ఆటోవాలాల సేవలకు సలాం!

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆటోవాలాల్లో కొందరు తమకోసమే కాకుండా సామాజిక దృక్పథంతోనూ ఆలోచిస్తున్నారు

Updated : 07 Jul 2024 05:12 IST

ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఆటోవాలాల్లో కొందరు తమకోసమే కాకుండా సామాజిక దృక్పథంతోనూ ఆలోచిస్తున్నారు. అందుకోసం బృందాలుగా ఏర్పడి ఎన్నో మంచి పనులు చేస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు. వాళ్లు చేస్తున్న ఆ సేవా కార్యక్రమాలు ఏంటంటే...

 ఆకలి తీర్చుతూ...

కేరళలోని కొల్లం దగ్గర ఉన్న అలుంపీదిక, ఒచిర, దాని చుట్టుపక్కల పది గ్రామాలకు ఆటోలు నడిపే కొందరు డ్రైవర్లు- ఓ కిచెన్‌ను ఏర్పాటు చేసి మూడేళ్లుగా పేదల ఆకలి తీర్చుతున్నారు. కొల్లంకు చెందిన సోనూ అనే ఆటోడ్రైవర్‌ కొవిడ్‌ సమయంలో ఆకలితో అల్లాడిపోతున్న ఎందర్నో చూసి చలించి- తనకు చేతనైనంత మందికి అన్నం పెట్టడం మొదలుపెట్టాడు. అన్నదానంలో ఆనందం వెతుక్కున్న సోనూ ఎప్పటికీ ఆ సేవల్ని కొనసాగించాలనుకున్నాడు. అది తనొక్కడి వల్లా అయ్యేది కాదని, తోటి ఆటో డ్రైవర్లకు మనసులోని మాట చెప్పాడు. మంచి మనసున్న ఓ ఇరవై మంది స్పందించడంతో ఓ గ్రూపుగా ఏర్పడి- అలుంపీదిక గ్రామంలో కిచెన్‌ను ఏర్పాటు చేశాడు. అక్కడ ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ టిఫిన్‌, భోజనం సిద్ధం చేసి- వచ్చిన వారి ఆకలి తీరుస్తుంటారు. కొందరు ఆటో డ్రైవర్లు ఫుడ్‌ ప్యాకెట్లను తీసుకెళ్లి దార్లో కనపడిన పేదలకు అందిస్తుంటారు. మరికొందరు డ్రైవర్లు చుట్టుపక్కల గ్రామాల్లో మంచానికే పరిమితమైన వృద్ధుల ఇళ్లకు వెళ్లి కడుపు నింపుతుంటారు. వారికి ప్రతినెలా మందులూ ఇస్తుంటారు. మొదట్లో సోనూ బృందంలోని ఇరవై మంది ఆటో డ్రైవర్లు- తమ రోజువారీ సంపాదన నుంచి కొంత మొత్తం కేటాయించి పేదలకు అన్నం పెట్టేవారు. అది చూసిన స్థానిక దుకాణాల వాళ్లూ, ఉద్యోగులూ కూడా తలో చేయి వేయడంతో దాదాపు రెండు వందల మంది అభాగ్యులకు అన్నదానం చేస్తున్నారు.


వదిలేసినా ఇస్తారు

చాలామంది డ్రైవర్లు ఆటో ఎక్కేటప్పుడు ఒక రేటు చెబుతారు. దిగేటప్పుడేమో ఎక్కువ డబ్బు డిమాండ్‌ చేస్తుంటారు. కొందరు దురుసుగా ప్రవర్తిస్తుంటారు.. అలాంటి ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నాడు కర్ణాటకలోని ఉడిపికి చెందిన అనిల్‌ శెట్టి అనే సామాజిక కార్యకర్త. ఆటో డ్రైవర్లపట్ల సమాజంలో గౌరవం పెంపొందించాలని ‘పీస్‌ ఆటోడ్రైవర్‌’ పేరుతో ఓ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశాడు. దాని ద్వారా జిల్లాలోని ఆటో డ్రైవర్లకు- మర్యాదగా మాట్లాడటం, ప్యాసింజర్లతో మర్యాదగా వ్యవహరించడం, ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం, క్రమశిక్షణతో నడుచుకోవడం ఎంత అవసరమో తెలియజెబుతుంటాడు. వారు మంచి పనులు చేసేలా ఎప్పటికప్పుడు మోటివేషనల్‌ క్లాస్‌లు నిర్వహిస్తుంటాడు. అనిల్‌ స్ఫూర్తితో ఓ బృందంగా ఏర్పడిన పదిహేను వందల మంది డ్రైవర్లు- ప్రయాణికులు ఆటోలో వదిలేసిన వస్తువుల్ని బాధ్యతగా పోలీస్‌స్టేషన్‌లో అప్పగిస్తుంటారు. అనాథా శ్రమాల్లోని విద్యార్థుల్ని స్కూళ్లకీ కాలేజీలకీ- వృద్ధుల్ని ఆసుపత్రికీ ఉచితంగా తీసుకెళ్లి తీసుకొస్తుంటారు. వారికి మందులూ, నెలవారీ సరకులూ సమకూరుస్తారు. కొందరు డ్రైవర్లు అయితే ఆటోల్లో పుస్తకాలూ, పత్రికలూ, స్నాక్స్‌, వాటర్‌ బాటిళ్లూ అందుబాటులో ఉంచి ప్రయాణికులకు అందిస్తుంటారు. దాంతోపాటు అసోసియేషన్‌ సభ్యులు ప్రతి నెలా తలా కొంత డబ్బును దాచుకుంటారు. ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్ల వైద్య అవసరాలకీ, ఆటోల రిపేర్లకూ ఆ సొమ్మును వాడతారు. బాధ్యతగా నడుచుకుంటూ మంచి పనులు ఎక్కువగా చేసిన అసోసియేషన్‌ సభ్యులకు ఏటా ‘పీస్‌ ఆటో అవార్డు’తో పాటు లక్షరూపాయల నగదు బహుమతిని కూడా అందజేసి ప్రోత్సహిస్తుంటాడు అనిల్‌.


ఆటో అంబులెన్స్‌...

భువనేశ్వర్‌కి చెందిన దీనబంధు నాయక్‌ చాలాకాలంగా ఆటో నడుపుతున్నాడు. తనలాంటి డ్రైవర్లతో కలిసి అవసరంలో ఉన్నవారికి సాయపడాలని కొన్నేళ్ల క్రితం ‘స్మార్ట్‌ సిటీ ఆన్‌లైన్‌ ఆటో అసోసియేషన్‌’ను ప్రారంభించాడు. ఇరవై మందితో మొదలై పదివేల మంది సభ్యులకు చేరిన ఈ అసోసియేషన్‌ ద్వారా రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు నాయక్‌. అంబులెన్సులు అందుబాటులో లేనప్పుడు- రోగులనీ, ప్రమాదాల బారిన పడినవారినీ ఆటోల్లో ఆసుపత్రికి తీసుకెళ్లేలా చూస్తున్నాడు. వికలాంగులకీ, గర్భిణులకీ, పరీక్షలకు వెళ్లే విద్యార్థులకీ ఉచితంగా సేవలు అందిస్తారు ఆటో అసోసియేషన్‌ సభ్యులు. పేద రోగుల కోసం సభ్యులంతా విరాళాలు సేకరించి వైద్యం చేయించి, మందులూ కొనిస్తారు. నిరుపేద వృద్ధులు తరచూ హాస్పిటల్‌కి వెళ్లాల్సి వస్తే- వారి నుంచి ఏమీ ఆశించకుండానే తీసుకెళ్లి తీసుకొస్తుంటారు. కేవలం ప్రయాణికుల కోసమే కాకుండా, తమ బృందంలోని వారు కష్టాల్లో ఉంటే కలిసికట్టుగా సాయమూ చేస్తారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ల పిల్లల చదువు ఆగిపోకుండా ఆ బాధ్యతనూ తీసుకుంటారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు