారు.

* బస్సులో ఇరవై మంది ప్రయాణికులతోపాటు ఇద్దరు డ్రైవర్లూ, ఏజెన్సీ ప్రతినిధీ, వైద్య సహాయకుడూ, గైడూ ఉంటారు. ఆయా దేశాల్లోని పర్యటక ప్రాంతాల్లో ఆగినప్పుడు స్థానిక కరెన్సీ సిమ్‌ కార్డు వంటివి కూడా ట్రావెల్‌ ఏజెన్సీ ప్రతినిధులు ఇప్పిస్తారు. ప్రయాణం మధ్యలో స్టార్‌ హోటళ్లలోనే బస ఉంటుంది.

* ఈ అతి పొడవైన ప్రయాణానికి శ్రీకారం చుట్టిన తుషార్‌ అగర్వాల్‌, సంజయ్‌ మదన్‌లు 2017- 19 మధ్య మూడు సార్లు దిల్లీ నుంచి లండన్‌కు కారులో ప్రయాణించారు. ఆ అనుభవంతోనే పక్కాగా ప్రయాణానికి ప్రణాళికలు వేశారు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ ప్రయాణం ఈ ఏడాది అతి త్వరలో రోడ్డెక్కబోతోంది.

* లండన్‌కు భారత్‌ నుంచి బస్సు వెళ్లడం ఇదే తొలిసారి కాదు. 1957లోనే దిల్లీ మీదుగా కోల్‌కతా నుంచి లండన్‌కు ఒక బ్రిటిష్‌ కంపెనీ బస్సు సర్వీసును నడిపింది. కొంతకాలానికి బస్సు ప్రమాదానికి గురికావడంతో ఆ సర్వీసును ఆపేశారు. అప్పట్లో బస్సు టికెట్‌ రూ.13600. ఆ తరవాత ఆల్బర్ట్‌ టూర్స్‌ అనే కంపెనీ డబుల్‌ డెక్కర్‌ బస్సును అందుబాటులోకి తెచ్చి సిడ్నీ- ఇండియా- లండన్‌ మీదుగా సర్వీసును ప్రారంభించింది. ఇరాన్‌ అంతర్యుద్ధం, భారత్‌- పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆ బస్సునూ నిలిపేశారు. దాదాపు 46 ఏళ్ల తరవాత మళ్లీ మనదేశం నుంచి లండన్‌కు బస్సు ప్రయాణం ప్రారంభం కానుంది. దూర ప్రయాణాలు ఇష్టపడేవారికి ఈ బస్సు జర్నీ మాంచి కిక్‌నిస్తుంది అనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.


మిఠాయి.. ఆ చిన్నారుల కోసమే!

ఆ ప్రాజెక్టు పేరు మిఠాయి. పేరులో మిఠాయి ఉంది కదాని స్వీట్లు పంచిపెడతారనుకుంటే పొరపాటే. మధుమేహ బాధితులైన చిన్నారులకు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు సూచించడం నుంచీ చికిత్స ఇవ్వడం వరకూ పూర్తి బాధ్యత మిఠాయిదే.  కేరళ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు పదిహేనువందల మంది మధుమేహ చిన్నారులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ హాయిగా చదువుకుంటున్నారు.

