వెరీ పెరీ.. ఈ ఏడాది ఫ్యాషన్‌ వర్ణం ఇదే!

కాంతి లేని ప్రపంచాన్ని ఊహించలేనట్లే రంగుల్లేని జీవితాన్నీ ఊహించలేం. చెట్లూ పుట్టలూ మనుషులూ జంతువులతోపాటు తినేవీ తాగేవీ వాడుకునేవీ... ఇలా ప్రతీదీ వర్ణమయమే. ఒక్కోరంగుదీ ఒక్కో అందం. దేని ప్రత్యేకత దానిదే.

Published : 02 Jan 2022 00:45 IST

వెరీ పెరీ.. ఈ ఏడాది ఫ్యాషన్‌ వర్ణం ఇదే!

కాంతి లేని ప్రపంచాన్ని ఊహించలేనట్లే రంగుల్లేని జీవితాన్నీ ఊహించలేం. చెట్లూ పుట్టలూ మనుషులూ జంతువులతోపాటు తినేవీ తాగేవీ వాడుకునేవీ... ఇలా ప్రతీదీ వర్ణమయమే. ఒక్కోరంగుదీ ఒక్కో అందం. దేని ప్రత్యేకత దానిదే. అందుకే అప్పటి ప్రపంచ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఏటా ఒక వర్ణాన్ని ఎంపిక చేస్తుంటుంది పాంటోన్‌... అంతర్జాతీయ రంగుల సంస్థ. అలా ఈ ఏడాది మెరిసి పోనున్న వర్ణమే ‘వెరీ పెరీ’..!

వెరీ పెరీ... పేరే కాదు, పాంటోన్‌ రంగుల చక్రంలోనూ ఇది కొత్త రంగేనట. ఫ్యాషన్‌ వరల్డ్‌ కోసం ఆ సంస్థ ఏర్పాటు చేసుకున్న రంగులరాట్నంలో ఇప్పటివరకూ లేని ఈ రంగుని తొలిసారిగా ఎంపిక చేసింది. లేత నీలంలో ఎరుపుతో కూడిన ఊదా రంగు కలగలిసినట్లుగా ఉంటుందీ వర్ణం అంటున్నారు రంగుల నిపుణులు. నీలం, ఊదా, లావెండర్‌ ఛాయలన్నీ కూడా వెరీ పెరీ రంగుకే చెందుతాయి అంటూ మరికొందరు డిజైనర్లు భాష్యం చెప్పేస్తున్నారు. కానీ నీలం కలిసినట్లుగా ఉండే లావెండర్‌ కలరే వెరీ పెరీ అన్నది పాంటోన్‌ సంస్థ నిపుణుల ఉవాచ. మొత్తమ్మీద లావెండర్‌కి దగ్గర షేడ్‌ అన్నమాట.

ఎందుకీ రంగు?
నీలం ఊదా కలగలిసినట్లుండే బిళ్లగన్నేరు పూలని స్ఫూర్తిగా తీసుకునే ఈ రంగుని ఎంపిక చేశారట. ఎక్కడంటే అక్కడ పెరిగే ఈ మొక్క అనేక రంగుల్లో పూస్తుంది. ఇందులోని ఔషధగుణాల రీత్యా ఈ మొక్కని ఆయుర్వేదం, చైనా సంప్రదాయ వైద్యంతోపాటు క్యాన్సర్‌ నివారణకోసం ఆధునిక వైద్యంలోనూ వాడుతున్నారు. అయితే ఇందులో ఎన్ని రంగులున్నా నీలం ఛాయలో ఉన్న పూలు ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ కళ్లకు ఆహ్లాదాన్ని అందిస్తాయి. అలాగే దాదాపు ఇదే రంగులో విరిసే లావెండర్‌ పూల సుగంధం కూడా మనసుకి ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. మరెన్నో రోగాలకు మందులా పనిచేస్తూ సాంత్వన చేకూరుస్తుంది. అందుకే గత రెండేళ్లుగా కరోనాతో ఆందోళనకు గురయిన జనంలో ఆశావాదాన్నీ ఆనందాన్నీ నింపుతుందీ కొత్త కలర్‌ అని వివరణ ఇస్తున్నారు ఫ్యాషనిస్టులు. ఇప్పటివరకూ వర్ణపటకంలో ఎక్కడా కనిపించని రంగు కాబట్టి ఈ రంగు దుస్తులుగానీ యాక్సెసరీలు కానీ మార్కెట్లో అంతగా లేవు. దాంతో దానికి దగ్గరగా ఉండే లావెండర్‌ షేడ్స్‌నీ వెరీ పెరీలోకి చేర్చేసిందీ సంస్థ. అంతేకాదు, ప్రియార్టీ, కారియుమా, బర్‌స్ట్‌, ఆలివ్‌ అండ్‌ జూన్‌... వంటి కొన్ని సంస్థలతో కలిసి సైకిళ్లూ స్నీకర్లూ టూత్‌బ్రష్‌లూ నెయిల్‌పాలిష్‌లూ... ఇలా రకరకాల ఉత్పత్తు లన్నింటినీ వెరీ పెరీ రంగులో రూపొందిస్తోంది పాంటోన్‌ సంస్థ. మైక్రోసాఫ్ట్‌తో కలిసి విండోస్‌ వాల్‌ పేపర్స్‌లోనూ ఈ రంగు వాడేలా చూస్తున్నారు పాంటోన్‌ నిపుణులు.

