సౌర ఫలకాల కింద సాగు!

వ్యవసాయానికి సౌర విద్యుత్‌ వాడటం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండింటినీ కలగలిపి చేసే ‘ఆగ్రోవోల్టాయిక్‌ సాగు’ గురించి తెలుసా? వినడానికి కొత్తగా ఉంది ఏంటీ ఈ సాగు విధానం అనుకుంటున్నారు కదూ...

Updated : 01 May 2022 06:19 IST

సౌర ఫలకాల కింద సాగు!

వ్యవసాయానికి సౌర విద్యుత్‌ వాడటం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండింటినీ కలగలిపి చేసే ‘ఆగ్రోవోల్టాయిక్‌ సాగు’ గురించి తెలుసా? వినడానికి కొత్తగా ఉంది ఏంటీ ఈ సాగు విధానం అనుకుంటున్నారు కదూ...

విద్యుత్‌ ఛార్జీలూ, కొరతా వంటివి తగ్గించుకోడానికి చాలామంది రైతులు తమ పొలాల్లో సౌరవిద్యుత్‌ పంపుసెట్లు వాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రైతుకి మాత్రం పెట్టుబడికి తగ్గట్టు ఆదాయం రావడం ఎంతో కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆగ్రోవోల్టాయిక్‌ సాగు రైతుల్ని లాభాల బాట పట్టిస్తోంది. ఈ విధానంలో- పొలాల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేసి కరెంట్‌ని ఉత్పత్తి చేయడంతోపాటు వాటి కింద పంట కూడా పండిస్తారు. సౌర ఫలకాల్ని ఒకటిన్నర నుంచి ఎనిమిది అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తారు. వాటి ఎత్తును అవసరం మేరకు తగ్గించొచ్చూ పెంచొచ్చూ. పైగా సోలార్‌ ప్యానెల్స్‌ ఎండ ఎటు ఉంటే అటే తిరుగుతాయి కాబట్టి పంటకీ సరిపడ ఎండా తగులుతుంది. వాటి కింద భూమి ఎలాగూ ఖాళీగానే ఉంటుంది కాబట్టి వృథాగా వదిలేయకుండా సాగు చేయొచ్చు. అలానే అవసరం మేరకు సోలార్‌ విద్యుత్తును వాడుకుని మిగతాది గ్రిడ్‌కు పంపి ఆదాయం పొందొచ్చు. ప్యానెళ్ల కింద పంట పండించడం వల్ల భూమిపై తేమ ఎక్కువసేపు ఉంటుంది. తరచూ నీళ్లు పెట్టాల్సిన అవసరం ఉండదు. భూసారం కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

పాలీహౌస్‌ల ఉద్దేశం కూడా అదే. అందుకే ఆ విధానంలోనే టొమాటో, క్యారెట్‌, క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, వంగ, పొట్ల, బెండ, దోస వంటి  కూరగాయలతోపాటు - ఆకుకూరలు, ద్రాక్ష వంటి పండ్లను సాగు చేసి లాభాలు గడిస్తున్నారు- కెన్యా, చైనా, జపాన్‌, ఉత్తర ఆసియా, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాల్లోని రైతులు. కొందరేమో సోలార్‌  ప్యానెళ్లను ఏర్పాటుచేసి కౌలుకు ఇస్తున్నారు. దాంతో విద్యుత్‌తోనూ, కౌలుతోనూ రెండు విధాలుగా ఆదాయం అందుకుంటున్నారు.

మన వద్దా సిద్ధం...
పొలంలో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెల్స్‌ ఎత్తును ఎలాగూ పెంచుకునే అవకాశం ఉంటుంది కాబట్టి యంత్రాల సాయంతో భూమిని దున్నినా ఇబ్బంది ఉండదు. అందుకే ఇప్పటికే ఈ విధానాన్ని ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల్లోనూ కొందరు రైతులు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. కొచ్చి ఎయిర్‌పోర్టులోనూ 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్యానెళ్ల కిందా సాగును మొదలుపెట్టింది ఎయిర్‌పోర్టు అథారిటీ. అలానే హైదరాబాద్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ కూడా కొన్ని స్టార్టప్‌లతో కలిసి ఆగ్రోవోల్టాయిక్‌ విధానంపై అధ్యయనం చేస్తోంది. యూనివర్సిటీ భూముల్లోనూ సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు చేసి ఈ మధ్యనే నూతన సాగుకు శ్రీకారం చుట్టారు. ఎంత పవర్‌ ఉత్పత్తి చేస్తే గ్రిడ్‌కు ఇవ్వచ్చు అన్నదానిపై ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నారు.

ఆ విషయంలో స్పష్టత వచ్చాక ‘పీఎం కుసుమ్‌’ పథకం కింద రాయితీతో సోలార్‌ పంపు సెట్లు అందించినట్టే ఈ ప్యానెళ్ల ఏర్పాటుకూ ఊతమివ్వడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అధికారులు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..