మధుమేహం వస్తే చాలు... తీపి వస్తువులు మానేసి పోషకాహారం తీసుకోవాలని చెబుతారు డాక్టర్లు. వ్యాయామం చేయడం తప్పనిసరవుతుంది. మందులు వేసుకుంటూనే అప్పుడప్పుడూ రక్తంలో చక్కెరస్థాయుల్నీ పరీక్షించుకోవాలి. పెద్ద వాళ్లయితే ఇవన్నీ సరే కానీ... చిన్నారులతో కష్టం. పైగా చాక్లెట్లు, స్వీట్లు, చిప్స్‌ లాంటివాటికి దూరంగా ఉండమంటే అసలు వినరు. ఈ సమస్యను గుర్తించాకే కేరళ ప్రభుత్వం సోషల్‌ సెక్యూరిటీ మిషన్‌ ఆధ్వర్యంలో ‘మిఠాయి’ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించి మధుమేహ బాధితులైన చిన్నారుల సంరక్షణ బాధ్యతను తీసుకుని... వాళ్లకు అవసరమైన వైద్యసదుపాయాన్ని అందిస్తోంది. ఆలోచన బాగానే ఉంది కానీ... పిల్లల్లో మధుమేహం ఎందుకొస్తుందంటే దానికీ కారణాలున్నాయి. నిజానికి డయాబెటీస్‌ టైప్‌-1, టైప్‌-2 రకాల్లో ఉంటుంది. జీవన విధానంలో జరిగే మార్పుల వల్ల టైప్‌-2 వస్తే... టైప్‌-1ను ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌గా పేర్కొంటారు. దీనికి కారణాలు బోలెడు ఉన్నా... ఇది ఎక్కువగా 5 - 18 ఏళ్లలోపు పిల్లల్లోనే మొదలవుతుంది. పైగా ఈ సమస్య కారణంగా రక్తంలో చక్కెరస్థాయులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి నిరంతరం జాగ్రత్తలు తీసుకోవాలి. కేరళలో పేద, బడుగు వర్గానికి చెందిన పిల్లలే ఎక్కువగా ఈ టైప్‌-1 మధుమేహం బారిన పడుతుండటంతో.. దీన్ని గుర్తించిన ప్రభుత్వం ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ మిఠాయి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎలా పనిచేస్తుందంటే...

టైప్‌-1 మధుమేహ బాధితులు ఆ సమస్యతో జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. దీంతో ఒక్క రోగికే కాదు, కుటుంబ సభ్యులకూ దీనిపైన పూర్తి అవగాహన ఉండాలి. సమస్య ఉన్నవాళ్లు మిఠాయి అధికారులను సంప్రదిస్తే అవసరమైన పరీక్షలు చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలను బాధిత కుటుంబసభ్యులకు తెలియజేస్తారు. పేదవర్గాలు పోషకాహారం తీసుకోలేరు కాబట్టి వాళ్లు తినేవాటిల్లోనే ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో వివరిస్తారు. ఆ తరువాత చికిత్సను సూచిస్తారు. అంటే... ఈ పిల్లలకు తరచూ రక్తంలో చక్కెరస్థాయుల్ని పరీక్షించుకుంటూనే ఇన్సులిన్‌ను ఎలా తీసుకోవాలో చెబుతారు. ఇది కాస్త ఖరీదుతో కూడుకున్న విషయం కాబట్టి.. దానికి సంబంధించిన పూర్తి కిట్‌ను అందిస్తారు అధికారులు. ఇందులో గ్లూకోమీటర్‌తోపాటూ, పిల్లలు తమంతట తాము చేసుకునే ఇన్సులిన్‌ పెన్‌ - కాట్రిడ్జ్‌ కూడా ఉంటుంది. సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారికి ఇన్సులిన్‌ పంప్‌ను అందజేస్తారు. రక్తంలో చక్కెర స్థాయుల్ని ఆ చిన్నారులు ఎప్పటికప్పుడు నోట్‌ చేసుకుంటూనే తదనుగుణంగా ఇన్సులిన్‌ను ఎంత మోతాదులో ఎలా తీసుకోవాలో వైద్య సిబ్బంది సూచిస్తుంటారు. అంతేకాదు... పిల్లలు నెల్లో నాలుగుసార్లు మిఠాయి ప్రాజెక్టు అధ్వర్యంలో నడిచే క్లినిక్‌లకు వెళ్లి ఉచిత పరీక్షలు చేయించుకుని రావచ్చు. ఇందుకోసం అయిదు క్లినిక్‌లను ప్రారంభించారు. అవి లేనిచోట మిఠాయి శాటిలైట్‌ సెంటర్‌ పేరుతో ప్రత్యేక శిబిరాలనూ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇక్కడ ఉండే వైద్యులూ, ఇతర సిబ్బందీ నిరంతరం ఆ పిల్లల వివరాలను సేకరిస్తూ, వారితో మాట్లాడుతూ అవసరమైన సలహాలు ఇస్తుంటారు. వీటన్నింటితోపాటు తమ వెబ్‌సైట్‌లో కొత్తగా రిజిస్టర్‌ చేసుకున్న పిల్లలకు కూడా అవసరమైన పరీక్షలు నిర్వహించి పరిస్థితికి తగినట్లుగా వైద్యం అందిస్తుందీ ప్రాజెక్టు.

ఓ వైపు ఇవన్నీ చేస్తూనే మరోవైపు వాళ్లలోని అభిరుచుల్ని ప్రోత్సహించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ... బాధితుల్లో ఒత్తిడినీ దూరం చేస్తుంది ఈ సంస్థ. కొత్త రోగుల్ని గుర్తించేందుకు ఎప్పటికప్పుడు శిబిరాలను నిర్వహిస్తూ మధుమేహంపైన అవగాహన కల్పిస్తూ... ఆదిలోనే సమస్యను గుర్తించే ప్రయత్నం చేస్తున్న మిఠాయి ప్రాజెక్టు ఇప్పటివరకూ దాదాపు పదిహేను వందల మంది పిల్లల్లో మార్పు తెచ్చిందని అంటారు డాక్టర్లు. ‘టైప్‌-1 మధుమేహం సమస్య పేద పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కానీ చాలామంది తల్లిదండ్రులు దాన్ని గుర్తించకపోవడంతో సమస్య ఇంకా పెరుగుతోంది. అదే తల్లిదండ్రుల్లో ఆ చైతన్యం వస్తే మొదట్లోనే సమస్యను అదుపు చేయొచ్చు..’ అంటారు మిఠాయి ప్రాజెక్టు డాక్టర్లు.


ఊరందరికీ ‘చెక్క’డమే పని!

ఏ ఊళ్లో అయినా చెక్క పనితనం తెలిసినవాళ్లు ఒకరో ఇద్దరో ఉంటారు. కానీ తమిళనాడు సేలం జిల్లాలోని తమ్మాపట్టిలో మాత్రం ఏకంగా 120 కుటుంబాలు అదే పనిలో ఉంటాయి. వాళ్లకు చెక్కడమే పని. ఏ కొయ్యముక్కైనా వాళ్ల చేతిలో పడితే చాలు... అద్భుతమైన శిల్పంలా మారిపోతుంది. అందుకే ఆ ఊరు జి.ఐ. ట్యాగునీ సొంతం చేసుకుని శిల్పగ్రామంగానూ పేరొందింది!

75 సంవత్సరాల నాటి మాట... వడ్డార్‌ తెగకు చెందిన కొందరు కళాకారులు తమ్మాపట్టి గ్రామానికి వచ్చి అక్కడి వాతావరణం కలప పనికి అనుకూలంగా ఉండటంతో స్థిరపడ్డారట.

ఊళ్లోని ఉగ్ర నరసింహస్వామి ఆలయంకోసం ఓ చెక్క రథాన్ని తయారుచేయడంతో వాళ్లలోని కళ వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఆ రథం స్థానికులతోబాటు, చుట్టుపక్కల ప్రాంతాల్నీ దేశవ్యాప్తంగా ఉన్న ఎందరో కళాకారుల్నీ ఆకట్టుకుందట.

ఆ చెక్కుడులోని సునిశితమైన నైపుణ్యం అందరూ ఆ గ్రామం వైపు చూసేలా చేసింది. అప్పటి నుంచీ అక్కడి కళాకారులు తమ ఉలికి నిత్యం సానబెడుతూనే ఉన్నారు. వినాయకుడి నుంచి తిరుమల బాలాజీ వరకూ దేవతలందరినీ అద్భుతంగా చెక్కుతూనే ఉన్నారు. శివపార్వతుల విగ్రహం చెక్కితే అందులో పరమేశ్వరుడి చేతి ముద్రల నుంచి పార్వతీదేవి కాలి అందెల వరకూ అన్నీ అందంగానూ స్పష్టంగానూ కనిపిస్తాయి. తరతరాలుగా వస్తోన్న శిల్పశాస్త్ర మెలకువల్ని అభ్యసిస్తూనే కాలానుగుణంగా వస్తోన్న మార్పుల్నీ అందిపుచ్చుకుని అనునిత్యం చెక్కుతూ ఉండటమే వాళ్ల కళా నైపుణ్యం వెనకున్న రహస్యం.

టేకు, రోజ్‌వుడ్‌ చెట్లతో పోలిస్తే నిద్రగన్నేరు, ఏగిస, అత్తి... వంటి చెట్ల కలపతోనే శిల్పాల్ని చేస్తుంటారు. రకరకాల చెట్లకు ఆలవాలమైన పచైమలై-కొల్లి కొండల మధ్య ఈ ఊరు ఉండటంతో అనేక రకాల చెక్కతో చేసే ప్రావీణ్యాన్ని వాళ్లు సంపాదించారు. వర్షపాతం ఎక్కువగా ఉండటంతో అక్కడి చెట్ల కాండాలు మృదువుగానూ ఒకలాంటి మెరుపుతోనూ ఉంటాయి. దాంతో విగ్రహాలకు కొద్దిపాటి సహజ రంగులద్దినా చాలు... అవి ఎంతో అందంగా కనిపిస్తాయి అంటారక్కడి కళాకారులు.

ఎలా చేస్తారు?

ఇందుకోసం ముందుగా వీళ్లు శిల్పానికి సరిపడా చెక్కని ఎంపిక చేసుకుని ఆ తరవాత దాన్ని చెక్కుతారు. మూడోదశలో నునుపుదనం వచ్చేలా సానబెడతారు. మొదట్లో దేవతలవే ఎక్కువగా చెక్కినా క్రమంగా ఇంటీరియర్‌ చెక్క డిజైన్లకీ వీళ్లు కళ కట్టిస్తున్నారు. పురాణపాత్రల విగ్రహాలతోపాటు డోర్‌ ప్యానెల్సూ, పూజా మండపాలూ, పూజాగది తలుపులూ... అక్కడివాళ్లు చెక్కినవి చుట్టుపక్కల రాష్ట్రాలతోపాటు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.  అమెరికా, బ్రిటన్‌, కెనడా, సింగపూర్‌, మలేషియా, ఫ్రాన్స్‌... వంటి విదేశాల నుంచీ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయట.

పనితనాన్ని బట్టి అక్కడ తయారుచేసే విగ్రహాలు ఒక్కొక్కటీ వందల నుంచి లక్షల రూపాయల వరకూ ధర పలుకుతుంటాయి.

‘డిగ్రీలు చదువుకున్నా- వారసత్వంగా వచ్చిన విద్యని ఆసక్తి కొద్దీ మా తరం నేర్చుకుంది. కానీ మా పిల్లల్ని కార్పొరేట్‌ ఉద్యోగాలని వదులుకుని ఈ రంగంలోనే స్థిరపడమని  చెప్పలేం. వాళ్లకిష్టమైతే నేర్చుకుంటారు’ అంటారు స్థానిక శిల్పకారుడైన సెంగొట్టువల్‌. ఇటీవల అక్కడి కళాకారుల జీవనచిత్రంమీద తీసిన ఓ డాక్యుమెంటరీతో ఆ ఊరు మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..