ప్రేమకు సంకేతం!
వెరీ పెరీ రంగులో అంతర్లీనంగా ఉన్న నీలం, ఎరుపూ కలిసి శక్తిని అందిస్తాయనీ విశ్వాసాన్ని కలిగిస్తాయనీ అంటున్నారు. లావెండర్‌ మాదిరిగానే ఇదీ ప్రేమకి సంకేతమేనట. లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నదానికీ ఈ రంగే చిహ్నమట. ఆ కారణంతోనే చూసీ చూడగానే ప్రేమలో పడ్డవాళ్లు ఈ రంగు పూలతో ప్రపోజ్‌ చేయొచ్చు అంటున్నారు. ముఖ్యంగా చలికాలానికీ వేసవికీ మధ్య వచ్చే నులివెచ్చని కాలానికి ఈ రంగు చక్కగా సరిపోతుంది. యౌవ్వనాన్నీ ఈ రంగు ప్రతిఫలిస్తుంది. ఊహాశక్తిని పెంచుతుంది. ఒకలాంటి అమాయకత్వాన్నీ సున్నితత్వాన్నీ ప్రతిబింబిస్తుంటుందీ కలర్‌. లావెండర్‌ పూలవాసన ఎలాగైతే మనసునీ శరీరాన్నీ సేదతీరుస్తుందో ఈ రంగు వేసుకున్నప్పుడు కూడా అలాంటి ఫీలే కలుగుతుందట. అందుకే ఈ రంగుని ఇష్టపడేవాళ్లు సృజనాత్మకంగా ఆలోచిస్తారనీ ప్రశాంతంగా కనిపిస్తారనీ చెబుతున్నారు కలర్‌ థెరపిస్టులు. దీనికి ఎరుపూ నలుపూ పసుపూ వంటి సాధారణ రంగులతో పొంతన ఉండదు సరికదా, మరే ఇతర రంగులతోనూ కలిసిపోదు. అందుకే ఈ రంగు డ్రెస్సు వేసుకున్న అమ్మాయిలు ఎంతమందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపిస్తారనీ ఒక్కసారి చూడగానే ఎప్పటికీ గుర్తుండిపోతారనీ చెప్పుకొస్తున్నారు ఫ్యాషనిస్టులు.

మృణాళినీ రావు, రీనా ధాకా తదితర భారతీయ డిజైనర్లు అప్పుడే వెరీ పెరీ రంగుని సొంతం చేసుకుని పెళ్లి దుస్తుల నుంచి ఇండో వెస్ట్రన్‌ దుస్తుల వరకూ అన్నింటినీ ఆ రంగులో రూపొందించే పనిలో ఉన్నారు. ఎంత ఖరీదైన డ్రెస్సు అయినా దాన్ని ఎంత ప్రత్యేకంగా డిజైన్‌ చేసినా ముందుగా కనిపించేది రంగే. కాబట్టి డిజైనర్లంతా వెరీ పెరీ రంగు ఫ్యాబ్రిక్‌ కోసం ప్రయత్నిస్తున్నారట. కొందరయితే ప్రత్యేకంగా డై చేయిస్తున్నారట. డిజైనర్లే కాదు, మేకప్‌ ఆర్టిస్టులు సైతం లేలేత నీలంతో కూడిన లావెండర్‌ రంగు మేకప్‌ షేడ్‌లమీద దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఐ షాడోలూ లిప్‌స్టిక్‌ల్లో ఈ రంగు కోసం అన్ని బ్రాండ్‌ల్లోనూ వెతికేస్తున్నారట. ఇక, నెయిల్‌పాలిష్‌ల గురించయితే ప్రత్యేకంగా చెప్పే పనే లేదు. అదీగాక కరోనా తెచ్చిన ఒంటరితనం, అస్థిరతలతో విసిగిన వాళ్లందరికీ ఈ కొత్త రంగు ఒకలాంటి ఉత్తేజాన్ని నింపుతుందనీ, ఈ రంగుమీదకి ఏ జ్యువెలరీ అయినా చక్కగా నప్పుతుందనీ, అన్నింటిలోకీ ముత్యాలయితే మరింత చక్కగా నప్పుతాయనీ కూడా చెప్పుకొస్తున్నారు జ్యువెలరీ డిజైనర్లు. ఈ రంగు షేడ్‌లు గదిలో ఒక గోడకు వేసి, మిగిలిన గోడలకి తెలుపు లేదా ఆకుపచ్చ రంగులు వేస్తే ఆ గది లుక్కే మారి పోతుంది అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అదీగాక ఈ రంగుని చూసినప్పుడు గందరగోళం పోయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందట. కోపం తగ్గి శాంతంగా ఉండేలా చేస్తుందట.

మొత్తమ్మీద వెరీ పెరీ ఫ్యాషన్‌ ప్రపంచంలోనూ ఇంటీరియర్‌ డిజైనింగ్‌లోనూ కొత్త ట్రెండ్‌ను సృష్టించనుంది. ఇంత వరకూ ఎరుపూ ఊదా గులాబీ పసుపూ ఛాయల్లోనే ఎక్కువగా కనిపించే సెలెబ్రిటీలూ సామాన్యులూ అందరూ కూడా ఇప్పుడు ఈ కొత్త రంగుమీద మనసు పారేసుకోనున్నారన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..