పానీపూరీ కావాలా... ఆధార్‌ చూపండి!

పానీపూరీ అనగానే చాలామందికి నోట్లో నీళ్లు తిరుగుతాయి. చిన్నా పెద్దా వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లో అయినా ఇష్టంగా తినే ఈ స్ట్రీట్‌ ఫుడ్‌కి ఉన్న క్రేజ్‌ ఇంతా ఇంతాకాదు.

Updated : 08 Jan 2023 17:52 IST

పానీపూరీ కావాలా... ఆధార్‌ చూపండి!

పానీపూరీ అనగానే చాలామందికి నోట్లో నీళ్లు తిరుగుతాయి. చిన్నా పెద్దా వయసుతో సంబంధం లేకుండా ఏ సీజన్‌లో అయినా ఇష్టంగా తినే ఈ స్ట్రీట్‌ ఫుడ్‌కి ఉన్న క్రేజ్‌ ఇంతా ఇంతాకాదు. అందుకు తగినట్లే వాటిని అమ్మే బండ్లు కూడా వీధికొకటి ఉంటున్నాయి. అన్ని చోట్లా నేరుగా వెళ్లిపోయి ఎన్ని కావాలంటే అన్ని తినేయొచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌-భింద్‌ రోడ్డులోని భగత్‌ జీ గోల్‌గప్పా స్టాల్‌లో మాత్రం అలా కుదరదు. అక్కడ ఆధార్‌ కార్డు చూపిస్తేనే ఆ స్టాల్‌ ఓనర్‌ ఛోటేలాల్‌ బఘెల్‌ ఎవరికైనా పానీ పూరీ ఇస్తాడు. అసలు పానీ పూరీకీ, ఆధార్‌కీ సంబంధం ఏంటనే కదా సందేహం... ఛోటేలాల్‌ నడిపే చాట్‌ భండార్‌కు ఆ ప్రాంతంలో మంచి పేరుంది. ఎక్కడెక్కడ నుంచో అక్కడ గోల్‌గప్పా తినడానికి వస్తుంటారు. అయితే పానీపూరీ నీళ్లలో వాడే ఘాటైన చాట్‌ మసాలానే ఆ ప్రత్యేకమైన రుచికి కారణమట. కానీ, అది పిల్లలకీ, వృద్ధులకీ, ఆడవాళ్లకీ మంచిది కాదనీ అందువల్ల వారికి గోల్‌గప్పా అమ్మకూడదనీ నిర్ణయించుకున్నాడట ఛోటేలాల్‌. అందుకే ఆధార్‌ కార్డు చెక్‌ చేసి 18-50 ఏళ్ల లోపు మగవాళ్లకే పానీపూరీ విక్రయిస్తూ ఉంటాడు. ఆ విషయాన్నే తన చాట్‌ బండిపైనా రాసి ఉంచాడు. అయితే, ఇరవై ఏళ్లగా చాట్‌ బండి నడుపుతున్న ఛోటేలాల్‌ తన మసాలా ప్రత్యేకత ఏంటో మాత్రం ఎవరికీ చెప్పడు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..