ఈ సత్రం... క్యాన్సర్‌ బాధితులకోసం!

క్యాన్సర్‌ అనేదే ఓ ప్రాణాంతకమైన వ్యాధి. అలాంటిది ఆ జబ్బు పేదవారికి వస్తే... పైగా ఆ చికిత్సకోసం నగరానికి రావాల్సిన పరిస్థితి ఎదురైతే... ఎక్కడ ఉండాలీ, భోజనం ఎలా... ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్లను చుట్టుముడతాయి.

Published : 06 Jul 2024 23:59 IST

క్యాన్సర్‌ అనేదే ఓ ప్రాణాంతకమైన వ్యాధి. అలాంటిది ఆ జబ్బు పేదవారికి వస్తే... పైగా ఆ చికిత్సకోసం నగరానికి రావాల్సిన పరిస్థితి ఎదురైతే... ఎక్కడ ఉండాలీ, భోజనం ఎలా... ఇలా ఎన్నో ప్రశ్నలు వాళ్లను చుట్టుముడతాయి. వాటన్నింటికీ పరిష్కారం చూపిస్తుంది ‘నీనారావు చామకూరు సత్రం’. క్యాన్సర్‌ రోగులకూ, వాళ్లతోపాటు వచ్చే సహాయకులకూ వసతి, భోజనం ఉచితంగా అందించే ఈ సత్రం నిర్వహణా ఆసక్తికరంగానే ఉంటుంది.

పార్వతిది వరంగల్‌. క్యాన్సర్‌ నిర్ధారణ కావడంతో చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఎంజేఎం ఆసుపత్రిలో చూపించుకోమన్నాడు స్థానిక డాక్టర్‌. ఉన్న పొలాన్ని తాకట్టుపెట్టి చేతిలో డబ్బు పెట్టుకుని హైదరాబాద్‌కు చేరుకుందామె.

రవిది దిగువ మధ్యతరగతి కుటుంబం. రోజంతా కష్టపడితేనే కానీ పూటగడవదు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రికి క్యాన్సర్‌ అని తెలియడంతో పల్లెటూరు నుంచి ఎంజేఎం ఆసుపత్రికి తీసుకొచ్చాడు.  

వీళ్లిద్దరనే కాదు... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎందరో పేదవాళ్లు చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఎంజేఎం క్యాన్సర్‌ ఆసుపత్రికి వస్తారు. వాళ్లందరికీ ఆసుపత్రిలో చికిత్స ఉచితమే కానీ ఆ తరువాత ఉండేందుకూ, భోజనం చేసేందుకూ చేతిలో డబ్బు ఉండాల్సిందే. ఆ ఖర్చుల్నీ పెట్టుకోలేని వాళ్లకోసం ఆసుపత్రికి దగ్గరగా ఏర్పాటైందే ‘నీనారావు చామకూరు సత్రం’. రోగుల పరిస్థితిని బట్టి ఆసుపత్రి సిబ్బందే వాళ్లను సత్రానికి సిఫారసు చేస్తారు. ఈ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టరు సీకే గోవిందరావు. క్యాన్సర్‌ రోగుల దుస్థితిని కళ్లారా చూసిన ఆయన వాళ్లకోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన గోవిందరావు.. తమ ట్రస్టు అధ్వర్యంలో ఎంజేఎంకు దగ్గర్లో ఉన్న తమ స్థలంలోనే ఓ భవనాన్ని నిర్మించి ఆసుపత్రి యాజమాన్యానికి అందించాడు. దాంతో ఆసుపత్రి సిబ్బంది సత్యసాయి సేవా సంస్థకు ఈ సత్రం నిర్వహణ బాధ్యతను అప్పగించింది. అలా దాదాపు -రెండేళ్లుగా సత్యసాయి సంస్థలో భాగమైన శివం ‘ఆశ్రిత కల్ప’ పేరుతో ఈ సత్రాన్ని నిర్వహిస్తోంది.

ఎన్నాళ్లయినా ఉండొచ్చు...

ఈ సత్రం మూడంతస్తుల్లో ఉంటుంది. ఇక్కడ డార్మిటరీ తరహాలో గదులుంటాయి. నిత్యకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూంలూ, దుస్తులు ఉతికి ఆరేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాటూ, మెట్లెక్కలేనివాళ్లకు లిఫ్ట్‌ వంటివన్నీ ఉంటాయి. ఇక, రోగులకూ, వాళ్లతోపాటు వచ్చే సహాయకులకూ రెండుపూటలా వేడివేడిగా భోజనం కూడా రెడీ చేస్తారు సత్యసాయి సేవకులు. డాక్టర్లు చెప్పిన డైట్‌కు అనుగుణంగానే ఈ భోజనంలో రాగిజావ, పప్పు, కూర, సాంబారు, మజ్జిగ, పండు.. వంటివన్నీ ఉంటాయి. ఇలా చికిత్స జరుగుతున్నంతకాలం ఇక్కడే ఉంటారు రోగులు.  

నిర్వహణ ఎలాగంటే..

ఈ సత్రం నిర్వహణ, రెండుపూటలా వాళ్లకు సమయానికి భోజనం పెట్టడం... అన్నీ పక్కా ప్రణాళికతో చేస్తామని చెబుతారు సత్యసాయి సేవకులు. ‘ఆసుపత్రి సిబ్బంది మాకు సత్రం బాధ్యతలు అప్పగించినప్పుడు ఎలా చేయాలనేది మా సత్యసాయి డిస్ట్రిక్ట్‌ ప్రెసిడెంట్‌ ఎ.మల్లేశ్వరరావుతో కలిసి చర్చించుకున్నాం. ప్రతిరోజూ శివం నుంచి రెండుపూటలా భోజనం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇందుకోసం దాదాపు నాలుగువందల మంది ఈచ్‌ వన్‌ ఫీడ్‌ వన్‌ పేరుతో నెలమొత్తం ఒక రోగికి భోజనం పెట్టేందుకు మాకు తోచినంత డబ్బులు వేసుకుంటూ ఓ కిరాణా దుకాణానికే నేరుగా పంపించేస్తాం. అక్కడినుంచి సరకులు శివం కిచెన్‌కు వెళ్లిపోతాయన్నమాట. అలాగే మా సత్యసాయి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్‌వ్యాప్తంగా పదహారు సమితీలు ఉంటాయి. ప్రతి శని, ఆదివారాలు ఈ సమితీల నుంచీ భోజనం వచ్చేలా చూస్తున్నాం. రాత్రి భోజనం అయ్యాక... ఎంతమంది రోగులు ఉన్నారనేది అంచనా వేసుకుని మర్నాడు తేవాల్సిన భోజనాల గురించి శివం సభ్యులకు సమాచారం అందిస్తాం. అదే విధంగా క్యాన్సర్‌ రోగులు ఉండే పరిసరాలూ శుభ్రంగా ఉంచేందుకు మా సేవకులు ప్రతిరోజూ ఇక్కడకు వచ్చి ఈ సత్రాన్ని ఊడ్చి, తుడుస్తారు. వాళ్లకు భోజనమూ వడ్డిస్తారు. క్యాన్సర్‌బాధితుల్ని ఆనందంగా ఉంచేందుకు అప్పుడప్పుడూ కౌన్సెలింగ్‌ ఇస్తాం. రోజూ భజనలు చేయిస్తాం. యోగా, ధ్యానం చేయిస్తూ...  కథలూ, కబుర్లూ చెబుతుంటాం. అలాగే క్యాన్సర్‌ బాధితులైన చిన్నారులకోసం ప్రత్యేకంగా బాల వికాస్‌ తరగతుల్నీ నిర్వహిస్తాం. ఈ రెండేళ్లలో దాదాపు ఎనిమిది వేలమందికి పైగా క్యాన్సర్‌ బాధితులు ఇక్కడ ఆశ్రయం పొందడం విశేషం’... అంటూ వివరిస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..