అజైల్‌శాల... సరికొత్త పాఠశాల!

అందరికీ కాదుగానీ... ‘అజైల్‌’ అంటే ఐటీ ఉద్యోగులకి బాగా తెలిసి ఉంటుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసే సమయంలో పాటించాల్సిన ప్రత్యేక విధివిధానాల సమాహారాన్నే అజైల్‌ అంటారు.

Updated : 16 Apr 2023 03:44 IST

అజైల్‌శాల... సరికొత్త పాఠశాల!

అందరికీ కాదుగానీ... ‘అజైల్‌’ అంటే ఐటీ ఉద్యోగులకి బాగా తెలిసి ఉంటుంది. ఓ సాఫ్ట్‌వేర్‌ని అభివృద్ధి చేసే సమయంలో పాటించాల్సిన ప్రత్యేక విధివిధానాల సమాహారాన్నే అజైల్‌ అంటారు. ఐటీ రంగంలో అద్భుతాలు సృష్టించిన ఈ విధానాలని... విద్యాబోధనకి వర్తింపజేస్తే? బెంగళూరుకి చెందిన శ్రీకర మహిషి, పూర్ణిమా శ్రీకర దంపతులకి ఈ ఆలోచనే వచ్చింది. దానికి ప్రపంచంలోని ఇతర ఉత్తమ బోధనా పద్ధతుల్ని జోడించి వాళ్ళు సృష్టించిన ఆన్‌లైన్‌ విద్యాసంస్థే... అజైల్‌ శాల! దీని ప్రత్యేకత ఏమిటో చూద్దామా...

పన్నెండేళ్ళ నిఖిలది సూర్యాపేట. ఆరో తరగతి దాకా స్థానిక బడిలోనే చదువుకుంది. అక్కడ విపరీతమైన ఒత్తిడి, హోమ్‌వర్క్‌ల మోతని భరించలేకపోయింది. నిఖిల తండ్రి హరిప్రసాద్‌కి ఏం చేయాలో పాలుపోలేదు. తన పాపకి ర్యాంకుల ఒత్తిడిలేని, ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయని బడుల కోసం అన్వేషించసాగాడు. అప్పుడే ‘అజైల్‌శాల’ గురించి విని అందులో చేర్చారు. ఏడాది కాలంలో వివిధ సబ్జెక్టులపైన పాపలో పెరిగిన జిజ్ఞాసా, తన పనులు తానే చేసుకునే స్వీయక్రమశిక్షణా, వివిధ సబ్జెక్టులపైన సాధిస్తున్న నైపుణ్యం... ఇవన్నీ తనకి ఎనలేని తృప్తినిస్తున్నాయంటున్నారు హరిప్రసాద్‌.

జిజ్ఞాసా, క్రమశిక్షణా ఎవరిక్కావాలి... ఐఐటీలో సీటే ముఖ్యమంటారా! అయితే, మీరు గుజరాత్‌కి చెందిన ప్రియాంశ్‌ గురించి తెలుసుకోవాలి. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 70 శాతం మార్కులే సాధించిన ప్రియాంశ్‌ అజైల్‌శాలలో ఇంటర్‌ రెండో ఏడాదిలో చేరాడు. అప్పటిదాకా మార్కులే లక్ష్యంగా చదివినవాడు కాస్తా సైన్స్‌ మ్యాథ్స్‌ ‘కాన్సెప్ట్స్‌’పైన పట్టు సాధించగలిగాడు. ఇంకేం... గత ఏడాదే ఐఐటీలోనూ సీటు సాధించేశాడు!

అజైల్‌శాల సహవ్యవస్థాపకురాలు పూర్ణిమ... ఐఐటీ-మద్రాసులో పీహెచ్‌డీ చేసి... బోధనపైన ఉన్న ఆసక్తితో ఇటువైపు వచ్చారు. భర్త శ్రీకర మహిషిని కూడా ఈ రంగంవైపు నడిపించారు. స్పెయిన్‌లో ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ చదివిన ఆయన ఓ బహుళజాతి సంస్థలో పనిచేస్తుండేవాడు అదివరకు. పూర్ణిమ వాళ్లన్నయ్య శ్రీనిధి ద్వారానే మొదట దంపతులిద్దరూ అజైల్‌ సూత్రాల గురించి విన్నారట. వాటిని విద్యారంగంలో ఉపయోగించాలనుకున్నారు. ఎన్నో ప్రయోగాల తర్వాత కరోనా సమయంలో ఓ కోచింగ్‌ సెంటర్‌లా ప్రారంభించారు. ఆదరణ బావుండటంతో పూర్తిస్థాయి బడిగా మార్చారు. ప్రస్తుతం దేశవిదేశాల నుంచి అరవైమంది విద్యార్థులున్నారు.

అంతా కొత్తగానే...

అజైల్‌ బోధనా విధానంలోని ప్రధాన అంశం... ఇది విద్యార్థి కేంద్రంగా పనిచేయడం. ఓ విద్యార్థి ఏం చదవాలన్నది ప్రభుత్వమో, స్కూలో నిర్ణయించి పాఠ్యప్రణాళిక రూపొందించే విధానమే ఇప్పటిదాకా మనకు తెలుసు. కానీ, అజైల్‌లో ఇందుకు భిన్నంగా ప్రతి విద్యార్థి ఆసక్తీ అతని మేధో స్థాయిని బట్టే పాఠ్య, బోధనా ప్రణాళికలు రూపొందిస్తారు. బోధన కూడా నిత్య జీవితానికి ముడిపెట్టే ఉంటుంది. ప్రతిదాన్నీ ఓ ఆటలాగా మార్చి(గేమిఫికేషన్‌) చెబుతారు. పరీక్షలు కూడా మూణ్నెల్లు, ఆరునెలలు, ఏడాది అన్న క్రమంలో ఉండవు. వారానికోసారి ఉంటాయి! ఇలా ఓ వారాన్ని యూనిట్‌గా తీసుకుని, ఆ మేరకు మాత్రమే ప్రణాళికని పూర్తిచేయడాన్ని ‘స్ప్రింట్‌’ అంటారు అజైల్‌ విధానంలో. అంతేకాదు, విద్యార్థే తన రోజువారీ టైమ్‌టేబుల్‌ని వేసుకుంటాడు. దీన్ని ‘స్క్రమ్‌’ స్టోరీబోర్డు అంటారు. ఒక్క చదువనే కాదు ఓ రోజులో తన వ్యాపకాలన్నింటినీ కలిపే ఈ స్టోరీబోర్డు తయారుచేయాల్సి ఉంటుంది. ఏవైనా అంశాలు మిగిలిపోతే ఆ తర్వాతి రోజు చేసుకోవచ్చు ఏ ఒత్తిడీ ఉండదు. ప్రతిరోజూ ఉదయం విద్యార్థి-తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల మధ్య చర్చ ఉంటుంది. అజైల్‌ విధానంలో రోజూ ఈ ముగ్గురి మధ్య భాగస్వామ్యం తప్పనిసరి. వారం రోజుల్లో నేర్చుకున్న అంశాలపైన... వారాంతంలో ‘ఓపెన్‌బుక్‌’ పద్ధతిలో పరీక్ష ఉంటుంది. నెలలో మూడువారాలు ఇలా సబ్జెక్టుల గురించి బోధించాక... నాలుగో వారాన్ని పూర్తిగా అటు విజ్ఞానం ఇటు వినోదంతో కూడిన ప్రాజెక్టుల కోసం కేటాయిస్తారు. ‘పీచుమిఠాయిని ఎలా తయారుచేస్తారు?’, ‘పైరుపైన పక్షులు రాకుంటే ఏమవుతుంది?’ ఇలా ఉంటాయి ప్రాజెక్టు అంశాలు.

మళ్ళీ బడిలో చేరక్కర్లేదు...

అజైల్‌ శాలలో రోజుకి ఎక్కువలో ఎక్కువగా మూడు తరగతులే ఉంటాయి. పాఠాలకి సంబంధించిన పుస్తకాలూ ఇతరత్రా వస్తువులన్నింటినీ ఇంటికే పంపిస్తారు. ప్రతి తరగతికీ ఆరేడుమంది విద్యార్థులే ఉంటారు. వాళ్ళనే ఓ గ్రూపుగా చేస్తారు. మూడునెలలకోసారి వీళ్ళకి పర్యటనలు నిర్వహించి స్నేహాలు చిగురించేలా చూస్తారు. మరి ఈ ఆన్‌లైన్‌ బడిలో చేరితే మామూలు స్కూలు సర్టిఫికెట్‌ రాదా అన్న బెంగ అక్కర్లేదు. పది, పన్నెండో తరగతులకి సీబీఎస్‌ఈ విధానంలో పరీక్షలు రాయిస్తారు. ఫీజులు ప్రారంభ తరగతులకి 40 వేల రూపాయల నుంచి ఇంటర్‌కి లక్షన్నరదాకా ఉన్నాయిక్కడ. బెంగళూరు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళకి అటు ఆన్‌లైన్‌ ఇటు ఆఫ్‌లైన్‌(హైబ్రిడ్‌) విధానంలో బోధిస్తున్నారు.

కె. ముకుంద, ఈనాడు, బెంగళూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..