విశాఖ లైబ్రరీ...... ఆ హంగులే వేరు మరి!

పబ్లిక్‌ లైబ్రరీ అనగానే బూజు పేరుకుపోయిన గోడలూ, పెచ్చులూడిన అల్మారాలూ...  ఈ దృశ్యాలే కళ్లలో మెదులుతాయి ఎవరికైనా! ఇన్నున్నా సగటు పాఠకుడు లైబ్రరీకి ఎందుకు వెళతాడు...? పుస్తకాలపైన ఆసక్తి కొందరిదైతే... పోటీ పరీక్షల అవసరం ఇంకొందరిది! ఆ ఆసక్తికీ, అవసరాలకీ అడుగడుగునా గొడుగుపడుతూ

Updated : 22 May 2022 06:00 IST

విశాఖ లైబ్రరీ...... ఆ హంగులే వేరు మరి!

పబ్లిక్‌ లైబ్రరీ అనగానే బూజు పేరుకుపోయిన గోడలూ, పెచ్చులూడిన అల్మారాలూ...  ఈ దృశ్యాలే కళ్లలో మెదులుతాయి ఎవరికైనా! ఇన్నున్నా సగటు పాఠకుడు లైబ్రరీకి ఎందుకు వెళతాడు...? పుస్తకాలపైన ఆసక్తి కొందరిదైతే... పోటీ పరీక్షల అవసరం ఇంకొందరిది! ఆ ఆసక్తికీ, అవసరాలకీ అడుగడుగునా గొడుగుపడుతూ నిర్మించిన తొలి ప్రజా గ్రంథాలయం అది. ఆధునిక హంగుల పరంగా తెలుగురాష్ట్రాల్లో ఇదే నంబర్‌ వన్‌ అంటున్నారు. ఎందుకో చూడండి...

ఆ కార్పొరేట్‌ లుక్కేమిటీ, ఏసీ హాళ్లేమిటీ, పిల్లల్ని అలరించే అడవి నేపథ్యం ఏమిటీ... అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు ఈ లైబ్రరీలోకి అడుగుపెట్టినవాళ్లు! గోడలకి చక్కటి నునులేత రంగుల పెయింటు, కళ్లని ఇబ్బందిపెట్టని లైటింగ్‌, ఆ వెలుగు కూడా సన్నగా జారిపోతుందేమో అన్నట్టుండే నున్నటి ఫ్లోరింగ్‌, ఏ అంతస్తుకా అంతస్తులో విభిన్నంగా ఉండే ఇంటీరియర్‌ డిజైనింగ్‌... ఇలా ఏ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కో వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ అడుగుపెడితే. పైపై హంగుల్లోనే కాదు... వసతుల్లోనూ తిరుగులేదు అనిపించుకుంటోందీ గ్రంథాలయం. అటు లైబ్రరీ అల్మరాల్లోని పుస్తకాలతోపాటూ ‘ఈ-బుక్స్‌’ కూడా చదువుకోవడానికి వీలుగా నాలుగు ఫ్లోర్‌లలో 41 కంప్యూటర్‌లని ఏర్పాటుచేశారు. ఇన్ని సేవల్నీ ఉచితంగానే అందిస్తున్నారు!

ప్రతి ఫ్లోరూ... అద్భుతమే!
ఈ లైబ్రరీ లోపలికి అడుగుపెట్టగానే రిసెప్షన్‌ విభాగమే మనల్ని పలకరిస్తుంది. మనం ఇందులో సభ్యులమైనా కాకున్నా రిసెప్షన్‌లో ఐడీ కార్డు తీసుకుని స్వైప్‌ చేస్తేనే అద్దాల గదులు తెరుచుకుంటాయి. ముందు- గ్రౌండ్‌ ఫ్లోర్‌. ఇక్కడ దేశవిదేశాలకి చెందిన 30 పైచిలుకు మ్యాగజైన్‌లని చూడొచ్చు. 14 దినపత్రికల్నీ చదవొచ్చు. ఇక్కడి ప్రత్యేక కాన్ఫరెన్స్‌ హాళ్లలో పోటీ పరీక్షలకి సిద్ధమయ్యే వారి కోసం వారానికోసారి ప్రత్యేక తరగతులూ, కౌన్సెలింగ్‌లూ నిర్వహిస్తుంటారు. అప్పుడప్పుడూ వ్యక్తిత్వ వికాస తరగతులూ ఏర్పాటుచేస్తున్నారు. అక్కణ్నుంచి మెట్లద్వారానో లిఫ్ట్‌లోనో మొదటి ఫ్లోర్‌కి వెళితే అతిపెద్దదైన జనరల్‌ సెక్షన్‌-1’ని చూడొచ్చు. ఇక్కడ స్త్రీ పురుషులకి వేర్వేరుగా ఏసీ రీడింగ్‌ హాళ్లున్నాయి! ఇందులో ‘కెరియర్‌ వింగ్‌’ పేరుతో ప్రత్యేక రిఫరెన్స్‌ పుస్తకాల విభాగాన్నీ ఏర్పాటుచేశారు. దాంతోపాటూ ఈ-బుక్స్‌తో కూడిన ‘ఈ-లెర్నింగ్‌’ సెంటర్‌ ఇక్కడ ఉంటుంది. ఇక రెండో అంతస్తు- అత్యంత ఆకర్షణీయమైంది. పిల్లలకి లైబ్రరీని అలవాటుచేయడం కోసం ‘మియావాకీ’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని సృష్టించారు ఇక్కడ. గోడలకి అడవి థీమ్‌ ఉన్న బొమ్మలే కాదు, నేలకి కూడా గడ్డిలాంటి ఫ్లోరింగ్‌ని వేసి, పిల్లలకే ప్రత్యేకమైన కుర్చీలని పెట్టారు. చిత్రలేఖనం, కథారచనల్లోనూ శిక్షణ అందిస్తున్నారు. ఇదే ఫ్లోర్‌లో తాజాగా ‘గాంధీయానా’ అన్న ప్రత్యేక విభాగాన్నీ ఏర్పాటుచేశారు. మహాత్ముడికి సంబంధించిన సుమారు 1500 పుస్తకాలున్నాయి ఈ సెక్షన్‌లో. ఈ ఫ్లోర్‌లో రెండు జనరల్‌ సెక్షన్‌లు కూడా ఉన్నాయి. ఫస్ట్‌ఫ్లోర్‌లో ఉన్న జనరల్‌ సెక్షన్‌నూ కలిపితే ఈ లైబ్రరీలో మొత్తం 70 వేల పుస్తకాలున్నాయని చెబుతున్నారు!  

పాఠకులే నిర్మించారు...
విశాఖలోని సామాన్య పాఠకులు... సాటి పాఠకుల కోసం ఏర్పాటుచేసిన విశిష్ట లైబ్రరీ ఇది. ఈ కలల లైబ్రరీకి బీజం 1996లో పడిందట. విశాఖ నగరంలోని ‘బుక్‌ సెంటర్‌’ వ్యవస్థాపకుడు వరహాల చెట్టి తనలాంటి పుస్తకప్రియులు వి.సీతారామయ్య, తిరుపతి రాజు, ప్రసన్నకుమార్‌ తదితరులతో కలిసి ఇందుకు ప్రణాళికలు సిద్ధంచేశారు. నాటి కార్పొరేషన్‌ ఇందుకోసం ద్వారకా నగర్‌లో రెండువేల చదరపుటడుగుల్ని కేటాయించింది. విశాఖ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు భూరి విరాళాలని అందించాయి. అలా-2004లో ఈ లైబ్రరీ మొదలైంది. పేరుకి ఇది కార్పొరేషన్‌ యాజమాన్యం కిందే ఉన్నా దీన్ని పాఠకులతో కూడిన ప్రత్యేక పాలనా మండలి నిర్వహిస్తూ వస్తోంది. అందుకే కావచ్చు... 2014లో ఈ లైబ్రరీ ఆధునికీకరణ మొదలైనప్పటి నుంచీ సగటు పాఠకుల అభిప్రాయానికే పెద్ద పీటవేశారు. ముఖ్యంగా విద్యార్థులూ, వృద్ధులూ, స్త్రీల అవసరాలని తెలుసుకుంటూనే ఆర్కిటెక్ట్‌లు కొత్త నిర్మాణాలని డిజైన్‌ చేశారు. ఇప్పటికీ అంతే- ఆ మధ్య పోటీపరీక్షల విద్యార్థుల కోరిక మేరకే ఇక్కడి ఈ-లెర్నింగ్‌ సెంటర్‌లో ‘మాక్‌ టెస్ట్స్‌’ని కొత్తగా పరిచయం చేశారు! తమకి అంత ప్రాధాన్యం ఇస్తున్నందువల్లనేమో... ఇటు తూర్పుగోదావరి నుంచి అటు శ్రీకాకుళం దాకా ఉన్న విద్యార్థులు ఈ లైబ్రరీని ఆశ్రయిస్తున్నారు.  

- బీఎస్‌ రామకృష్ణ, ఈనాడు, విశాఖపట్నం.


అపజయాల మ్యూజియం!

మీరు ఎన్నో రకాల మ్యూజియాల గురించి వినుంటారు, చూసుంటారు. కానీ ఓటమి పాఠాలు చెప్పే వస్తుప్రదర్శన సంగతి తెలుసా... ‘మ్యూజియం ఆఫ్‌ ఫెయిల్యూర్‌’ పేరుతో స్వీడన్‌లోని హెల్సింగ్‌బోగ్‌లో ఉంది అలాంటి వింత మ్యూజియం. దీంట్లో అడుగుపెట్టగానే ప్రపంచంలోని వివిధ సంస్థలకు చెందిన 159 ఫెయిల్యూర్‌ వస్తువుల్ని చూడొచ్చు. సాధారణంగా ఫోర్డ్‌, ఆపిల్‌, గూగుల్‌ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏది పట్టినా బంగారమే అనుకుంటాం గానీ కొన్నిసార్లు ఈ సంస్థలకీ ఓటమి తప్పలేదు. 1957లో ఫోర్డ్‌ సంస్థ- ఫోర్డ్‌ ఎడ్‌సెల్‌ అనే కారును విడుదల చేసింది. ఆ కారు లుక్కూ, రేటూ ప్రజల్ని ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కంపెనీ కొన్ని కోట్ల నష్టాన్ని మూటకట్టుకుంది. ఇలాగే ఆపిల్‌ మెసేజ్‌ప్యాడ్‌, గూగుల్‌ గ్లాసెస్‌ ఎవరినీ మెప్పించలేకపోయాయి. ఇవే కాదు.. కాఫీ రుచితో వచ్చిన కోకాకోలా బ్లాక్‌, కాల్గేట్‌ సంస్థ తెచ్చిన లసగ్నా అనే ఆహార పదార్థం, లెగో ఫైబర్‌ ఆప్టిక్‌, సోనీ బీటామ్యాక్స్‌ వీడియో హోమ్‌ సిస్టమ్‌, అమెజాన్‌ ఫైర్‌ ఫోన్‌.... ఇలా ఎన్నెన్నో ఉత్పత్తులకు సరైన ఆదరణ రాలేదు. మార్కెట్లో విజయాన్ని పొందకపోయినా బిజినెస్‌ పాఠాల్లా నిలిచిన ఈ ఉత్పత్తుల గురించి అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో 2017లో శామ్యూల్‌ వెస్ట్‌ అనే ఆయన ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశాడు. టూరింగ్‌ మ్యూజియంగా అప్పుడప్పుడు వేరే దేశాల్లోనూ వీటిని ప్రదర్శనకు ఉంచుతున్నాడు. వాటన్నింటినీ మీరూ చూడాలనుకుంటే ఈ మ్యూజియం సైట్లోని వర్చువల్‌ టూర్‌కి వెళ్లిరావచ్చు!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు